కొన్ని దృశ్యాలు.. వణుకు పుట్టిస్తాయి. అక్షరాలవసరం లేకుండానే భావోద్వేగాలకు గురిచేస్తాయి. అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు ఇన్ స్టా లో వైరలవుతోంది. ఊకదంపుడు ఉపాన్యాసాలిచ్చే నేతలు.. గుర్తించాల్సిన దృశ్యాలను కూడా కళ్లుండీ చూడలేని కబోధుల్లా వ్యవహరిస్తున్నప్పుడు చెప్పుకోవాల్సిన రూరల్ స్టోరీ ఇది.
అత్యాధునిక వంతెనలు, మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు అంటూ ఓవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరగొడుతుంటాయి. ఇంకోవైపు, కనీసం నదులు, వాగులు, చెరువులు దాటడానికి వీల్లేని పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలలాగే ప్రభుత్వాల దృష్టికి నోచుకోకుండా గ్రహణం పడతాయి. ఈ కాంట్రాస్ట్ సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ హైలెట్ అవుతుంది. సమసమాజం గుర్తిస్తుంది. అయ్యో పాపమనుకుంటుంది. కానీ, అభివృద్ధి చేయాల్సినవారు, అదే అభివృద్ధి గురించి ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే నేతలకు మాత్రం కనబడదు, వినబడదు. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు కనీస మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మనమెక్కడున్నామనే ప్రశ్నను మన ముందుంచుతోంది.

ఉత్తరాఖండ్ లో పాఠశాల విద్యార్థినులు ఓ రోప్ కు ట్రాలీని తగిలించి నదిని దాటుతున్న ఓ ఆందోళనకరమైన వీడియో. అదిప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది.
ఉత్తరాఖండ్‌లోని కుమావున్ ప్రాంతం నుంచి తమ బడికి వెళ్లడానికి విద్యార్థినులు ఎదుర్కొంటున్న కష్టాలను కళ్లకు కట్టే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వాళ్ల కష్టాలను కళ్లకు కట్టేలా ఉన్న వారి దినచర్యకు సంబంధించిన ఆ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో ఇప్పుడు ట్రెండింగవుతోంది. ఓవైపు హిమాలయ పర్వతాలు, మధ్యలో నది… పాఠశాలకు చేరాలంటే నది దాటి తీరాల్సిన పరిస్థితి. అలాంటి చోట ఓ రోప్ ద్వారా ఇద్దరు విద్యార్థినులు ఓ ట్రాలీని దానికి తగిలించి నది దాటుతున్న వీడియో ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వ పెద్దలకు తలబొప్పి కట్టిస్తోంది. నిత్యం ఇదే పరిస్థితిలో విద్యార్థులు ఈ రోప్ ఉన్న ట్రాలీ ద్వారానే పాఠశాలకు చేరుకోవాల్సి ఉండగా.. చూసేందుకే భయానకంగా కనిపిస్తున్న ఆ వీడియో చూసినవారు.. ఇదేనా ప్రభుత్వాలు చెబుతున్న అభివృద్ధి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
కామెంట్ బాక్సులో ఇన్ స్టా యూజర్స్… విభిన్నరకాల కామెంట్ చేస్తున్నారు. మనమసలున్నది 2025లోనేనా.. లేక, ఇంకా అనాగరిక కాలంలోనా అన్నట్టున్నాయి ఆ వ్యాఖ్యలు. అభివృద్ధిని ప్రశ్నిస్తూ ఐసే హోగా వికాస్ అంటూ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీని ప్రశ్నిస్తున్నారు.
మారుమూల ప్రదేశాల్లో మౌలిక సదుపాయల గురించి ఈ వీడియో ఇప్పుడు పెద్ద చర్చకే దారితీస్తోంది. అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి ఇది అంటూ కొందరు వ్యాఖ్యానిస్తే.. మరికొందరు స్థానిక ఎమ్మెల్యేకు, ముఖ్యమంత్రికి ఆ వీడియోను ట్యాగ్ చేసి చూపించండంటూ ఫైర్ అవుతున్నారు. ఆ వీడియోను కూడా మీరిక్కడ చూడొచ్చు.
గత ఏడాది ఆగస్ట్ ప్రారంభంలో కూడా ఇదే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో టెహ్రీ గర్హ్వాల్ లోని సోంథర్ కు చెందిన 18 ఏళ్ల సౌరభ్ పన్వర్ అనే వ్యక్తి సాంగ్ నది దాటడానికి బ్రిడ్జ్ లేకపోవడంతో ఇలాంటి రోప్ వేకు ట్రాలీని తగిలించి వెళ్తున్న దృశ్యాలు వైరలయ్యాయి. జస్ట్ ఓ తాత్కాలిక పరిష్కారంగా మాత్రమే ఏర్పాటు చేసి, ప్రమాదకర స్థితిలో ఉన్న ఓ రోప్ వే అక్కడి వందలాది గ్రామస్థులు నిత్యం నదిని దాటేందుకు ఏకైక మార్గం కావడం పలు విమర్శలకు తావిచ్చింది. ఆ సమయంలో రోప్ వేపై ట్రాలీలో ప్రయాణించిన పన్వర్ కూడా ఇదిగో ఈ విద్యార్థుల్లాగే తాను కళాశాలకు వెళ్లాలంటే నది దాటాల్సిందేనని చెప్పుకొచ్చాడు.
నెలలు గడుస్తున్నాయి. సోషల్ మీడియాలో, మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. సమాజమంతా దుమ్మెత్తిపోస్తోంది. కానీ, పాలకుల్లో చలనం మాత్రం లేదు.
డెహ్రాడూన్ శివార్లలోని మాల్దేవ్తాకు 10 నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాదాపు 70 గ్రామాల ప్రజానీకానికి ఇక్కడి నదిని దాటందే బతుకులు వెళ్లని పరిస్థితి. ఒకవైపు డెహ్రూడూన్, ఇంకోవైపు టెహ్రీ మధ్యన నది. ఇలా ఇక్కడి నదిని దాటాలంటే బ్రిడ్జ్ మార్గంగానీ, బోటింగ్ గానీ అందుబాటులో లేకపోవడంతో ఇదిగో ఇలా రోప్ వేలో తాడుకు ట్రాలీ కట్టి దాటాల్సిన దయనీయ స్థితి ఇక్కడి ప్రజానీకానిది. ఈమధ్య కురిసిన భారీ వర్షాలతో ఈరోప్ వే మరింత క్రాస్ గా మారిపోయి ప్రమాదకర స్థితిలో కనిపిస్తోంది. ఇలాంటి రోప్ వేలో తాడు కట్టిన ఓ ట్రాలీలో విద్యార్థినీ, విద్యార్థులు, ఇక్కడి గ్రామాల ప్రజలు నది దాటే ఈ దృశ్యం.. ఇంకా గ్రామీణ కొండ ప్రాంతాల్లో జనం ఇబ్బందులెలా పడుతున్నారో కళ్లకు కట్టేది.
నది ప్రమాదకరంగా ఉప్పొంగినప్పుడు ఇక్కడి విద్యార్థినీ, విద్యార్థులు స్కూల్స్, కళాశాలలకు వెళ్లడం కూడా మానేస్తుంటారని పన్వర్ చెప్పిన మాట. ఎందుకంటే, రోప్ వే ద్వారా ట్రాలీలో వెళ్తున్నప్పుడు కేవలం రెండడుగుల దూరంలో నది ప్రవహిస్తుందంటే.. ఎంత ఎత్తులో ఎంత లోతుతో ప్రవహిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నది దాటకుండా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలంటే కనీసం 15 నుంచి 20 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అంత పెద్ద ఎత్తైన కొండలపై నుంచి వర్షాకాలంలో జారుతుంటే ట్రెక్కింగ్ మరింత కష్టం. మరోవైపు అడవి జంతువుల భయమొకటి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ లో నదులను దాటే క్రమంలో విద్యార్థుల వీడియోపై భిన్నరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతూనే.. ప్రభుత్వ తీరుపై ఫైర్ అవుతున్నారు.



