మోదుమూడి సుధాకర్.. ✍🏼 సంగీత విద్వాంసులు
సంగీత కళాకారులు ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఒక్కొక్కసారి ఎదుర్కోవలసి వస్తుంది. సమర్థులైనవారు వాటిని యుక్తిగా అధిగమిస్తారు. అందుకు ఒక ఉదాహరణగా గతంలో నేను విన్న ఒక యదార్థ సంఘటన చెప్తాను.
బాలమురళీగారు తమిళనాట ఒక ఊరి సభలో కచేరీ చేయవలసి ఉంది. ఆరోజు ప్రక్కవాద్యం వాయించవలసిన మృదంగ విద్వాంసుడు, సభ నిర్వాహకులకు ఒక షరతు పెట్టారు. అదేమిటంటే, మురళిగారు తనతో తంబురా వేసేందుకు మగవారిని మాత్రమే పెట్టుకోవాలని! ఆడవారు వేస్తే తాను సహకారం అందించనని!!

చాలా తర్జనభజనల అనంతరం తప్పనిసరి పరిస్థితిలో నిర్వాహకులు ఈ విషయం మురళీగారికి చెప్పారు. నిజానికి ఆయనతో ఆరోజు ఒక మహిళ తంబురా వేయటానికి వచ్చారు. మురళీగారు నిర్వాహకులతో.. ”అది నా ఇష్టం.. ఆయన మృదంగ సహకారం నాకే కదా వాయిస్తారు..? ఆమెకు కాదు కదా..? అయినా అటువంటి అభ్యంతరం ఉంటే.. ఆయన వాయించనక్కరలేదు.” అన్నారు.
నిర్వాహకులు ఇబ్బందిలో పడ్డారు. ఈవిషయం మార్దంగికునికి తెలియజేసారు. అయితే, ఆయన ఆ ఊరిలో ఎంతో పలుకుబడి కలిగిన వారు కావటంతో, తాను వాయించకపోగా, మృదంగం, వయోలిన్ తో సహా మరెవరూ ఆరోజు కచేరీకి మురళీ గారికి సహకరించటానికి వీలు లేదని ఫత్వా జారీ చేసారు.
ఎవరూ ఇళ్లల్లో లేకుండా నిర్వాహకులు వచ్చే సమయానికి మాయమయ్యారు!
ఎంత ప్రయత్నించినా సహకారానికి ఎవరూ ముందుకురాలేదు. కచేరీ సమయం ఆసన్నమయింది. శ్రోతలు హాలులో కిక్కిరిసి ఉన్నారు. ఇక గత్యంతరం లేక నిర్వాహకులు చివరి ప్రయత్నంగా వాకబు చేస్తే.. హరికథలకు వాయించే ఒక మద్దెల కళాకారుడు, నాటకాలు వగైరాలకు వాయించే ఒక హార్మోనిస్ట్, ఘట కళాకారుడు దొరికారు!
మురళిగారు వారి సహకారాలతో కచేరీ ఆరంభించారు!
మూడు గంటలపాటు శ్రోతలను తన గానాంబుధిలో మునకలు వేయించారు ఆయన! సహకారాలకు ఎక్కువ పని కల్పించక.. శ్రోతల ధ్యాస తన పాటవైపే తిప్పుకుని.. ఏలోటూ తెలియనీయకుండా కచేరీ అద్భుతంగా నడిపారు మురళీగారు! నిర్వాహకులు బ్రహ్మానందం చెందారు! సహకరించిన కళాకారులు తమ జన్మ ధన్యమైందని ఆనందపడ్డారు!
ఆ కచేరీ ఒక సువర్ణ అధ్యాయంగా ఆ ఊరి సంగీత రసికజనుల హృదయాల్లో నిలిచిపోయింది! తన మాటే నెగ్గాలని.. తోటి కళాకారులను కించపరచాలని చూసిన అహంకారపరుడైన మృదంగ విద్వాంసునికి ఆ సంఘటన ఒక గుణపాఠమైంది!


