వక్ఫ్ బిల్లు.. బీజేపీ నేతల వాదనల్లో హైలెట్స్!

మూజువాణి ఓటుతో పార్లమెంట్ ఆమోదం కంటే ముందే.. విస్తృత చర్చకు తెరతీసింది వక్ఫ్ బోర్డ్ బిల్లు. ఈ బిల్లును ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమనే వాదనను ప్రతిపక్షాలు వినిపిస్తే.. సమర్థించుకునేందుకు రైటిస్టులూ అంతే విస్తృతంగా వాదించారు. ఇంకా వాదిస్తూనే ఉన్నారు. పైగా ఇప్పటివరకూ సరైన నిర్వచనంతో కాకుండా ఎవరికనుకూలంగా వారు నిర్వచించుకుంటున్న సెక్యులర్ అనే పదమూ అదే స్థాయిలో వాదనలకు తెరలేపుతోంది. ఈ క్రమంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు… బెంగళూర్ ఎంపీ సూర్యవంశీ బీజేపీ తరపున సమర్థవంతమైన వాదనలు వినిపించారు. అందులో నిర్మలా సీతారామన్ ఉటంకించిన ఓ స్టోరీ చెప్పుకోవాల్సింది. ఆమె నిన్న రాజ్యసభలో మాట్లాడుతూ తమిళనాడులో జరిగిన ఓ ఉదంతాన్ని సభ ముందుకు తెచ్చారు. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడైన సయ్యద్ నాజిర్ హుస్సన్ కు ట్యాగ్ చేస్తూ తన X ఖాతాలోనూ పోస్ట్ చేశారు.

తమిళనాడులోని ఓ గ్రామంలో 1800 ఏళ్ల నాటి ఓ పురాతన చంద్రశేఖరాలయం ఉంది. ఈ గ్రామం మొత్తం ఎస్సీలు, ఓబీసీలు మెజార్టీగా జీవిస్తున్నారు. వక్ఫ్ బోర్డ్ రికార్డుల కారణంగా ఆ పురాతన ఆలయ భూవివాదంలో అక్కడి గ్రామస్థులెలా చిక్కుకున్నారో 2025 వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టే క్రమంలో సీతారామన్ సభ ముందుంచారు.

TEJASWI SURYA-BANGALORE SOUTH MP

సదరు గ్రామంలో 408 ఎకరాల భూమి వివాదాస్పదంగా మారింది. అక్కడి భూములెవరైనా కొనాలన్నా, అమ్ముకోవాలన్నా సదరు గ్రామస్థులు వక్ఫ్ బోర్డ్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నది అక్కడ నిబంధనగా మారింది. అది ఆ గ్రామస్థులకు శాపంగా పరిణమించింది. దానికి కారణం డిజిటలైజేషన్ ప్రక్రియలో రెవెన్యూ అధికారులు ఆ ల్యాండ్ మొత్తాన్నీ వక్ఫ్ బోర్డ్ భూమి కింద తప్పుగా నమోదు చేశారు. దాంతో అప్పుడు ఆ భూమిపై హక్కులు వక్ఫ్ బోర్డుకు సంక్రమించాయి. అలా గ్రామం మొత్తం అక్కడి ఎస్సీలు, ఓబీసీలకు సంబంధించిన భూములు కూడా వక్ప్ బోర్డ్ ఖాతాలోకి వెళ్లాయి. ఒకవేళ అక్కడి భూములను సదరు గ్రామస్థులెవరైనా అమ్మాలన్నా, కొనాలన్నా దానికి వక్ఫ్ బోర్డ్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరైంది. ఇదేం పద్ధతి… ప్రతీ గ్రామస్థుడికీ తన భూమి అమ్ముకోవాలంటే ఎన్వోసీ రావాలా అంటూ ఆమె ప్రశ్నించారు.

సరే, రెవెన్యూ అధికారుల తప్పిదంతో డిజిటలైజేషన్ లో తప్పిదం జరిగిందే అనుకుందాం.. మరి తమకు ఎలాంటి సంబంధం లేని భూమిని తమది కాదని అక్కడి వక్ఫ్ బోర్డ్ ఎందుకు చెప్పడం లేదు…? తమ భూములమ్ముకునేందుకు అధికారుల నిర్వాకం కారణమైతే.. ప్రతీసారీ తాము ఎన్వోసీ ఇవ్వాల్సి వస్తే అక్కడి వక్ఫ్ బోర్డ్ ఎందుకు స్పందించదు…? తరాల నుంచి అక్కడే నివశిస్తున్న ప్రజలది కాకుండా… అక్కడి భూమి ఇంకా ఎవరిదో ఎలా అయింది..? ఆలయ భూములు కూడా అక్కడి వక్ఫ్ బోర్డుకెలా సంక్రమించాయి… అక్కడి ఆలయాన్ని వక్ఫ్ బోర్డ్ నిర్మించిందా.. ? ఇదిగో ఈ ప్రశ్నల్ని సభ ముందుంచారు సీతారామన్.

https://twitter.com/nsitharamanoffc/status/1907778337046515920

ఈ బిల్లును మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో ప్రవేశపెట్టిన సందర్భంలో ఈ చర్చకు తెరలేచింది. మబ్బున వరకూ జరిగిన చర్చ తర్వాత 288 మంది ఎంపీలు అనుకూలంగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే, ఈ బిల్లు మైనార్టీల హక్కులను కాలరాసేందుకనేది ఓ దుష్ప్రచారం మాత్రమేనంటోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ముస్లిం మహిళలకు సాధికారత కల్పించడానికి కూడా ఈ బిల్లు ఉపయోగపడుతోందంటోంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా లోక్ సభలో ఈ బిల్లుపై పలు ఉదాహరణలను ముందుంచారు. 2013లో వక్ఫ్ చట్టంలో చేసిన సవరణలతో దేవాలయ, రైల్వే, ఇతర ప్రభుత్వ అసైన్డ్ భూములెలా వక్ఫ్ బోర్డ్ వశమయ్యాయో చెప్పుకొచ్చారు. తమిళనాడులోని 15 ఏళ్ల క్రితం నిర్మించిన తిరుచెందూర్ ఆలయానికి సంబంధించిన 400 ఎకరాలతో పాటు.. హిమాచల్ ప్రదేశ్ లోనూ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రార్థనాలయాలను ఎలా నిర్మించారో ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో 2001 నుంచి 2012 వరకూ కూడా సుమారు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు లీజుకిచ్చారని.. కర్నాటకలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ కోసం కేవలం నెలకు 12 వేల రూపాయలకు లీజుకిచ్చిన వివరాలన్నీ ఆయనా సభ ముందుంచారు.

మరోవైపు, పార్లమెంట్ లో వక్ఫ్ బిల్లు ఆమోదం ముస్లిం సమాజానికి ఓ కొత్త ఉదయమన్నారు బెంగళూర్ సౌత్ ఎంపీ తేజస్వినీ సూర్య. ఎలాంటి పారదర్శకత లేని, అవినీతిమయంగా మారి, జవాబుదారీతనం లేని ఒక సంస్థను హేతుబద్ధం చేయడమే ఈ బిల్లు ఉద్దేశమంటూ గట్టి వాదనలు వినిపించాడు సూర్య.

కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన 1954, 1995, 2013 వక్ఫ్ సవరణ చట్టాలన్నీ… ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ కంటే సుప్రీమన్నట్టుగా విశేషాధికారాలెలా కల్గి ఉండేవో చెప్పుకొచ్చారు. వక్ఫ్ బోర్డ్ కబ్జాల కారణంగా కర్నాటక రాష్ట్రంలో రైతులెలా ఆత్మహత్యల బాట పట్టారో సభలో వివరించారు సూర్య. కాంగ్రెస్ దేశాన్ని రాజ్యంగం అమలు విషయంలో కూడా పూర్తి మోసం చేసిందని ఆరోపించిన సూర్య.. వక్ఫ్ ఆస్తుల సర్వేపైనా మాట్లాడారు. సెక్షన్ 5, 6 లతో పాటు.. సెక్షన్ 40 వంటి అపరిమితమైన అధికారాల ద్వారా వక్ఫ్ బోర్డ్ ఏ భూమినైనా వశపర్చుకునే అధికారాలను నాటి చట్టాలు కట్టబెట్టాయని.. ఇక 2013 చట్ట సవరణతో ఆ అపరిమిత అధికారాలు మరింత పెరిగిపోయాయని విమర్శించారు.

అందుకు, కర్నాటకలోని విజయపుర జిల్లాలో పేద రైతులకు చెందిన 15 వేల ఎకరాల భూమితో పాటు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న భూములను కూడా అక్కడ వక్ఫ్ బోర్డ్ తన భూములేనని ఎలా బుకాయించిందో చెప్పుకొచ్చారు. సామాజిక సంస్కర్త బసవన్న స్థాపించిన అనుభవ మంటపాన్నీ వక్ఫ్ బోర్డ్ తన జాగానేనని క్లెయిమ్ చేసుకున్న పలు ఉదంతాలను సభ ముందు పెట్టి కడిగిపారేశారు.

మొత్తంగా సెక్యులరిజం పేరుతో ఏదో ఒక వర్గం వైపే నిలబడే వాదనలే రైట్ అండ్ లెఫ్ట్ లో కనిపిస్తున్న తరుణంలో.. వక్ఫ్ బోర్డ్ బిల్లుకు ముందు రాజ్యసభలో బీజేపీ నాయకులు మాత్రం బలమైన వాదనలే వినిపించి విజయం సాధించారనేందుకు ఇవే ఉదాహరణలు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles