ఇంటింటా వినిపించే పాట: అందుకే, అదో మ్యూజిక్ విలేజ్!

ఏ ఆలయం నుంచి మైక్ సెట్లలోనో… లేక, ఏదైనా ఇంట్లో ఎవరైనా పాడుతుంటేనో… కాకపోతే, ఇంకేదైనా సంగీత కళాశాలలో ప్రాక్టీస్ కొనసాగుతుంటేనో.. పాటలో, సంగీతమో వినిపిస్తూ ఉండటం సహజం. కానీ, ఏ ఇంటి ముందుకెళ్లినా సంగీతమే వినిపిస్తే…? అలాంటి గీతాల పల్లె గురించి తెలుసుకోవాలంటే… కేరళ వెళ్లాలి.

పాలక్కాడ్ జిల్లా వాల్ముట్టి అనే ఓ చిన్న గ్రామం జానపదుల సంగీతానికి కేరాఫై నిలుస్తోంది. అందుకే కేరళ ప్రభుత్వం అధికారికంగా ఆ గ్రామాన్ని పట్టు గ్రామం అని గుర్తించింది. పట్టు అంటే మళయాళంలో సంగీతం. ఇంటింటిలో ఓ పాట వినిపించడంతో పాటు.. సామూహికంగా సాగే సంగీత విభావరులు, భక్తి భజనలతో వాల్ముట్టి ఎప్పుడూ ఆబాలగోపాలన్ని ఉర్రూతలూగించే శృతిలో పాటై వినిపిస్తుంది.

సాయం సంధ్యవేళైందంటే చాలు… ఓవైపు వీధి దీపాలు వెలిగేలోపే.. గ్రామంలోని చిన్న చిన్న వీధుల్లోంచి సంగీత స్వరాలు వినిపిస్తుంటాయి. పిల్లలు తమ ఇళ్ల ముందు గుంపులుగా కూర్చుని సంగీతాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు. మరికొందరు జనరంజకమైన సినిమా పాటలు ఆలపిస్తుంటారు. పురాతన విష్ణుమూర్తి ఆలయం వద్ద.. శివుణ్ని, విష్ణుమూర్తిని మేల్కొల్పే మళయాళంలో తుయిలునర్తు పాట్టుగా పిల్చుకునే భజనలు చేస్తూ వృద్ధ మహిళలు కనిపిస్తారు. పోనీ, ఇదేమన్నా సంగీతంలో ఔపోశన పట్టిన పండితులున్న గ్రామమా అంటే.. అదీ కాదు. తరతరాలుగా అలవాటైన పద్ధతి. వారికున్న జ్ఞాపకశక్తి, దైవభక్తి, వారసత్వమే ఈ గ్రామాన్ని ఇప్పుడు మ్యూజిక్ విలేజ్ గా మార్చాయి.

వాల్ముట్టికి సంగీతం ప్రదర్శనా కాదు. ఇదో అలవాటు. వారసత్వంగా సాగుతున్న జీవస్పందన. అందుకే ఈ గ్రామంలోని ఈ ప్రత్యేకతను కేరళ ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. చిత్తూర్ – తత్తమంగళ మున్సిపాలిటీ వాల్ముట్టిని రాష్ట్రంలోని తొలి పట్టు గ్రామంగా అంటే మ్యూజిక్ విలేజ్ గా ప్రకటించడంతో ఈ గ్రామం వార్తల్లోకెక్కింది.

ఈ ఊరు పాట వెనుక వేల ఏళ్ల చరిత్ర!

వాల్ముట్టికి పాట ఓ పరవశం. ఆ పరవశం వెనుక వేళ ఏళ్ల లోతైన చరిత్ర ఉంది. గ్రామంలో ప్రధానమైన పానర్లు అనే వర్గం దాదాపు 2 వేల 200 ఏళ్ల నాటి నుంచే సంగీత, సాహిత్యాల్లో నిపుణులుగా ప్రస్తావించబడ్డారు.

పానర్ ఎథ్నోగ్రఫీ రాసిన రచయిత, మానవ శాస్త్రవేత్తైన భక్తవత్సల భారతి ఏమంటారంటే.. ప్రాచీన తమిళ సమాజంలో పానర్లు అనేవారు సమాచార వాహకులుగా ఉండేవారు. సంప్రదాయాలను కాపాడేవారు. వార్తలను పంచేవారు. అలాగే, సాంస్కృతిక మూలాలను పెంచి పోషించినవారు. నాటి పురాతన తమిళ రాజ్యాల మధ్య తిరుగుతూ.. రాజసభల్లో తమ ప్రదర్శనలిచ్చేవారు. పాటల రూపంలో కథలు చెప్పేవారు. రాజులను స్తుతించేవారు. ప్రకృతి వర్ణనలు చేసేవారు. భక్తిగీతాలు పాడేవారు.

అంటే నేటిలా సోషల్ మీడియానో, మీడియానో, పత్రికలో లేని కాలాన ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండానే.. స్వరం, వాద్యాలతో సంస్కృతిని మోసుకెళ్లినవాళ్లు. నేడు వల్ముట్టిలో కనిపించేవాళ్లలో ఆ వారసత్వానికి చెందినవారే కావడంతో.. వాల్ముట్టి ఓ మ్యూజికల్ విలేజ్ గా ప్రసిద్ధిగాంచింది.

పురాతన వాద్యాలైన యాళ్, కుఝుల్ వంటివి పోయి.. గిటార్స్, డ్రమ్స్ వరకూ కాలక్రమేణా వాద్యాలు మారాయేగానీ… వాల్ముట్టి ఆత్మ మాత్రం మారలేదంటారు అక్కడివారు. నొటేషన్ పుస్తకాలతో కుస్తీలుండవు.. వాటి కోసం తరగతి గదులూ ఉండవు. ఒకరి నుంచి ఒకరికి సంక్రమించిన వారసత్వంగా పాట వాల్ముట్టి సోల్ గా మారింది.

ఇంటింటికీ వినిపించే పాట!

వాల్ముట్టి అనే చిన్న గ్రామంలో ఉన్న ఇళ్లు కేవలం 54 మాత్రమే. కానీ, ప్రతీ ఇంట్లోనూ సంగీత విద్వాంసులే. వంశపారపర్యంగా ఇంటింటిలోనూ తరతరాలుగా సంగీతకారుల వారసత్వం అలాగే కొనసాగుతోంది. పిల్లలు తమ పేరు రాయడం నేర్చుకునేకంటే ముందే.. ఈ ఊళ్లో పాట వింటారు. అమ్మ అని పలికేకంటే ముందే పాట పాడేస్తారు.

ఇక పండుగలు, వేడుకల సమయంలోనైతే రాత్రిళ్లూ ఇక్కడ జరిగే కచేరీలు ఊరిని సంగీత సాగరంగా మారుస్తాయి. విష్ణు మూకన్ సాథన్ ఆలయం వద్ద ఊరంతా కూడి పాడే నర్తిస్తూ, సంప్రదాయ వాద్యాలు వాయిస్తూ, పాటలు, భజనల్లో మునిగి తేలుతున్నప్పుడు ఊరు తాదాత్మ్యం చెందుతుంది.

తన జీవితాంతం సంగీతానికి ఆమె చేసిన సేవలకు 2021లో కేరళ ఫోక్లోర్ అకాడమీ రాష్ట్ర పురస్కారం లభించిన 72 ఏళ్ల తత్తమ్మ ఏమంటారంటే.. ఇక్కడంతా సంగీతకారులే. మా పూర్వీకులు ఆలయ ఉత్సవాల్లో పాటలు, భజనలు పాడుతూ జీవనం సాగించారు. వారిని చూస్తూ మేము అదే దారిలో నడుస్తున్నాం. వారు నిర్మించిన వారసత్వాన్ని మేం కొనసాగిస్తున్నాం. నేర్చుకుంటూ జీవిస్తాం. జీవిస్తూ నేర్చుకుంటాం. సంగీతం ఈ ఊళ్లో మా ఫ్యామిలీ మెంబర్ అంటోంది.

అలాగే, 75 ఏళ్ల దేవియనాయికి తుయులునర్తు పాట్టుకు (భజనలకు) రాష్ట్ర పురస్కారం లభించింది. తను సంగీతాన్ని పాఠాల ద్వారా కాదు.. కేవలం వినికిడి ద్వారా నేర్చుకుంది. చిన్నప్పుడు తన మామలు ప్రాక్టీస్ చేస్తుంటే ఓ గదిలో కూర్చుని తానూ సాధన చేసిన గత జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలంగా ఉంచుకుంది. పదేళ్లకే పాటందుకుంది. గత అరవై ఏళ్లుగా ఆ పాటే తన ప్రాణమైంది.

సమాజం వీరి కళకు విలువనివ్వని రోజుల్లో కూడా వీరెవ్వరూ బాధపడలేదు. దాన్ని కాపాడుకుంటూ వచ్చిన ప్రతినిధులుగా పాటకు సేవ చేశారు.

సంగీతంలో గ్రాడ్యుయేషన్ చేసిన యువ సంగీతకారిణి మేఘ.. సంగీతంతోనే పెరిగాను. సంగీత ఉపాధ్యాయురాలిగా మారి తమ ఊరి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను అంటోంది. ఈమె చెల్లి సజీనా చిత్తూర్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో సంగీతంలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం వాల్ముట్టిలో పిల్లలకు సంగీత శిక్షణనిస్తోంది. పాటల పూదోటలో పెరగడం వల్లే తన ఆసక్తి సంగీతం వైపు మళ్లిందంటారామె.

ఇన్నేళ్లకు దక్కిన గుర్తింపు!

ఇంతకాలం ఎవ్వరూ పట్టించుకోని వాల్ముట్టిని ఇప్పుడు కేరళ ప్రభుత్వం అధికారికంగా సంగీత గ్రామంగా గుర్తించడంతో ఆ ఊళ్లో ఉత్సాహం మరింత ఉరకలెత్తుతోంది.

వాల్ముట్టిలో రాష్ట్ర స్థాయి పురస్కార గ్రహీతలు, శిక్షణ పొందిన గాయకులు, జానపద కళాకారులు, సినిమా పాటలు పాడే గాయకులు ఇలా వివిధ రంగాల్లో సంగీతంలో తమ ప్రతిభను చాటుకుంటున్నవారున్నారు. ఇంకా ఎదిగేందుకు వీరి సామాజిక, ఆర్థిక అడ్డంకులతో పాటు.. సరైన గుర్తింపు లేకపోవడం మైనస్ గా మారింది. అలాంటి పరిస్థితి నుంచి వాల్ముట్టిని తామంతా గర్వపడే గ్రామంగా నిలబెట్టడమే పట్టు గ్రామంగా ప్రకటించడానికి కారణమంటారు తత్తమంగళం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శివకుమార్.

తత్తమంగళ మున్సిపాలిటీ, కేరళ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ గుర్తింపు.. సాంస్కృతిక పరిరక్షణ, అనువంశిక వారసత్వాన్ని కొనసాగించడం, ఎవ్వరి మద్దతు లేకుండానే కళలను నిలబెట్టే సమాజాలకు బాసటగా నిలవడమనే అంశాలపై విస్తృతమైన చర్చకు తెరలేపింది.

వల్ముట్టి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే దారిలో యువతరం!

పగలంతా బ్యాంకులు, స్కూల్స్, పరిశ్రమల్లో పనిచేస్తూ.. సాయంత్రానికి పిల్లలకు సంగీతం నేర్పుతున్నారు ఇప్పటికే సంగీతాన్ని అభ్యసించినవారు. కానీ, వాద్యాలు, శిక్షణ ఇచ్చేందుకు కావల్సిన తరగతి గదులు, ఆర్థిక మద్దతు, ఇతర మౌలిక సదుపాయాల లోటు మాత్రం అదే స్థాయిలో ఉంది. ఇప్పుడు వాల్ముట్టికి ప్రభుత్వం నుంచి లభించిన గుర్తింపుతోనైనా ఆ సాయమందుతుందేమోనన్న ఆశా వాల్ముట్టిలో కనిపిస్తోంది.

ఇక్కడ సంగీతాన్ని పెంచి పోషిద్దామనుకుని రంగంలోకి దిగి గట్టిగా నేర్చుకుంటున్నవారికి కూడా… ప్రదర్శన అవకాశాల్లేక కుటుంబాలను పోషించే ఆదాయం రాక ఆలోచించాల్సిన దైన్య స్థితీ కనిపిస్తోంది. దేశంలోనే ఏ గ్రామానికి రానటువంటి, లేనటువంటి.. మ్యూజిక్ విలేజ్ అనే గుర్తింపును పట్టు గ్రామం సాధించడం గర్వకారణమే. అయితే, నిధులు, వర్క్ షాప్స్, సాంస్కృతిక ప్రదర్శనల ఏర్పాటు, పిల్లలకు స్కాలర్షిప్స్ తో ప్రోత్సాహం వంటి వనరులనూ అందిస్తే వాల్ముట్టి ప్రపంచంలోనే ఒక ప్రత్యేక సంగీత గ్రామంగా ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించడం మాత్రం ఖాయం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles