అతడి జీతం 1 లక్షా 25 వేలు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు. విధి వక్రించింది. ఓ కారు ప్రమాదంతో తన ఎడమ చేయి, కాలు పక్షవాతానికి గురయ్యాయి. అప్పటివరకూ షాపూర్ జీ పల్లోంజీ కంపెనీలో మంచి హోదాలో పనిచేస్తున్న అతడి జీవన గమనమే మారిపోయింది.

కానీ, తన ఆశలు వదులుకోలేదతను. జోమాటోలో డెలివరీ బాయ్ గా అతడికి అవకాశం వచ్చింది. ఆ ఉద్యోగాన్నే నమ్ముకుని ఫుడ్ డెలివరీ చేస్తున్న అతగాడి మంచితనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జొమాటో కస్టమర్ అయిన శ్రీపాల్ గాంధీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఆ పోస్ట్ తో.. ఇప్పుడు సదరు జొమాటో డెలివరీ బాయ్ తో పాటు.. అలాంటి వ్యక్తులను ఉద్యోగానికెంచుకున్నందుకు జొమాటోకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.
పూణేవాసైన శ్రీపాల్ గాంధీ లంచ్ కోసం జొమాటోలో పన్నీర్ టిక్కా, శాండ్ విచ్, బింగో చిప్స్, ఓట్ రైసిన్ కుకీలు ఆర్డర్ చేశాడు. ఆర్డర్ వచ్చిందిగానీ, అందులో తాను పేర్కొన్న మెనూలోని ఐటమ్స్ మొత్తం లేవు. ముఖ్యంగా ఆయన ఇష్టంగా ఆర్డర్ చేసిన బింగో చిప్స్, కుకీలు కనిపించలేదు. అదే విషయాన్ని సదరు జొమాటో బాయ్ కు తెలియజేశాడు. ఆయన అందుకు సార్ ఒకసారి జొమాటోకిగానీ.. లేదా, రెస్టారెంట్ కి గానీ కాల్ చేయండని సూచించాడు.
జొమాటో ఆన్ లైన్ నంబర్ కు శ్రీపాల్ గాంధీ ఫోన్ చేయడంతో… ఆ రెస్టారెంట్ కు జొమాటో సిబ్బంది సమాచారమిచ్చారు. అందుకు ఆ రెస్టారెంట్ సిబ్బంది క్షమాపణ చెప్పడంతో పాటు.. జొమాటో ఆర్డర్ బాయ్ ని తిరిగి మా రెస్టారెంట్ కు పంపగలరా మేం ఆ ఆర్డర్స్ మళ్లీ పంపిస్తామన్నారు. ఎందుకంటే, సదరు బాయ్ పనిచేసేది జొమాటోకేగానీ, రెస్టారెంట్ కు కాదు కాబట్టి. వాస్తవానికి అది జొమాటో బాయ్స్ రిస్క్ కానే కాదు.
కానీ, సదరు జొమాటో బాయ్ మాత్రం సార్ పర్లేదు నేను ఆ రెస్టారెంట్ కు వెళ్లొస్తాను. మీరు ఏవైతే మెనూలో పేర్కొని మిస్సయ్యాయో వాటిని తీసుకొస్తానంటూ వెళ్లి తీసుకొచ్చాడు. సదరు కస్టమర్ డబ్బులిస్తానన్నా అదనంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. పైగా అది తన బాధ్యతగా చెప్పుకొచ్చాడు. దేవుడు తనకు చాలా ఇచ్చాడు.. ఎవరో చేసిన తప్పుకు నేను మీ దగ్గర డబ్బు తీసుకోవడమేంటని సున్నితంగా తిరస్కరించాడు. కస్టమర్ తృప్తి చెందితేనే తమ వృత్తికి న్యాయం చేసినట్టంటూ హంబుల్ గా తనకిచ్చిన టిప్ ను తిరస్కరించాడు.
అదే సమయంలో సదరు శ్రీపాల్ గాంధీకీ, జొమాటో రైడర్ కూ మధ్య జరిగిన సంభాషణలో తన గురించి చెప్పుకొచ్చాడు. గతంలో తన జీతం 1 లక్షా 25 వేల రూపాయలుండేదని.. కానీ, ఓ రోడ్డు ప్రమాదం తన బతుకు చిత్రాన్నే మార్చేసిందని బాధపడుతూ చెప్పడంతో పాటు.. తనకు ఉద్యోగమిచ్చిన జొమాటో పేరుకు ఎక్కడా మచ్చ రానీయకుండా పనిచేయడమే నా లక్ష్యం సార్ అంటూ శ్రీపార్ గాంధీతో అన్నాడు.
తన పేరు చెప్పడానికి మాత్రం ఇష్టపడని ఆ జొమాటో బాయ్.. తన కూతురుని కష్టపడి దంతవైద్యురాలిని చేయించేందుకు.. పగలనకా, రాత్రనకా కష్టపడుతూ రైడింగ్ చేస్తూ సంపాదిస్తున్నాడు. తన కూతురు కలను నిజం చేయాలన్నదే తన ముందున్న ఏకైక లక్ష్యం. తన జీవితంలో కోల్పోయిన విలువైన ఎన్నింటికో.. కొందరైతే జీవితాన్నే నిందించేవారు.. ఇదేం విధి అని బాధపడేవారు.. కానీ, సదరు జొమాటో రైడర్ లో అలాంటి భావనేమాత్రం లేకపోవడం శ్రీపాల్ గాంధీని ఆశ్చర్యపర్చింది. జీవితాన్ని నిందించలేదు, సాకులు చెప్పలేదు, అయ్యో జీవితమిలా ఐపోయిందేనన్న ఫిర్యాదూ లేదు. కష్టపడాలి, సంపాదించాలి, నిజాయితీగా బతకాలి, బాధ్యత నిర్వర్తించాలనే భావనలు మాత్రమే సదరు జొమాటో రైడర్ లో కనిపించాయంటూ శ్రీపాల్ గాంధీ అనే కస్టమర్ చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారిపోయింది.
అదే సమయంలో శ్రీపాల్ గాంధీ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ కు కూడా అభినందనలు తెలిపాడు. వికలాంగులను, దివ్యాంగులను కూడా ఉద్యోగాల్లోకి తీసుకుని వారికి కొత్త జీవితాన్నందిస్తున్నందుకు.. అందులోనూ తనకు జరిగిన అనుభవం తన జీవితంలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పాడు శ్రీపాల్.
జొమాటో బాయ్ మంచితనానికి సోషల్ మీడియా అప్లాజ్ తెలపగా.. కొందరు వందనమంటూ కొనియాడుతున్నారు. మరోవైపు ఒక మంచి విషయాన్ని సమాజం దృష్టికి తీసుకొచ్చినందుకు శ్రీపాల్ గాంధీకి కూడా ధన్యవాదాలు చెబుతున్నారు. నిత్యజీవితంలో ఇలాంటి చాలామందికీ జరుగుతుంటాయి. అవే కదిలిస్తాయి. కానీ, వాటిని శ్రీపాల్ లాంటివారు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పైకి తీసుకొచ్చి.. ఆ కథల విలువను మరింత పెంచడాన్ని చాలామంది నెటిజన్స్ హర్షిస్తున్నారు.



