భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త ధరించిన చీర ఇప్పుడు అమెరికాలోని ఓ మ్యూజియంలో ప్రదర్శనకుంచారు. ఏంటా కథ..?
మార్స్ ఆర్బిటర్ మిషన్ లో కీలక ఘట్టం సందర్భంగా నందిని హరినాథ్ ఆకట్టుకునే రీతిలో భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా ఓ చీర ధరించారు. ఇప్పుడీ చీర వాషింగ్టన్ డీసీలోని స్మిత్ సోనియన్ నేషనల్ ఎయర్ అండ్ స్పేస్ మ్యూజియంలో దర్శనమిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చారిత్రక వస్తువులు, వాహనాలు, అంతరిక్ష నౌకలు, వైమానిక రంగానికి చెందిన అరుదైన సంపదను ప్రదర్శించే మ్యూజియం.. ఇప్పుడు భారత అంతరిక్ష విజయానికి ప్రతీకగా నిల్చిన ఘట్టం సమయంలో ధరించిన చీరను కూడా ప్రదర్శనకుంచింది.

నందినీ హరినాథ్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పనిచేసే ఓ మహిళా శాస్త్రవేత్త. భారతదేశం నుంచి తొలి ఆర్బిటర్ మిషన్ అయిన మంగళయాన్ విజయంలో ఈ రాకెట్ ఉమన్ ది కీలకపాత్ర.
నందినీ హరినాథ్ భారత్ లో పుట్టి, పెరిగారు. తల్లి గణిత ఉపాధ్యాయురాలు. తండ్రి ఇంజనీర్. ఇస్రోలో చేరేముందు నందిని హరినాథ్ ఇంజనీరింగ్ లో డిగ్రీతో పాటు, పీజీ కూడా పూర్తి చేశారు. రెండు దశాబ్దాలకుపైగా సాగిన తన సైంటిస్ట్ కెరీర్ లో నందిని ఇస్రోలో 14కు పైగా మిషన్స్ లో భాగస్వామయ్యారు.
గతంలో కాండే నాస్ట్ ట్రావెల్లర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఏమంటారంటే… ఏ పని చేసినా అది అత్యంత ముఖ్యమైందనే ఆరంభించాలి.. ఫలితాలతో సంబంధం లేకుండా అయిపోయేవరకూ విశ్రమించకుండా పూర్తి చేయాలి. మంగళయాన్ మిషన్ మాత్రం నా కెరీర్ లో మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఆ మిషన్ పై దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది.
మంగళయాన్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఎందరో మమ్మల్ని గమనిస్తుంటారు. మన నైపుణ్యం, సామర్థ్యం గుర్తింపుకు నోచుకోవడం గొప్ప అనుభూతి. దేశ ప్రధాని మాతో చేతులు కలుపుతారు. నాసా మాకు అభినందనలు తెలిపింది. ఇప్పుడు నాసా మాతో కలిసి పనిచేస్తోంది. పారిశ్రామికవర్గాల నుంచి మొదలు పాఠశాలలు, విద్యాసంస్థలు, ప్రజలంతా ఎంతో ఆసక్తిగా అనుసరించే మిషన్ మేం చేపట్టాం. సోషల్ మీడియా కూడా ఫాలో అవుతూ ప్రశంసలు కురిపించిన ఓ బృహత్తర కార్యక్రమం మంగళయాన్ మిషన్.
2025లో బెంగళూరులో జరిగిన ఈటీ ఎంటర్ ప్రైజ్ ఏఐ మేకిగ్ ఏఐ వర్క్ సమ్మిట్ లోనూ నందిని హరినాథ్ మాట్లాడారు. చిన్ననాట్నుంచే అంతరిక్షంపై తనకు ఆసక్తి ఎలా పెరిగిందో వివరించారు. స్టార్ ట్రెక్ అనే ఓ పాప్యులర్ టీవీ సీరియల్ తమ కుటుంబమంతా కలిసి చూసేవాళ్లమంది నందిని. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూశామంటూ గుర్తు చేసుకున్నారు. అలాగే, అపోలో 13 సినిమాను కూడా మళ్లీ మళ్లీ చూసేదాన్నని.. ఆ అన్వేషణ, టీమ్ వర్క్ స్టోరీస్ తనలో గొప్ప ప్రేరణ కల్గించాయన్నారు.
దీంతో సైన్స్ ఫిక్షన్ సినిమాలు, స్పేస్ డ్రామాలు కూడా భారత అంతరిక్ష సైంటిస్టులుగా ఎదిగిన ఒక తరానికి ఎంత ప్రేరణనిచ్చాయన్నది తెలియజేస్తాయి.
చీర ప్రాముఖ్యతను ఇన్ స్టాలో వెల్లడించిన స్మిత్ సోనియన్ మ్యూజియం నిర్వాహకులు!
నందిని హరినాథ్ చీర ప్రాముఖ్యతను వాషింగ్టన్ స్మిత్ సోనియన్ మ్యూజియం తన ఇన్ స్టా ఖాతాలో వెల్లడించింది.
భారతదేశపు రాకెట్ ఉమెన్ లో ఒకరైన నందిని హరినాథ్ ది భారత్ ను మార్స్ కు చేర్చడంలో కీలకపాత్ర. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన అంతరిక్ష నౌక భూకక్ష్యను విడిచి 300 రోజుల మార్స్ ప్రయాణానికి సిద్ధమైన రోజున.. ఆమె ధరించిన చీర ప్రత్యేకమైందంటూ పేర్కొంది.
మ్యూజియం నిర్వాహకులు ఇంకేమన్నారు..?
రాకెట్ శాస్త్రవేత్తగా, మార్స్ ఆర్బిటర్ మిషన్ డిప్యూటీ ఆఫరేషన్స్ డైరెక్టర్ గా నందిని హరినాథ్.. మిషన్ ప్రణాళిక, ఆపరేషన్స్ లో చాలా ప్రధాన పాత్ర పోషించారు. ఆరు నుంచి పది నెలలు మాత్రమే కొనసాగుతుందని భావించిన ఈ మిషన్.. ఎనిమిదేళ్లపాటు మార్స్ కక్ష్యలోనే ఉంటూ.. అక్కడి ఉపరితలం, వాతావరణంపై ఎంతో కీలక సమాచారాన్ని సేకరించింది.
ఈ విజయంతో భారత్ మార్స్ చేరుకున్న తొలి ఆసియా దేశంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో నాల్గో దేశంగా నిలిచింది. మిషన్ లో మహిళా శాస్త్రవేత్తలు ధరించిన చీరలు భారతీయ సంప్రదాయానికి ప్రతీకలు. అంతరిక్ష విజయంలోనూ వాటి పాత్ర ఉంది. అని ఇన్ స్టా లో వెల్లడించారు మ్యూజియం నిర్వాహకులు.
మ్యూజియంలో చీరను ధరించిన బొమ్మ ఫోటోలను కూడా షేర్ చేశారు. ఎరుపు, నీలం రంగులతో అందంగా డిజైన్ చేసిన చీర ఆకట్టుకునేలా ఉండటంతో స్మిత్ సోనియన్ మ్యూజియం దానికీ ఓ గుర్తింపు కల్పించింది. నీలిరంగు బ్లౌజ్, ఎరుపు, నీలం కలయికల్లో చూడముచ్చటగా చీర మెరిసిపోతోంది.
మార్స్ ఆర్పిటర్ మిషన్ గురించి!
మంగళయాన్ గా ప్రసిద్ధి చెందిన మార్స్ ఆర్బిటర్ మిషన్.. ఇస్రో చేపట్టిన తొలి అంతర్గ్రహ మిషన్. ఈ అంతరిక్ష నౌకను 2013, నవంబర్ 5వ తేదీన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు.
ఇస్రో చెప్పినదాని ప్రకారం అంతర్ గ్రహ అన్వేషణకు అవసరమైన కీలక సాంకేతికలను పరీక్షించడం.. అలాగే, ఐదు శాస్త్రీయ పరికరాల ద్వారా మార్స్ ఉపరితలం, వాతావరణాన్ని అధ్యయం చేయడం ఈ మిషన్ ముఖ్య లక్ష్యాలు. 2014లో ఈ అంతరిక్ష నౌక మార్స్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించడం భారత అంతరిక్ష చరిత్రలో ఓ సువర్ణధ్యాయంగా నిల్చింది. దీంతో భారత్ మార్స్ చేరుకున్న తొలి ఆసియా దేశంగా.. ప్రపంచంలో నాల్గో దేశంగా గుర్తింపు పొందింది.
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం కేవలం మొదటి ఆరు నుంచి ఎనిమిది నెలల కాలం పాటే ఈ మిషన్ పని చేస్తుందని అంతా భావించారు. కానీ, సుమారు ఎనిమిదేళ్ల పాటు కొనసాగి.. అంచనాలను మించి విజయాన్ని సాధించింది ఈ మిషన్. తక్కువ వ్యయంతో అంతరిక్ష అన్వేషణలో భారత్ కు ప్రపంచవ్యాప్త ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది.



