అర్జెంటీనాపై 2026 ఫిఫా ప్రపంచకప్ గెలిచి, విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టు చేసిన సంబరాలు ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులందరి దృష్టినీ ఆకర్షించాయి. ఆనందోత్సాహాలు, ఆలింగనాలు, ట్రోఫీ ఎత్తిపట్టడం వంటి సాధారణ వేడుకలతో పాటే.. మరో దృశ్యం కూడా అక్కడ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఏంటది..?
తమకు దక్కిన అడిషనల్ టైంను ఉపయోగించుకుని 1-0తో అర్జెంటీనాను ఓడించిన స్పెయిన్ ఆటగాళ్లు.. వెంటనే గోల్ పోస్ట్ కు ఉన్న నెట్ ను కత్తిరించడం ఫిఫా ఫైనల్స్ తర్వాత చర్చకు తెరలేపింది. అదే అందరి దృష్టినీ అమితంగా ఆకర్షించింది. ఆ కత్తిరించిన గోల్ పోస్ట్ ను ఆటగాళ్లంతా తమతో పాటు తీసుకెళ్లడం మరింత విశేషంగా కనిపించింది.

అసలదేం సంప్రదాయం..?
బాస్కెట్ బాల్ లో ప్రసిద్ధమైన సంప్రదాయాన్ని ఫిఫా ఫుట్ బాల్ గెల్చుకున్న తర్వాత స్పెయిన్ అనుసరించింది. ఈ వినూత్న సంబరం వెనుక కారణమేంటంటే… గోల్ నెట్ ను ముక్కలుగా కత్తిరించే సంప్రదాయాన్ని అత్యంత గొప్ప విజయానికి గుర్తుగా బాస్కెట్ బాల్ లో భావిస్తారు. అడిషనల్ టైం 106వ నిమిషంలో ఆల్టర్నేటివ్ గా వచ్చిన ఆటగాడు ఫెర్రాన్ టోరెస్ చేసిన ఏకైక గోల్ స్పెయిన్ కు చారిత్రాత్మక విజయాన్నందించింది. దాంతో విజయోత్సవాలు ఆరంభమైన వెంటనే స్పెయిన్ ప్లేయర్స్ బాస్కెట్ బాల్ ఆటలో ప్రసిద్ధి చెందిన నెట్ ను కత్తిరించే విధానాన్ని అనుసరించారు.
గోల్ పోస్ట్ నెట్ కత్తిరించే సంప్రదాయం ఎక్కడ, ఎప్పుడు ఆరంభమైంది..?
గోల్ పోస్ట్ నెట్ ను కత్తిరించి జ్ఞాపకంగా తీసుకెళ్లే సంప్రదాయం అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో మొట్టమొదట ప్రారంభమైంది.
20వ శతాబ్దం ఆరంభంలో ఛాంపియన్ గా నిలిచిన జట్టు… తమ విజయానికి చిహ్నంగా బాస్కెట్ బాల్ నెట్ ను కట్ చేసి తీసుకెళ్లడం ప్రారంభమైంది. 1947వరకు ఈ సంప్రదాయం మరింత ప్రసిద్ధి చెందింది. నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ కోచ్ అయిన ఎవెరెట్ కేస్.. తమ జట్టు, సదర్న్ కాన్ఫరెన్స్ టోర్నమెంట్ గెలిచిన సందర్భంగా ఆటగాళ్ల భుజాలపైకెక్కి బాస్కెట్ బాల్ నెట్ లో కొంత భాగాన్ని కత్తిరించి తీసుకెళ్లాడు.
ఎవరెట్ కేస్ 23 ఏళ్ల తన స్వస్థలమైన ఇండియానాలో హైస్కూల్ బాస్కెట్ బాల్ కోచ్ గా పనిచేసి.. నాల్గు రాష్ట్ర ఛాంపియన్ షిప్స్ సాధించాడు. 1946లో నార్త్ కరోలీనా స్టేట్ కు కోచ్ గా చేరాడు. 1947లో జట్టును సదర్న్ కాన్ఫరెన్స్ టోర్నమెంట్ విజేత నిలిపిన తర్వాత విజయానికి గుర్తుగా నెట్ ను కత్తిరించి తీసుకెళ్లాడు. అదే ఆ తర్వాత బాస్కెట్ బాల్ లో గుర్తింపు పొందిన ఓ సంబరంగా మారిపోయింది. ప్రస్తుతం అనేక టోర్నమెంట్స్ తర్వాత బాస్కెట్ బాల్ పోటీల్లో మనకీ ఆనవాయితీ కనిపిస్తుంది.
స్పెయిన్ ఆటగాళ్లు అదే సంప్రదాయాన్ని ప్రపంచ ఫుట్ బాల్ లోని అతి పెద్ద వేదికైన ప్రపంచకప్ ఫైనల్ కూ తీసుకొచ్చారు. మెట్ లైఫ్ స్టేడియంలో అర్జెంటీనాను ఓడించిన తర్వాత తమ గెలుపు జ్ఞాపకంగా గోల్ పోస్ట్ నెట్ ను ముక్కలుగా కట్ చేసి తలో ముక్క పట్టుకెళ్లారు.



