మునుపంటే పెన్నుకు పని కానీ.. ఇప్పుడంతా కీబోర్డే. డెస్క్ టాపైనా, ల్యాప్ టాపైనా… కీ బోర్డ్ మీద ఆ అక్షరాలను స్పీడుగా కొట్టే అలవాటుంటే పదసంపద కూడా ధారలా, ఓ ప్రవాహంలా వెళ్తునే ఉంటుంది. అయితే, ఆ కీబోర్డుపైన ఉండే కీస్ లో… F,అలాగే J రెండు కీస్ ని మీరెప్పుడైనా గమనించారా..? ఏ కీస్ పైనా కనిపించని ఒక గీత F, అలాగే J రెండు కీస్ పైనా కనిపిస్తుంది. చాలామంది గమనించొచ్చు, గమనించకపోవచ్చు. గమనించినవాళ్లకు ఆ రెండు కీస్ పైన ఆ గీతలెందుకున్నాయో చాలామందికి తెల్వకపోవచ్చు కూడా. అదేంటో ఓసారి తెలుసుకుందాం.
అసలా చిన్న గీతలెందుకుంటాయి..?
F అండ్ J ఈ రెండు కీస్ పైన కింద ఉండే గీతలను ట్యాక్టైల్ గైడ్స్ అంటారు. వీటి ముఖ్య ఉద్ధేశం.. కీబోర్డును చూడకుండా టైప్ చేసే సమయంలో మన వేళ్ల సరైన స్థానంలో ఉండేలా సాయం చేయడమే.

టైపింగ్ కు ఓ ప్రత్యేక పద్ధతుంటుంది. దాన్నే టచ్ టైపింగ్ అంటారు. ఈ విధానంలో కీబోర్డును మళ్ళీ మళ్లీ చూడకుండానే వేళ్ల మజిల్ మెమరీ ద్వారా టైప్ చేస్తూ ఉంటాం.
మరి ఎందుకు F అండ్ J బటన్లనే ఎంచుకున్నారు..?
సాధారణంగా మనం ఉపయోగించే క్వెర్టీ కీబోర్డ్ లే అవుట్ లో ఎడమచేతి చూపుడు వేలిని F బటన్ పైన.. అలాగే, కుడి చేతి చూపుడు వేలిని J బటన్ పైన ఉంచుతాం. ఇక మిగిలిన ఎడమ చేతి వేళ్లు హోమ్ రో లో A, S, D, F ఇలా వరుస క్రమంలో ఉంటే.. కుడి చేతి వేళ్లు J, K, L వరుస క్రమంలో ఉంటాయి.
F అండ్ J కీస్ పైన కింద చిన్నగా కనిపించే గీత వల్ల టైపింగ్ చేసేవారు కీబోర్డును చూడకుండానే సరైన స్థానాన్ని సులభంగా గుర్తించగల్గుతారు.
ఇంకా ఏముంటాయి ఆ కీస్ ప్రయోజనాలు..?
కీబోర్డ్ చూడాల్సిన అవసరముండదు.
స్క్రీన్ పైనే పూర్తి దృష్టి సారించి వేగంగా టైప్ చేయొచ్చు.
మజిల్ మెమరీ మెరుగుపడుతుంది
వేళ్లు ఎప్పటికప్పుడు సరైన స్థానంలో ఉంచడం వల్ల మెదడు, చేతులు ఏకకాలంలో అనుసంధానమై పనిచేస్తూ పోవచ్చు. దీంతో టైపింగ్ లో తప్పులు తగ్గించుకోవచ్చు.
అలాగే, శరీర భంగిమలో కూడా ఇబ్బందుల్లేకుండా టైపింగ్ చేసుకోవచ్చు.
చేతులు సరైన స్థానంలో ఉండటం వల్ల వేళ్లు, మణికట్టుపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. దీంతో చిన్న చిన్న నొప్పులు, స్ట్రెస్ ఇంజ్యూరీస్ తగ్గే అవకాశాలుంటాయి.
ప్రతీ కీబోర్డులోనూ ఆ గీతలు కనిపిస్తాయా..?
దాదాపు ప్రతీ ఫిజికల్ కీబోర్డులోనూ మీరు ఆ గీతలను F అండ్ J కీస్ పై గమనించవచ్చు. అది డెస్క్ టాప్ కీబోర్డైనా, ల్యాప్ టాప్ ఇన్ బిల్ట్ కీబోర్డైనా టాక్టైల్ గైడ్స్ కంపల్సరీగా ఉంటాయి. కొన్ని టచ్ స్క్రీన్ కీబోర్డ్స్, బ్రెయిల్ పరికరాల్లో కూడా ఇలాంటి స్పర్శ లక్షణాలుంటాయి. దాంతో యూజర్ ఫ్రైండ్లీగా మారి.. కీస్ చూడకుండానే టైపింగ్ ను వేగంగా చేయగల్గుతాం.



