వేణువై వచ్చాడు భువనానికి.. ఇదేరోజు 2016, మే 22న గాలైపోయాడు గగనానికి! తాను రాసిన పాటలానే.. గాలిలో కలిసి పోయినా.. జీరో పర్సెంట్ పొల్యూషన్ తో ఆక్సిజన్ రూపంలో అందివచ్చే సుమధుర గాలిలా వీస్తుంది ఆ గీతం. పాట బతికున్నంత కాలం.. తెలుగు భాష కొనసాగినంత కాలం.. సాహిత్యానికి అభిమానులున్నంత కాలం.. ఆయన రాసిన ప్రతీ పాటా పిల్లతెమ్మెర గాలై పలకరిస్తూనే ఉంటుంది. వీనులవిందైన వేణువై చెవులను అలరిస్తూ సాగుతుంది. పేరుకు తగినట్టుగానే ప్రభాకరుడై ప్రతీ ఇంటా మోబైల్ లోనో, టీవీలోనో, రేడియోలోనో ఉదయిస్తూ మోగుతూనే ఉంటాడు. సూర్యుడికి సూర్యాస్తమయాలున్నట్టే.. వేటూరికీ పుట్టుక గిట్టుకలుండవచ్చునేమోగానీ.. ఆయన రాసిన పాట మాత్రం ఎప్పటికీ చిరంజీవే.
కృషి ఉంటే మనుషులు రుషులవుతారని అడవిరాముడులో ఆయనే రాసినట్టు ఎదిగాడు. మానసవీణ మీటి తన పాటతో మధుమాసాన్ని సృష్టించాడు. ఝుమ్మంది నాదం అంటూ.. తన పాట విన్న ప్రతీ పాదాన్నీ ఎగిరి గంతేయించాడు. కొమ్మకొమ్మకో సన్నాయంటూ.. కోటిరాగాలను తన పదాల్లో పలికించాడు. ఉరిమే ఉరుములు మెరిసే మెరుపులతో పరవశాన శిరస్సునూగించినా.. వెన్నెల్లో గోదారి అందాలను వర్ణించినా.. కిన్నెరసానికి వెన్నెల పైటేసినా.. భావయుక్తమైన స్వేచ్చకు ఆ కలం ఓ ప్రతీక. ఆకాశాన విహంగమై ఎగిరే ఓ పక్షి.. సంద్రమంతా తనదేనన్నట్టుగా ఈదే ఓ చేపపిల్లలా.. ఎల్లలు లేని విహారానికి ఓ పర్యాయపదం.

మర్మస్థానం కాదది నీ జన్మస్థానమంటూ.. దుర్యోధన, దుశ్శాసన దుర్వినీత లోకాన్ని ప్రతిఘటించిన కలమే… కోమలమైన కొరమీనుకు సొరచేపకు శోభనం చేసింది. అబ్బ నీ తీయనీ దెబ్బ అంటూ హోయలు పోయిన శ్రీదేవిని.. యమహో నీ యమా యమా అందం అంటూ ఆటపట్టించిన మెగాస్టార్ స్టెప్పుల మెరుపులకు ఉత్ప్రేరకం ఆ పాట! కర్పూరవీణలా కరిగిపోయే గీతాన్ని రాశాడు.. పావురానికి, పంజరానికి ముళ్ళు పెట్టే మూఢలోకాన్నీ పట్టి చూపాడు. ఆకాశాన సంధ్యవేళ సూర్యుడుండడని.. తెల్లవారితే చందమామకు రూపముండదని.. నగ్నసత్యాలను అందంగా ప్రెజెంట్ చేసిన కలం వేటూరి. అంతెందుకు, పసివాడి ప్రాణంలో పాటొకటి వినండి… కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ చందమామ.. కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ చందమామ. అసలు సూరీడు కరగడమేంటి.. కన్నె ఈడును మంచుతో పోల్చడమేంటి… అది కదా భావుకతలో రససిద్ధి అంటే. అందుకే వేటూరి ఎవర్ గ్రీన్.
రాలిపోయే పువ్వా రాగాలెందుకే తోటమాలిని తోడు లేనులే అంటూ నర్మగర్భంగా వైరాగ్యాన్ని పర్చినవాడు. స్నేహితుడా స్నేహితుడా అంటూ రహస్యాల అంతరంగాన్ని విప్పినవాడు. మాండురాగాన్ని మదనమోహినీ చూపులో బంధించి.. తోడిరాగంలో శశివదనే అంటూ ప్రేమలోకి దింపినవాడు. కంచిపట్టున మధురమధురతర మీనాక్షిని పలకరించి.. గోదారిలా ఉప్పొంగి.. మంగళంపల్లి పరిభాషలో గానం కోరుకున్న గీతం పేరు వేటూరి. పయనీరన్నా, ట్రెండ్ సెట్టర్ అన్నా వేటూరే. తానాయనకు కేవలం కొనసాగింపు మాత్రమేనన్నాడు సిరివెన్నెల కురిపించిన సీతారాముడు. వేటూరి వారి పాటకు సమవుజ్జీ ఎవరని సరస్వతిని చేరి కోతితే.. తన పాటేశ్వరుడికి వుజ్జీ వేటూరేనని సాక్షాత్తు సరస్వతే నవ్వుతూ చెప్పిందన్నది ముళ్లపూడి వారి ప్రశంస. ఆ మాటకు పూర్తి అర్హుడై.. మాడల్ గా నిల్చిన పాళీ వేటూరి.
ఆ కలానికి… ఎన్నో గళాలకు బలమైన ఆ పదానికి… తెలుగు పాటకు సృజనాత్మక రూపుతో వన్నె తెచ్చిన ఆ అక్షరయజ్ఞానికి… సంప్రదాయ పాటలకు పదనిసలనద్దిన ఆ వాక్యనిర్మాణానికీ… వ్యాకర్ణ కౌశల్యానికి… మొత్తంగా తెలుగుజాతి కీర్తిపతాకైన వేటూరిని.. దివికెగిసిన రోజున ఓసారి యాజ్జేసుకుంటూ.. ఈ చిన్న నివాళి.



