జయమాలినిని పరిచయమూ చేశాడు.. జగన్మోహినినీ చేశాడు!

జయమాలినిని జగన్మోహినిగా మార్చాడు. గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే పాము, కోతి, దెయ్యాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. జానపద మాంత్రికుడి కొత్త సినీ వ్యాకరణమిది!

విఠలాచార్య అంటే తెలుగు సినిమాకు జానపదం, సాహసం, మాయాజాలం, ఫాంటసీ, కత్తియుద్ధాలు, భారీ సెట్లు, ట్రిక్‌ షాట్లు ఇలాంటివన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన వినోద ప్రపంచాన్ని సృష్టించిన దర్శకుడు. అందుకే ఆయన్ను జానపద బ్రహ్మగా పిలిచేవారు. తనకంటూ ప్రత్యేకమైన జానర్ సృష్టించుకుని.. కెరీర్ లో ఎన్నో హిట్స్ ను అందించిన సినీ మెజీషియనతను.

విఠలాచార్యకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఎన్నో సినిమాల్లో కొన్నింటి గురించి మనమోసారి చెప్పుకుందాం..

బందిపోటు: 1963లో ఎన్టీఆర్‌తో విఠలాచార్యకు బలమైన గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో ఇది ముఖ్యమైనది. సాధారణ రాజకుమారుడి కథ కాకుండా.. కత్తులు, యుద్ధాలు, గుర్రాలపై స్వారీ వంటివాటితో స్వాష్‌బక్లింగ్ జానపద సాహసగాధగా తీర్చిదిద్దాడు. ఎన్టీఆర్–కృష్ణకుమారి జంట, ఘంటసాల సంగీతం, రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రహణంతో ఈ సినిమా ఇప్పుడు చూసినా అరే వా అనిపించేది. దీన్నే వీర కేసరి పేరుతో రాజ్‌కుమార్‌తో కన్నడంలోనూ ఏకకాలంలో తీశారు విఠలాచార్య. క్లైమాక్స్‌ను ఈస్ట్‌మన్ కలర్‌లో చిత్రీకరించడం అప్పట్లో సాంకేతికంగా ఓ ప్రత్యేకత.

అగ్గిపిడుగు: 1964లో విడుదలైన ఈ సినిమా ట్విన్ బ్రదర్స్ కాన్సెప్ట్‌ తో… యాక్షన్-ఫాంటసీగా మలిచిన చిత్రం. ఎన్టీఆర్ ఇందులో రాజా, మాధవ్ అనే కవలల పాత్రలు పోషించారు. 1844లో అలెగ్జాండ్రె దుమాస్ రాసిన The Corsican Brothers అనే ఫ్రెంచ్ నవల ఈ సినిమా కథకు మూలం. పూర్తిగా సంప్రదాయ జానపద కథ నుంచి వచ్చింది కాకపోయినా.. విదేశీ సాహిత్య మూలాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మల్చారు. రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రహణమే ఈ సినిమాకూ ఎస్సెట్.

విఠలాచార్య ఫార్మూలాకు మరో ఉదాహరణలా కనిపించే 1967లో విడుదలైన చిక్కడు–దొరకడు, అరేబియన్ నైట్స్ లోని కథను తెలుగు జానపద ఫాంటసీకి అనుగుణంగా మల్చిన ఆలీబాబా 40 దొంగలు, ఆ తర్వాత మెహిని, దెయ్యం, పునర్జన్మ, రాజు, భక్తి, ప్రతీకారం ఇలాంటివెన్నో మిళితం చేసి 1978లో తీసిన జగన్మోహిని ఇలాంటి ఎన్నో సినిమాలతో కనికట్టు చేశాడు.

జయమాలినిని పరిచయం చేసిన విఠలాచార్య!

తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ సినిమాల్లో కలిసి 1970వ దశకం నుంచి 90వ దశకం వరకూ సుమారు రెండు దశాబ్దాలపాటు వెండితెరను వ్యాంపు పాత్రలతో ఏలిన డ్యాన్సర్ జయమాలిని.

అలమేలు మంగను తెరకు పరిచయం చేసింది తమిళ దర్శకుడు టీ. ఆర్. రామన్న. స్వర్గత్తిల్ తిరుమనం అనే సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రతో ఆమె పరిచయమైనా… తెలుగులో మాత్రం జయమాలినిగా నామకరణం చేసి ఆడదాని అదృష్టం సినిమాతో తెరమీదకు తీసుకొచ్చింది విఠలాచార్యనే.

1978లో జగన్మోహిని అనే సినిమా విడుదలైంది. నిర్మాత, కథ, దర్శకత్వం అన్నీ విఠలాచార్యనే. నరసింహరాజు, ప్రభ, జయమాలిని, సావిత్రి, ధూళిపాళ, పొట్టి వీరయ్య వంటివారు నటులు. ఈ సినిమా కథ మొత్తం పాతివ్రత్యం, అద్భుత శక్తులు, దేవతలు, దెయ్యాలు, భక్తి చుట్టే తిరుగుతుంది. ఒక పల్లెటూరి అందగాణ్ని మోహించిన ఓ కామపిశాచి వలలో వేసుకోవడం.. తన భర్తను కాపాడుకునేందుకు దేవతలను వేడుకునే భార్య.. ఇదీ స్థూలంగా కథాంశం. ఇలాంటి సినిమాలో కోతి, పాము వంటి జంతువులనూ వాడుకుని హిట్ కొట్టాడు విఠలాచార్య. 1951లోనే కన్నడలో వచ్చిన జగన్మోహినికి ఇది పునర్నిర్మాణం. ఈ సినిమా పదే పదే చూసేందుకు కన్నడనాట రైతులు తమ పశువుల్ని కూడా అమ్ముకున్నారని ఓ ప్రచారం కూడా జరిగింది.

తన జీవితకాలం మొత్తం వ్యాంప్ పాత్రలకు, డ్యాన్సులకే పరిమితమైన జయమాలినితో.. ఓ మాయావి పాత్రను వేయించి.. ఆమెనే ఆకర్షణగా, ఆమెనే భయంగా, ఆమెనే మొత్తం కథంతా నడిపించే శక్తిగా మార్చేశాడు విఠలాచార్య. దెయ్యం కాళ్లను మంటలకుపయోగించే విచిత్రమైన సన్నివేశాల విజువలైజేషన్ ఈ సినిమాలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. అప్పటి కాలంలోనే అలాంటి దృశ్యాలను తెరపై సృజనాత్మకంగా చూపించిన విఠలాచార్య… నేడూ ఇంకా ఉండి ఉంటే…?

గ్రాఫిక్స్ లేకపోవచ్చుగానీ.. విఠలాచార్య ఊహల పరిధి మాత్రం పెద్దది. ఇవాళ కంప్యూటర్ లో కొన్ని క్లిక్స్ తో ఓ పామును, డ్రాగన్ ను, దెయ్యాన్ని, రాక్షసుణ్ని, ఎగిరే కీలుగుర్రాన్నీ సృష్టించవచ్చు… కానీ, విఠలాచార్య కాలంలో అది అంత సులభం కాదు. అందుకే మేకప్, మినియేచర్స్, ట్రిక్ షాట్స్, సెట్స్, కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్, జంతువులు, స్టంట్ సీక్వెన్సెస్.. ఇలా వీటితోనే ఒక అద్భుతమైన మాయాప్రపంచాన్ని పున: సృష్టి చేశాడు విఠలాచార్య.

ఆయన సినిమాల్లోని హీరో, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులే కాదు.. జంతువులు, దెయ్యాలు కూడా బ్రాండే!

దెయ్యమంటే తెల్లని దుస్తులు, ఎర్ర జుట్టు, భయపెట్టే ముఖం.. కానీ, వీటిని చూసి భయపడటమే కాదు… చాలాసార్లు ఆ భయంలోనుంచే నవ్వుకునేలా చేశాడు విఠలాచార్య. భయాన్నీ వినోదంగా మల్చిన టెక్నిక్ ఆయనది.

విఠలాచార్య ప్రొడక్షన్ లో ప్రతీ అంశంలోనూ శ్రద్ధ పెట్టేవారు. అందులో ప్రధానంగా డబ్బింగ్ పైన ఆయన సీరియస్ గా దృష్టి సారించారంటారు ఆయన్నెరిగినవారు.

డబ్బింగ్‌లో కూడా రాజీకి అవకాశమివ్వని వాడు!

విఠలాచార్యకు డబ్బింగ్ విషయంలోనూ చాలా స్పష్టమైన ప్రమాణాలు ఉండేవి. డబ్బింగ్ ఆర్టిస్ట్ గొంతు నటుడి గొంతుకు సరిపోవాలి. మాటల ఉచ్చారణ, స్వరంలో హెచ్చుతగ్గులు కూడా నటుడి శరీరభాషకు సరిపోవాలి. పని సరిగ్గా చేస్తే మాత్రం కళాకారులను ఎంతో గౌరవించేవారట విఠలాచార్య.

టూరింగ్ టాకీస్ నిర్వాహకుడి నుంచి జానపద బ్రహ్మగా ఎదిగిన విఠలాచార్య ప్రయాణం అంత సులభంగా సాగలేదు. అసలు ఆ ప్రయాణం ఎలా మొదలైంది..?

తదుపరి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles