బతుక్కే.. ఒక భరోసా
~~~~~~~~~~~~~~~
-డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి… ✍🏻
……………………………………………………………………………………………………………..
మనస్పూర్తిగ మాట్లాడుతడు
నిరంతరం నిండుగ నవ్వుతడు
ఆత్మవిశ్వాసం ఒక్కటే తనకున్న ఆస్తి
పౌరలక్షణంలో తనముందెవరైనా నాస్తి.
నిత్యావసరాల కోసం సిద్దిపేటల ఉన్న
విశాల్ మార్టుకు పోతే, తను కనబడ్డడు.
దృష్టి తిప్పుకోనీయని దీక్షతో ఎదుట నిలబడ్డడు.
తన పరిచయంలేని నా గురుత్వం వ్యర్థమనిపించింది.
అందుకనే ప్రేమగ భుజంమీద చెయ్యివేసి మాటకలిపిన.
ఏడోయేడు దాకా అతనూ మనందరి తీరుగనే ఉండేవాడు.
వివరం తెలియని రోగం, రెండుకాళ్ల నరాలను కబలించింది.

రాచమల్లు నవీన్, మా కాలేజీ పూర్వవిద్యార్థి.
B.Com. CAతో 2014లో తన డిగ్రీ పూర్తిచేసిండు.
రెండేండ్లు ఉద్యోగార్థిగా పోటీపరీక్షలకోసం చదివిండు.
నరంమీది పుండువంటి పేదరికపు సలుపరం నిలువనివ్వలే.
పోటీచదువు పక్కకువెట్టి ఉద్యోగం వేటలో ఊరిమీద పడ్డడు.
తొల్త మూడేండ్లు బాలవికాస సమితిల పనిచేసిండు.
ఆ తర్వాత రెండేండ్లు మ్యారేజ్ బ్యూరోల పనిచేసిండు.
గత అయిదేండ్లసంది ఈ విశాల్ మార్టుల పనిచేస్తున్నడు.
పగలు రెండుగంటలకు వస్తే, రాత్రి రెండుగంటలవరకూ పని.
శ్రమతో కూడిన కాయకష్టపు పని, భౌతికమైన శక్తి ఒక సవాలు.
ఉత్తముడని చెప్పుటానికి శకునాలెన్నో ఎదురువచ్చినయి.
తోటి పిల్లలంతా నవీనన్నా అని ఆప్యాయంగ పిలుస్తున్నరు.
ఒక్కక్షణమూ తీరికను కోరుకోడు, పనిచేస్తూనే మాట్లాడుతడు.
లోతుకుదిగి మాట్లాడినా, ముఖంమీది చిరునవ్వు చెదరనీయడు.
BC-A పిల్లవాడు. కొంత కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హుడు.
గ్రూపు-4 ఉద్యోగం సాధించుకున్నాసరే, జీవితం తప్పక వికసిస్తది.
తెల్లగుంటె చుట్టం-నల్లగుంటె దయ్యం. పేదకు అక్షరమే బంధువు.
ఒక్కపూట తిన్న సరే, ఒక్కడ్రెస్సు ఉన్న సరే, చదువొక్కటే వెలుగు.
నా గతజీవితాన్పి తనకు పరిచయం చేసి,చదువుకొమ్మని చెప్పిన.
తనవంటివారికి ఉద్యోగమస్తే సంబురపడేవాళ్లల్ల నేనుముందుంట.
పగలూరాత్రీ చుక్కాముక్కా పిచ్చిలో జోగుతున్న యువత కంటే
గంజాయి నల్లమందూ అమ్ముక తిరుగుతున్న దుర్మార్గుల కంటే
ఆడివిల్లల్ని వాడుకొని వాడుకొని కడతేరుస్తున్న కసాయిలకంటే
అవినీతిలంచాలూ ఆగడాలతోటి బతికే సర్కారు ఉద్యోగులకంటే
కాళ్లురెక్కల పుష్టిగలిగీ గవ్వమందం సంపాదనలేని సోమరులకంటే
బతుకువిలువ తెలువక, బలవన్మరణాలకు గురౌతున్నవారి కంటే
సవాలు విసిరిన శరీరాన్ని,నలుగుట్ల తలెత్తుకునేటట్టు నడిపిస్తున్న
ఈ నవీన్ ఎంత దృఢకాయుడు, మరెంత గుండెనిబ్బరం కలవాడు.
ఉత్తమత్వమే మనిషికి అలంకారమైతే, తనకంటే ఉదాత్తుడెవరని.
దేశం నలుమూలలా ఉన్న ఇటువంటి వేలమంది యువకులు,
కోటానుకోట్ల యువతరానికి కనువిప్పు కలిగించే మార్గదర్శకులు.
భారతమాత గర్వించదగిన బలమైన విలువలకు వీళ్లదే పరంపర.
——————
కావాలనే పెండ్లి విషయం కదిలించిన. చిరునవ్వు జవాబయింది..
భాషమూగబోతే భావం తెలువక పోతదా,నవీన్ పెండ్లికి అర్హుడు.
నాకు ఎవరిస్తరు సర్ అని బదులిచ్చిండు. ఇస్తరని గట్టిగ చెప్పిన.
ఆర్థికస్థిరత్వం వస్తే,తను భార్యాపిల్లలను సాదుకోగల సమర్థుడు.
ఈ పౌరులను చూసినప్పుడే ప్రభుత్వ కళాశాలల పస తెలుస్తది.
మా ఉద్యోగబాధ్యత ప్రతిరోజూ స్పూర్తినిచ్చే పొద్దయి పొడుస్తది.
తనకు తొందరలోనే ఒక స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం దొరుకాలనీ,
అందరులోకుల తీరే, భార్యాపిల్లలతో నిండుజీవితం గడుపాలనీ
నవీనుకు ఆశీస్సులు.ఇప్పట్నుంచి నా ఆలోచనా తనకు ఒకతోడు.



