తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేవారి భరతం పడుతున్న ఇంటలిజెన్స్: పదుల సంఖ్యలో పట్టుబడుతున్న గూఢచారులు!

శత్రుదేశం బలహీనతలేంటి… అక్కడి బలహీనతలను తమకనుకూలంగా ఎలా మల్చుకోవచ్చనే విషయంలో ప్రత్యర్థులు ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూ అప్రమత్తంగా ఉంటూనే ఉంటారు. అలాంటి పనే ఇప్పుడు పాక్ చేస్తోందనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఇండియా పాక్ వార్ నేపథ్యంలో భారత్ కు చెంది పక్క దాయాది శత్రురాజ్యానికి ఉప్పందిస్తున్నవారెవరన్నదానిపై ఇండియన్ ఇంటలిజెన్స్ వ్యవస్థ చాలా సీరియస్ గా ఫోకస్ చేసింది. అందులో 11 మందిని వివిధ రాష్ట్రాలకు చెందినవారిని జల్లెడ పట్టి అరెస్ట్ చేసింది. ఎవరా ఐఎస్ఐ ఎజెంట్స్.. ఏంటా కథా..?

భారత్-పాక్ వివాదం ప్రారంభమైనప్పట్నుంచీ భారత భద్రతా సంస్థలు సరిహద్దు రాష్ట్రాలతో పాటు.. ఉగ్రమూలాలున్న రాష్ట్రాలపై ఫోకస్ చేశాయి. ముఖ్యంగా స్లీపర్ సెల్స్ తో పాటు… పాక్ కు గూఢచారులుగా వ్యవహరిస్తున్నవారి నెట్ వర్క్ ను ఛేదించే పనిలో నిమగ్నమయ్యాయి. సరిహద్దు అక్రమ రవాణాలకు పాల్పడటం, శత్రు కార్యకలాపాలకు దేశంలోనే ఉంటూ మద్దతివ్వడం.. పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ)తో సంబంధాలను నెరుపడం.. అదిగో అలాంటివారిని గుర్తించి ఏకంగా 48 గంటల్లోనే 11 మంది పాకిస్థానీ గూఢచారులను జల్లెడ పట్టి మరీ పట్టుకున్నాయి భారత భద్రతా దళాలు. ఇంతకీ ఆ పాక్ గూఢచారులెవరు..?

  1. ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు జ్యోతి మల్హోత్రా. ఈమె కోవిడ్ సమయంలో తన ఉద్యోగం కోల్పోయాక ఓ యూట్యూబర్ గా అవతరించింది. అయితే, జ్యోతి మల్హోత్రా కంటెంట్ ను స్పష్టంగా పరిశీలిస్తే దాయాది శత్రుదేశమైన పాక్ ను కీర్తించేలా ఉండటంతో ఈమెపైన అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇప్పటికే మూడుసార్లు పాకిస్థాన్ కు వెళ్లివచ్చింది. సిక్కు యాత్రీకులతో కలిసి రెండుసార్లు పాక్ లో పర్యటించిన సమయంలో అక్కడి రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న డానిష్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఈమెపైన సున్నితమైన సమాచారాన్ని అందించిందన్న ప్రధాన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడితో కలిసి ఇండోనేషియాలోని బాలికి కూడా ప్రయాణించింది జ్యోతి. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన జ్యోతి మల్హోత్రా విలాస జీవితం పలు అనుమానాలు రేకెత్తించేలా ఉంది. విదేశీ పర్యటనలు, ఎక్కడికెళ్లినా విలాసవంతమైన హోటల్స్ లో బస, టాప్ మోస్ట్ రెస్టారెంట్స్ లో భోజనాలు, ఈ ఏడాదిలోనే పెహల్గాంలో పర్యటించడం, ఉగ్రవాదదాడి తర్వాత పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్తున్న వ్యక్తితో ఈ జ్యోతి మల్హోత్రా ఫోటో బయటకు రావడం.. వీటికి తోడు పెహల్గాంలో వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవేసిందన్న ఆరోపణలు.. వెరసి, జ్యోతి మల్హోత్రా ఇప్పుడు పాక్ ఐఎస్ఐ ఏజెంట్ గా ప్రచారంలోకొచ్చింది. ఈమెను భారత భద్రతా దళాలు 3 రోజుల క్రితం మే 18న హర్యానాలోని హిస్సార్ లో అరెస్ట్ చేశాయి.
    ………………………………………

2) ఇక షాజాద్ వంతు. సరిగ్గా జ్యోతిని అరెస్ట్ చేసిన రోజే మే 18వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో వ్యాపారవేత్తైన షాజాద్ నూ పోలీసులు గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేశారు. షాజాద్ సొంత ఊరు యూపీలోని రాంపూర్. ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ లో షాజాద్ పోలీసులకు చిక్కాడు. ప్రధానంగా పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్సైన ఐఎస్ఐ తరపున సరిహద్దుల్లో స్మగ్లింగ్, గూఢచర్య కార్యకలాపాల్లో సహకరిస్తున్నాడనేది షాజాద్ పైనున్న ప్రధాన ఆరోపణ.
………………………………………..

3) ఇక మే 8న పంజాబ్‌లోని మలేర్‌కోట్లాలో గజాలా అరెస్టు కూడా చెప్పుకోవాల్సిందే: ఫిబ్రవరి 2025లో పాకిస్తాన్ వీసా పొందడానికి గజాలా పాక్ హైకమిషన్‌ను సందర్శించినట్లు తెలుస్తోంది. అక్కడ ఆమె డానిష్ అనే పాకిస్తాన్ అధికారిని కలిసింది. అంతటితో అయిపోలేదు. ఆమె ఆర్మీ ట్రక్కులు, ఆర్మీ స్థావరాలు, ఇతర సున్నితమైన ప్రదేశాల గురించి తనకు తెలిసిన డేటాను పంపడం ప్రారంభించిందన్నది అధికారులు చెబుతున్న మాట. 30 వేల రూపాయల యూపీఐ లావాదేవీలను కూడా అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో కూడా మరోసారి తన స్నేహితురాలు భాను నస్రినాతో కలిసి గజాలా మళ్ళీ రాయబార కార్యాలయాన్ని సందర్శించి డానిష్ అనే అధికారిని కలిసినట్టు అధికారులు గుర్తించారు.
………………………………………….

4). మే 12న హర్యానాలో విద్యార్థి దేవేంద్ర సింగ్ ధిల్లాన్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కైతాల్ జిల్లా గుహ్లా ప్రాంతానికి చెందిన ఇరవై ఐదేళ్ల దేవేందర్ సింగ్‌ను సోషల్ మీడియాలో తుపాకులు పట్టుకున్న ఫోటోలను పోస్ట్ చేసిన తర్వాత పోలీసులు ట్రేస్ చేసి మరీ అరెస్టు చేశారు. పంజాబ్‌లో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థి అయిన సింగ్.. 2023లో పాకిస్తాన్‌లోని నాన్‌కానా సాహిబ్‌కు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఆ పర్యటనలో, అతను పాకిస్థాన్ నిఘా కార్యకర్తలతో సంబంధాలు ఏర్పరచుకున్నాడని.. ఆ తర్వాత భారత్ కు తిరిగి వచ్చాక కూడా వారితో కమ్యూనికేషన్‌లో ఉన్నాడని అధికారుల విచారణలో తేలింది.
……………………………………………

5). మే 13న హర్యానాలోని పానిపట్ నుండి అరెస్టు చేయబడిన నౌమాన్ ఇలాహిదీ ఇలాంటి కథే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల ఇలాహి.. పానిపట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు, అక్కడ అతను ఇక్బాల్ అలియాస్ కానా అనే పాకిస్థానీ ట్రైనర్ కోసం గూఢచర్యం చేస్తున్నాడన్నది ఇతడిపైనున్న ప్రధాన ఆరోపణ. అంతేకాదు, ఏకంగా నౌమాన్ వద్ద ఎనిమిది పాస్‌పోర్ట్‌లు లభించాయి. అంతకుముందు తాను నాలుగుసార్లు పాకిస్థాన్‌కు ప్రయాణించాడనీ అధికారులు చెబుతున్నారు. దళాల కదలికలు, రైలు మార్గాల గురించి అతను సున్నితమైన పూర్తి వివరాలను ఐఎస్ఐ ఏజెంట్స్ కి అందించినట్లు సమాచారం. నౌమాన్ అత్త, మామ పాకిస్థాన్‌ వాసులు కావడంతో.. దాన్ని ఆసరాగా చేసుకునికి సరిహద్దు దాటుతూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనేది అధికారులు చెబుతున్న మాట. ఇక్బాల్ సహచరుడైన ఖలీమ్ అరెస్ట్ తర్వాత.. నౌమాన్ వ్యవహారం కూడా బట్టబయలై తాను పోలీసుల చేతికి చిక్కాడు.
……………………………………………..

6). మే 16న పంజాబ్‌లోని జలంధర్‌లో ముర్తజాను కూడా అక్కడి భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. బీహార్‌కు చెందిన ముర్తజా.. భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో సరిహద్దు వెంట ఉండే హ్యాండ్లర్ల, ఉగ్రమూకల ట్రైనర్స్ కు భారత వార్తల క్లిప్స్ ను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు ఓ యాప్ ను క్రియేట్ చేశాడన్నది ముర్తజాపైనున్న అభియోగం. ఒకే నెలలో పాక్ సిటిజెన్స్ తో ముర్తజాకు 40 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు అధికారులు. నాలుగు మోబైల్ ఫోన్‌లు, మూడు సిమ్ కార్డులు, అనుమానాస్పద వీడియోలనూ సేకరించారు.
………………………………………………..

7). మే 17న హర్యానాలోని నుహ్ లో మరో విద్యార్థి అర్మాన్ అరెస్టూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ద్వారా… భారత సైన్యానికి సంబంధించిన కార్యకలాపాలను షేర్ చేస్తున్నాడన్న అభియోగం ఇరవై ఆరేళ్ల అర్మాన్ ను అరెస్ట్ చేశారు. అర్మాన్‌ను ఆరు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. అతని ఫోన్ నుండి పాకిస్థాన్ నంబర్లకు పంపిన సంభాషణలు, ఫోటోలు, వీడియోలను పోలీసులు ట్రేస్ చేశారు. పాకిస్తాన్ హైకమిషన్‌లోని ఇద్దరు ఉద్యోగులు సహా, ముగ్గురు వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేశారు.
………………………………………………….

8). జ్యోతి తరహాలోనో మరో వ్లాగర్ అరెస్ట్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒడిశాకు చెందిన ప్రియాంక సేనాపతి ఓ వ్లాగర్. పూరీకి చెందిన వ్లాగర్ ప్రియాంక సేనాపతి కూడా ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్ కు వెళ్లివచ్చింది. మూడునెలల క్రితం కర్తార్ పూర్ సాహిబ్ కు వెళ్లి.. అక్కడి సందర్శన వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా మారిన జ్యోతి మల్హోత్రా, ప్రియాంకా సేనాపతి కలిసే కర్తార్ పూర్ సాహిబ్ ను సందర్శించి ఉంటారా అనే కోణంలో అధికారులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే, అక్కడికి మాత్రం ఇద్దరూ కలిసి వెళ్లలేదని తేలింది. అదే సమయంలో జ్యోతి మల్హోత్రాతో కలిసి ప్రియాంకా సేనాపతి కశ్మీర్, కేరళ వంటి రాష్ట్రాల్లో పలు పర్యటనలకు వెళ్లినట్టు ఆమెను ఒడిశా పోలీసులు ప్రశ్నించినప్పుడు వెల్లడించింది.
……………………………………………………..

9). వేగుచుక్కలపై కన్నేసిన ఇండియన్ ఇంటలిజెన్స్ వ్యవస్థ ఎక్కడికక్కడ పకడ్బందీగా సోదాలు చేస్తూనే ఉంది. స్లీపర్ సెల్స్ ను, గూఢచారులపై ఉక్కుపాదం మోపుతోంది. పంజాబ్‌లోని అమృత్‌సర్ నివాసితులైన పాలక్ షేర్ మాసిహ్, సూరజ్ మాసిహ్‌ ను ఈ నెల ప్రారంభంలోనే అరెస్టు చేశారు అక్కడి పోలీసులు. ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలతో పాటు, వైమానిక స్థావరాల సున్నితమైన సమాచారాన్నీ, ఫోటోలనూ లీక్ చేస్తున్నారనేది వీరిపైనున్న ప్రధానారోపణ.
……………………………………………………..

10). పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నివాసైన సుఖ్‌ప్రీత్ సింగ్ ను కూడా.. మిల్ట్రీ దళాల కదలికలు, వ్యూహాత్మక ప్రదేశాల వివరాలతో సహా, సున్నితమైన సైనిక సమాచారాన్ని.. పాకిస్థాన్ ఐఎస్ఐకి లీక్ చేశాడనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు.
……………………………………………………….

11). అదే గురుదాస్‌పూర్‌కు చెందిన కరణ్‌బీర్ సింగ్‌ను కూడా ఇలాంటి గూఢచర్య ఆరోపణలపైనే అరెస్టు చేశారు. పాకిస్తాన్ నిఘా సంస్థకు సున్నితమైన సైనిక డేటాను అందజేసినట్లు అధికారులు వెల్లడించారు.
……………………………………………………….

వీరంతా నిజంగా శత్రుదేశానికి మద్దతిచ్చి.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినవారే అయితే మాత్రం కచ్చితంగా ఇలాంటివారి ఏరివేత ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరం. అంతేకాదు, ఇంకొకరు ఇలాంటివి చేయాలంటేనే భయపడేలా శిక్షలుండాల్సిన అవసరముంది. అదే సమయంలో థరో ఇన్వెస్టిగేషన్ లేక నిర్దోషులను, అమాయకులను కేసుల్లో ఇరికించి చిత్రహింసలు పెడితే మాత్రం అందుకు తగ్గ విమర్శలూ ఎదుర్కోక తప్పదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles