ఒక హిందుస్థానీ భారతీయ సంగీత దిగ్గజం, ప్రపంచ ఫ్యూజన్ మేస్ట్రో… మరో హిందుస్థానీ బాలీవుడ్ ప్రఖ్యాత సంగీత దర్శకుడి పాత్రలో నటించిన విషయం మీకు తెలుసా..? నటించింది జాకీర్ హుస్సేన్… పాత్రేమో ఆర్డీ బర్మన్. సినిమా సాజ్! వృత్తిపరంగా తబిలిస్ట్, సంగీతకారుడే అయినప్పటికీ.. జాకీర్ హుస్సేన్ ప్రవృత్తిగా అప్పుడప్పుడూ సినిమాల్లో నటించేవారు. అలా ఓ నాల్గైదు సినిమాల్లో మెరిసి మురిపించారు. మరి జాకీర్ హుస్సేన్ సంగీత ప్రస్థానంలో ఆ సినిమా పిచ్చేంటి..? ఏకంగా ఆయన మరో మేస్ట్రో ఆర్డీ బర్మన్ పాత్రనెందుకు ఎంచుకున్నారో ఓసారి చదివేయండి.

1983లో హిస్టారికల్ రొమాంటిక్ థ్రిల్లర్ హీట్ అండ్ డస్ట్ సినిమాతో జాకీర్ హుస్సేన్ సినీరంగ ప్రవేశం చేశాడు. బుకర్ ప్రైజ్ విజేత రుత్ ప్రవార్ రాసిన నవల ఆధారంగా జేమ్స్ ఐవరీ దర్శకత్వంలో కెమెరా ముందుకొచ్చాడు. 1920ల కాలంలో భారత్ కు చెందిన ఓ నవాబ్ తో.. బ్రిటీష్ కల్నల్ భార్య ఒలివియా కొనసాగించే వివాహేతర సంబంధానికి సంబంధించిన కథైతే… 1982లో తన అత్త ఒలివియా గురించి తెలుసుకోవడానికి ఇండియాకొచ్చిన తన మేనకోడలు కూడా అప్పటికే వివాహమైన మరో భారతీయుడితో ప్రేమలో పడే కథతో.. ఈ సినిమా సాగుతుంది. అందులో ఒలివియా మేనకోడలు అన్నేతో ప్రేమలో పడే పాత్రధారే జాకీర్ హుస్సేన్.
కట్ చేస్తే మళ్లీ 1998 వరకూ కూడా జాకీర్ హుస్సేన్ మధ్యలో ఎప్పుడూ నటించలేదు. 1998లో సాయి పరంజంపే దర్శకత్వంలో సాజ్ అనే మ్యూజికల్ డ్రామాతో మళ్లీ కెమెరా ముందుకొచ్చారు జాకీర్ హుస్సేన్. భారతీయ సినీ సంగీతంలో తిరుగులేని రాణులుగా ఎదిగిన లతా మంగేష్కర్, ఆశాభోంస్లే ఇద్దరి మధ్య సంగీత ప్రపంచంలో నెలకొన్న పోటీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
సాజ్ సినిమాలోనే జాకీర్ హుస్సేన్… సుప్రసిద్ధ బాలీవుడ్ సంగీత దర్శకుడు, ఆశాభోంస్లే రెండో భర్తైన ఆర్డీ బర్మన్ పాత్రలో నటించాడు. హిమాన్ దేశాయ్ పేరుతో కనిపించే ఆ పాత్రలోకి ఒదిగిపోయిన జాకీర్ హుస్సేన్… యశ్వంత్ డియో, భూపేన్ హజారికా, రాజ్ కమల్ వంటి సంగీత దర్శకులతో పాటు… తానూ ఓ రెండు పాటలకు కంపోజింగ్ చేశారు. క్యా తుమ్నే కెహ్ దియా అనే పాట జాకీర్ హుస్సేన్ రిథమిక్ ప్యాటర్న్ తో అలరిస్తుంది. ఫిర్ బోర్ భాయీ అంటూ దేవకీ పండిట్ గాత్రంలో జాకీర్ హుస్సేన్ రికార్డ్ చేసిన ఉద్వేగభరిత పాట కూడా సాజ్ సినిమాకు మరో ఎస్సెట్.
సాజ్ సినిమాలో పంచమ్ దా పాత్రలో ఒదిగిపోయిన జాకీర్ హుస్సేన్… షబనా అజ్మీ, అరుణా ఇరానీలతో కలిసి ఈ సినిమాలో నటించారు. బన్సీ, మాన్సీలుగా ఈ ఇద్దరూ లతామంగేష్కర్, ఆశాభోంస్లే పాత్రలు పోషించారు.
ఇక 2024లో దేవ్ పటేల్ నటించిన ది మంకీ మ్యాన్ జాకీర్ హుస్సేన్ చివరి చిత్రం. ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో జాకీర్ సాబ్ కనిపిస్తారు.
2013లో ఓసారి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో… తబలా వాద్యం కంటే కెమెరా ముందు నటించడమే కష్టం. కానీ, అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినప్పుడు నాలోనూ నటనపై కూసింత ఇష్టం పెరిగిందని చెప్పారు జాకీర్ హుస్సేన్. అదే సమయంలో ఇంకా తన నటనను మెరుగుపర్చుకోవాల్సిందీ ఎంతో ఉందన్నారు.
తనను తాను నటుడిగా ఎప్పుడూ ప్రొజెక్ట్ చేసుకోలేదు. ఆ పరిచయం కూడా నాకు అవసరం లేదు. వాస్తవానికి అది నా ఐడెంటిటీనే కాదు. కానీ, సరదాగా నాకు సమయం దొరికినప్పుడు చేస్తూ పోయాను. అందుకే, ఈ ప్రపంచానికి కూడా నేను నటుడిగా కంటే తబలా విద్వాంసుడిగానే తెలుసునంటూ ఇంటర్వ్యూలో తన నటనా విశేషాలను వెల్లడించాడు జాకీర్ హుస్సేన్.
బియాండ్ ద తబలా.. జాకీర్ హుస్సేన్ ఓ నటుడిగా కూడా సుపరిచితుడు!



