వరదలు, పిడుగులు ఏం చేయలేకపోయాయి.. ఏకైక ముప్పు దుష్టమానవుడే: వృక్షవిలాపం!

సుబ్రహ్మణ్యం వల్లూరి…✍🏼

ఎంతోమంది నన్ను ప్రేమతో సృశిస్తూ అడిగేవారు నేను ఎప్పుడు పుట్టానని..? నా వయస్సు ఎంత ఉంటుందని…? నా వయసు నాకు తెలిసినా జవాబు ఇచ్చేదాన్ని కాదు!

ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా సులువుగా నా వయసు తెలుసుకోవచ్చు. నిలువునా క్షమించండి అడ్డంగా కోసిన నన్ను చూసి.

ఇన్ని శతాబ్దాలపాటు జవాబు ఇవ్వని నేను.. కోసేయబడ్డ నా ఖాండంలో కనిపించే సన్నటి వృత్తాల్ని బట్టి నేను ఎప్పుడు పుట్టానో లెక్కించుకోవచ్చు. నా లెక్క తప్పు అవడానికి లేదు. మీకో బండ గుర్తు.. ప్రతి రింగు ఒక సంవత్సరం కింద లెక్క! నాకు గుర్తుండీ నా వయసు మూడు వందలా యాభై సంవత్సరాలు దాటే ఉంటుంది. నేను బాగా ఎదిగిన తరువాత మొట్టమొదటిసారి గుర్రం మీద నా నీడలో నిలబడ్డ, పాలిపోయినట్టుండే తెల్లటి ఆంగ్లేయుడిని మొదటిసారి చూసాను.. అప్పుడు నా వయసు రెండు మూడేళ్లు తక్కువగా వంద .

నేను వాగ్గేయకారుడు త్యాగరాజు 1767లో పుట్టాడని విన్నానని.. 1847లో స్వర్గస్థులయ్యారనీ విన్నానని.. అంటే ఆశ్చర్యపోకండి. ఆయన్ను చూసే భాగ్యం కలుగలేదు కానీ.. ఒక సంగీతం మాస్టారు నా నీడన కూర్చుని పిల్లలకు సంగీతం నేర్పించేవారు. అలా విన్నది గుర్తుపెట్టుకున్నాను. అలా కొద్దిగా సంగీతంలో ఓనమాలు వచ్చు నాకు. నానుంచి, సన్నగా వీచే గాలిలో దీక్షగా వింటే త్యాగరాజకీర్తనలు వినిపిస్తాయి. ఆ తరువాత పదేళ్లు కూడా కాకుండా బారతదేశంలో మొట్టమొదటి స్టీమ్ ఇంజిన్తో రైల్వేలు ప్రారంభం అయ్యాయి. ఆ రైల్వే శాఖ వల్ల మా వృక్షజాతి కోట్ల చెట్లు నరికి వేయబడ్డాయి.

నా వయసు 250 దాటిన తరువాత ఎప్పుడో ప్రపంచంలో మొదటిసారి విమానం నడిపారు అమెరికాలో రైట్ సోదరులు. ఆ విమానం నడపడం మొదలైన తరువాత రెండు ప్రపంచ యుద్ధాలు చూసాను. కరువుకాటకాలు, వరదలు , భీకరమైన ప్రచండ గాలులు , పిడుగులు నన్నేమీ చేయలేకపోయాయి, ఎప్పటికైనా నాకు ఉన్న ఏకైక ముప్పు దుష్ట మానవుడే అని ఎప్పుడో గ్రహించాను. చివరకు అదే నిజమయ్యింది కూడా.

నేను మూడొందల ఏళ్ళ పుట్టినరోజు జరుపుకున్నప్పుడు ఆంగ్లేయులు నేను పుట్టిన దేశం విడిచి వెళ్లిపోయారు. మీరందరూ స్వతంత్రం వచ్చిందని చాలా సంతోషించారు. గత డెబ్భై ఎనిమిదేళ్ళల్లో మీరు దేశాన్ని ఎంత నాశనం చేశారో చూస్తూనే ఉన్నాను. నా చుట్టూ ఉండే నా బంధువులను నిర్దాక్షిణ్యంగా నరికేశారు. మీ ఇళ్ల కోసం, రోడ్ల కోసం, పర్యావరణ రక్షణ అటుంచి మీ శాయశక్తులా వినాశనానికి తలో చెయ్యి వేసి మీ భవిష్యత్తుని మీరే సర్వనాశనం చేసుకోవడం గమనిస్తూనే ఉన్నాను. నిన్న నా వంతు వచ్చింది. పెద్ద ముత్తయిదువ లాంటిదాన్ని అన్న కనికరం లేకుండా ఏడున్నర గంటలు శ్రమించి మొదలుతో సహా యంత్రాలతో నన్ను కోస్తూ వచ్చి నా ప్రాణం నిలువునా తీశారు. నన్ను అడగాలని కొద్దిగా కూడా అనిపించలేదు ఎవరికీ. పోనీ నీ ప్రాణం తీస్తున్నాం అని నాతో చెప్పి నాకు క్షమాపణ కూడా చెప్పలేదు. ఎంత నిర్దయులు మీ మానవులు..? నా నీడన వందలాది మంది సేద తీరేవారు అన్న ఇంగితం లేకుండా నిర్దాక్షిణ్యంగా అర ఏకరంలో ఉండే నన్ను కోసి పక్కన పడేశారు!

నాప్రాణం పోయేముందు మీతో కొన్ని మాటలు పంచుకుందామనుకున్నా. కానీ, వినే మానవుడెక్కడ? నిర్దయకు మారుపేరు అయిన మనిషికి నా గోడు పట్టదు. ఈ ప్రపంచం నీ ఒక్కడిదే అని విర్రవీగుతున్నావు కదా..? నేను నా బంధుమిత్రులు, రకరకాల జంతువులు, కీటకాలు లేకపోతే నీ మనుగడ లేదని నువ్వు గ్రహించే నాటికి నీ అంతం నీకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే నా శాపం మీ జాతికి!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles