తన సంగీతమంత తీయగా ఉండే జాంబాగ్ పళ్ల రుచంటే ఆయనకెంతో ప్రీతి!

హైదరాబాద్ తో సంగీత దిగ్గజం పండిట్ జస్రాజ్ ప్రయాణం!

శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి… ఈ నానుడిని నిజం చేశాడు. తన సంగీతంతో శిశు, పశు, పాములను తన్మయత్వంలో ముంచెత్తాడు. అలాంటి పద్మవిభూషణుడైన మహానుభావుడు పండిట్ జస్రాజ్ బాల్యానికి కేరాఫ్ మన భాగ్యనగరం. ఆ భాగ్యాన్ని భాగ్యనగరంతో పంచుకున్న ఆ బడి డ్రాపవుటే.. బడా సంగీతకారుడయ్యాడు. తన జర్నీలో హైదరాబాద్ తో ఆయనకున్న అనుబంధమేంటో ఓసారి ఆయన మాటల్లోనే చెప్పుకుందాం.

మా తండ్రి మోతీరామ్ ప్రముఖ సంగీతకారుడు. నేను నాల్గో ఏటనే తండ్రిని కోల్పోయాను. అది నాకు తీరని క్షోభ మిగిల్చింది.

ఇంకా నాకు గుర్తుంది. మధ్యాహ్నం భోజనం కాగానే.. జస్రాజ్ ఆజావో అని తాను పడుకుని.. తన బొత్తపై నన్ను కూర్చోబెట్టుకుని సంగీతం పాడేవారు. అప్పుడప్పుడే ముద్దుముద్దు మాటలు పలికే నాతో ఆ కీర్తనలు పాడించే ప్రయత్నం చేసేవారు. అలా సరదాగా సాయంకాలం నాల్గున్నర, ఐదింటివరకూ నాన్నతో గడిచిన మసక మసక తీపి జ్ఞాపకాలు నా జీవితమంతా నెమరు వేసుకుంటూనే గడిపాను.

ఉస్మాన్ అలీఖాన్ మందిరంలో ఆస్థాన విద్వాంసుడిగా మా నాన్నను రాయల్ మ్యుజీషియన్ గా ప్రకటించే సమయం ఆరోజు. కానీ, ఐదారు గంటల ముందే.. మానాన్న గొంతు మూగబోయింది. నాన్న లేరన్న వార్త మమ్మల్ని కలిచివేసింది. నిజంగా ఆయన అదే ఆస్థానంలో స్టేట్ మ్యుజీషియన్ గా కొనసాగి ఉంటే గనుక.. మా కుటుంబం మరో స్థాయిలో ఉండేది. కానీ, మా నాన్న పోతూపోతూ మాకు మిగిల్చిన పేదరికం.. ఆ తర్వాత మా కుటుంబంలో అలజడి రేపింది. ఇవాళ్టి పండిట్ జస్రాజ్ ఎదుగదల వెనుక.. నాణానికి రెండోవైపు చేదు జ్ఞాపకాలూ అప్పుడప్పుడూ నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. ఇవన్నీ తన స్నేహితులతో సందర్భం చిక్కినప్పుడల్లా పండిట్ జస్రాజే స్వయానా చెప్పేవారట.

1972 నుంచీ కూడా జస్రాజ్ తండ్రి పండిట్ మోతీరామ్, ఆయన సోదరుడు పండిట్ మణిరామ్ పేరిట హైదరాబాద్ వేదికగా సంగీత్ సమారోహ్ కార్యక్రమం జరుగుతోంది. జస్రాజ్ కుటుంబ సభ్యులు కూడా ఆ కార్యక్రమాలకు అప్పుడప్పుడూ హాజరయ్యేవారు. గోల్నాకలో ఉన్న తండ్రి సమాధి వద్ద ఉదయమే నివాళులర్పించేవారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందుస్థానీ వోకల్ ఆర్టిస్ట్ జస్రాజ్.. తన తండ్రి, సోదరులతో.. అంతకుమించి, హైదరాబాద్ తో తనకున్న ఎన్నో అనుబంధాలను నెమరు వేసుకోవడంలో ఒక థ్రిల్ ఫీల్ అయ్యేవారట. ఇప్పటికీ పండిట్ జస్రాజ్ కల్చరల్ ఫౌండేషనే ఆ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

తండ్రి మరణం తర్వాత జస్రాజ్ బాబాయ్ పండిట్ జ్యోతిరామ్.. హర్యానాలోని హిసార్ జిల్లాలో సొంత గ్రామమైన మండోరికి వెళ్లిపోదామని పట్టుబట్టారు. కానీ, జస్రాజ్ అమ్మ మాత్రం వద్దని వారించింది. మోతీరామ్ మరణం తర్వాత.. జస్రాజ్ పెద్దన్నే ఆ కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు. మా అమ్మ కూడా మా నాన్నంత ఘనత సాధిస్తాడన్న నమ్మకాన్ని మా అన్నపై పెట్టుకుంది. ఆ తర్వాత ఆయనే మొత్తం కుటుంబ పోషణ చూసుకున్నారు. అలా జాంబాగ్ పళ్ల తీపిని.. ఇక్కడి మార్కెట్ కొచ్చే పూల గుబాళింపునూ ఆస్వాదిస్తూ.. వివేకవర్ధినీ స్కూల్ లో అన్న పోషణలో చదువుకున్నాడు జస్రాజ్.

చదువుపై మాత్రం జస్రాజ్ కు ఆసక్తి ఉండేది కాదు. పేరుకే స్కూల్.. పోతేకదా..? రోజూ బడి డుమ్మాలే. బడికని బయల్దేరిన జస్రాజ్ ను మార్గమధ్యంలో ఉన్న యాకుబియా అనే ఓ చిన్న రెస్టారెంట్ అయస్కాంతంలా ఆకర్షించేది. వేరే ఏ పాటలూ లేనట్టూ.. దిగ్గజ గజల్ సంగీతకారిణైన బేగం అక్తర్ పాడిన దివానా బనాహైతో దివానా బనాదే అనే పాటతో బడి వయస్సులోనే ప్రేమలో పడిపోయాడు సంగీత నేపథ్యమున్న జస్రాజ్. జలపాతంలా జారుతూ స్నూతింగ్ గా వినిపించే బేగం అక్తర్ గజల్ జస్రాజ్ ను చేసిన మాయ అది.

బడికని చెప్పి యాకూబియా రెస్టారెంట్ కు వెళ్లడం.. బేగం అక్తర్ గజల్ కు మెస్మరైజవుతూ పొద్దస్తమానం ఆ పాటే వింటూ గడపడం.. నా దినచర్యగా మారింది. పిల్లవాణ్ననేమోగానీ.. ఆ రెస్టారెంట్ వాళ్లు కూడా అవసరమైతే మంచినీళ్లివ్వడం… ఆకలవుతుందా బాబూ అంటూ పాటల పట్ల నా అనురక్తిని గమనించి తినడానికి ఏదైనా ఇవ్వడమూ చేసేవారు. కానీ, కొంతకాలం చూశాక ఈ పిల్లోడు బడికి వెళ్లడంలేదు.. రోజూ మా రెస్టారెంట్ కు వచ్చి పాటలు వింటున్నాడు.. మీరేమో ఇతను బడికి వెళ్తున్నారనుకుంటున్నారని అమ్మకు మొత్తం విషయం చెప్పేశారు. ఇలాగైతే ఇక నా చదువు అటకెక్కినట్టేనని గ్రహించిన మా రెండో అన్న.. నా ఆసక్తిని గమనించి అప్పుడే తబలా నేర్పించాడు.

అలా ఏడాదిలోనే తబలాలో మంచి నడక సాధించిన నేను.. ఏడేళ్లకే సోదరులతో కలిసి కాన్సర్ట్స్ కు వెళ్తూ సంగీత ప్రయాణాన్ని ప్రారంభించాను. భాగ్యనగరంలోని మీర్ ఉస్మాన్ అలీఖాన్ వద్ద ప్రస్తుత బాలీవుడ్ సంగీత ద్వయమైన జతిన్-లలిత్ తండ్రికి సోదరుడు ప్రతాప్ నారాయణ్.. స్టేట్ మ్యుజీషియన్ గా అపాయింట్ అయ్యాడు. ఆయనకు తోడుగా నేనూ వెళ్లేవాడిని. మా అన్నలైన పండిట్ మణిరామ్, ప్రతాప్ నారాయణ్ దగ్గర తబలాలో కొద్దికొద్దిగా పట్టు సాధించడం మొదలెట్టాను.

ఆరోజుల్లో హైదరాబాదీలకు తబలా వాద్యమంటే మక్కువ. ఇప్పటికీ ఆ క్రేజ్ కనిపిస్తూనే ఉంది. పెద్దపెద్ద నవాబుల్లో కొందరు వినడానికి ఆసక్తి కనబరిస్తే.. మరికొందరు స్వయానా తబలా వాయిస్తూ తన్మయత్వంలో మునిగిపోయేవారు. సాలార్జంగ్ కు ఇష్టమైన దివాన్ దేవ్డీలో మూడు, నాల్గుసార్లు నాకు తబలా వాయించే అవకాశం వచ్చింది. ఒక్కో గది రంగురంగుల దీపకాంతుల్లో మెరిసిపోతుంటే.. అంతకుమించిన ధవళ వస్త్రాల్లో సాలార్జంగ్ మెరిసిపోయేవారు. ఒక్కో గదిలో కాస్సేపు తబలా వాద్య కచేరీ జరిగేది. అలా ఎన్ని గదుల్లో వాయిస్తే అన్ని గదుల్లో.. ఒక్కో గదికి.. ఒక్కో గంట చొప్పున లెక్క కట్టి డబ్బులిచ్చేవారు. ఎంతైనా వాళ్లు నవాబులు కదా..?!

1946, స్వాతంత్ర్య పోరాటం తీవ్రమైన సంవత్సరమది. అప్పటి నవాబులతో సహా.. చాలామంది తెలిసినవారు తమను హైదరాబాద్ వదలి వెళ్లిపోమ్మని ఒత్తిడి తీసుకొచ్చారు. ఏదైనా జరగరానిది జరిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తామెవ్వరం కూడా మీకు ఉపయోగపడకపోవచ్చు అందుకే వెళ్లిపోండంటూ నిక్కచ్చిగా చెప్పేశారు. అలాంటి పరిస్థితులను మేం 1944 నుంచీ చూస్తూ వస్తున్నాం. ఇక 1946లో మాత్రం పూర్తిగా హైదరాబాద్ ను విడిచిపెట్టాల్సి వచ్చింది.

అలా సంక్లిష్టతలెదురైనప్పుడు గుజరాత్ సనందలోని మహారాజ్ జయవంత్ నాకు గురువయ్యారు. ఓ గైడ్ అయ్యారు. నా తండ్రి తర్వాత తండ్రైన నా బాబాయ్ పండిట్ మణిరామ్ కూడా నాకు గురువయ్యాడు. అదే సమయంలో ఆయనతో జగడాలూ ఉండేవి. ఒక కీర్తనను నైపుణ్యంతో ఆలపించడమంటే అదంత సులభం కాదు. ఆయన నాకు అలా నేర్పడంలేదేమోనని అనుమానించేవాణ్ని. కానీ, మా బాబాయ్ పట్ల ఆ శంఖని మహారాజ్ జయవంతే తీర్చారు.

దసరా నవరాత్రుల్లో ఒకసారి నవమి పూజ జరిగే సమయంలో ఆయన దేవీ పూజా మందిరంలోకి వెళ్లుతూ.. నేను పూజ చేస్తున్నంతసేపూ నీవిక్కడ జాన్ పురి రాగమాలపిస్తూ ఉండూ అంటూ లోనికి వెళ్లిపోయారు. అలా నేను పాడుతూనే ఉన్నాను. ఆయన పూజ చేస్తూనే ఉన్నారు. బయటకొచ్చిన ఆయన నాకొక కోవాపేడా తీసుకొచ్చి ఇచ్చారు. నీ ఆలాపన ఈ పేడా అంత తీయగా ఉంది. దీనికి కారణం మీ సోదరుడు మణిరామే. కాబట్టి మణిరామ్ తో గొడవ పెట్టుకోవడం సరికాదంటూ నాకు జ్ఞానబోధ చేసిన గురుతుల్యుడు మహారాజ్ జయవంత్. ఈ ముచ్చట్లన్నీ హైదరాబాద్ లోని తన చిన్ననాటి దోస్తులకు చెప్పేవారట జస్రాజ్.

తన ఆధ్యాత్మిక గురువైన మహారాజ్ జయవంత్ మరణానంతరం.. జస్రాజ్ తన కుటుంబీకులతో కలిసి కలకత్తా పయనమయ్యారు. అక్కడే ఆల్ ఇండియా రేడియోలో ప్రొఫెషనల్ హిందుస్థానీ ఓకల్ సింగర్ గా తన జీవితంలో మరో అంకాన్ని ప్రారంభించాడు. మరో 13 ఏళ్ల తర్వాత ముంబైకి పయనమయ్యారు. తన మొదటి సంగీత కచేరీని 1952లో నేపాల్ రాజైన త్రిభువన వీర విక్రమ్ సభతో ప్రారంభించిన పండిట్ జస్రాజ్.. ఆ తర్వాద పద్మశ్రీగా.. పద్మభూషణుడిగా.. పద్మవిభూషణుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా సాగిన ఆయన సంగీత ప్రయాణం.. రెస్ట్ ఆఫ్ లైఫ్ ఇక అందరికీ తెలిసిందే.

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనన్నట్టుగా.. బాల్యస్మృతుల విషయంలో ఎవరికైనా అవి ఒకటే! అందుకే, హైదరాబాదంటే సంగీత రారాజైన స్వర్గీయ జస్రాజ్ కు విడదీయలేని ఆత్మీయ బంధం, మురిపెం, మమకారం. హైదరాబాదీల తరపున ఆ స్వరమాంత్రికుడిని ఓసారి తల్చుకుంటూ.. జస్రాజ్ యాదిలో!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles