చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు.. చదువుకై మైళ్ల కొద్దీ నడిచాడు… దీపం వెలుగుల్లోనే చీకట్లలో చదువుకున్నాడు… ఆ తర్వాత ఆ కర్నాటక బాలుడే భారతదేశం ఎన్నటికీ మర్చిపోలేని వారసత్వాన్నందించి చిరంజీవి అయ్యాడు. ఇది అందరికీ తెలిసిన కథే. కానీ, ఇంకోసారి తల్చుకోవాల్సిన కథ కూడా.
ఎప్పుడైనా మీకిలా అనిపించిందా..?
ఎంత కష్టపడుతున్నా… క్రమశిక్షణతో పని చేస్తున్నా… సరైన పనే చేస్తున్నామనిపించినా.. జీవితం ముందుకు కదలట్లేదేంటని..? అలా అనిపించినప్పుడు ఏ కొందరో మినహాయిస్తే.. చాలావరకూ మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్నీ కోల్పోవడం సర్వసాధారణం. కానీ, సహనంతో పట్టుదలతో లక్ష్యం కోసం కృషి చేస్తే ఫలితం తప్పకుండా ఉంటుందని నిరూపించిన ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
అందుకే మోక్షగుండం ఎప్పటికీ ఓ ప్రేరణ.

కష్టాలను ఈది శక్తివంతమైన సైన్స్ మేధావిగా ఎదుగుదల!
అది 1861, కర్నాటకలోని ఓ కుగ్రామం ముద్దెనహల్లి. కనీస సౌకర్యాలు కూడా లేని ఓ పేదింట్లో ఓ ధృవ నక్షత్రం జన్మించింది. తండ్రి ఓ సంస్కృత పండితుడు. చదువే జీవితాన్ని సార్థకం చేయగలదని నమ్మినవాడు. ఆ ప్రభావమే విశ్వేశ్వరయ్య ఆలోచనలపై పడింది. బాగా చదువుకోవాలనకున్నాడు. కానీ, సమస్యలు చుట్టుముట్టాయి. మెంటార్ గా, గైడ్ గా మార్గదర్శనం చేసిన తండ్రి మరణంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. అప్పుడు విశ్వేశ్వరయ్య చదువుకోవడమనేది ఓ పెద్ద సవాల్. కానీ, తగ్గేదేలే అన్నారు విశ్వేశ్వరయ్య.
ఎండావానా లెక్క చేయకుండా… ఆ ఎండావానే తనకు తోడుగా.. మైళ్ల కొద్దీ నడిచి చిక్కబల్లాపూర్ వరకూ చదువుకోవడానికి పాఠశాలకు వెళ్లి వచ్చేవారు. కరెంట్ సౌకర్యం లేని నాటి రోజుల్లో చీకట్లో దీపాలు పెట్టుకుని చదివాడు. తన చదువు కొనసాగించేందుకు ట్యూషన్స్ చెబుతూ వచ్చిన డబ్బును పెట్టుబడిగా పెట్టి చదువుకున్నాడు.
విశ్వేశ్వరయ్య గురించి చెప్పుకున్నప్పుడు సాధారణంగా ఆయన మేథస్సొక్కటే ప్రస్తావనకొస్తుంది. కానీ, ఆయన ఆ స్థాయికెదగడానికి క్రమశిక్షణ, పట్టుదలే కారణం. ప్రతీ సాధారణ మనిషికి దగ్గరగా ఉండే జీవన ప్రయాణమే. ఎలాంటి షార్ట్ కట్స్ కూడా కనిపించవు. కానీ, ఆయనేనాడూ నిరంతర కృషి మాత్రం వదులుకోలేదు.
పెద్ద కలలు కన్నారు.. సాధించారు!
విశ్వేశ్వరయ్యకు విద్య విషయంలో ఆశయాలు గొప్పగా ఉండేవి. అందుకే పెద్ద కలలు కనేవారు. 1881లో సెంట్రల్ కాలేజ్ బెంగళూర్ నుంచి బీఏ పూర్తి చేసిన తర్వాత అక్కడే ఆగిపోకుండా ఇంకా పెద్ద కల కన్నారు. అదే ఇంజనీరింగ్ చేయాలన్న తాపత్రయం. నాటి కాలంలో ఇంజనీరింగ్ కు నేడున్నంత ఆకర్షణేమీ లేకుండే. కానీ, సమాజ సమస్యలకు పరిష్కారం చూపే మార్గంగా ఇంజనీరింగ్ నే ఎంచుకున్నారు ఈ సోషల్ ఇంజనీర్.
అనుకున్నట్టే పట్టు వదలకుండా పూణేలో సివిల్ ఇంజనీరింగ్ చదివి అగ్రస్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. తన చదవులో సాధించిన మార్కులు అదృష్టం కాదు.. పట్టుబట్టి ఇంజనీరింగ్ ను ఇష్టపడి చదివిన ఎన్నో ఏళ్ల కష్టానికి అందివచ్చిన ఫలితం.
ఇంజనీర్లు వందేళ్ల ముందుచూపుతో ఆలోచించాలనేది మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆలోచన. ఆయన ఆచరణాత్మక వైఖరే అందుకు నిలువెత్తు నిదర్శనం.
ఆధునిక భారత నిర్మాణ చరిత్రలో ఓ విప్లవం!
సర్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటే కేవలం ప్రతిభావంతుడైన ఇంజనీర్ మాత్రమే కాదు.. ఇంజనీరింగ్ ను సరికొత్తగా నిర్వచించిన దార్శనికుడు.
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ నీటి సరఫరా, సాగునీటి వ్యవస్థలపై దృష్టి పెట్టాడు. ఆ కాలంలోనే మౌలిక సదుపాయాలను కాలానికి మించిన రీతిలో అభివృద్ధి చేసి చూపించాడు.

విశ్వేశ్వరయ్య ఆవిష్కరణల్లో గొప్పేంటి..?
ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్ల రూపకల్పన విశ్వేశ్వరయ్య మస్తిష్కం నుంచి పుట్టిన ఆలోచన. ఖడక్వాస్లా డ్యామ్ వద్ద ఈ ఫ్లడ్ గేట్స్ మొట్టమొదట అమర్చారు. అది ఆయన ప్రతిభావంతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలవడంతో పాటే… ఎందరో ప్రజల జీవితాలకు ఉపయోగపడే ఓ విప్లవాత్మక పరిష్కారంగా గుర్తింపు పొందింది. సాంకేతిక ప్రతిభతో పాటు…. ఆ ప్రతిభ ప్రజలకుపయోగపడ్డప్పుడే సార్థకం అని నమ్మిన జీవి విశ్వేశ్వరయ్య. ఆయన చేపట్టినవి కేవలం నిర్మాణాలు కాదు.. అవి ప్రజలెదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు.
మైసూరును మార్చిన దూరదృష్టి!
మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటే ఏంటో తెలియాలంటే మైసూర్ ప్రాంతంలో చూసి తీరాలి. చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కాలంలో కృష్ణరాజ సాగర డ్యామ్ నిర్మాణం ఆయన నాయకత్వంలోనే పూర్తైంది. ఎండిపోయిన పడావు పడ్డ భూముల్మని సశ్యశ్యామలం చేసింది ఈ డ్యామ్. వేలాది రైతుల జీవనరేఖగా మారింది.
మైసూర్ దివాన్ గా మోక్షగుండం!
1912 నుంచి 1918 వరకు మైసూర్ దివాన్ గా పనిచేసిన ఆయన రాష్ట్ర ఆధునీకరణలో కీలకపాత్రధారి. మైసూర్ సోప్ ఫ్యాక్టరీ నిర్మాణంలోనూ, భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ వంటి పరిశ్రమల ఏర్పాటులోనూ ఆయన సహకారం మైసూర్ ఏనాడూ మర్చిపోదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వంటి సంస్థల అభివృద్ధికి తనవంతు తోడ్పాటునందించారు.
మోక్షగుండం కాలాన్ని స్వర్ణయుగమని ఎందుకన్నారు..?
నేటి ఆధునిక సాంకేతికత లేని కాలంలోనే ఎన్నో అద్భుతాలు సాధించారు. కంప్యూటర్స్ లేవు, ఆధునిక యంత్రాలు లేవు. కచ్చితమైన లెక్కలు, ప్రణాళిక, అంకితభావం ఇవే.. మోక్షగుండం ప్రాజెక్టుల రూపకల్పనలో అస్త్రాలు.
ఉదయాన్నే నాల్గు గంటలకు లేవడం.. క్రమశిక్షణతో రోజును ప్రారంభించడంలోనే మనిషి జీవనశైలి ఏర్పడుతుంది. అలాంటి జీవితాన్ని అంతే నిరాడంబరంగా గడిపిన ధన్యజీవి మోక్షగుండం.
మోక్షగుండాన్ని వెతుక్కుంటూ వచ్చిన గుర్తింపులు, గౌరవాలు!
గుర్తింపును, గౌరవాన్ని వెతుక్కుంటూ, కోరుకునే రోజుల్లో ఉన్న మనకు… మోక్షగుండంనే అవి వెతుక్కుంటూ వచ్చాయంటే నమ్మశక్యం కాదేమో. కానీ, ఆయనేనాడూ వాటికోసం పాకులాడలేదు. అవే వాటంతటవి వచ్చి ఆయన్ను హత్తుకున్నాయి.
1915లో బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ను సర్ బిరుదుతో సత్కరించింది. 1955లో.. 94 ఏళ్ల వయస్సులో భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న
లభించింది.
వందేళ్ల వయస్సు వరకూ బతికి సెంచరీ కొట్టిన ఆ ఆరోగ్యవంతుడు… తను జీవించి ఉన్నంతకాలం రచనలు చేస్తూ, సలహాలు ఇస్తూ, దేశాభివృద్ధికి తన వంతు సేవలందిస్తూనే ఉన్నారు. అందుకే, ఆయన ప్రేరణనిచ్చే వారసత్వ సంపదగా ఇప్పటికీ గుర్తుండిపోయారు.
ఫలితాల కోసం తొందరపడలేదు. షార్ట్ కట్స్ వెతుక్కోలేదు. తాను చేపట్టిన ప్రక్రియపై నమ్మకముంచారు. అందుకు నిరంతరం కష్టపడ్డారు. అర్థవంతమైన పని అనుకుంటేనే దృష్టి పెట్టారు. త్వరితగతిన విజయాల కోసం పరుగులు తీసే ఈ కాలాన.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితం అందరికీ ఓ గొప్ప పాఠం.
మన జీవితం అనుకున్నంత వేగంగా, వడివడిగా ముందుకు జరగట్లేదనిపిస్తే మనం ఓడిపోతున్నట్టేం కాదు.. బహుశా, మనం కూడా సమయం తీసుకుని ఇంకా ఏదైనా గొప్ప పని చేయబోతున్నామేమోన్న ఒక పాజిటివ్ వైబ్ ను మోక్షగుండం విశ్వేశ్వరయ్య మనకు అందించారు.
అందుకే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటే డ్యాములు, రోడ్లు, ఇతర ఇంజనీరింగ్ వ్యవస్థలే కాదు… సాధారణ ఆరంభం నుంచి అసాధారణ విజయం సాధించొచ్చని చెప్పిన లైఫ్ స్టోరీ.


