దిల్ డూండ్తా హై ఫిర్ వహీ ఫుర్సత్ కే రాత్ దిన్!

హిందీ చిత్రసీమను మాత్రమే కాకుండా… తమ పాటలతో భారతదేశ వ్యాప్తంగా కోట్ల హృదయాలను గెల్చుకున్న సంగీత దర్శకుల జాబితా చాంతాడంతది. వారిలో చెప్పుకోవాల్సిన పేర్లలో మదన్ మోహన్ ఒకరు. గజల్స్ అంటే విపరీతంగా ఇష్టపడే తన కంపోజిషన్ స్టైల్ వల్లే తలాత్ మహమూద్ వంటి గజల్స్ సింగర్స్ ఆయనతో పని చేసేందుకు ఆసక్తి చూపేవారు. మదన్ మోహన్ ను మొత్తంగా మెలోడీ రారాజుగా ఇప్పటికీ గొప్పగా చెప్పుకోవాడానికి కేవలం ఆయన వదిలివెళ్లిన ట్యూన్స్, కంపోజిషన్సే కారణం.

ఇవాళ జూన్ 25 ఆ లెజండరీ సంగీతజ్ఞుడు మదన్ మోహన్ పుట్టినరోజు!

మదన్ మోహన్ సినీ సంగీత ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఎక్కడో ఇరాక్ బాగ్ధాద్ లో పుట్టిన మదన్ మోహన్… ఆ తర్వాత ఆర్మీలో ఉద్యోగం చేసి… ఆ ఉద్యోగం వదిలేసి ముంబైలో సినిమాల్లో తన భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్లాడు. వెళ్లడం కాదు.. ఆ తర్వాత ఆయనే ఓ హిస్టరీ అయ్యాడు.

మదన్ మోహన్ తండ్రి రాజ్ బహదూర్ చున్నీలాల్ కోహ్లీ బాగ్ధాద్ లో ఇరాక్ పోలీస్ ఫోర్స్ లో అకౌంటెంట్ జనరల్ గా పనిచేసేవాడు. మదన్ మోహన్ బాల్యమంతా అక్కడే గడిచింది. 1932లో మదన్ మోహన్ ఫ్యామిలీ తమ సొంతూరు పంజాబ్ లోని జెలూమ్ జిల్లాలోని చక్వాల్ కు తిరిగి వెనక్కి వచ్చేసింది. మదన్ మోహన్ తండ్రి మళ్లీ బాంబే బాట పట్టాడు ఏదైనా పని చూసుకుందామనే ఉద్ధేశంతో. అదే సమయంలో తన నానమ్మ, తాత దగ్గర లాహోర్ లో పెరిగాడు మదన్ మోహన్. ఆ సమయంలో కొద్దిరోజులపాటు కర్తార్ సింగ్ అనే సంగీతజ్ఞుడి దగ్గర హిందుస్థానీ క్లాసికల్ సంగీతాన్ని కేవలం కొద్ది కాలం మాత్రమే అభ్యసించాడు. కానీ, మళ్లీ తండ్రి ముంబైలో కాస్త సెటిల్ కాగానే మదన్ మోహన్ కుటుంబం ముంబైకి షిఫ్టైపోయింది. అక్కడ 11 ఏళ్ల వయస్సులోనే ఆల్ ఇండియా రేడియో నిర్వహించే చిన్నపిల్లల సంగీత కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించాడు.

1943లో ఆర్మీలో సెకండ్ లెఫ్టినెంట్ గా జాయిన్ అయిన మదన్ మోహన్… రెండో ప్రపంచ యుద్ధం అయ్యే వరకూ కూడా అక్కడే రెండేళ్లపాటు పనిచేశాడు. కానీ, రెండేళ్ల తర్వాత ఆర్మీకి గుడ్ బై చెప్పిన మదన్ మోహన్ తిరిగి ముంబైకి చేరుకోవడంతో.. తిరిగి ఆయన మ్యూజికల్ జర్నీ ఆల్ ఇండియా రేడియో షోలతోనే ప్రారంభమైంది. అలా లక్నో, ఢిల్లీ రేడియో స్టేషన్స్ లో పనిచేసే క్రమంలోనే తలాత్ మహమూద్ తో పాటు, ఉస్తాద్ ఫయాజ్ ఖాన్, ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, బేగం అక్తర్ వంటివారితో చాలా పరిచయాలేర్పడ్డాయి. ఆల్ ఇండియా రేడియోలో ఆయన సాంగ్స్ కంపోజిషన్ కు మెచ్చి.. ప్రైవేట్ గజల్స్ ఆల్బమ్స్ కు సంగీతం సమకూర్చే అవకాశాలు వచ్చాయి. అలా 1948లో తనకు షహీద్ అనే సినిమాలో లతా మంగేష్కర్ తో కలిసి పాడే అవకాశం లభించింది. కానీ, ఆ పాటలు, సినిమా రిలీజ్ కు నోచుకోలేదు. అదే సమయంలో మదన్ మోహన్ ఎస్డీ బర్మన్ దగ్గర అసిస్టెంట్ గా పనికి కుదిరారు. 1950లో మళ్లీ మదన్ మోహన్ కు ఆంఖే సినిమా రూపంలో రెండో అవకాశం తలుపు తట్టింది. అలా ఆ సినిమాతో మహ్మద్ రఫీతోనూ.. ఆ తర్వాత సినిమా అదాతో లతామంగేష్కర్ తోనూ జతకట్టిన మదన్ మోహన్ ఆ తర్వాత సినీ సంగీతంలో తన మెలోడీలతో ఒక చరిత్రనే సృష్టించడం తెలిసిందే.

ఇప్పటికీ వెంటాడే ఆయన పాటలకు పెద్దగా అవార్డులేం దక్కకపోయినా… నాటి నుంచీ నేటి వరకూ ఆయన పాటలు హంటింగ్ చేసేలా వినిపిస్తూనే ఉంటాయి. ఆయన వెళ్లిపోయినా.. ఆయన చేసిన ట్యూన్స్ నే యశ్ చోప్రా వీర్ జారా సినిమాలో కొద్దిగా మాడిఫై చేసి పెడితే… ఆ పాటలు ఇప్పటికీ వెంటాడుతూ, వేటాడుతూ ఎలా సాగిపోతున్నాయో ఆ తర్వాత చరిత్ర మనకు తెలిసిందే.

భారతీయ చలన చిత్ర సంగీతరంగంలో మదన్ మోహన్ ది ఉత్థానస్థానం!

గజల్స్, సెమీ క్లాసికల్ తరహాలో సాగే ఆయన పాటల ప్రయాణం మనసులను హత్తుకునేలా.. రిపీటెడ్ గా వినేలా చేయగల్గడమే ఆయన సంగీతంలో సాధించిన అత్యున్నత విజయం. ఏదీ ఒక్కసారి మీ యూట్యూబో, స్పాటిఫైనో, సారేగామానో ఆన్ చేసి వినండి… లగ్ జా గలే పాటైనా, ఆప్ కీ నజ్రోన్ సే సంఝా అంటూ లత గొంతులో ఆ పాటలు. మళ్లీ మళ్లీ వినాలనిపించే అలాంటి కంపోజిన్స్ కు మదన్ మోహన్ మాత్రమే పేటెంట్ అనిపించదూ!

నౌషాద్ అలీ, సి. రామచంద్ర, మాస్టర్ గులాం హైదర్, పండిత్ అమర్నాథ్ వంటి సంగీత దిగ్గజాలు కూడా తమకంటే చిన్నవాడైన మదన్ మోహన్ చేసే ట్యూనింగ్స్, కంపోజిషన్స్ చూసి ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నౌషాద్ అలీ స్పష్టం చేశాడు. ఈ ఇంటర్వ్యూని కూడా ఇక్కడ మీరు చూడవచ్చు.

లెజండరీ సింగర్స్ తో మదన్ మోహన్ ప్రయాణం!

ఒక పాట ఎన్నేళ్లు ప్రజల గుండెల్లో నిల్చిపోవాలంటే… జనం పాటలు వింటున్నంతసేపూ.. అసలు పాట ఉనికి ఉన్నంత కాలమూ ఓ పాట నిల్చిపోవాల్సిందే. అలాంటి పాటల సమాహారమే మదన్ మోహన్ సంగీతం. లతతో తీసుకుంటే లగ్ జా గలే, ఆప్ కీ నజ్రోన్ సే సంఝా వంటి వెంటాడే పాటలు.. మహ్మద్ రఫీ సాబ్ తో ప్రయాణంలో ఓ తుమారే జుల్ఫ్ కే సాయే.. తలాత్ మహమూద్ తో జతకట్టినప్పుడు ఫిర్ వొహీ శామ్ వొహీ ఘమ్ అని వెంటాడే గజల్ తరహా పాట.. ఆశాభోంస్లే తో షోక్ నజర్ కీ బిజ్లియా , భూపిందర్ గొంతులో వెంటాడి వేటాడే దిల్ డూండ్త హై వంటి హిట్స్ ను అందించిన వైవిధ్యమైన సంగీతం మదన్ మోహన్ ది.

భావోద్వోగాలను పలికించేలా పాటలకు ప్రాణం పోసిన లెజెండ్!

పాట భావం, శ్రావ్యత, టోన్, ట్యూన్, ఇంటర్ నోట్స్ ఇలా ఏ విధంగా చూసినా సాఫీగా సాగిపోయే పాటలకు కేరాఫ్ మదన్ మోహన్ కంపోజిషన్. రణగొణ ధ్వనుల్లో పాట వినిపించని, శ్రావ్యత కనిపించని నేటి రోజుల్లో… ఇవాల్టి సంగీత దర్శకులెందరో కచ్చితంగా చదవాల్సిన మెలోడీ పాఠం మదన్ మోహన్.

సినీసంగీత రంగంలో ఎలాంటి వారసత్వం లేకుండా తనను తాను చాటుకున్నవాడు మదన్ మోహన్.

జుమ్ కా గిరారే వంటి ఊపున్న మదన్ మోహన్ పాటలను రీమిక్స్ చేసి ప్రీతమ్ వంటి సంగీత దర్శకుడు ఆ మధ్య రణబీర్ సింగ్, అలియాభట్ నటించిన రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ వంటి సినిమాలో ఆర్జిత్ సింగ్, జోనితాగాంధీతో పాడించారంటే నాటి మదన్ మోహన్ పాటలకు నేటికీ ఎంత క్రేజుందో అర్థం చేసుకోవచ్చు.

మదన్ మోహన్ సమకాలీనుల్లో నౌషాద్ అలీ, శంకర్ జైకిషన్ వంటివారు వాణిజ్యపరంగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ చార్ట్ లో ఉన్నప్పటికీ.. వారితో పాటే సంగీత ప్రయాణాన్ని సాగించిన మదన్ మోహన్ మాత్రం కాలానికి అతీతంగా గుర్తుండిపోయే మధుర సంగీతాన్నందించి సనీసంగీత వినీలాకాశంలో ధృవతారై నిల్చిపోయారు. సుమారు 25 వేల పాటల వరకూ కంపోజ్ చేసిన మదన్ మోహన్… ప్రతీ పాటలోనూ మెలోడీతో పాటు, వైవిధ్యాన్ని ప్రతిబింబించే ట్యూనింగ్స్ తో వాణిజ్య విలువలను మించి సినీ సంగీతాన్ని ఉన్నతస్థానంలో నిలబెట్టారు. అందుకే ఆయన లేకపోయినా.. ఆయన పాటల్లో ఎప్పుడూ స్మృతిలోనే ఉండే మెలోడీ కింగ్ కు జన్మదిన శుభాకాంక్షలతో..💐🙏

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles