త్రిముఖ పోటీలో తేలేదెవ్వరు..? తేల్చేదెవ్వరు..??

Vamsy Krishna… ✍🏻

—————————————

దళపతి తేల్చేదెవరిని?ముంచేదెవరిని ?

తమిళనాడు రాజకీయ యవనికపై 2026 అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకమైన మలుపుగా మారాయి. ఏప్రిల్ 23వ తేదీన జరగనున్న పోలింగ్ కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అధికార పక్షమైన ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నాయకత్వంలో తన ‘ద్రవిడ మోడల్’ పాలనను, మహిళా సంక్షేమ పథకాలను నమ్ముకుని బరిలోకి దిగుతోంది. ఐదేళ్ల పాలన తర్వాత సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడం డీఎంకేకు పెద్ద సవాలుగా మారింది.

మరోవైపు గతంలో విడిపోయిన ఏఐఏడీఎంకే, భాజాపా ఈసారి తిరిగి కూటమిగా ఏర్పడి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా గట్టి పోటీనిస్తున్నాయి. ఈ కూటమి మహిళలకు నెలకు రెండు వేల రూపాయలు ,ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి భారీ హామీలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

ఈ ఎన్నికల రణక్షేత్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK). విజయ్ తన రాజకీయ అరంగేట్రాన్ని అత్యంత వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తూ, స్వయంగా పెరంబూర్ ,తిరుచిరాపల్లి ఈస్ట్ వంటి కీలక నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు.

చెన్నై, కోయంబత్తూర్, మదురై వంటి నగరాల్లో విజయ్ కి యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. మొదటిసారి ఓటు వేసే యువ ఓటర్లు (First-time voters) ఆయన వైపు మొగ్గు చూపుతున్నారు.విక్రవాండిలో జరిగిన పార్టీ మొదటి భారీ బహిరంగ సభకు దాదాపు 8 లక్షల మంది జనం హాజరయ్యారు. ఉత్తర తమిళనాడులోని విల్లుపురం, కడలూరు, చెంగల్పట్టు జిల్లాల్లో TVK కి మంచి ఆదరణ లభిస్తోంది. విజయ్ తన ప్రసంగాలలో పెరియార్, అంబేద్కర్ కామరాజ్ వంటి నాయకుల గురించి ప్రస్తావించడం ద్వారా ఆ వర్గాల ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

విజయ్ తన పార్టీలో ఇతర ముఖ్య నేతలను కూడా కీలక స్థానాల్లో నిలబెట్టారు.టీ నగర్ స్థానం నుండి పార్టీ ప్రధాన కార్యదర్శి ‘బుస్సీ’ ఆనంద్ .విల్లివాక్కం (Villivakkam) నుంచి మాజీ ఎంపీ ఆదవ్ అర్జున పోటీ చేస్తున్నారు., విజయ్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలలో మొదటిది పెరంబూర్ (Perambur): ఇది చెన్నైలోని కీలకమైన నియోజకవర్గాలలో ఒకటి.ఇక్కడ పట్టణ ఓటర్లు, యువత కార్మిక వర్గం ఎక్కువగా ఉంటారు. చెన్నైలో తనకున్న బలమైన ఫ్యాన్ బేస్‌ను ఓట్లుగా మార్చుకోవడానికి ఈ స్థానాన్ని ఎంచుకున్నారు. రెండవది తమిళనాడు నడిబొడ్డున ఉన్న తిరుచిరాపల్లి ఈస్ట్ (Trichy East) ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయడం ద్వారా, తాను కేవలం చెన్నైకే పరిమితం కాదని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపుతాననే సంకేతాన్ని విజయ్ పంపారు.

విజయ్ అంతర్గత సంభాషణలలో తమ పార్టీ 30% ఓట్లు సాధిస్తుంది అని చెపుతున్నా, TVK పార్టీ కనీసం పది నుంచి పద్నాలుగు శాతం ఓట్ల షేర్ సాధిస్తుందని విశ్లేషకుల అంచనాలు ఉండటంతో, అది ఎవరి గెలుపోటములను ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయ్ కి ఉన్న అతిపెద్ద బలం ఆయన “విజయ్ మక్కల్ ఇయక్కం” (VMI) అనే సేవా సంస్థ. ఇది దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవ చేస్తూ నెట్‌వర్క్‌ను నిర్మించుకుంది. అయితే, ఈ పట్టు ఓట్లుగా మారుతుందా లేదా అనేది ఏప్రిల్ 23న జరిగే పోలింగ్‌లో తేలనుంది.

రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన మదురైలో పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా ఉంది. మదురై సెంట్రల్ నియోజకవర్గంలో డీఎంకే మంత్రి పళనివేల్ త్యాగరాజన్ (PTR) విద్యావంతుడనే ఇమేజ్‌తో బరిలో ఉండగా, ఆయనకు పోటీగా ఏఐఏడీఎంకే ప్రముఖ నటుడు-దర్శకుడు సుందర్ సి ని రంగంలోకి దింపడం అక్కడ పోటీని గ్లామర్ వర్సెస్ అడ్మినిస్ట్రేషన్‌గా మార్చేసింది.

మదురైలో ముక్కుల తోర్ (Mukkulathor) సామాజిక వర్గం ఓట్లు అత్యంత కీలకం. గతంలో వీరు ఏఐఏడీఎంకేకు అండగా ఉండేవారు, కానీ ఇప్పుడు ఓపీఎస్ (OPS) దూరం కావడం, శశికళ వర్గం విడిగా పోటీ చేయడం వంటి కారణాలతో ఈ ఓట్లు ఎటు వెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది.మదురై సౌత్ లో ప్రస్తుత ఎమ్మెల్యే భూమినాథన్ (DMK) పై కొంత వ్యతిరేకత ఉందని, ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి దీనిని అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందని స్థానిక పత్రికలు రాస్తున్నాయి.మదురైలో ఏకపక్ష తీర్పు వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. DMK తన అభివృద్ధి పనులపై నమ్మకంతో ఉండగా, AIADMK-BJP కూటమి బలమైన అభ్యర్థులతో సవాల్ విసురుతోంది. వీటి మధ్య విజయ్ (TVK) ఎంతవరకు ఓట్లను తన వైపు తిప్పుకుంటారనే దానిపైనే విజేత ఎవరనేది ఆధారపడి ఉంటుంది. పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది.

దక్షిణ భారత మాంచెస్టర్ గా పిలిచే కోయంబత్తూర్ (కొంగు నాడు) ప్రాంతం ఎప్పుడూ తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన తీర్పులను ఇస్తుంది. కోయంబత్తూర్ సాంప్రదాయకంగా ఏఐఏడీఎంకే బీజేపీలకు బలమైన పట్టున్న ప్రాంతం. ఈసారి వీరిద్దరూ కలిసి పోటీ చేస్తుండటం వారికి పెద్ద ప్లస్ పాయింట్.బీజేపీ తన సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా వానతి శ్రీనివాసన్ ఈసారి కోయంబత్తూర్ నార్త్ నుండి పోటీ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వలన బీజేపీ క్యాడర్‌లో కొంత నిరుత్సాహం ఉన్నప్పటికీ, ఆయన రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు

గత ఎన్నికల్లో కోయంబత్తూర్ జిల్లాలో డీఎంకే ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈసారి ఆ లోటును భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా ప్రత్యేక దృష్టి పెట్టారు.డీఎంకే కీలక నేత వి. సెంథిల్ బాలాజీ కోయంబత్తూర్ సౌత్ నుండి పోటీలో ఉన్నారు. జిల్లాలో పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు
.”స్టాలిన్ కొనసాగాలి – తమిళనాడు గెలవాలి” అనే నినాదంతో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

దళపతి విజయ్ నేతృత్వంలోని TVK కి కోయంబత్తూర్‌లో ఊహించని స్పందన లభిస్తోంది.ఇటీవల కోయంబత్తూర్‌లో విజయ్ నిర్వహించిన భారీ రోడ్ షోకు లక్షలాది మంది యువత తరలివచ్చారు. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయిందంటే ఆయన క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.యువ ఓటర్లు మార్పు కోరుకునే వారు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ, డీఎంకే ఓట్లను చీల్చే అవకాశం ఉందని స్థానిక మీడియా విశ్లేషిస్తోంది . పారిశ్రామిక కేంద్రమైన కోయంబత్తూర్‌లో ఏ పార్టీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. గెలుపు మార్జిన్లు చాలా స్వల్పంగా ఉండే అవకాశం ఉంది.

తమిళనాడు రాజకీయాలకు అత్యంత కీలకమైన తిరుచిరాపల్లి (తిరుచ్చి) జిల్లాలో ఎన్నికల వాతావరణం పతాక స్థాయికి చేరింది. రాష్ట్రానికి నడిబొడ్డున ఉండే ఈ ప్రాంతంలో పట్టు సాధించడం అంటే అధికారాన్ని శాసించడమే అని నమ్మే రాజకీయ పార్టీలు ఇక్కడ భీకరమైన పోరాటానికి సిద్ధమయ్యాయి.

ముఖ్యంగా తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రం మొత్తానికే ‘హాట్ సీట్’గా మారింది, విజయ్ తిరుచ్చి ఈస్ట్ నుండి పోటీ చేస్తున్నారు. విజయ్ తన టీవీకే (TVK) పార్టీ తరపున భారీ ర్యాలీలు నిర్వహిస్తూ యువతను మార్పు కోరుకునే ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా అధికార డీఎంకే తన సిట్టింగ్ ఎమ్మెల్యే ఇనిగో ఇరుదయరాజ్‌ను మళ్ళీ బరిలోకి దింపింది. డీఎంకే ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను, మౌలిక సదుపాయాల కల్పనను ప్రధాన అస్త్రంగా వాడుతోంది. రాష్ట్ర మంత్రి కె.ఎన్. నెహ్రూ తిరుచ్చి వెస్ట్ నుండి పోటీ చేస్తూ జిల్లా మొత్తం పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు.

మరోవైపు ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి కూడా గట్టి సవాలు విసురుతోంది. ఏఐఏడీఎంకే అభ్యర్థి కె. రాజశేఖరన్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, స్థానికంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలు, తాగునీటి ఎద్దడి వంటి ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి పాత క్యాడర్ బలం తోడవడంతో, డీఎంకే వ్యతిరేక ఓట్లు తమకే పడతాయని వారు ధీమాగా ఉన్నారు. స్థానిక మీడియా విశ్లేషణల ప్రకారం, తిరుచ్చిలో ఇప్పటివరకు డీఎంకేకు ఉన్న ఏకపక్ష ఆధిపత్యాన్ని విజయ్ తన ఇమేజ్‌తో బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తోంది. విజయ్ ఓట్లను భారీగా చీల్చగలిగితే అది ఫలితాలను తలకిందులు చేయవచ్చు.

కావేరీ డెల్టా ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న తిరుచ్చిలో రైతాంగ సమస్యలు కూడా ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అటు అభివృద్ధి చాటుతున్న డీఎంకే, ఇటు మార్పు కోరుతున్న విజయ్, మరోవైపు పట్టు నిలుపుకోవాలని చూస్తున్న ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి మధ్య పోరు అత్యంత ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతానికి మెజారిటీ మీడియా సంస్థల సర్వేల ప్రకారం DMK కూటమి స్వల్ప ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, విజయ్ ఎంట్రీ వల్ల కనీసం ముప్పై నుంచి నలభై స్థానాల్లో ఫలితాలు తలకిందులయ్యే అవకాశం ఉందని విశ్లేషణలు చెప్తున్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న ద్విముఖ పోటీ కాస్తా ఇప్పుడు త్రిముఖ పోటీగా మారడం తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది

కింది ఫోటోలో మధురైలో ఒక టీ స్టాల్ ఓనర్ సెల్వం తో వ్యాసకర్త వంశీకృష్ణ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles