జాఢ్యాలపై వ్యంగాస్త్రాలు.. ఆయన సినిమాలు!

“యాక్టర్ కావాలనుకుని.. డైరెక్టరైన రాజూ హిరానీ”

హిందీ చిత్రరంగంలో రాజ్ కుమార్ హిరానీ పేరు.. వెర్సటైల్ దర్శకుల జాబితాలోనే ఉంటుంది. ఆయన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేసుకునే స్థాయిలో ఆ కథా, కల్పన ఉంటుంది కనుకే… ఇప్పుడా దర్శకుడి 63వ పుట్టినరోజున మనం మాట్లాడుకుంటున్నాం.

మున్నాభాయి ఎంబీబీఎస్ నుంచి డంకీ వరకూ ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు కేవలం ఆరే. కానీ… ఓ యాభై సినిమాలు తీసిన ఓ దర్శకుడి అనుభవం మనకు రాజ్ కుమార్ హిరానీ స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో కనిపిస్తుంది. చాలామంది తాము డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయినట్టు చెప్పేవాళ్లను ఇంటర్వ్యూల్లో చూస్తుంటాం. కానీ రాజ్ కుమార్ హిరానీది కథ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. తాను యాక్టరే కావాలనుకున్నాడు. పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సులో చేరడానికి ప్రయత్నించాడు. కానీ… ఆ కోర్సులో హిరానీకి స్థానం దొరకలేదు. అదే పూణే ఫిల్మ్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో దర్శకత్వ శాఖలో సీటు కోసం అవకాశముందని యత్నించాడు. కానీ.. అదీ ఫలించలేదు. చివరాఖరకు ఎడిటింగ్ కోర్సులో చేరి తనను తాను సంతృప్తి పర్చుకున్నాడు రాజ్ కుమార్ హిరానీ. రాజ్ కుమార్ హిరానీ యాక్టింగ్ నే కెరీర్ గా ఎంచుకోవాలనకోవడానికి కారణం… తాను చదువుతున్న రోజుల్లో నాటకాలు బాగా వేసేవాడు. దాంతో తన గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే… నటనవైపు ఆసక్తి కనబర్చాడు.

తన కోర్స్ ముగిసిన వెంటనే అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో కాపీరైటర్ గా జాయిన్ అయిన రాజ్ కుమార్ హిరానీకి తన జర్నీలో ప్రముఖ దర్శక నిర్మాతైన విధూ వినోద్ చోప్రాతో పరిచయం ఏర్పడింది. అలా 1942 ఏ లవ్ స్టోరీ సినిమాకు ట్రైలర్ రూపొందించడంతో ఆయనతో తన ప్రయాణాన్ని మొదలెట్టాడు. ఆతర్వాత విధూ వినోద్ చోప్రా దర్శకత్వంలో రూపొందిన మల్టీస్టారర్ సినిమా మిషన్ కాశ్మీర్ తో పూర్తిస్థాయి ఎడిటర్ గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే విధూ వినోద్ చోప్రా నిర్మాతగా వ్యవహరించిన సంజయ్ దత్ హీరోగా నటించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ కు దర్శకత్వం వహించి ఔరా అనిపించాడు. అది పెద్ద హిట్ కావడంతో పాటు… ఆ చిత్రం ప్రాంతీయ భాషల్లోకీ రీమేక్ చేయబడింది. దాన్నే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన లగే రహో మున్నాభాయ్ కూడా పెద్ద హిట్.

మున్నాభాయ్ సీరిస్ తర్వాత రాజ్ కుమార్ హిరానీ తీసిన 3 ఈడియట్స్ సినిమా ఆయన కెరీర్ మొత్తంలోనే ఓ మైలురాయి. ఎప్పటికీ నిల్చిపోయే ఓ మాస్టర్ పీస్. ఆ సినిమాలోని క్యారెక్టర్స్ తీర్చిదిద్దిన తీరు, చిరు హాస్యం పండించిన రీతి, హ్యూమన్ ఎమోషన్స్, సంగీతం, కెమెరా పనితనం, లొకేషన్స్ ఎంపిక.. ఇలా ప్రతీదీ ఓ ఫీల్ గుడ్ అనుభూతినిస్తూనే… భారతీయ విద్యావ్యవస్థపై ఓ వ్యంగాస్త్రంగా నిర్మించిన శైలి విశేషంగా ఆకట్టుకుంది. రాజ్ కుమార్ హిరానీ క్రియేటివిటీ స్థాయిని పట్టిచూపించి.. తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు ఉపయోగపడిన ఓ అద్భుత చిత్రం 3 ఈడియట్స్. ముఖ్యంగా అమీర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషిల పాత్రలతో పాటు… వీరూ సహస్ర బుద్ధిగా వైరస్ అనే షార్ట్ కట్ పేరుతో బొమ్మన్ ఇరానీ నటన, చతుర్ రామలింగం పాత్రలో ఓమీ వైద్య పాత్ర చిత్రణ.. మొత్తంగా 3 ఈడియట్స్ ఓ బ్లాక్ బస్టర్.

ఆ తర్వాత పీకే పేరుతో మళ్లీ అమీర్ ఖానే దేవుడిని వెతికే గ్రహాంతరవాసి పాత్రలో… మతాల పేరిట ప్రజలను మోసగిస్తున్న తీరు… దొంగ బాబాలే లక్ష్యంగా సినిమాను మల్చారు హిరానీ. ఆ తర్వాత ఎందుకోగానీ రాజ్ కుమార్ హిరానీ ఆలోచనలు ఎక్కువగా సంజయ్ దత్ చుట్టూ తిరగటం వల్లనో, ఆయన జీవితం హిరానీపై ఏం ప్రభావం చూపిందో, ఏమోగానీ ఆయన మొదటి రెండు సినిమాల్లో హీరోగా తీసుకున్న సంజయ్ జీవిత చరిత్రనే ఆధారంగానే చేసుకుని… తన ఐదో సినిమా సంజుని తీశాడు. రణబీర్ కపూర్ ను సంజయ్ దత్ పాత్రలో పెట్టి తీసి ఒర్జినల్ సంజయ్ ని మైమరిపించాడు. డంకీ పేరుతో వలసలపై షారుక్, తాప్సీ, విక్కీకౌశల్ వంటివారితో తీసిన ఎమోషనల్ డ్రామా కూడా మంచి పేరే తెచ్చుకున్నా… రాజుహిరానీ అనుకున్న స్థాయి బ్లాక్ బస్టర్ మాత్రం కాలేకపోయింది.

చాలామంది దర్శకులు వస్తుంటారు, పోతుంటారు… కానీ పాత్ర చిత్రణలో సున్నితత్వం, కథ, కథనం నడిపే విధానంతో పాటు… 24 క్రాఫ్ట్స్ సినిమాను అత్యంత అద్భుతంగా పండించినవాడే రాజ్ కుమార్ హిరానీలా పేరు సాధిస్తారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles