గూఢచర్యం కేసులో భారత సంతతి ఇంజనీర్ కు 32 ఏళ్ల జైలు: బీ2 వెనుక ఆయన మేథస్సు!

ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో ఇరాన్ అణుకేంద్రాలపై బీ2 స్టెల్త్ బాంబర్ దాడులతో విరుచుకుపడింది అమెరికా. దాంతో బీ2 స్టెల్త్ బాంబర్ ప్రత్యేకతేంటనే చర్చ మొదలైంది. అంతటి శక్తివంతమైన బాంబర్ ఆవిష్కరణ వెనుక కూడా ఓ ఇండో అమెరికన్ హస్తముంది. కానీ, భారతీయ సంతతికి చెందిన ఆ ఏరోస్పేస్ ఇంజనీర్ అదే అమెరికాలో జైలుపాలయ్యాడు. ఎందుకు..?

అసలు బీ2 అంటే ఏమిటి..?

అమెరికన్ స్టెల్త్ టెక్నాలజీకి వెన్నెముకలాంటిదే బీ2 బాంబర్ విమానం. శత్రువు కంటికి కనిపించకుండా వ్యవహారాన్ని చక్కబెట్టగల్గే స్టెల్త్ కెపాసిటీ ఈ విమానం ప్రత్యేకత. అమెరికా వద్దనున్న బంకర్ బస్టర్ బాంబులను మోసుకెళ్లే విమానాలనే బీ2 స్టెల్త్ బాంబర్ అంటారు. బంకర్ బ్లస్టర్ బాంబులు, బీ2 స్టెల్త్ బాంబర్ ను వేర్వేరుగా చూడలేం. ఎందుకంటే ఆ బంకర్ బస్టర్ బాంబులను తీసుకెళ్లి జారవిడవగల సామర్థ్యం కేవలం బీ2 బాంబర్ కు మాత్రమే ఉంది. ఈ విమానాలనే నార్త్ రోప్ బీ2 స్పిరిట్ అని కూడా పిలుస్తుంటారు.

యుద్ధభూమిలో శక్తివంతమైన టెక్నాలజీ!

అమెరికా కంపెనీ నార్త్ రోమ్ గ్రూమన్ బీ2 స్టెల్త్ బాంబర్ విమానాలను తయారుచేస్తుంది. అణుబాంబుల ప్రయోగం కోసం అమెరికా వీటిని 1997లోనే తయారుచేసింది. కింద బాంబు పడేవరకూ కూడా గగనతలంలో బీ2 బాంబర్ ఉందనే విషయాన్ని ఎవ్వరూ పసిగట్టలేని విధంగా దీని రూపకల్పన చేశారు. గతంలో కొసావో యుద్ధంతో పాటు, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, యెమన్ లపై దాడికి ఈ బీ2 బాంబర్ విమానాలను వాడారు.

ఇంతకీ బీ2 రూపకల్పనలో భారతీయ అమెరికన్ పాత్రేంటి… ఆయనెందుకు జైలుపాలయ్యాడు..?

1944లో ముంబైలో జన్మించిన భారతీయ సంతతికి చెందిన ఏరోస్పేస్ ఇంజనీర్ నోషిర్ షెరియార్జీ గోవాడియా 19 ఏళ్లకే యూఎస్ వలసవెళ్లాడు. 1969లో అమెరికన్ పౌరసత్వం లభించింది. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బీ2 బాంబర్ విమానాన్ని తయారుచేసిన నార్త్ రోప్ గ్రూమన్ సంస్థలో 1970లో ఒక ఏడాది తిరక్కముందే ఉద్యోగం సంపాదించాడు. వియత్నాం, యోమ్ కిప్పూర్ యుద్ధాల సమయంలో చవిచూసిన కొన్నిఫెయిల్యూర్స్ తర్వాత తదుపరి తరానికి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీతో బాంబర్ నిర్మించేందుకు ఈ సంస్థ ఏర్పాటైంది. బ్లూబెర్రీ మిల్క్ షేక్ పేరుతో రహస్యంగా ఏర్పాటైన ఆ మిషన్ రూపకల్పనలో గోవాడియా కూడా కీలక ఉద్యోగి. ఇన్ ఫ్రా రెడ్ సప్రెసింగ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ను మెరుగుపర్చేందుకు నార్త్ రోప్ గ్రూమన్ కు ఏకంగా 20 ఏళ్ల సమయం పట్టింది. అంటే, రహస్యంగా ఉన్న రాడార్స్ ని, అణుకేంద్రాల వంటి అధిక ఉష్ణోగ్రతలతో కూడిన ప్రాంతాలను ఇట్టే గుర్తించేవిధంగా దీన్ని సాంకేతికంగా అభివృద్ధి పర్చారు. బీ2 కు చెందిన క్షేత్రగణితమంతా తన రూపకల్పనలోనే జరిగినట్టు గోవాడియా గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఒక్కసారి ఇంధనంతో నింపేస్తే చాలు పదివేల నాటికల్ మైళ్ల దూరం.. పేలోడ్స్ ను మోసుకుంటూ ప్రయాణించే విధంగా ఈ బీ2 బాంబర్ విమానాన్ని 172 అడుగుల పొడవుండే రెక్కలతో తయారుచేశారు.

మరి నోషిర్ గోవాడియా ఎందుకు జైలుపాలయ్యాడు..?

అమెరికా సైనిక రహస్యాలను పంచుుకున్నాడన్న ఆరోపణలపైన గోవాడియా 32 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యాడు భారత సంతతికి చెందిన ఈ ఏరోస్పేస్ ఇంజనీర్ గోవాడియా. బీ2 స్టెల్త్ ప్రొపల్షన్ సమాచారాన్ని చైనాతో సహా, ఇతర దేశాలకు లీక్ చేశాడని గూఢచర్యం కేసులో హవాయిలో పర్యటిస్తున్న సమయంలో గోవాడియాను అమెరికన్ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. అక్కడి వరకూ ఒక వెలుగు వెలిగిన గోవాడియా జీవితం.. ఇక ఆ తర్వాతంతా చీకటి అధ్యాయంగా మారిపోయింది.

స్టెల్త్ ఎగ్జాస్ట్ పితామహుడిగా గోవాడియాకు పేరు!

గోవాడియా అనారోగ్యం కారణంగా 1986లో నార్త్ రోప్ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత తానే సొంతంగా డిఫెన్స్ కన్సల్టింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కానీ, 1997లో ఓ ఒప్పందంపై చెలరేగిన వివాదం కారణంగా తన కన్సల్టింగ్ అనుమతిని కోల్పోయాడు. హవాయిలోని మౌయిలో 3.5 మిలియన్ యూఎస్ డాలర్స్ అంటే 30 కోట్లకు పైగా వెచ్చించి ఓ లగ్జరీ విల్లా కొనుగోలు చేశాడు. కానీ, ఆ తర్వాత ఆర్థికంగా కూరుకుపోయాడు. 2003లో నిధుల లేమితో తీవ్రంగా తహతహలాడాడు. అలాంటి సమయంలోనే గోవాడియా చైనా అధికారులకు సహకరించాడు. మారుపేర్లతో ఎన్ క్రిప్టెడ్ ఈమెయిల్స్ ను ఉపయోగించాడు. చైనాలోని చెంగ్డూ, షెన్ జెన్ వంటి నగరాలను సందర్శించాడు. బీ2 సాంకేతికతకు సమానమైన రాడార్ వ్యవస్థను, క్రూయిజ్ క్షిపణుల అభివృద్ధికి అవసరమైన స్టెల్త్ నాజిల్ డిజైన్స్ ను గోవాడియా చైనాతో పంచుకున్నాడని అమెరికా అధికారుల విచారణలో వెల్లడైంది. అందుకుగాను, చైనా గోవాడియాకు 110,000 యూఎస్ డాలర్స్ అంటే సుమారు 94 లక్షలకు పైగా చెల్లించింది.

గూఢచర్యం కేసుతో గోవాడియా ఇంటిపై ఎఫ్బీఐ దాడులు!

2005, అక్టోబర్ 13వ తేదీన హవాయిలోని గోవాడియా మౌయి ఎస్టేట్ పై ఎఫ్బీఐ దాడులకు దిగింది. హార్డ్ డ్రైవ్స్, బ్లూప్రింట్స్, మరికొన్ని డాక్యుమెంట్స్, ఈమెయిల్స్, 500 పౌండ్స్ కు సంబంధించి జరిగిన లావాదేవీల వివరాలన్నీ సేకరించారు. కస్టమ్స్, షిప్పింగ్ ఫామ్స్, తప్పుడు లేబుల్స్ తో రక్షణ సామాగ్రిని కూడా అక్రమ రవాణా చేయడానికి ఉపయోగించినట్టూ తేల్చారు. గోవాడియా దర్యాప్తు నెలల తరబడి కొనసాగింది. ఎఫ్బీఐ గోవాడియాపై గూఢచర్యం, ఆయుధ ఎగుమతి నియంత్రణ చట్టాల కింద అభియోగాలతో కేసులు నమోదు చేసింది. గోవాడియా కూడా ఎఫ్బీఐ విచారణలో ఒప్పుకున్నాడు. తాను చేసింది గూఢచర్యంతో పాటు, రాజద్రోహమని తానే ఒకింత పశ్చాత్తాపపడుతూ అంగీకరించాడు. అతడి విచారణ 2010లో ప్రారంభమైంది. కోర్టులో నాల్గు నెలల పాటు విచారణనంతరం.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పట్ల తన విధేయతా ప్రమాణాలను ఉల్లంఘించినట్టు సుసాన్ ఓకి మోల్వే అనే న్యాయమూర్తి పేర్కొన్నారు. కుట్ర, మనీలాండరింగ్, జాతీయ రక్షణా సమాచారాన్ని అనధికారికంగా బదిలీ, బహిర్గతం చేయడం వంటి 17 నేరాల్లో గోవాడియా పేరును చేర్చారు. 14 నేరాలకుగాను ప్రాసిక్యూషన్ లో గోవాడియా దోషి అని తేలింది. 2011లో యూఎస్ లోని అత్యంత కట్టుదిట్టమైన జైలైన కొలరాడోలోని యూఎస్పీ ఫ్లోరెన్స్ యాడ్ మ్యాక్స్ కు తరలించిన గోవాడియాకు ఏకంగా 32 ఏళ్ల కఠిన కారాగారశిక్ష పడింది.

తాజాగా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ కింద అమెరికా ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ లోని ఇరాన్ అణు కేంద్రాలపై బీ2 బాంబర్ విమానాలతో కచ్చితమైన దాడులు నిర్వహించిన నేపథ్యంలో… ఆ శక్తివంతమైన బీ2 వెనుక కథ ఓసారి మళ్లీ తెరపైకొచ్చింది. అందులోనూ, ఓ భారత సంతతికి చెందిన శాస్త్రజ్ఞుడున్నాడని సంతోషించాలా… గూఢచర్యం కింద అరెస్టై జైలుపాలై పరువు తీసినందుకు బాధపడాలో తెలియని చరిత్ర ఇది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles