రోచిష్మాన్… ✍🏻, 9444012279
———————————————————————
ఎస్.డీ. బర్మన్ పాట
“దిల్ కా భన్వర్ కరే పుకార్ ప్యార్ కా రాగ్ సునో…”
1963లో వచ్చిన తేరే ఘర్ కే సామ్‌నే హిందీ సినిమాలోని పాట “దిల్ కా భన్వర్ కరే పుకార్ ప్యార్ కా రాగ్ సునో…”
ఎస్. డీ. బర్మన్… దేశ సినిమాలో వచ్చిన అత్యంత గొప్ప సంగీత దర్శకుల్లో ఒకరు సచిన్ దేవ్ బర్మన్ లేదా ఎస్. డీ. బర్మన్! (1906-75)

ప్రతి గొప్ప కళాకారుడికి తన ముద్ర ఉంటుంది. ముద్ర లేకుండా ఉండడం మరో స్థాయి గొప్పతనం ఔతుంది. ఎప్పటికప్పుడు తన ముద్ర నుంచి బయటపడుతూ, తనను తాను మార్చుకుంటూ కొనసాగడం కూడా కళాకారుడి వైశిష్ట్యం ఔతుంది. అటువంటి కళాకారుడు సంగీత దర్శకుడు ఎస్.డీ. బర్మన్.
భారతదేశ సినిమాలో తన ముద్రను తానే అధిగమిస్తూ పురోగమించిన సంగీత దర్శకులు ప్రముఖంగా ఇద్దరు. ఒకరు ఎమ్.ఎస్. విశ్వనాద(థ)న్; ఇంకొకరు ఎస్.డీ. బర్మన్. దేశ సినిమాలో ఎమ్.ఎస్. విశ్వనాదన్, ఎస్.డీ. బర్మన్ ఇచ్చినంత వైవిధ్యభరితమైన సంగీతాన్ని ఇతర గొప్ప సంగీత దర్శకులు ఇవ్వలేదు! అంత విశ్వనాదన్ కూడా ఎస్.డీ. బర్మన్ ప్రభావంతో పాటలు చేశారు.
ఎస్.డీ. బర్మన్ విషనరీ కాదు; ట్రెండ్ సెట్టర్ కాదు. అయినా దేశంలోని గొప్ప సంగీత దర్శకుల్లో ప్రముఖమైన వారు ఎస్.డీ. బర్మన్. (దక్షిణాదిలో కె.వీ. మహాదేవన్ ఇలాంటి గొప్ప సంగీత దర్శకుడు)
1935లో వచ్చిన సుదేరెర్ ప్రియే అన్న బెంగాలీ సినిమా సంగీత దర్శకుడిగా బర్మన్ తొలి సినిమా. అంతకు ముందు పలు బెంగాలీ నాటకాలకు సంగీతం చేశారు; అంతకు ముందు రేడియో గాయకుడు త్రిపుర రాజ వంశంలో పుట్టిన బర్మన్.
1946 వచ్చిన షికారీ బర్మన్ తొలి హిందీ చిత్రం. 1947లో వచ్చిన దోభాఈ హిందీ సినిమాతో బర్మన్ గుర్తింపును పొందారు. దోభాఈ సినిమాలో గీతా రాయ్ పాడిన “మేరా సుందర్ సప్నా బీత్ గయా…” పాట పెద్ద హిట్. ఆ తరువాత 1951లో వచ్చిన బాజీ సినిమాలో గొప్ప పాటలు చేశారు బర్మన్. ఆ సినిమాలోని “సునో గజర్ క్యా గాయే…” పాట విశేషంగా ఉంటుంది.
దేశ సినిమాలో వచ్చిన ‘తొలి serenade ఎస్. డీ. బర్మన్ చేశారు’ అని నా ఎరుక. 1952లో వచ్చిన జాల్ సినిమాలోని హేమంత్ కుమార్ పాడిన “యే రాత్ యే చాంద్‌నీ…” పాట దేశ సినిమాలో వచ్చిన తొలి serenade. (నా ఈ మాట తప్ప అనీ, సరైనది ఇది అనీ చెప్పిన వాళ్లకు కృతజ్ఞుణ్ణి అవుతాను)
1951లో వచ్చిన నౌజవాన్ సినిమాలో ఎస్.డీ. బర్మన్ చేసిన “ఠండీ హవాయే లహరాకే ఆయే…” పాట ఆధారంగా లేదా ప్రేరణగా లేదా అనుసరణగా హిందీలోనే 10, 12 పాటలు వచ్చాయి. ఆ పాటల్లో రోషన్, మదన్ మోహన్, ఆర్. డీ. బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ వంటి లబ్ద ప్రతిష్టులు చేసిన పాటలూ ఉన్నాయి. మన నాగయ్య కూడా ఆ పాటకు కాపిగా తమిళ్ష్‌లో “కొఞ్‌జుమ్ పురావే…” పాటను చేశారు.
ఈ “ఠండీ హవాయే లహరాకే ఆయే…” పాటకు ఒక బెంగాలీ జానపదం ఆధారం అని, బర్మన్ ఒక రోజు చిట్టగాంగ్‌లో ఒక వీధిలో నడుచుకుంటూ వెళుతూండగా ఆ దారిలో పోతున్న ఒక బెంగాలీ పల్లె అమ్మాయి పాడుకున్న పాట విని ఈ పాటను చేశారు అని తాను ఒక పుస్తకంలో చదివానని వీ.ఎ.కె. రంగారావు నాకు చెప్పారు.
బర్మన్ బెంగాలీ, అస్సామీ జానపదం ఆధారిత సంగీతాన్ని విరివిగా చేశారు. సలిల్ చౌధరీ, బర్మన్ ఈ ఇద్దరి విజయంలో జానపదం ముఖ్యంగా అస్సామీ, బెంగాలీ జానపదం ప్రధానమైంది.
Finesse సంగీతం ఎస్. డీ. బర్మన్ సంగీతం. జానపదాన్ని వెస్టన్ సంగీతంతో కలిపి గొప్ప పాటల్ని సృష్టించడం ఇళైయరాజా కన్నా ముందే ఎస్. డీ. బర్మన్ ప్రసిద్ధం చేశారు.
“మేరా సుందర్ సప్నా బీత్ గయా…” పాట నుంచీ “నైన్ దీవానే…”( సినిమా: అఫ్సర్), “ఉపర్ గగన్ విశాల్…” (మహల్), “తుమ్ నా జానే కిస్ జహాన్…”(సమ), “జాయే తో జాయే కహాన్…”(టాక్సీ డ్రైవర్), “దుఖి మన్ మేరే…” (ఫన్‌తూష్), “జానే క్యా తూనే కహీ…”(ప్యాసా), “హమ్ బేఖుదీ మేన్ తుమ్ కో పుకారే చలే గయే…” (కాలాపానీ), “జల్‌తే హైన్ జిస్ కేలియే…”(సుజాతా), “వక్త్ నే కియా క్యా హసీన్ సితమ్…”(కాగజ్ కే ఫూల్), “చల్ రీ సజ్‌నీ అబ్ క్యా సోచే…”(బొంబై కా బాబూ), “న తుమ్ హుమెన్ జానో…” (బాత్ ఎక్ రాత్ కీ), “పూఛో నా కైసే…”
(మేరీ సూరత్ తేరీ ఆంఖేన్), “ఖొయా ఖొయా చాంద్…” (కాలా బజార్), “రాత్ కా సమా…” (జిద్దీ), “దిన్ ధల్ జాయే…” (గైడ్), “ఫూలోం కే రంగ్ సే…” (ప్రేమ్ పుజారీ), “ఖిల్ తే హైన్ గుల్ యహాన్…”(షర్మిలీ) వంటి ఎన్నో గొప్ప గొప్ప పాటల్ని చేసి చేసి ఎస్.డీ. బర్మన్ దేశాన్ని అలరించారు.
“పల్‌కోన్ కే పీఛే సే…” పాట తలాష్ (1969) సినిమాలోది. ఎస్.డీ. బర్మన్ విశేషంగా చేసిన పాటల్లో ఒకటి అది. Phrase progression పరంగా ప్రశస్తమైన పాట. ఈ పాటకు ముందు 1967లో వచ్చిన జుఅల్ తీఫ్ సినిమాలోని విశేషమైన పాట “దిల్ పుకారే ఆరే ఆరే…” పాట. 1947లో “మేరా సుందర్ సప్నా బీత్ గయా…” పాటను చేసిన ఎస్. డీ. బర్మన్ 67లో, 69లో ఈ పంథాలో పాటలు చేశారు! ఈ కోవలో ఆరాధన(1969) సినిమాలోని “కోరా కాగజ్ థా యే మన్ మేరా…” పాట ప్రత్యేకంగా చెప్పుకోతగ్గది.
70ల వరకూ బర్మన్ సంగీత పరిణామంలోని వైవిధ్యం చాల గొప్పది. దేశంలో ఒక్క ఎమ్. ఎస్. విశ్వనాదన్ మాత్రమే బర్మన్ కన్నా విస్తృతమైన వైవిధ్యాన్ని ఇవ్వగలిగారు.
ఎస్.డీ. బర్మన్ మంచి గాయకుడు కూడా. గాత్ర సౌఖ్యాన్ని మినహాయిస్తే బర్మన్ గాన విధానం చెప్పుకోతగ్గది. బందినీ సినిమాలోని “ఓ రే మాంఝీ సాజన్…” పాటా, “వహాన్ కౌన్ హై తేరా…” (గైడ్), “సున్ మేరా బంధు రే…”(సుజాతా) వంటి పాటలూ ఆయన గాన నైపుణ్యాన్ని తెలియజేస్తూంటాయి. దిన్ ధల్ జాయే పాట పాడడానికి రఫీ 20 టేక్స్ పైనే తీసుకున్నారు. బర్మన్ దాదాపుగా ప్రతి టేక్‌నూ ఒ.కె. చేస్తున్నా రఫీ ఒప్పుకోకుండా “మీరు పాడినట్టుగా రావడం లేదు; అలా రావాల్సిందే” అని బర్మన్ పాడిన స్థాయిలో వచ్చాకే పాటను ఒ.కె. చేశారు.
ఎస్.డీ. బర్మన్ తన గొప్ప సంగీతంతో పాటు దేశ సినిమాకు చేసిన మరో సమర్పణ కిషోర్ కుమార్. కిషోర్ కుమార్ గాన ప్రతిభకు,
గాన నైజానికి మార్గం, నిర్దేశనం, ఆమోదం బర్మన్ ఇచ్చారు.
ఇళైయరాజా కూడా ఎస్.డీ. బర్మన్ ప్రభావితుడై కొన్ని పాటలు చేశారని అని కొందరి మాట.
మన ఎస్. రాజేశ్వరరావు తన మీద ఎస్. డీ. బర్మన్ ప్రభావం పెద్దగా ఉందని పరిశీలకుల్ని కొంతకాలం పాటు విజయవంతంగా పక్కతోవ పట్టించేశారు. (తనపై వసంత్ దేశాయ్, పంకజ్ మల్లిక్ వంటి ఇతరుల ప్రభావం ఉండడాన్ని పసిగట్ట నివ్వకుండా పరిశీలకుల్ని రాజేశ్వరరావు పక్కతోవ పట్టించినట్టుగా అనిపిస్తుంది)
“దిల్ కా భన్వర్ కరే పుకార్ ప్యార్ కా రాగ్ సునో…” పాట ఎస్.డీ .బర్మన్ చేసిన ఎన్నో గొప్ప పాటల్లో ఒకటి. Finesse..finesse…finesse… an epitome of finesse ఈ పాట. కొన్ని పాటల్ని వినాలనుకున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు ఈ పాట దగ్గర ఆగి
ఒకటికి పదిసార్లు వినాలనిపించే పాట ఇది. మనసు బాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఈ పాట వింటే ఈ పాట మహత్ తెలుస్తుంది.
ఎస్. డీ. బర్మన్ చేసిన ఒక మహత్ గీతం ఇది.
వినండి



