నేరాలు, దొమ్మీలు, దొంగతనాలు, కొట్లాటలు, హత్యలు… ఇలా ఎక్కడ ఏ మూలకు చూసినా వీటి తీవ్రత పెరుగుతూనే ఉంది… తగ్గే అవకాశాలు ఆవగింజంతైనా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో అవేవీ లేని ఓ సమాజాన్ని చూడాలనుకుంటే.. మయన్మార్ బార్డర్ లో విసిరేసినట్టుండే ఆ గిరిజన గ్రామాన్ని సందర్శించాలి.
ఆ ఊరే ఖొనోమా.. ఆ గ్రామానికి హానెస్టీ విలేజ్ అని పేరు!
ప్రకృతికి రంగేసినట్టు కొండలు, గుట్టలు, చెరువుల మధ్య విసిరేసినట్టుండే ఓ అందమైన గ్రామమే ఖొనోమా. చుట్టూ గ్రీనరీతో ఆకుపచ్చ గ్రామంగా ఖొనోమా ఓ పెయింటింగ్ ను తలపిస్తుంది. ఇండో- మయన్మార్ సరిహద్దులో ఉన్న ఈ మారుమూల గ్రామంలో అసలు ఇళ్లకు, దుకాణాలకు, ప్రార్థనాలయాలకు వేటికీ తాళాలే కనిపించవు.

భద్రత కరవైన ప్రపంచంలో, ఆధిపత్యమే అగ్రభాగమై నడిచే సమాజంలో.. అలాంటి అవలక్షణాలేవీ కనిపించని ఒకానొక గ్రామంగా ఖొనోమా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి నిజాయితీ ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా నిల్పేదే కాదు.. మిగిలిన సమాజానికి స్ఫూర్తి కల్గించేది.
ఇవాళ, రేపట్లో సీసీ కెమెరాల్లేని ఊళ్లు లేవు. సెక్యూరిటీ గార్డ్స్ లేని గేటెడ్ కమ్యూనిటీలు కనిపించవు. చెక్ పోస్టుల్లేని కాలనీలు లేవు. ఇలాంటి రోజుల్లో పరస్పర నమ్మకం, ఐకమత్యం, అంతా కలిసి ఓ కుటుంబంలా, అన్ని కుటుంబాలు కలిసి ఓ స్వచ్ఛమైన, ఆనందమైన సమాజంలా బతకాలన్న తలంపే ఖొనోమాను భారతదేశంలోని మిగిలిన గ్రామాలతో పోల్చినప్పుడు ప్రత్యేకంగా నిలబెడుతోంది.
పరస్పర విశ్వాసానికి మారుపేరు అంగామీ తెగ!
ఖొనోమాలో అంగామీ తెగకు చెందిన గిరిజనులే అధికం. అంగామీ నాగ ప్రజలంతా తరతరాలుగా ఒకరి పట్ల ఒకరు విశ్వాసంగా బతుకుతున్నారు. అదే సంప్రదాయంగా మారిపోయింది. అందుకే, ఇళ్ల తలుపులు తెరిచే ఉంటాయి. దుకాణాల్లో యజమానులు లేకున్నా.. ఆ వస్తువు రేటెంతో అక్కడ రాసి ఉంటుంది. దాని ప్రకారం గల్లాపెట్టెలో ఆ డబ్బులు వేసి.. కావల్సిన వస్తువు తీసుకెళ్తుంటారు. నిజాయితీ అనే పదం ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పేందుకు ఓ ఉదాహరణలా కనిపిస్తుంది ఈ ప్రకృతి రమణీయ పల్లె.
అంగామీ తెగకు మూలస్తంభమైన కెన్యు ప్రాచీన నియమావళి!
కెన్యు అనే నియమావళే అంగామీ నాగలకు అత్యంత ప్రధానమైంది. ఈ నియమావళి ప్రకారం 154 నిషిద్ధాలున్నాయి. అలాగే, సమాజంలో సామరస్యం, పరస్పర గౌరవం, నిజాయితీ కొనసాగించేందుకు ఆ నిషిద్ధమైన వాటిని తప్పకుండా పాటించడం ఈ తెగ ఆనవాయితీ. ఖొనోమాలో కనిపించే నీతి, నిజాయితీ.. శాంతి, ఐక్యతను పెంపొందించి ఈ గ్రామాన్ని దేశంలోనే ఒక మాడల్ గా నిలబెట్టాయి. అదే సమయంలో ఇక్కడి ప్రజలు పర్యావరణ పరిరక్షణ పట్ల కూడా అంతే జాగురకతతో వ్యవహరిస్తుండటం ఇక్కడి మరో ప్రత్యేకత

నేరరహితంగా ఎదగడంలో గ్రామ ప్రత్యేకత!
సాధారణంగా ఏ గ్రామాన్నైనా ఈ రోజుల్లో నేరరహితంగా మార్చడమంటే హైటెక్ భద్రతా చర్యలు చేపట్టడం, సాయుధ దళాలను పెట్టి శాంతికోసం యత్నించడం, సీసీ కెమెరాలు పెట్టి పరిశీలించడం ఇలాంటివన్నీ కనిపిస్తాయి, వినిపిస్తాయి. కానీ, అవేవీ లేకుండానే నేరరహిత గ్రామంగా ఖొనోమా గుర్తింపు పొందింది. పేదరికంలో కొట్టుమిట్టాడటం కూడా కనిపించదు. ఎవరికి సాయం అవసరం పడ్డా మరొకరు సాయం చేయడానికి సిద్ధంగా ఉండే ఓ కొత్త బంగారు లోకం ఈ ఖొనోమా.
గొప్ప సాంస్కృతిక వారసత్వానికీ ఖొనోమా ఉదాహరణ!
ఖొనోమాలో అంగామీ నాగ తెగ శతాబ్దాలుగా వారి ఆచారాలను పాటిస్తూ.. జానపద కథలతో తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తోంది. గిరిజనుల ఆచార, వ్యవహారాలకు సంబంధించి ఈ గ్రామమే ఓ మ్యూజియంలా మనకు దర్శనమిస్తుంది. పచ్చని ప్రకృతి రమణీయత మధ్య వెదురు బుట్టల్లా కనిపించే ఇళ్లతో నాగా గిరిజన తెగల సాంస్కృతి వైభవాన్ని కళ్లముందుంచే ఓ సుందరమైన దృశ్యం ఖొనోమా.
ప్రశాంతతకు నెలవు!
రయ్ రయ్ మంటూ వినిపించే వాహనాల శబ్దాల మధ్య, సైరన్ల మధ్య నిత్యం విసిగిపోతూ… ఆఫీస్ కార్యకలాపాల్లో నిత్యం బిజీబిజీగా.. కాస్త అటూ ఇటు అయితే గజిబిజిగా మారిపోయే జీవితాలకు అద్భుతమైన గమ్యస్థానం ఖొనోమా.
ఖొనోమా ఎందుకు సందర్శనాస్థలం..?
నాగాలాండ్ కొండల్లోని ఈ మారుమూల పల్లె పల్లె ప్రకృతి జీవన సౌందర్యం. ట్రెక్కింగ్ కు అనుకూలంగా, సరదాగా అక్కడ ఉండే సంప్రదాయ గృహాల శైలిని పరిశీలిస్తూ, పక్షుల కిలకిలా రావాల మధ్య, పచ్చని వాతావరణంలో, స్వచ్ఛమైన ఆక్సిజన్ అందే గాలితో అదో మరపురాని ప్రయాణమంటారు సందర్శించినవారు. నీతి, నిజాయితీ, నేరరహిత, ప్రకృతిసిద్ధమైన, ఘనమైన పురాతన వారసత్వానికి ప్రతీకగా, ఒక వైవిధ్యాన్ని, మరపురాని అనుభవాన్ని మిగులుస్తుందంటున్నారు.
ఖొనోమా భౌగోళికంగా ఓ పర్యాటక ప్రాంతానికే పరిమితం కాలేదు.. తన వెనుక ఓ పెద్ద కథనే దాచుకుంది. అందుకే ఖొనోమా ఓ చూడాల్సిన ప్రదేశం!


