కొందరు టీచర్లు తమ ఉద్యోగ ధర్మానికే పరిమితమైతారు. మంచి చదువులు చెప్పి రాష్ట్రస్థాయిలోనో, రాష్ట్రపతి అవార్డులో అందుకుంటారు. కానీ, కొందరు ఉపాధ్యాయులు మాత్రం అంతకుమించి ఆలోచిస్తారు. ఏదైనా తప్పు జరుగుతోందని తెలిస్తే ఖండిస్తారు. అవసరమైతే పోరాటం చేస్తారు. అలాంటి పోరాటయోధుడే తాజాగా నీట్ పేపర్ లీకేజ్ స్కామ్ ను బట్టబయల్జేసిన శశికాంత్ సుతార్. రాజస్థాన్ కు చెందిన ఈ కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు ఎలా నీట్ పేపరు లీకేజ్ ను గుర్తించాడు. ఆయన గుర్తించిన తర్వాత ఏం జరిగింది..? గుర్తించి ఫిర్యాదు చేశాకైనా ఈ వ్యవస్థ సక్రమంగా స్పందించిందా…? అసలేం జరిగింది..?
డబ్బులుంటే చాలు ఏదైనా కొనుక్కోవచ్చు. వ్యవస్థల్లో పేరుకుపోయిన అవినీతితో కొనుగోళ్ల దందా రాజ్యమేలుతున్న కాలాన.. కాదేదీ అందుకు అనర్హమన్నట్టు ఉన్నతస్థాయి చదువులకు కూడా ఇప్పుడా మకిలీ అంటుకుంది. మొత్తంగా ఉన్నత విద్యావ్యవస్థపైనే విశ్వసనీయత సన్నగిల్లేలా చేసింది తాజాగా లీకైన నీట్ ఎగ్జామినేషన్ స్కామ్.

శశికాంత్ సుతార్ రాజస్థాన్ సీకర్ కు చెందిన కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు. 2026, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారాన్ని బట్టబయల్జేసిన కీలక పాత్రధారి. మే 3వ తేదీన నీట్ ఎగ్జామ్ పూర్తైంది. లీక్ పై అనుమానం వ్యక్తం చేస్తూ మొట్టమొదట శశికాంత్ అధికారులను అప్రమత్తం చేశాడు.
ఆ రోజు శశికాంత్ కొందరు విద్యార్థులతో కలిసి ప్రశ్నాపత్రం గురించి చర్చిస్తున్న క్రమంలో ఈ స్కామ్ బహిర్గతమైంది. తనకు తెలిన ఓ విద్యార్థి ఓ పీడీఎఫ్ డాక్యుమెంట్ శశికాంత్ కు చూపించాడు. ఆ డాక్యుమెంట్ మే 2వ తేదీ నుంచే.. అంటే నీట్ పరీక్షకు ఒక్కరోజు ముందు నుంచే వైరలైన డాక్యుమెంట్.
అది చూసిన శశికాంత్ అవాక్కైపోయాడు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ లో తను బోధించే కెమిస్ట్రీలోని 45 ప్రశ్నలేవైతే వచ్చాయో… అవే ఆ పీడీఎఫ్ లో ఉండటంతో షాక్ కు గురయ్యాడు ఆ టీచర్. వెంటనే తన మిత్రుడైన బయాలజీ టీచర్ కు ఫోన్ చేసి బయాలజీ సబ్జెక్ట్ ప్రశ్నలను కూడా పోల్చి చూడమని చెప్పాడు. తన ఫ్రెండ్ పరిశీలిస్తే.. బయాలజీలో కూడా 90 శాతం అవే ప్రశ్నలు నీట్ ఎగ్జామ్ లో రావడంతో పేపర్ లీక్ అయిందని కచ్చితంగా రూఢీ చేసుకున్నాడు శశికాంత్.
వెంటనే సీకర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ, పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సంప్రదించమని పోలీసులు అక్కడ ఉచిత సలహా ఇచ్చి పంపించేశారు. పట్టించుకోలేదు. కానీ, శశికాంత్ లో మాత్రం అహోరాత్రులు కష్టపడి చదివిన విద్యార్థులు నష్టపోకూడదనే బాధ, ఆందోళన మొదలైంది. మళ్లీ అర్ధరాత్రి నిద్రపట్టని సుతార్.. ఒంటిగంట సమయంలో పోలీస్ స్టేషన్ గడప తొక్కి కంప్లైంట్ తీసుకోవాలని కోరాడు.
ఆ తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఈమెయిల్ ద్వారా సమాచారమందించాడు. వెంటనే ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ నుంచి సుతార్ కు ఫోన్ వచ్చింది. ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసును వెనువెంటనే సీబీఐకి అప్పగించడం.. ఆ తర్వాత సీబీఐ అధికారులు కూడా సుతార్ ను సంప్రదించడం అంతా ప్రొసీజర్ లో భాగంగా జరిగిపోయాయి. శశికాంత్ తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలను సీబీఐకీ, ఎన్టీఏ అధికారులకు అప్పగించాడు.
అయితే, ఈ విషయాన్ని వెలికి తీసిన సుతార్ కు బెదిరింపులు ఎదురైనట్టుగా కూడా కొంత ప్రచారం జరిగినా.. వాటిని శశికాంత్ కొట్టిపారేశారు. జస్ట్ విద్యార్థుల భవిష్యత్తు, వారి ప్రయోజనాలే లక్ష్యంగా తాను దాన్నెలాగైనా బయటపెట్టాలని యత్నించానన్నారు. నీట్ లీకేజీ కేసులో దోషులను పట్టుకోవాలన్నదే సుతార్ వాదన.
ఇప్పటికే ఈ వ్యవహారంలో సీబీఐ 9 మందిని అరెస్ట్ చేసింది. వారిలో రాజస్థాన్ లోని జైపూర్, సీకర్.. హర్యానాలోని గురుగ్రామ్.. మహారాష్ట్రలోని నాసిక్, పూణే, అహిల్యానగర్ ప్రాంతాలకు చెందిన నిందితులున్నారు. ఈ దర్యాప్తులో కీలకమైన మలుపు పూణేలో బట్టబయలైంది. అక్కడి కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్టీఏ పరీక్ష ప్రక్రియలో భాగంగా ప్రశ్నాపత్రాలకు యాక్సెస్ ఉండటంతో.. కులకర్ణిని ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్నారు. పూణేకే చెందిన మరో బాటనీ టీచర్ మనీషా గురునాథ్ మంధారే ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె ఎన్టీఏ నియమించిన నిపుణురాలిగా నీట్ పరీక్షా పత్రాల ప్రక్రియలో పనిచేశారు.
మొత్తంగా కొందరు ఉపాధ్యాయులు ఉన్నత చదువుల విషయంలో బుద్ధి గడ్డి తిని ప్రవర్తిస్తే… శశికాంత్ సుతార్ మాత్రం బుద్ధితో వ్యవహరించి ఈ మొత్తం నీట్ పరీక్ష లీకేజీ స్కామ్ ను బట్టబయల్జేసి ఇప్పుడు హీరో అయ్యారు. సామాజిక బాధ్యత కల్గిన ఉపాధ్యాయుడిగా మన్ననలందుకుంటున్నాడు.



