గులాం అలీ కచేరీలో ఒకానోక రోజు: ఓ మధురమైన జ్ఞాపకం!

Modumudi Sudhakar…✍️

సంగీతానికి కుల,మతాలు, ఎల్లలు, రాజకీయాలులేవు.. భాష తెలియనక్కరలేదు. భావ బంధురమైన పాట మనల్ని కట్టిపడేస్తుంది. మళ్ళీ మళ్ళీ వినేట్లు చేస్తుంది.

మన పొరుగు దేశమైన పాకిస్థాన్ కు చెందిన గజల్ గాయకులు మెహ్దీ హసన్, గులాం ఆలీ.. వీరిద్దరికీ భారతదేశంలో ఉన్నంతమంది అభిమానులు ప్రపంచంలో మరెక్కడా లేరు .

వారిలో గులాం ఆలీ పాట అంటే ప్రాణం ఇస్తాను నేను. ఆయన పాడిన ఆల్బమ్స్ నాదగ్గర ఉన్నన్ని బహుశా ఎవరి దగ్గరా ఉండవేమో! ఆయనది అసాధారణమైన సంగీతం.

ఉస్తాద్ బడేగులాం ఆలీఖాన్, వారి సోదరులైన బర్ఖత్ ఆలీఖాన్ల శిష్యరికం చేసి, హిందుస్థానీ సంగీతం క్షుణ్ణంగా నేర్చుకున్నారు. గులాం ఆలీ ప్రతిభని చూసిన గురువు బర్ఖత్ ఆలిఖాన్, ‘నీ సంగీతం అనన్య సామాన్యం. ఏ శాస్త్రం, సంప్రదాయం నీ కల్పనాచాతుర్యానికి శృంఖలాలు వేయజాలవు. భావ ప్రధానమైన నీ సంగీతం, రాగ, తాళాలకు అతీతమైనది. నీవు గజల్స్ పాడటానికే పుట్టావు. కాబట్టి గురువుగా నేను నీకు సంపూర్ణ స్వేచ్ఛనిస్తున్నాను. నీకు తోచినట్లు నువు పాడు. దానికి శ్రోతలు బ్రహ్మరథం పట్టితీరుతారు.’ అని కితాబిచ్చారు.

గురువుల వద్ద అటువంటి అరుదైన ప్రశంస పొందటం ఎంత విశేషం?

నాకు ఉర్దూ రాదు. అయినా ఆయన పాడుతుంటే ఆ పాటలోని సాహిత్యం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. ఆయన నోటి నుండి జాలువారే అక్షరాలు ఎంత పుణ్యం చేసుకున్నాయో..? అనిపిస్తుంది.

గులాంఆలీ గారి గజళ్ళు కొన్ని వేలసార్లు విన్న నాకు, ఒక్కసారైనా జీవితంలో ఆ మహనీయుని చూసే అదృష్టం కలుగుతుందా..? అనిపించేది.

ఆ పుణ్య గడియ రానే వచ్చింది. అది 2001, మే 10వ తేదీ.. శ్రీ గణపతి సచ్చిదానందస్వామివారి జన్మదినోత్సవాల్లో భాగంగా మైసూరు ఆశ్రమంలో గులామ్ ఆలీ గారి కచేరీని వారు ఏర్పాటుచేసినట్లు తెలిసింది.

రెక్కలు కట్టుకొని మైసూరులో వాలిపోయాను.. నాశ్రీమతి అంజన, 7సంవత్సరాల కూతురు శ్రుతిరంజనిని తీసుకొని.. సూర్యాస్తమయ సమయానికి ఆశ్రమం చేరుకున్నాము.

ఎన్నాళ్ళో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. తెల్లటి కారులోనుండి తెల్లటి కుర్తా, పైజమాలో దిగారు గులాం ఆలీ. అప్రయత్నంగా వారి పాదాలకు నేను, నా శ్రీమతి నమస్కరించాము. చిరునవ్వుతో తెలిసినవారివలె పలకరించారాయన! మా అమ్మాయి కూడా వారి అభిమాని అని తెలుసుకొని, ఆయన వెంట వచ్చిన ఆయన శ్రీమతి, ఎత్తుకొని ముద్దుచేసింది.

హిందూ ధర్మాన్ని ప్రతిబింబించే ఆశ్రమంలో దత్తాత్రేయుడి గుడి దర్శించుకుని, తీర్థం స్వీకరించారాయన. ఆనాటి కచేరీలో ఆయనకు పేరుతెచ్చిపెట్టిన ‘చుప్కే చుప్కే రాత్ దిన్..’లాంటి గజళ్ళు,’హంగామా హై క్యో బర్పా’.. వంటి షరాబీ పాటలు హుషారుగా రెండు గంటలపాటు పాడారు. గంగాప్రవాహంలా ఆ గానం సాగింది.

అక్కడ ఉన్న అశేష జనం స్వామీజీని భక్తితో దర్శిస్తుంటే, నేను గులాంఆలీగారిని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను. ఏదో పాప వశాన నరునిగా పుట్టిన గంధర్వుడాయన!

కచేరీ ముగిశాక, స్వామీజీ మాట్లాడుతూ, శృంగార రసప్రధానమైన గజళ్ళను జయదేవ అష్ఠపదులతో పోల్చి, సరస్వతీ అంశగా గాయకుణ్ణి కీర్తించారు.

శ్రోతల కరతాళధ్వనులు మిన్నంటాయి. నా జీవితం ధన్యమైంది.

మహా కళాకారులైన వోలేటి వేంకటేశ్వర్లు, బాపూగారి వంటివారే గులామ్ ఆలీ గారి గానానికి గులాములైతే నాబోటివారు ఒక లెక్కా!…

ఆ గానం ఆపాతమధురం…అవధులు లేని ఆయన సంగీతం అనిర్వచనీయానందమయం!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles