ఇందిరాగాంధీ – ఎమర్జెన్సీ – ఓ చీకటి కోణం – ఇది అందరికీ తెలిసిన కథే. ఆ సమయంలో తన ప్రత్యర్థులు, శత్రువులనుకున్నవారందరినీ ఇందిర ఎలా జైళ్లల్లో తోయించారో కూడా చదువుకున్నదే. అందులో జైపూర్ మహారాణి అయిన రాజమాత గాయత్రీ దేవీ కూడా ఉన్నారన్న విషయం తెలుసా..? మరి ఎందుకు ఆ రాజమాతపై ఇందిర అంతగా పగ బట్టింది..?
ప్రధాని ఇందిరాగాంధీ వర్సెస్ రాజమాత గాయత్రీ దేవి.. చరిత్రలో ఓ ఇంట్రెస్టింగ్ పేజీ ఇది.
జైపూర్ మూడో మహారాణి అయిన గాయత్రీ దేవిని 1975 జూలైలో ఢిల్లీలోని తీహార్ జైలుకు పంపింది ఇందిరాగాంధీ. ఆమె ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ పీరియడ్ లో గాయత్రీదేవి ఏకంగా 6 నెలల పాటు తీహార్ జైలులో గడిపారు.

తీహార్ జైలు ఓ చేపల మార్కెట్ లాంటింది. చిన్నా చితక దొంగల నుంచి వేశ్యల వరకూ ఎందరో అరెస్టైనవారంతా ఆ జైల్లో కనిపించేవారంటూ ఓసారి గాయత్రీదేవి తన జైలు అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు.
మరి గాయత్రీదేవి ఎందుకు జైలుకు వెళ్లాల్సివచ్చింది..?
ఎమర్జెన్సీని అణిచివేతకు ఆయుధంగా ఇందిర వాడుకుందనే వాదన ఉండనే ఉంది. ఆ క్రమంలో అనేకమందిని ఇందిర జైలులో పెట్టించింది. అందులో నాయకులు, జర్నలిస్టులు, తనకు ముప్పుగా అనిపించిన ఇతరులెందరో ఆ జాబితాలో కనిపిస్తారు. వారంతా ప్రస్తుతం రద్దైపోయిన.. నాటి మెయింటెనెన్స్ ఆఫ్ సెక్యూరిటీ యాక్ట్- మీసా కింద అరెస్ట్ అయ్యారు.
అందులో ఇందిరాగాంధీ అరెస్ట్ చేయాలనుకుని లక్ష్యంగా చేసుకున్నవారిలో కూచ్ బీహార్ రాజకుమారి, జైపూర్ మూడో మహారాణి రాజమాత గాయత్రీదేవీ ఒకరు. ఎమర్జెన్సీ విధించిన కొద్ది రోజులకే ఆమెను 1975లో తీహార్ జైలుకు తరలించారు.
అసలు గాయత్రీదేవి ఎవరు..?
1919లో రాజవంశంలో జన్మించింది గాయత్రీదేవి. కూచ్ బీహార్ రాజ్యాధిపతులైన మహారాజా జితేంద్ర నారాయణ్, ఇంద్రాదేవీల కుమార్తె. వైభవోపేతంగా పెరిగిన జీవితం గాయత్రీదేవిది.
తన 12వ ఏటనే జైపూర్ పాలకుడు మహారాజ్ రెండో సవాయి జై మాన్ సింగ్ ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆయన మూడో భార్యగా జైపూర్ మహారాణిగా గాయత్రీదేవికి కిరీటం దక్కింది.

మాన్ సింగ్ మొదటి, రెండో భార్యలు అంగీకరించిన పర్దా వ్యవస్థను గాయత్రీదేవి తీవ్రంగా వ్యతిరేకించారు. వోగ్ మ్యాగజీన్ ప్రపంచంలోనే పది మంది అత్యంత అందగత్తెల జాబితాలో చోటు దక్కించుకుంది గాయత్రీదేవి. అయితే, ఆమె తన అందంతో మాత్రమే పాప్యురల్ కాలేదు. రాజకీయ నాయకురాలిగా కూడా ఆమె తన సత్తాను చాటారు.
1962లో జైపూర్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన గాయత్రీదేవి.. 2 లక్షల 46 వేల 516 ఓట్లలో 1 లక్షా 92 వేల 909 ఓట్లు.. అంటే 78 శాతం ఓట్లు సంపాదించి.. ఘన విజయం సాధించారు. అప్పట్లో అదే ప్రపంచ రికార్డ్ మెజార్టీ. సి. రాజగోపాలాచారి స్థాపించిన స్వతంత్ర పార్టీ తరపున గాయత్రీదేవి పోటీ చేయగా.. ఆ పార్టీ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధాన ప్రత్యర్థిగా నిల్చింది.
ఇందిర, గాయత్రీదేవికి శత్రువుగా ఎందుకు మారింది..?
గాయత్రీదేవి, ఇందిరాగాంధీ ఇద్దరూ చిన్ననాటి నుంచీ పరిచయస్థులే. ఇద్దరూ పశ్చిమబెంగాల్ లోని శాంతినికేతన్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పాఠా భవన్ పాఠశాలలో చదువుకున్నవారే.
అయితే ఖుష్వంత్ సింగ్ రాసిన దాన్నిబట్టి.. తనకంటే అందమైన మరో మహిళను ఇందిర భరించలేకపోయేవారట. పార్లమెంట్ లో గాయత్రీదేవిని అందుకే ఇందిర బిచ్ అని గాజుబొమ్మ అని అవమానించినట్టుగా కూడా ఆయన పేర్కొన్నారు. గాయత్రీదేవి వల్ల ఇందిరాగాంధీలో ఉన్న చిన్నచూపు ధోరణి, ప్రతీకార స్వభావం వంటివన్నీ బయటపడ్డాయనీ ఆయన తన వ్యాసాల్లో రాసుకొచ్చారు.
ఇందిర, గాయత్రి మధ్య బంధాన్ని ఇండిపెండెంట్ పత్రిక ఏమని పేర్కొంది..?
పార్లమెంట్ లో గాయత్రీదేవి ఉనికే ఇందిరాగాంధీకి తీవ్ర అసహనం కల్గించేదట. పాఠా భవనంలో ఇద్దరూ కలిసి చదువుకున్నప్పటికీ.. రాజవంశస్థురాలు కావడం వల్ల కూడా గాయత్రీ అంటే ఇందిరకు పడకపోయేది. రాచరిక పాలనపై నెహ్రూకెంత వ్యతిరేకతో.. ఇందిర అంతకుమించి వ్యతిరేకించేదట. అలా పాఠా భవన్ పాఠశాల వయస్సు నుంచే గాయత్రీదేవి అందం, సంపద బహిరంగంగా ప్రదర్శితం కావడంతో ఇందిరలో సహజంగానే ఒక అసూయతో కూడాన ద్వేషం గాయత్రి అంటే ఏర్పడినట్టు చెబుతారు. దానికి తోడు 1962 లోక్ సభ ఎన్నికల్లో గాయత్రీదేవికి వచ్చిన మెజార్టీ.. ఆమె సాధించిన విజయం ఇందిరకు మరింత కన్ను కుట్టేలా చేశాయి. గాయత్రీదేవి భవిష్యత్తులో ఒక శక్తివంతమైన రాజకీయ నేతగా ఎదుగుతుందన్న భావన ఇందిరలో బలపడుతూ వచ్చింది.
అందుకే, 1965లో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి.. గాయత్రీదేవిని కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆహ్వానించారు. కానీ, కాంగ్రెస్ వ్యతిరేక వేదిక నుంచి గెల్చిన గాయత్రీ అందుకు తిరస్కరించారు. ఆ తర్వాత స్వతంత్ర పార్టీ, జనసంఘ్ తో కలిసి 1967లో లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. మల్పురా అసెంబ్లీ నియోజకవర్గంలో దామోదర్ లాల్ వ్యాస్ చేతిలో ఓటమిపాలైంది గాయత్రీదేవి.
రాజవంశాలపై ఇందిరకెందుకంత అసహనం..?
ఇందిరాగాంధీకి రాజవంశాలంటే గిట్టదు. అందుకే అసహనం. ఆమె నాయకత్వంలోని విధానాల్లో రాచరికంపై స్పష్టమైన వ్యతిరేకత కనిపించేది. 1971లో భారత రాజ్యాంగంలోని 26వ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాజవంశాలకు చెల్లించే మొత్తాన్ని రద్దు చేశారు ఇందిరాగాంధీ.
1947లో భారతదేశంలో విలీనం అవ్వడానికి.. 1949లో పాలనాధికారాలను వదులుకోవడానికి ప్రతిఫలంగా అప్పటి రాజవంశాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే ఆ మొత్తాన్ని ప్రివీ పర్సెస్ అని పిల్చేవారు. ఇందిర నిర్ణయం వల్ల పూర్వ రాజవంశాల ఆర్థిక స్థితికి పెద్ద దెబ్బే తగిలింది.
1975 జూన్ 25న అలహాబాద్ హైకోర్ట్ తీర్పును సుప్రీం కోర్ట్ సమర్థిస్తూ ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని ప్రకటించిన మరుసటి రోజే.. ఇందిర ఒత్తిడితో నాటి రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.
ఆ అత్యవరస పరిస్థితిని ప్రకటించిన వెంటనే ఇందిరకు ప్రత్యర్థులైన ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, ఇతర శత్రువులందరి అరెస్టులు ఒక్కొక్కటిగా మొదలయ్యాయి. ఆ సమయంలో వైద్య చికిత్స కోసం గాయత్రీదేవి ముంబై వెళ్లింది. ఆమె చికిత్సనంతరం ఎప్పుడైనా అరెస్ట్ కావొచ్చనే సమాచారమూ అందింది. దాంతో ఆమె వెంటనే ఢిల్లీకి పయనమై.. లోక్ సభకు వెళ్లారు. అక్కడ ప్రతిపక్ష నాయకుల బెంచీలన్నీ ఖాళీగా, సభ్యులెవ్వరూ లేకుండా కనిపించాయి.
ఆ తర్వాత జౌరంగజేబ్ రోడ్డులోని గాయత్రీదేవి నివాసంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులకు తెగబడ్డారు. గాయత్రీదేవి ఇంట్లో లభించిన బంగారం, సంపదకు లెక్కల్లేవని ఆరోపిస్తూ ఆమెను కోఫెపోసా ( విదేశీ మారకద్రవ్య సంరక్షణ మరియు అక్రమ రవాణా నిరోధక చట్టం -Conservation of Foreign Exchange and Prevention of Smuggling Act) కింద అరెస్ట్ చేశారు. అలా జైపూర్ మహారాణి, రాజమాత గాయత్రీదేవిపై ఇందిర తన అక్కసును వెళ్లగక్కి సంతృప్తి చెందారని ప్రతీతి.
గాయత్రీ జైలు జీవితమెలా గడిచింది మరి..?
గాయత్రీదేవి జైల్లోని సెల్ లో శ్రీలత స్వామినాథన్ అనే ఓ ఎన్జీవో కార్యకర్తతో కలిసుండేది. ఢిల్లీ సరిహద్దుల్లోని ఫామ్ హౌజ్ ల్లో పనిచేసే కార్మికులను సంఘటితం చేసిన కారణంగా శ్రీలతను కూడా అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఆ ఫామ్ హౌజ్ ల్లో ఒకటి రాజీవ్ గాంధీకి చెందిందని కూడా చెబుతారు.
జైల్లో ఉన్న సమయంలో రాజమాత గాయత్రి అక్కడి పిల్లలకు పాఠాలు చెప్పేవారు. వారి కోసం పలకలు, పాఠ్యపుస్తకాలు ఏర్పాటు చేయడంతో పాటు.. ఓ బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా తయారు చేయడంలో సాయమందించారట. కానీ, జైలు జీవితం గాయత్రీదేవి ఆరోగ్యంపై పెను ప్రభావం చూపింది. తీహార్ జైలుకు వెళ్లిన వారం రోజుల్లోనే ఆమెకు నోటిలో పుండ్లై మౌత్ అల్సర్ అటాకైంది. దంత వైద్యుడిని కలవడానికి కూడా జైల్ అధికారులు మూడువారాల తర్వాత అనుమతించారట.
జైల్లో ఆమె సెల్ కూడా ఓవైపు పురుషులు, మరోవైపు మహిళల మధ్య విభాగంలో ఉండటం వల్ల రెండు వైపుల నుంచి వచ్చే శబ్దాలు భరించలేకపోయేదట ఆ మహారాణి. అలాగే, మహిళా ఖైదీలు తరచూ పోట్లాడుకోవడం, వారి పిల్లలు తరచూ ఏడ్వడం, ఇంకోవైపు రాజకీయ నినాదాలు, మరోవైపు దేశభక్తి పాటలు, మాసికంగా కలత చెందినవారి పిచ్చి అరుపులు, నవ్వులు.. అదిగో అలా ఆమె సెల్ లో ఒక చిత్రవధే అనుభవించారట. జైల్లో గడిచిన సమయంలో మానసికంగా డిస్టర్బ్ కావడంతో పాటే.. ఆరోగ్యం కూడా అంతకంతకూ క్షీణించి ఆమె కిడ్నీలో స్టోన్స్ కూడా ఏర్పడ్డాయి.
చివరకు గాయత్రీదేవి ఇందిర పెట్టిన ఎన్నో షరతులకు ఒప్పుకున్నాకగానీ.. పెరోల్ పై విడుదలైంది. 1977 ఎన్నికల వరకూ కూడా ఆ షరతులేవీ బ్రేక్ చేసేందుకు వీల్లేకుండేది. తన విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు 1976లో రాగా.. ఒక చిన్నపార్టీ ఏర్పాటు చేసి మిత్రులందరినీ పిలుద్దామనుకున్నారట రాజమాత గాయత్రి. కానీ, నవీన్ పట్నాయక్ తండ్రి బిజూ పట్నాయక్ ఇంకా జైల్లోనే ఉండటంతో తన ఆలోచన విరమించుకున్నారు. ఇక జైల్లోంచి విడుదలైన తర్వాత గాయత్రీదేవి పూర్తిగా రాజకీయాలకే దూరం జరిగారు. A PRINCESS REMEMBERS: THE MEMOIRS OF THE MAHARANI OF JAIPUR పేరిట తన అనుభవాలతో ఆమె ఆత్మకథను రాయగా.. అది 1976లో ప్రచురితమైంది.
1999లో గాయత్రీదేవిని తృణమూల్ కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో నిలబడాలని ప్రతిపాదించినా ఆమె అందుకు తిరస్కరించారు. గాయత్రీదేవి 2009, జూలై 29న ప్యారాలిటిక్ ఐలియస్ అనే వ్యాధికి తోడు ఊపిరితిత్తులు ఫెయిలై కన్నుమూశారు.



