యాక్టర్ కావాలనుకున్న జీనియస్ ఐఐటీయన్ అనిరుధ్ అగర్వాల్. కానీ, ఆయన విధిరాత మరోలా ఉంది. ఆయనకున్న రంగంలో ప్రత్యేకత సంపాదించాడే తప్ప.. హీరోలా మెరవాలన్న ఆయన కల మాత్రం నెరవేరలేదు. కానీ, ఆ తర్వాత హార్రర్ సినిమాల్లో పాత్రలకు ఆయన కేరాఫ్ గా నిల్చారు
అనిరుధ్ అగర్వాల్ ది డెహ్రూడూన్. ఓ మధ్య తరగతి కుటుంబం. పది మంది పిల్లల్లో ఎనిమిదోవాడు. తండ్రి కిరాణం నడుపుకునేవాడు. తల్లి గృహిణి. అనిరుధ్ చిన్నప్పట్నుంచీ హీరో జితేంద్ర అభిమాని. తానూ నటుడు కావాలన్నది చిన్నప్పట్నుంచీ ఓ కల. కానీ, తండ్రి మాత్రం వద్దని వారించాడు.

చేసేదేంలేక తన కలను పక్కనబెట్టాడు. అనిరుధ్ ఇంజనీరింగ్ చదవాలని నిర్ణయించుకున్నాడు. చదువులోనూ జీనియస్ కావడంతో ఐఐటీ రూర్కీలో బీటెక్ చేశాడు. ఆ సమయంలో తన అభిమాన హీరో జితేంద్రను స్వగ్రామంలో ఓసారి చూడటం.. ఆయన్ను మరోసారి తట్టిలేపే వేకప్ కాల్ అయిందది. దాంతో తన కల ఎలాగైనా నేర్చుకోవాలన్న తపనతో ముంబైకి చేరుకున్నాడు.
దాదాపు ఏడడుగుల ఎత్తుతో ఆకర్షణీయమైన బాడీ లాంగ్వేజ్ తో ఉన్న తనకు హీరో పాత్రలు వాటంతటవే తన్నుకు వస్తాయనుకున్నాడు అనిరుధ్. కానీ, విధి ఇంకోలా నిర్ణయించింది. ముంబై వెళ్లి సినిమా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో అనారోగ్యం బారిన పడ్డాడు. పిట్యూటరీ గ్రంథిలో ట్యూమర్ ఉన్నట్టు నిర్ధారణైంది. హార్మోన్స్ అసమతుల్యత వల్ల ముఖంతో పాటు, అవయవాల్లో మార్పులేర్పడ్డాయి. అప్పటివరకూ ఏడడుగుల అందగాడుగా ఉన్న అనిరుధ్ అగర్వాల్.. భయంకరంగా మారిపోయాడు. అప్పటివరకూ ఆకర్షణకు లోనయ్యే అమ్మాయిలంతా.. ఆయన్ను చూసి భయపడిపోయేవారు. ఈ విషయాన్ని ఓసారి ఇంటర్వ్యూలో అనిరుధే చెప్పారు.
దాంతో ఓ సంప్రదాయ హీరోగా తనను తాను చూసుకోవాలన్న కల ఛిద్రమైపోయింది. కానీ, ఓం శాంతి ఓం సినిమాలోని ఓ ప్రసిద్ధ డైలాగ్ కహ్తే హై అగర్ కిసీ చీజ్ కో దిల్ సే చాహోతో పూరీ కాయనాత్ ఉస్సే తుమ్సే మిలానే కీ కోశిష్ మే లగ్ జాతీ హై… మీరేదైనా బలంగా కోరుకుంటే అది జరగడానికి యావత్ ఈ విశ్వం మొత్తం ప్రయత్నిస్తుందన్నది స్థూలంగా దీనర్థం. అదే అనిరుధ్ జీవితంలో జరిగింది.

ఓ మిత్రుడు అప్పటికే హార్రర్ మూవీస్ కు పితామహుల్లా పేరు పొందిన రామ్ సే బ్రదర్శ్ ను ఓసారి కలవమని అనిరుధ్ కు సలహానిచ్చాడు. అనిరుధ్ దీపక్ రామ్ సేను కలిశాడు. ఆఫీస్ కు వచ్చిన అనిరుధ్ రూపాన్ని చూసి అక్కడికొచ్చివారంతా ఆయన్నే చూస్తుండటంతో… ఆయన ట్యూమర్ తెచ్చిన భయంకర రూపమే ఆయనకు యాక్టింగ్ అవకాశాన్ని కల్పించింది. రామ్ సే బ్రదర్స్ లో మరొకరైన తులసీ రామ్ సే పురానా మందిర్ సినిమాలో అవకాశమిచ్చారు. ఆ సినిమాలో సామ్ రీ అనే పాత్రకు వారు కోరుకుంటున్న పాత్రధారుడు ఇంకా వారికి దొరక్క వెతుకుతూనే ఉన్నారు. ఆ సమయంలోనే అనిరుధ్ వారి కార్యాలయంలో అడుగుపెట్టడంతో వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా మంత్రముగ్ధులయ్యారు.
లో బడ్జెట్ లో భారీ విజయాలు సాధించే దర్శక ద్వయంగా రామ్ సే బ్రదర్స్ కు పేరు. పురానా మందిర్ సినిమాను మహాబలేశ్వర్ లో చిత్రీకరించారు. అనిరుధ్ మేకప్ కే ఎనిమిది గంటల సమయం పట్టేదట. ఉదయం ఏడింటికి మేకప్ కు కూర్చుంటే.. మధ్యాహ్నం రెండు గంటలకు అనిరుధ్ సెట్స్ పైకి వచ్చేవాడు.
ఓసారి హీరోయిన్ ఆర్తీ గుప్తా సెట్స్ కు వచ్చారు. ఆమె అంతకుముందు అనిరుధ్ ను ఎప్పుడూ చూడలేదు. చీకట్లో ఒక్కసారిగా పూర్తిగా సామ్ రీ మేకప్ లో ఉన్న అనిరుధ్ ను చూసి ఆమె కేక వేసి స్పృహ తప్పారు. స్పృహకు వచ్చాక.. ఇదేంటి, ఈ దెయ్యంతో ఎలా పనిచేస్తామని అడిగారట. ఈ విషయాన్ని కూడా ఓసారి అనిరుధ్ గుర్తు చేసుకున్నారు. తాను మేకప్ గదిలోని వాష్ రూమ్ నుంచి బయటకొస్తున్న సమయంలో ఆమె తనను చూసి భయపడిందని.. ఆ ఘటన తనను కూడా భయపెట్టిందన్నారాయన.
అనిరుధ్ అగర్వాల్ ప్రయాణం ఆ తర్వాత కూడా చాలా సినిమాల వరకూ రామ్ సే బ్రదర్స్ తో కలిసి సాగింది. సామ్ రీ, బంద్ దర్వాజా వంటి చిత్రాల్లోనూ రామ్ సే బ్రదర్స్ తో కలిసి పనిచేశారు. ఆ దర్శక ద్వయం సినిమా నుంచి టెలివిజన్ వైపు మళ్లడంతో మళ్లీ అనిరుధ్ కు అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత బాండిట్ క్వీన్, అమీర్ ఖాన్ సోదర ద్వయం నటించిన మేళా, తలాష్ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు.
హార్రర్ సినిమాల్లో భయపెట్టే పాత్రల్లో క్లిక్ అయిన అనిరుధ్ కు ఆ తర్వాత మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలుగానీ, ఇతర జానర్లలోగానీ దక్కలేదు. కొన్ని సినిమాల్లో ఫైటర్ పాత్రల్లో ఆయన కనిపించారు
బంద్ దర్వాజా షూటింగ్ సమయంలో ఓసారి ప్రాణాపాయంలో కూడా పడ్డారు. శవపేటికలో పడుకునే సీన్ లో భాగంగా శ్వాస తీసుకునే సందు కూడా లేకుండా పొరపాటున మూసేయడంతో ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది ఆ సీన్. అది సౌండ్ ప్రూఫ్ పేటిక కావడంతో ఆయన కేకలు కూడా ఎవ్వరికీ వినిపించలేదు. చివరకు లక్కీలీ ఎవరో ఆ పేటిక తెరవడంతో ప్రాణాలతో బయటపడ్డాడట అనిరుధ్.
ఆన్ స్క్రీన్ లో దెయ్యాల పాత్రలు వేసిన అనిరుధ్ అగర్వాల్ కు చిన్నప్పుడు పదేళ్ల వయస్సులో ఇంట్లో గొడవ చేస్తే తన తల్లి బయటకు వెళ్లిపొమ్మందని.. అప్పటికే మానాన్న మా ఇంటి వద్ద దెయ్యాలు తిరుగుతాయని చెప్పేవాడని.. దాంతో భయపడ్డానంటాడు. ఆ జ్ఞాపకాలు మళ్లీ తాను రామ్ సే బ్రదర్స్ డైరెక్షన్ లో సినిమాల్లో చేసినప్పుడు యాదికొచ్చేవని చెబుతాడు.
అవకాశాలు తగ్గిపోయిన అనిరుధ్ ఇప్పుడు నటనకు దూరమై సొంత నిర్మాణ సంస్థ నడిపిస్తున్నాడు. ఒకనాడు చీకటి హార్రర్ పాత్రలకు కల్ట్ ఐకాన్ గా నిల్చిన ఆయన.. ఈరోజు ఓ వ్యాపారవేత్త. విధి వక్రించి ఇచ్చిన రూపం తనను నటుణ్ని చేసి, తన కలనైతే నిజం చేసిందేమోగానీ.. తానూహించినట్టుగా హీరో కాలేకపోయాడన్న బాధ మాత్రం అనిరుధ్ ఇంటర్వ్యూస్ లో కనిపిస్తుంది.


