పెళ్లి తప్పనిసరనే భావన మారుతోందా..?

పెళ్లి తప్పనిసరి కాదా…?

పెళ్లి ఎందుకు అనేది యుక్తవయస్సుకొచ్చే పిల్లల్లో కనిపించే ప్రశ్న…? కానీ, పెళ్లి ఎందుకు తప్పనిసరి అనేది ఇప్పుడు కనిపిస్తున్న ప్రశ్న..? అసలు పెళ్లి చేసుకోవాల్సిందేనా…? భారతీయ మహిళల ఆలోచనల్లో వస్తున్న ఈ మార్పుపై ఓ పెద్ద చర్చే జరుగుతోంది.

ఏంటీ ఈ మార్పు..?

ఒకప్పుడు అమ్మాయికి చదువు, ఉద్యోగం, ఆ తర్వాత పెళ్లి… ఇవే జీవితానికి సహజమైన ఓ పరిణామక్రమం. పెళ్లి ఎప్పుడు.. పిల్లలెప్పుడు అనే ప్రశ్నలు కూడా జీవితంలో భాగంగా వినిపించేవి.

కానీ, ఆప్రశ్నలు మారుతున్నాయి. వాటికి సమాధానాలూ మారిపోతున్నాయి.

పెళ్లి ఎప్పుడనే ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదనే భావన మహిళల్లో పెరుగుతోందా..? పెళ్లనేది జీవితంలో తప్పనిసరి మైలురాయి కాకుండా… వ్యక్తిగత ఎంపికలా మారిపోతోందా అన్నదే చర్చ.

అసలు డేటా ఏం చెబుతుందో ఓసారి చూద్దాం!

భారతదేశంలో మహిళల వివాహ వయస్సు, కుటుంబ పరిమాణం, సంతానోత్పత్తి విషయంలో గత రెండు దశాబ్దాల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2023-24 ప్రకారం… 20 నుంచి 24 ఏళ్ల మహిళలపై నిర్వహించిన సర్వేలో 18 ఏళ్ల లోపు వివాహం చేసుకున్న వారి శాతం 20.1 శాతానికి తగ్గినట్టుగా తేలింది. 2005-06లో ఇదే సంఖ్య 47.4 శాతంగా ఉండగా… ఈ సంఖ్య సగంకుపైగా తగ్గిపోవడం కనిపిస్తుంది. అంటే చిన్న వయస్సులో పెళ్లిళ్లు తగ్గిపోయాయన్నట్టు.

ఇదే సమయంలో భారతదేశం సంతానోత్పత్తి రేటు కూడా రెండు శాతం వద్దే ఆగిపోయింది. అంటే కుటుంబ పరిమాణంపై కూడా భారతీయ సమాజపు ఆలోచన మారిపోతోందన్నది ఈ గణాంకాల్లో కనిపిస్తోంది. అయితే, చిన్న వయస్సులో పెళ్లి తగ్గడమంటే.. పెళ్లి చేసుకోని మహిళల సంఖ్య అంతే స్థాయిలో పెరిగిందన్న అర్థం కాదు. పెళ్లి ఆలస్యంగా కావడం కూడా కావచ్చు. చదువుల కోసం వెయిట్ చేయొచ్చు. ఉద్యోగం, ఆర్థిక భద్రత, ఆర్థిక స్వాతంత్రం, సొంతకాళ్లపై నిలబడటం, జీవిత భాగస్వామి ఎంపికలో సమయం తీసుకోవడం ఇలాంటివన్నీ వెరసి పెళ్లిళ్లు ఆలస్యమవుతున్న ఉదంతాలెక్కువ.

పెళ్లికి కొత్త నిర్వచనం!

ఇప్పటి చదువుకున్న, ఉద్యోగం చేస్తున్న మహిళకు పెళ్లి అంటే కేవలం కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు. ఆ బంధాలన్నీ తన జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తాయనే ప్రశ్నలూ ఉద్భవిస్తున్నాయి. తమ కెరీర్ ఏమవుతుందనే ప్రశ్నలనూ ముందుంచుతున్నాయి. పెళ్లి చేసుకుంటే సమానత్వం విషయంలో రాబోయే భవిష్యత్ ఎలా ఉంటుందన్న ఆలోచనలూ మెదులుతున్నాయి. కుటుంబ బాధ్యతల పంపిణీ పంచుకోవడంలో తేడాల గురించీ యోచిస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు స్థానమెంత ఉంటుందనే సందేహాలూ వెంటాడుతున్నాయి. ఈ అస్పష్టత.. అంతకుమునుపు చూసిన సామాజిక జీవితాల ఉదాహరణలు వెరసి… పెళ్లి ఇప్పుడో సంక్లిష్టమైన ప్రక్రియగా మారిపోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థిక స్వాతంత్రం ఉన్న మహిళలు పెళ్లిని తప్పనిసరి జీవన దశగా కాకుండా.. తమ జీవితానికి నిజంగా విలువను జోడించే సంబంధంగా చూడటం పెరగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

మరి మహిళలు పెళ్లిళ్లు వద్దంటున్నారా..?

ఇలాంటి ప్రచారంతో మహిళలందరినీ ఒకే గాటన కట్టలేం. పైగా, పెళ్లి మీద వ్యతిరేకత కంటే కూడా పెళ్లి విషయంలో ఎంపిక హక్కు పెరగడం అనేది ఈ మార్పును సూచిస్తోంది. ఇదివరకు పెళ్లి చేసుకోవడమనే అంశంపై కుటుంబ, సమాజ ప్రభావమూ ఉండేది. కానీ, ఇప్పుడు చేసుకోవాలా, వద్దా… ఎవిరిని చేసుకోవాలి… ఎప్పుడు చేసుకోవాలి… ఎలా ఉండాలనే విషయాల్లో తమ నిర్ణయముండాలనే మహిళల సంఖ్య పెరిగింది.

ఆలోచనల్ని మార్చేస్తున్న ఉద్యోగాలు, ఆర్థిక స్వాతంత్రం!

మహిళలకు విద్య, ఉద్యోగ అవకాశాలు పెరగడం ఈ మార్పులో కీలకాంశాలు. ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న వ్యక్తికి.. వివాహం జీవన భద్రతకు ఏకైక మార్గమని చెప్పలేం. అందుకే, సంబంధంలో ప్రేమతో పాటు.. దక్కే గౌరవం, లభించే అనుకూలతలు, సమాన భాగస్వామ్యం, వంటి అంశాలకూ ప్రాధాన్యత పెరిగింది.

యావత్ భారతాన్నీ ఒకే కోణంలో చూడొచ్చా?

పట్టణాలు, గ్రామాలు, వివిధ రాష్ట్రాలు, కులం, మతం, కుటుం నేపథ్యం, విద్య, ఆదాయం.. ఇవన్నీ వివాహ నిర్ణయాలపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. అందుకే, భారతీయ మహిళలు పెళ్లికి దూరమైపోతున్నారు అనే ఒక్క జనరలైజ్జ్ స్టేట్ మెంట్ తో తేల్చేయడం సరైంది కాదు.

పెళ్లి అనే ప్రక్రియపై మారుతున్న ఆలోచనలు!

జీవితంలో ఓ దశకు వచ్చాక పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి అనే భావన నుంచి పెళ్లి తమ జీవితాలకు సరైందేనా అనే ఆలోచన వైపు మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఇది కేవలం మహిళల విషయంలో మాత్రమే కాదు.. యువత మొత్తంలో కూడా సంబంధాలు, తమ కెరీర్, వ్యక్తిగత స్వేచ్ఛ, కుటుంబ బాధ్యతలపై కొత్త చర్చకైతే తెరలేచింది.

మరి భవిష్యత్ ఎలా ఉండబోతోంది..?

ఎప్పుడు పెళ్లి అనే ప్రశ్న బదులు… ఎలాంటి జీవితం కావాలనే ఓ ఆలోచనే భవిష్యత్తులో మరింత ఎక్కువగా కనిపించొచ్చన్న భావన బలపడుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles