ధైర్యం, వ్యూహం, దూకుడు.. ఇవే ఆ సైనికుడి ప్రత్యేకతలు! ఇండియన్ ఆర్మీని అంతగా ఇన్స్పైర్ చేసిన ఆ రాంబో ఎవరు..?

కొందరు సైనికులు ఒకే ఒక్క అసాధారణ యుద్ధంతోనే లెజెండ్స్ గా మారుతారు. కానీ, వేళ్ల మీద లెక్క పెట్టే మరి కొందరు మాత్రం.. వారి కమాండర్లు, సహచరులు, ప్రత్యర్థులు కూడా అందుకోవాలని ఆలోచించలేనంత స్థాయికి కాలక్రమేణా ఎదిగి లెజెండ్స్ గా నిలుస్తారు. అలాంటి యుద్ధ సైనికుడే మనం చెప్పుకోబోతున్న ఇండియన్ రాంబో.

ఎవరీ ఇండియన్ రాంబో..?

మేజర్ సుధీర్ కుమార్ వాలియా. కాశ్మీర్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్లలో కాల్పులకు గురైన అమరవీరుడు. చివరిదాకా పోరాడిన దీశాలి. అందుకే భారతదేశ సైన్యంలోని స్పెషల్ ఫోర్సెస్ లో ఈయన్నంతా రాంబో అని పిల్చేవాైరు. ఇదేం మిల్ట్రీ ఇచ్చిన అధికారిక బిరుదు కాదు. ఆయనంతట ఆయన పెట్టుకున్న పేరూ కాదు. కానీ, మేజర్ సుధీర్ శారీరక సామర్థ్యం, ఆపరేషన్లలో ఆయన దూకుడు, ఎలాంటి ఒత్తిడి ఎదురయ్యే తీవ్ర పరిస్థితులైనా తట్టుకుని నిలబడి ఎదురు దూకుడు ప్రదర్శించడం.. ఇదిగో ఇటువంతి స్వభావమే మేజర్ సుధీర్ కుమార్ వాలియాకు ఇండియన్ ఆర్మీలో రాంబోగా గుర్తింపు తెచ్చిపెట్టింది. సహచర సైనికులంతా సుధీర్ ను రాంబో అనే సంబోధించేవారు.

1999లో సుధీర్ చనిపోయేవరకే భారత సైన్యంలో అత్యంత నైపుణ్యం, ధైర్యసాహసాలున్న అధికారిగా గుర్తింపు పొందిన యువ అధికారి సుధీర్.

హిమాచల్ నుంచి ఎలైట్ స్పెషల్ ఫోర్సెస్ వరకూ సుధీర్ జర్నీ!

సుధీర్ వాలియాది హిమాచల్ ప్రదేశ్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా భారత సైన్యంలో చేరాడు. జాట్ రెజిమెంట్ లో కమిషన్ పొందాడు. కానీ, తన ప్రతిభేంటో, తన దూకుడేంటో పారా స్పెషల్ ఫోర్సెస్ లో వెలుగులోకొచ్చింది.

ప్యారాచూట్ రెజిమెంట్ కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ యూనిట్స్.. భారత సైన్యంలో అత్యంత కఠినమైనవి. ట్రైనింగ్ కూడా కఠినంగా ఉంటుంది. చాలామంది మధ్యలోనే వదిలేస్తారు. ఆపరేషన్స్ నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అయితే, ఈ సవాళ్లన్నీ తట్టుకుని రాణించిన ధీరుడు సుధీర్ వాలియా.

ముఖ్యంగా సుధీర్ రాణింపులో ఆయన క్రమశిక్షణే ఆయనకు ఎస్సెట్. దానికి తోడు భయం తెలియని ధైర్యవంతుడు కావడం, యుద్ధవ్యూహాలు, యుద్ధంలో ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశాంతత కోల్పోకపోవడం ఈ అధికారికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.

1990ల కాలంలో కాశ్మీర్ లో మిలిటెన్సీ ఉధృతంగా నడుస్తున్న సమయంలో.. మిలిటెంట్ల ఏరివేతలో, అనేక ప్రమాదకర ఆపరేషన్లలో సుధీర్ వాలియా కీలక పాత్రధారి.

సుధీర్ ను దేశానికి చాటిచెప్పిన యుద్ధం కార్గిల్!

1999 కార్గిల్ యుద్ధ మేఘాల్లో ఎత్తైన కొండ ప్రాంతాల్లో పాక్ దళాలు దురాక్రమణను తిప్పి కొట్టినవాడు. తిరిగి ఆయా వ్యూహాత్మక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించినవాడు మేజర్ సుధీర్.

సుధీర్ నాయకత్వ లక్షణాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఈయన్ను వీర్ చక్ర పురస్కారంతో సత్కరించింది.

స్పెషల్ ఫోర్సెస్ లోకి వచ్చే కంటే ముందే సుధీర్ దూకుడు మామూలుగా ఉండేది కాదని ఆయన సహచరులే చెప్పేవారట.

ముఖ్యంగా ప్రమాదకర మిషన్స్ కు ముందుకొచ్చే వాళ్లల్లో మొదటి వరుసలో సుధీర్ వాలియా పేరుండేది. ఇతరుల కంటే ఎక్కువగా శ్రమించడం.. మిగిలినవారితో పోలిస్తే యుద్ధ విన్యాసాల్లో భిన్నంగా నిలవడమే సుధీర్ ను భారత ఆర్మీ రాంబోగా నిలబెట్టాయి.

సుధీర్ చివరి ఆపరేషన్ ఏంటి..?

కార్గిల్ యుద్ధం తర్వాత వెంటనే సుధీర్ మళ్లీ కాశ్మీర్ లో నెలకొన్న తిరుగుబాట్లను అదుపులోకి తెచ్చే ఆపరేషన్స్ కు నాయకత్వం వహించారు.

1999 ఆగస్ట్ లో కుప్వారా అడవుల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో ఆయన తన బృందంతో ఆ అడవులను జల్లెడ పట్టాడు. ఆ ఆపరేషన్ కాస్తా ఎదురుకాల్పుల ఘట్టంగా మారింది. అక్కడ తిరుగుబాటుదారుల కాల్పుల్లో వాలియా తీవ్రంగా గాయపడ్డాడు. అయినా, వెనక్కి వెళ్లేందుకు నిరాకరించారు. ఆ గాయాల నొప్పితోనే తన బృందానికి మార్గనిర్దేశం చేస్తూ ఆపరేషన్ కొనసాగించారు. తన బృందంలోని సైనికులను ప్రోత్సహిస్తూనే.. మరోవైపు, ఉగ్రవాదులు పారిపోకుండా పోరాటం చేశాడు. ఆ పోరాటంలో చివరకు ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత సైన్యం.

ఆ తర్వాత మేజర్ సుధీర్ కుమార్ వాలియా కూడా గాయాల తీవ్రతతో తన పరిస్థితి విషమించి వీరమరణం పొందారు. ఇదంతా కేవలం తన 35 ఏళ్ల వయస్సులోనే మేజర్ సుధీర్ కుమార్ సాధించారు. అందుకే, అమరవీరుడైనా.. మేజర్ సుధీర్ ను ఇప్పటికీ ఇండియన్ ఆర్మీ రాంబోగా అభివర్ణిస్తూ ప్రతీ ఏటా ఆయన పుట్టినరోజున, వర్ధంతికీ తల్చుకుంటోంది.

అశోక చక్ర ఇచ్చిన భారత ప్రభుత్వం!

సుధీర్ కుమార్ వాలియా సేవలకుగాను ఆయన మరణానంతరం భారతదేశపు అత్యున్నత సాహస పురస్కారమైన అశోక చక్ర ఆయన కుటుంబీకులకు ప్రదానం చేసింది భారత ప్రభుత్వం. కానీ, స్పెషల్ ఫోర్సెస్ వర్గాల్లో ఆయన పేరు కేవలం పురస్కారాలకే పరిమితమైంది కాదు.. ఆయన చూపించిన ప్రొఫెషనలిజం, పట్టుదల, పోరాటపటిమ మిగతా ఎందరో సైనికుల్లో స్పూర్తి నింపే పాఠ్యాంశమైంది.

మేజర్ సుధీర్ కుమార్ వాలియాది ఓ సినిమాను తలపించే అడ్వెంచరస్ థ్రిల్లింగ్ లైఫ్ స్టోరీ. ఆయనతో కలిసి పనిచేసినవారు యుద్ధంలో ఆయన పక్కన పనిచేయడాన్ని ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు. ఎందుకంటే, 1990ల చివర్లో కాశ్మీర్ లో జరిగిన కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ అత్యంత ప్రమాదకరమైనవి. యువ అధికారులు నిరంతరం ప్రాణాలకు తెగించి ఆ ఆపరేషన్స్ లో పాల్గొన్నారు. అందులో చాలామంది వీరమరణాలు పొందారు. దీర్ఘకాల సేవ చేయలేకపోయారు. వారందరికీ ప్రతీకగా మేజర్ సుధీర్ కుమార్ వాలియా స్టోరీ నిల్చిపోయింది.

ఇవాళ మేజర్ సుధీర్ కుమార్ వాలియా పేరిట రహదారులు వెలిశాయి. సంస్థలు పుట్టుకొచ్చాయి. స్మారక చిహ్నాలు ఏర్పడ్డాయి. వీటితో పాటే.. ఇండియన్ ఆర్మీలో మాత్రం ఆయన ఎప్పటికీ గుర్తుండిపోయేందుకు.. యుద్ధ సమయాల్లో ఒక్క పేరు అలారంలా గంట కొడుతూనే ఉంటుంది. అదే ఇండియన్ ఆర్మీ రాంబో!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles