డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాల అడ్డాలుగా.. గోల్డెన్ ట్రయాంగిల్ కంట్రీస్!

రెచ్చిపోతున్న ఆగ్నేయాసియా డిజిటల్ స్కామ్ సిండికేట్!

ఎంత అవగాహన కల్పిస్తున్నా… ఎన్ని ప్రచారాలు చేస్తున్నా… డిజిటల్ అరెస్టులు, ఆన్ లైన్ స్కామ్స్ మాత్రం ఆగడం లేదు. బాధితులు పుట్టుకొస్తూనే ఉన్నారు. జస్ట్ ఈమధ్యే ఓ రిటైర్డ్ ఇంజనీర్ ఏకంగా 10 కోట్ల రూపాయలను ఆన్ లైన్ మోసంలో పోగొట్టుకున్నాడు. దీనిపై ఇప్పటికే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తో పాటు, కొన్ని మీడియా సంస్థలూ పరిశోధిస్తే… ఇదంతా ఆగ్నేయాసియా నుంచి నడుస్తున్న డిజిటల్ క్రైమ్ సిండికేట్ గా తేలింది. కాంబోడియా, మయన్మార్, లావోస్ ఈ మూడు దేశాలు ఈ డిజిటల్ మోసాలకు గోల్డెన్ ట్రయాంగిల్ గా మారాయి.

సైబర్ క్రైమ్ తో పాటు, హ్యూమన్ ట్రాఫికింగ్ కు అడ్డాగా గోల్డెన్ ట్రయాంగింల్!

సందడి సందడిగా ఉండే పర్యాటక ప్రాంతాలకు కాస్త దూరంగా… బీచ్ సైడ్ క్యాసినోలు, గేటెడ్ కాంప్లెక్సులే ఈ సైబర్ క్రైమ్ సిండికేట్ కు అడ్డాలు. ఇక్కడి నుంచే క్రిమినల్స్ తమ సైబర్ స్కామ్స్ కు వ్యూహరచన చేస్తారు. బాధితులను… వారిని బాధితులను చేసే బాధిత నిందితులకు కూడా తెలియకుండా… ఈ రహస్య నేర సామ్రాజ్యాలు పనిచేస్తాయి.

ఈ సైబర్ క్రైమ్ లో ప్రధానంగా భారత్, నేపాల్, బంగ్లాదేశ్ లే ప్రధాన లక్ష్యాలు. ఇక్కడి నుంచి పురుషులతో పాటు.. మహిళలనూ అక్రమరవాణా చేస్తున్నారు. మంచి జీతాల పేరుతో ఉద్యోగావకాశాలను ఎరగా వేస్తూ నేరాల్లో ఇరికించి బ్లాక్ మెయిలింగ్ తో బానిసలుగా మారుస్తున్నారు. శారీరక వేధింపులు, ఆకలికేకలు, నిరంతర బెదిరింపులు ఇక ఇవన్నీ.. అక్కడికి తెలియక చేరుకున్న పాపానికి అదనపు బోనస్.

సైబర్ క్రైమ్స్ పై కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా!

అరచేతుల్లో మోబైల్ ఫోన్ తో ప్రపంచాన్ని చుట్టేస్తున్నామన్న సంతోషమెంతో… అదే స్థాయిలో వినాశక చర్యలకూ మన టెక్నాలజీ ఉపయోగపడుతోంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు… హ్యాకింగ్ లో పండిపోయినవారెందరో ఇప్పుడు క్రిమినల్స్ చెంత చేరుతున్నారు. నేరుగా వారేం బయటకు వచ్చే అవకాశాలుండవు.. కావల్సినంత డబ్బు.. ఇలా హ్యాకింగ్ లో నైపుణ్యం సంపాదించినవారంతా నేరాలబాట పడుతుండటంతో అమాయక జనం బాధితులుగా రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదే స్థాయిలో హ్యాకర్స్ ను ఎదుర్కొనేలా… ఎథికల్ హ్యాకింగ్ వ్యవస్థలు అన్ని రంగాల్లోనూ లేకపోవడమూ పెద్ద లోటుగా మారింది. ఇలాంటి లొసుగులను ఆసరా చేసుకుంటూ… సైబర్ క్రైమ్స్ కు వివిధ రూపాలిస్తూ అకౌంట్స్ లోంచి కోట్లు కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు.

ఈ ఏడాది 2024 మొదటి నాలుగు నెలల్లోనే… అంటే, జనవరి నుంచి ఏప్రిల్ వరకు సైబర్ క్రైమ్స్ లో ఏకంగా భారతదేశం మొత్తమ్మీద ఏడు వేల కోట్ల రూపాయలను సైబర్ క్రైమ్ కేటుగాళ్లు స్వాహా చేశారన్నది ఏకంగా భారత హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న విషయం.

ఏకంగా ఆరు లక్షల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)కి అందాయి.

ఇక ఫలానాదాంట్లో పెట్టుబడి పెట్టండి మీకు పదింతల ఆదాయం వస్తుందంటూ ఫోన్ మెస్సేజెస్, వాట్సప్, ఇన్ స్టా ద్వారా జరిగిన మోసాలకు సంబంధించిన 2023లో ఏకంగా పదివేల ఎఫ్ఐఆర్స్ నమోదయ్యాయి.

IT చట్టంలోని సెక్షన్ 69A కింద 3 వేల యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్స్ (URL), 595 యాప్స్ బ్లాక్ చేశారు అధికారులు.

2023 జూలై నుంచి దేశవ్యాప్తంగా 5 లక్షల 30 వేల సిమ్ కార్డులతో పాటు, 80 వేల 848 ఇంటర్నేషనల్ మోబైల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ (IEMI) నంబర్స్ బ్లాక్ చేయబడ్డాయి.

హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ సైబర్ క్రైమ్స్ పై ఈడీ దృష్టి!

ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ సైబర్ క్రైమ్స్ పై దృష్టి సారించింది. ఈడీ ఛార్జ్ షీట్ ప్రకారం నకిలీ ఉద్యోగాల ఆఫర్స్ తో ట్రాఫికర్స్ ఎలా ఆకర్షిస్తారో తన ఇన్వెస్టిగేషన్ ను ప్రారంభించింది. ఆగ్నేయాసియాకు చేరుకున్న తర్వాత చాలామంది బాధితులు బయటకు రాలేక, అక్కడ ఉండలేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో.. అలాంటి పరిస్థితుల్లో వారు విధిలేని పక్షంలో ఎలా సైబర్ క్రైమ్స్ లో భాగస్వాములవుతున్నారో కూడా వెల్లడించింది.

ఈడీ ఛార్జ్ షీట్ లో ప్రాధాన్యతాంశాలు!

కంబోడియా, మయన్మార్, లావోస్ ఈ మూడు గోల్డెన్ ట్రయాంగిల్ గా హాట్ స్పాట్స్ గా గుర్తించబడ్డాయి.

ఈ ప్రాంతాలకు మానవ అక్రమ రవాణాకు థాయిలాండ్ ప్రధాన వారధిగా పనిచేస్తోంది.

ఫేక్ జాబ్స్ పేరిట ఉచ్చుకు చిక్కిన బాధితులు అక్కడికెళ్లాక హింసకు గురికావల్సిందే. సైబర్ క్రైమ్స్ లో బలవంతంగా పాల్గొనాల్సిందే.

ఈ ప్రాంతాలకు 30 వేల మంది భారతీయులు ఇప్పటికే సందర్శకుల వీసాలపై వెళ్లి తిరిగిరాలేదని ఈడీ పేర్కొంది.

ఉత్తరప్రదేశ్ కు చెందిన 36 ఏళ్ల మనీష్ తోమర్ కథను ఈడీ ఓ ఉదాహరణగా చూపింది. యూట్యూబర్ బాబీ కఠారియా నుంచి వచ్చిన నకిలీ ఉద్యోగం యాడ్ తో మోసపోయి రెండు వేల రూపాయలతో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి మరీ లావోస్ వెళ్లి సైబర్ క్రైమ్ హబ్ లో ఇరుక్కుపోయాడు.

నకిలీ ఫేస్ బుక్ ప్రొఫైల్స్ సృష్టించి యూఎస్ లోని భారతీయను డాలర్లలో పెట్టుబడులు పెట్టమని ఆకర్షిస్తామని.. అందుకోసం, తామేది చెబితే అది చేయాల్సిందేనని తమను సైబర్ కేటుగాళ్లు బలవంతం చేస్తారని తోమర్ వంటివాళ్లు చెప్పే మాటలు.

దౌత్యపరమైన జోక్యాలు, చర్యలు!

గోల్డెన్ ట్రయాంగిల్ పేరుతో లావోస్, మయన్మార్, కాంబోడియాల్లో సాగుతున్న ఈ సైబర్ క్రైమ్స్ పై ఆ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలను భారత ప్రభుత్వం అలర్ట్ చేసింది. అవిప్పుడు అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బాబీ కఠారియా వంటి ట్రాఫికర్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసిన తర్వాత.. ఆ చైన్ మొత్తాన్ని ఛేదించే ప్రయత్నాలపై భారత నిఘా సంస్థలు మరింత దూకుడు పెంచాయి.

ఇదే సమయంలో ప్రజలు కూడా మోబైల్ ఫోన్స్ ద్వారా వచ్చే టెక్స్ట్ మెస్సేజెస్ నుంచి మొదలుకుంటే వాట్సప్ లో అనుమానితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ఉచ్చులో పడొద్దని, వాటి ద్వారా వచ్చే మెస్సేజెస్ ని ఓపెన్ చేయొద్దని.. అతిగా ఆశపడి పెట్టుబడులతో వచ్చే సందేశాలను ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్స్, ఇతరత్రా వివరాలు ఇవ్వొద్దని.. ఫేస్ బుక్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో వచ్చే అన్ నోన్ మెస్సేజ్ పై అలర్ట్ గా ఉండాలని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఎంత నిఘా సంస్థలు ఎందరు నేరస్థులను పట్టుకున్నా కూడా.. ప్రజల్లో అప్రమత్తత అనేది లేకుంటే ఈ నేరాలు పెచ్చుమీరడమే తప్ప.. తగ్గుముఖం పట్టవన్నది అధికారులు చెబుతున్న మాట.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles