నల్లధనపు తోటలో అరుణపుష్పం!

మాదాల రంగారావు మరణించిన రోజు రాసిన నివాళి వ్యాసం ఇది. ఆయన జయంతి మే 25 సందర్భంగా మరోసారి మీ కోసం!

నల్లధనం తోటలో అరుణపుష్పం

అరణ్యకృష్ణ.. ✍🏻

1980 నాటి సినిమాల్లో ఆయన మొదట్లో భయంకరమైన పాత్రలే వేసాడు. అగ్రకుల దురహంకారిగా, రేపిస్టుగా చెత్త పాత్రలే వేసాడు. అటువంటి మాదాల రంగారావు వున్నట్లుండి విప్లవాత్మక చిత్రాలు స్వయంగా తీసారు. వేసారు.

ఎమర్జెన్సీ అనంతరం జనతా పార్టీ ప్రయోగం విఫలమై, ఉద్యోగాల్ని, ఉపాధుల్ని సృష్ఠించగల ఉత్పాదక, సేవా రంగాలు లేని కాలం అది. భయంకర నిరుద్యోగం పట్టి కుదుపేసేది యువతరాన్ని. ఉద్యోగం అంటే గవర్నమెంటుద్యోగమే. ప్రైవేట్ ఉద్యోగమంటే పత్తి మిల్లులోనో, పొగాక్కంపెనీలోనో సూపర్వైజరుద్యోగమే. మిగతాదంతా చిరుద్యోగాలే. చాలీ చాలని బతుకులు. తీవ్రమైన పేదరికం. అప్పట్లోనే మళ్ళీ నక్సలైట్ ఉద్యమం పురుడుపోసుకుంటున్న కాలం. ఆర్.ఎస్.యూ. పీడి.ఎస్.యు. వేళ్ళూనుకుంటున్న కాలం. యువత ఆదర్శాలకి ప్రాధాన్యమిచ్చే కాలం. బెల్ బాటం పాంట్లు, చెవుల్ని మూసేస్తూ వంకీల జుట్టూ, మూతికి రెండువైపులా కిందకి దిగే మీసంతో యువకులూను, ఆత్మవిశ్వాసంతో యువతులు ఇంకా ఒకరినొకరు “మీరు…మీరు” అనుకుంటూ సంచరించే కాలం. ఆ సమయంలో సినిమాలు కూడా ఆదర్శాల్ని ప్రతిఫలించేవి. అలా ఆదర్శాల్ని ప్రతిఫలించే సినిమాల్ని తీసిన వారిలో మాదాల రంగారావు అగ్రగణ్యుడు. ఆయన మొదటిగా తీసిన సినిమా “యువతరం కదిలింది”, ఆ తరువాత “ఎర్రమల్లెలు”, “విప్లవశంఖం” వగైరా తీసారు. ఆయన సినిమాలకు డైరెక్తర్ గా ఎవరున్నా అంటే ధవళ సత్యమైనా లేదా బీరం మస్తాన్ రావైనా సినిమాలన్నీ ఒకే రకంగా వుంటాయి. ఒక సజీవ సమస్యకి, నాటకీయమైన పెర్ఫార్మెన్స్ తో, హృదయాన్ని తాకే ఉద్వేగపరమైన డైలాగులతో హృదయంలో ఏమాత్రం ఆవేశమున్న ప్రేక్షకుల్ని కట్టిపడేసేవి. ఆయన సినిమాల్లోని పాత్రలు రిక్షా డ్రైవర్లు, కూలీలు, రైతులు, దిగువ మధ్య తరగతి సంసారులు, ఆశోపహతులు, నిరుద్యోగులే. విలన్లెప్పుడూ సర్పంచులు, జెడ్.పీ. చైర్మన్ల వంటి పొలిటీషియన్లు, ప్రభుత్వాధికారులే. ఆయన తీసిన సినిమాల్లో “విప్లవశంఖం” పూర్తిగా గుంటూరులో తీసిందే. అన్నీ నాకు తెలిసిన ప్రాంతాలే. మేం రోజూ క్రికెట్ ఆడే పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ వెనుకనున్న జిల్లా పరిషత్ ఆఫీసు లో, ఆర్. అగ్రహారం రాయభద్రమేడ, పాతగుంటూర్, ఓవర్ బ్రిడ్జి, మార్కెట్ ప్రాంతాల్లో తీసిన సినిమా. ఆ సినిమా రిలీజ్ కి నేను ఇంటర్లోనో లేదా డిగ్రీ ఫస్టియర్లోనో ఉన్నాను. సెన్సార్ ఇబ్బందులతో అతి కష్టం మీద ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా చూసి ఆవేశంతో ఉప్పొంగిపోయాను. మాదాల రంగారావుకి శ్రీశ్రీ అంటే వీరాభిమానం. “కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు” అన్న పాటని గొప్పగా పాడించి పిక్చరైజ్ చేసారు. పాతగుంటూరులోని అనేక పెంకుటిళ్ళ వసారాలు, చిన్న చిన్న గదుల్లో బతికే దిగువ మధ్య తరగతి జీవితాన్ని బాగా చూపించారు ఆ సినిమాలో. “కట్నం డబ్బులు పూర్తిగా ఇవ్వకపోతే నీ కూతురు ఇదే రిక్షాలో రిటనొస్తుంది” అంటూ వియ్యంకుదితో క్రూరంగా ప్రవర్తించే పురోహితుడి పాత్రలో నర్రా వెంకటేశ్వర్రావు, కుటుంబ సమస్యలతో సతమతమైపోయి చివరికి మతిభ్రమించి “అయిపోయింది. ఆట అయిపోయింది” అంటూ పిచ్చిగా నవ్వుతూనే ఏడ్చే పాత్రలో నల్లూరి వెంకటేశ్వర్లు అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో “జజ్జనకని జనారే” అని ఒక గొప్ప పాట వుంది. వ్యవస్థకు బలైన రైతు, విద్యార్ధి, రిక్షా కార్మికుడు, గృహిణి..ఇలా రకరకాల ప్రజాసమూహాలకు చెందిన ప్రాతినిధ్య పాత్రల్ని సంబోధిస్తూ సాగుతుంది. గొప్ప హిట్టైంది.

తన సినిమాలలో ఆయనదే ప్రధాన పాత్ర. ఆ సినిమాల్లో ప్రజా నాట్యమండలి కళాకారులైన నల్లూరి వెంకటేశ్వర్లు, నర్రా వెంకటేశ్వర్రావు,టీ.కృష్ణ వంటి వారు నటించేవారు. నల్లూరి వెంకటేశ్వర్రావు సాత్విక పాత్రలు, నర్రా వెంకటేశ్వర్రావు దుర్మార్గ పాత్రలూ వేసేవారు. ఎప్పుడూ సెన్సార్ వాళ్ళతో గొడవే ఆయనకి. పట్టు విడిచేవాడు కాదు.

మాదాల రంగారావు తరువాత ఆ ఒరవడి చాలామందే అందుకున్నారు. అనేక “ఎర్రెర్రని” సిన్మాలొచ్చాయి. వేజెళ్ళ సత్యనారాయణ (ఎర్ర సినిమా కాకపోయినా), టి.కృష్ణ, ధవళ సత్యం, ఆర్.నారాయణ మూర్తి వంటివారు ఉధృతంగా సినిమాలు తీసారు. కొన్నాళ్ళకు మాదాల కూడా స్టేల్ అయిపోయారు. తను సినిమాల్లో సంపాదించిందంతా తిరిగి సినిమాల్లోనే పోగొట్టుకున్నారు. ఏదేమైనప్పటికీ, ఎంత నాటకీయంగా అయినప్పటికీ తన కాలం నాటి యువతరంలో సామాజిక స్పృహని, కొన్ని ఆదర్శాల్ని తన సినిమాల్లో చొప్పించటానికి ప్రయత్నించారు. ఆ నాటి ప్రేమాభిషేకాల వెల్లువకి ఒక చేతినడ్డుపెట్టి తెలుగు సినిమాలో సామాజిక స్పృహకి, సమసమాజ స్వప్నానికి ప్రతీకగా నిలవగలిగాడు. ఎప్పుడూ సెన్సార్ వాళ్ళతో గొడవే ఆయనకి. అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో ఆయన “కర్మ సిద్ధాంతం ఒక దోపిడీ సిద్ధాంతం. మనుషుల్లో ప్రశ్నించే తత్వాన్ని, తిరుగుబాటుని చంపేస్తుందది” అని అన్నారు. అది నేను చదివాను. అంత క్లారిటీ ఒక సినిమా ఆర్టిస్టుకి ఉండటం ఆశ్చర్యమే కదా. ఆ తరువాత కాలంలో ఆయన మరో రకం సినిమాల్లో వేయనే లేదు.

కనుమూసిన మాదాల రంగారావుకి అప్పటి జ్ఞాపకాలతో నా నివాళి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles