అది 1959… మంచుకొండల్లో గడ్డ కట్టే చలి, మరోవైపు ఎప్పుడెవరికేమైతుందో తెలియని రీతిలో కాల్పులు, ఓ 23 ఏళ్ల యువకుడు తన రాజభవనం నుంచి ఓ సామాన్య గార్డ్ తరహాలో పారిపోయేందుకు బయటకొస్తున్నాడు. కానీ, అతను సామాన్యమైన టెన్జిన్ గయాట్సో కాదు.. టిబెట్ కు చెందిన ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా.

1950ల నుంచే టిబెట్ పైన చైనా పట్టు బిగిస్తూ వస్తోంది. 17 పాయింట్ల ఒప్పందం పేరుతో చైనా ఓ నాటకానికి తెరలేపింది. అందులో భాగంగా టిబెటన్లకు తమ మతపరమైన స్వయంప్రతిపత్తి అందిస్తామని స్పష్టమైన హామీ లభించినా.. ఆచరణకొచ్చేసరికి అది చైనా సార్వభౌమత్వం కింద నలిగిపోతూ వచ్చింది. ఆ విషయాన్ని అప్పటికే 13 దలైలామా హెచ్చరించినట్టు ది టిబెట్ జర్నల్ కూడా అప్పట్లో ప్రచురించింది.
1950ల నుంచే టిబెట్ రాజధాని లాసా చైనా సార్వభౌమత్వం కింద బానిస బతుకననుభవిస్తోంది. అది రానురాను జఠిలమైపోయింది. చైనీస్ దళాలకూ, టిబెటన్లకు ఏదో ఒక ఘర్షణలు, నిరసనలతో 50ల చివరినాటికి శాంతన్నదే కరువైపోయింది. టిబెట్ దళాల అరాచకాలు పెరిగిపోయాయి. భూఆక్రమణల నుంచి మొదలకుంటే తమ దేశంలోనే తమకు స్వేచ్ఛ, భద్రత లేని హ్యూమిలేషన్ కు బౌద్ధ సన్యాసులు గురయ్యారు. రాజీ మార్గానికి నాడు దలైలామాది విఫలయత్నమే అయింది. అప్పటికే టిబెటన్లకు తమ ఆధ్యాత్మిక గురువైన దలైలామానూ చైనా దళాలు ఏదో చేస్తాయనే అపనమ్మకం బలపడింది. అనుకున్నట్టే చైనా దళాలు, ఫిరంగులు, తుపాకులు, యుద్ధట్యాంకుల వంటివి చుట్టుముట్టడం మొదలైంది. మొత్తంగా 1950ల కాలమంతా నిత్యం పోరాటమే జీవితమై పోయింది బౌద్ధభిక్షువులకు.
దలైలామా ట్రాపుకు చైనా యత్నం!
దలైలామాకు తన వెంట అంగరక్షకులెవ్వరూ లేకుండా లాసాలోని సైనిక ప్రధాన కార్యాలయంలో జరిగే ఓ నృత్యప్రదర్శనకు రావాలని చైనీస్ జనరల్ జాంగ్ చెన్యూ నుంచి ఒక ఆహ్వానమందింది. అంగరక్షకులెవ్వరూ లేకుండా రావాలని ఆ ఆహ్వానంలో పేర్కొనడంతోనే.. అది కచ్చితంగా చైనా వేస్తున్న ఏదో ఎత్తుగడ అయి ఉంటుందని భావించారు బౌద్ధభిక్షువులు.
అదిగో అదే 1959, మార్చి 10వ తేదీన సుమారు పదివేలకుపైగా టిబెటన్లు తమ ఆధ్యాత్మిక గురువైన దలైలామాను చైనా కుటిల ఎత్తుగడల నుంచి కాపాడుకోవడానికి నార్బులింగా ప్యాలెస్ వద్దకు చేరుకున్నారు. ప్యాలెస్ చుట్టుముట్టి ఒక మానవహారాన్ని నిర్మించారు. ముందే ఊహించినట్టుగా దలైలామాను ఏం చేయాలనుకుందోగానీ చైనా సైన్యం ఒక్కసారిగా ఆ ప్యాలెస్ వైపు దూసుకొచ్చింది. గుండ్ల వర్షం కురిపించింది. ఇక దలైలామా లాసాలో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదనే వాదన తెరపైకొచ్చింది. రాత్రికి రాత్రే ఇండియాకు వెళ్లిపోవడానికి రంగం సిద్ధమైంది. అదిగో ఆ అలజడి మధ్య అప్పటివరకూ ఎప్పుడూ బౌద్ధభిక్షువుల వస్త్రాల్లో మాత్రమే కనిపించిన దలైలామా.. ఇక ఓ గార్డ్ రూపం ధరించాల్సి వచ్చింది.
అలా పొగమంచు కమ్ముకున్న ఆ చిక్కటి రాత్రి అంతటి ఆధ్యాత్మిక గురువుకు కూడా కాళరాత్రైంది. తల్లి, సోదరులు, కొందరు ఆధ్యాత్మిక ప్రవచనకారులు, మరికొందరు గార్డ్స్, ఇంకొందరు టిబెటన్ అధికారులు ఇలా ఒక సమూహమంతా కలిసి నార్బులింగా ప్యాలెస్ రాజభవనం వెనుక మార్గం నుంచి బయటపడి ఇండియాకు ఆ దట్టమైన మంచుకొండల్లోంచి గడ్డ కట్టే వాతావరణంలో బయల్దేరారు.
ఓవైపు దలైలామా కోసం వెతుకుతున్న చైనా దళాలు, చెక్ పోస్టులు.. అలాంటి వాతావరణాన్ని తప్పించుకుంటూ మధ్యాహ్నాలు రహస్యంగా ఎక్కడో తల దాచుకుంటూ రాత్రిళ్లు బహుదూరపు బాటసారులై దలైలామా బృందం ప్రయాణం సాగించింది. దలైలామా తప్పించుకున్నాడనే వార్త తెలిసిన చైనా దళాలు తమ చాపర్స్ తో ఆ మంచుకొండల్లో వెతుకుతూనే ఉన్నాయి. కానీ, అక్కడి మబ్బులతో కూడిన వాతావరణం, పొగమంచే దలైలామా బృందాన్ని కాపాడింది. అలా చుషుల్, కైచు వంటి లోయలను దాటి హిమాలయాలను దాటి.. అరుణాచల్ ప్రదేశ్ కు చేరుకుంది దలైలామా బృందం.
నెహ్రూకు లేఖ రాసిన దలైలామా!
సరిగ్గా మార్చ్ 10న బయల్దేరిన దలైలామా బృందం.. మార్చ్ 26వ తేదీకి లుంట్సే జోంగ్ కు చేరుకుంది. అప్పుడే నాటి భారత ప్రధాని నెహ్రూకు దలైలామా ఒక లేఖ రాశారు. టిబెట్ మొత్తం రెడ్ చైనా నియంత్రణలోకి వెళ్లిపోయింది. నేను, నా ప్రభుత్వ అధికారులు, సామాన్య పౌరులంతా శాంతిని కాపాడుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తున్నా… చైనా మాత్రం తన నియంతృత్వాన్నే ప్రదర్శిస్తోంది. టిబెటన్ ప్రభుత్వాన్ని లొంగదీసుకుంటోందని తన ఆవేదనను వెలిబుచ్చాడు. ఈ క్లిష్టసమయంలో మీ సాయం మాకు ఎంతో అవసరం. సోనా ద్వారా మేం భారతదేశంలోకి ప్రవేశించాలనుకుంటున్నాం. అందుకు తగిన ఏర్పాట్లు చేసి మీరు మాకు సాయమందించాలని ఆ లేఖలో వేడుకున్నాడు దలైలామా.
దలైలామాకు ఆశ్రయమంటే చైనాతో మళ్లీ తలగోక్కోవడమే!
అప్పుడే ఔట్ డోర్ నుంచి ఢిల్లీకి తిరిగివచ్చిన నెహ్రూలో మళ్లీ ఓ తెలియని ఆందోళన మొదలైంది. దలైలామాను చైనాకు ఆహ్వానిస్తే కచ్చితంగా అది చైనాకు కోపం తెచ్చే పనే అవుతుంది. దౌత్యపరంగా కూడా ఇబ్బందులను సృష్టిస్తుంది. అప్పటికే రక్షణమంత్రి వీ.కే. కృష్ణమీనన్, ఇతరులు కూడా అదే విషయాన్ని బల్లగుద్ది చెబుతున్నారు. కానీ, నెహ్రూ మనసు మాత్రం ఎందుకో దలైలామా వైపే మొగ్గింది.
సుమారు 20 రోజులకు పైగా కాలిబాటన చాలా క్లిష్టతరమైన ప్రయాణాన్ని చేసి ఓ పక్క దేశపు ఆధ్యాత్మిక గురువు మన దేశానికి వస్తానంటే.. ఆపద సమయంలో కాదనడం సరికాదన్న విషయాన్ని పార్లమెంట్ ముందుంచాడు నెహ్రూ. ముఖ్యంగా దలైలామా తన సహచరులైనవారిని సంప్రదించాలన్నా, అక్కడ మళ్లీ శాంతి నెలకొనాలన్నా, మానసిక ఒత్తిని అధిగమించాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో దలైలామాకు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మానవీయకోణంలో అందించాల్సిన బాధ్యత కూడా ఉందనే విషయాన్ని నెహ్రూ స్పష్టం చేశాడు.
అలా నెహ్రూ నిర్ణయం మేరకు సరిగ్గా 1959, మార్చ్ 31వ తేదీన దలైలామా బృందం అరుణాచల్ ప్రదేశ్ లోని ఖెంజిమనే పాస్ వద్ద మెక్ మహాన్ రేఖను దాటి భారత్ లో అడుగుపెట్టారు. అప్పటి అస్సాం రైఫిల్స్ కు చెందిన హవిల్దార్ నరేన్ చంద్రదాస్ అలిసిసొలిసిన దలైలామా బృందానికి నమస్కారం చేసి.. దలైలామా బృందాన్ని అస్సాం రైఫిల్స్ పోస్ట్ నుంచి తవాంగ్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత తేజ్ పూర్ వెళ్లాక అక్కడ ఏప్రిల్ 18న మొదటిసారి దలైలామా చైనా దురాక్రమణలపైన పెదవి విప్పి ఖండించారు. అలాగే, తమకు ఆశ్రయం కల్పించిన భారత్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆ తర్వాత దలైలామా కొంతకాలం ముస్సోరీలో ఉన్నాక.. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలకు పయనమయ్యాడు. ఇక అదే అప్పట్నుంచి టిబెటన్ల ప్రవాస ప్రభుత్వ కేంద్రంగా మారిపోయింది.
భారత్ తీరుపై చైనా గుస్సా!
దలైలామాను తిరిగి టిబెట్ కు పంపించాలని చైనా భారత్ ను డిమాండ్ చేసింది. కానీ, నాడు నెహ్రూ నిరాకరించాడు. 1960ల నాటికి దలైలామా ధర్మశాలలోని మెక్ లియోడ్గంజ్ లో స్థిరపడ్డారు. ఇక ఆ ప్రాంతమే లిటిల్ లాసాగా మారిపోయింది. పాఠశాలలు, మఠాలు, సాంస్కృతిక కేంద్రాలకు నెలవైంది. 1989లో దలైలామా తన అహింసా పోరాటానికి నోబెల్ శాంతి బహుమతిని కూడా ఇదే భారత గడ్డపైకొచ్చాకే అందుకోవడం విశేషం.
వారసుడి ప్రకటనతో మరోసారి చైనా వర్సెస్ దలైలామాగా మారిన మాటల యుద్ధం!
ప్రస్తుతం దలైలామాకు 90 ఏళ్లు. ఇప్పటికీ దలైలామా నివాస కేంద్రం ధర్మశాలనే. ఇంకా కూడా టిబెట్ పై బీజింగ్ నియంతృత్వం మరోవైపు అలాగే కొనసాగుతోంది. ఇంకోవైపు, తన 90 ఏళ్ల వయస్సులో తన తర్వాతి వారసత్వాన్ని ప్రకటించేందుకు దలైలామా స్పష్టమైన ప్రకటన చేశాడు. తను పునర్జన్మ తీసుకుంటానని.. తన తర్వాత 15వ దలైలామాను చైనా ప్రభుత్వం తీసుకోకుండా, ట్రస్ట్ ద్వారా ప్రకటిస్తామని ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు మళ్లీ చైనా వర్సెస్ దలైలామాగా పరిస్థితిని తెరపైకి తెచ్చింది. దలైలామా ప్రకటనతో… భారత్ లోని చైనా రాయబారి శు ఫెయ్ హోంగ్ ఇది దలైలామా చెప్పినట్టు జరిగేది కాదని.. 7 శతాబ్దాల పరంపర అని.. తదుపరి దలైలామాను ప్రకటించేది చైనానేనంటూ దలైలామా ప్రకటనను ఖండించాడు.
1959లో టిబెట్ ను విడిచి భారత్ బాట పట్టి ఇక్కడే స్థిరపడ్డ దలైలామాతో పాటు, ఆ తర్వాత కూడా చాలామంది టిబెటన్లు ఇండియాకు వలస వస్తూనే ఉన్నారు. ఇంకా టిబెట్ పైన చైనా నిరంకుశత్వం కొనసాగుతూనే ఉంది.



