వెండితెర మాయావి.. విఠలాచార్య!

టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లోనే కత్తులు, మంత్రాలు, దెయ్యాలు, నాగకన్యలు, ఎగిరే గుర్రాలతో వెండితెరపై మాయాజాలం సృష్టించిన జానపద మాంత్రికుడి సినిమా వ్యాకరణం ఇది.

కాళ్లకు మంటలతో దెయ్యం కనిపిస్తుంది. ఆ దెయ్యం వంట కూడా చేస్తుంది. హీరో జంతువుగా మారిపోతాడు. రాకుమారుడు అడవిలోకి వెళ్తే నాగకన్య ఎదురవుతుంది. మంత్రగాడు వచ్చి శపిస్తాడు. హీరో చేతిలో అనూహ్యంగా ఓ కత్తి ప్రత్యక్షమవుతుంది. గుర్రం గాల్లో ఎగురుతూ పరుగులు తీస్తుంది. గుహలో రహస్య నిధి ఉంటుంది. తెరపై మాయాజాలం కనిపిస్తుంది. మయనసభను మరిపిస్తుంది.

ఇవన్నీ వింటే ఓ పేరు గుర్తొస్తుంది… ఆయనే విఠలాచార్య!

సాంకేతికత అందుబాటులో లేని కాలంలోనే ఈయన ఓ క్రిస్టోఫర్ నోలన్, జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్. దక్షిణాదివాడైనా ఉత్తరాదిన కూడా మన్ననలందుకున్న మాయాజాల మన్నన్.

లో బడ్జెట్ లో, పరిమితమైన సాంకేతిక వనరులున్న కాలంలోనే ప్రేక్షకులను థియేటర్ బాట పట్టించిన జానపద మాంత్రికుడు.

విఠలాచార్యకు సినిమా అంటే కథ కాదు… కథకూ, ప్రేక్షకులకు మధ్య ఓ ఒప్పందం. అందుకే జై విఠలాచార్య పేరిట ఆయన గురించి ఓ పుస్తకమే తీసుకొచ్చారు పులగం చిన్నారాయణ అనే సినీ జర్నలిస్ట్, రచయిత. టిక్కెట్ కొన్న ప్రేక్షకుడు ఆరంభం నుంచి శుభం కార్డ్ పడే వరకూ.. ఆనందంగా సినిమా చూడగల్గినప్పుడే ఆ సినిమా సక్సెస్… ఇదే విఠలాచార్య మూవీ మేకింగ్ ఫార్మూలా.

చాలా సినిమాల్లో కథ, కథనం, స్క్రీన్ ప్లే ఇవన్నీ బానే ఉంటున్నాయిగానీ… ఎక్కడో సినిమా టెంపో ఒక్కసారిగా స్లో మోషన్ కు మారడం.. కాస్త బోర్ ఫీలింగ్.. ఇవన్నీ కూడా నేటి ప్రఖ్యాత దర్శకుల సినిమాల్లోనూ ఇంకా చికాకు పెడుతూనే ఉన్నాయి. కానీ, ఈ సమస్యను అధిగమించే ఎక్సర్సైజ్ చేసినవాడు విఠలాచార్య.

కథలో వేగం తగ్గకుండా చూసుకోవడం. తగ్గినట్టనిపిస్తే ఓ కత్తిసాము ఫైట్ క్రియేషన్.. అదీ రక్తి కట్టదనిపిస్తే ఓ మంత్రగాడి ఎంట్రీ… ఇవన్నీ ఉన్నా ఉత్కంఠ లేదనిపిస్తే ఓ దెయ్యాన్ని ప్రవేశపెట్టడం… ఇలా సినిమాలో క్యూరియాసిటీ పెంచే కొత్త వ్యాకరణాన్ని ఏనాడో అర్థం చేసుకున్న దర్శకుడు. కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్ కు ఓ మార్గదర్శి.

షూటింగ్ కు రాకపోతే క్యారెక్టర్ నూ, కథనే మార్చేసే విభిన్న శైలి!

సమయపాలనలో విఠలాచార్య కఠినుడు. షూటింగ్ ఆరంభానికి కనీసం గంట ముందే నటీనటులు సెట్లో ఉండాలని కోరుకునేవారు. ఎవరైనా పదే పదే షూటింగ్ ఆలస్యంగా వచ్చేవాళ్లుంటే… ఓ సరదా హెచ్చరిక చేసేవాడు. మీ పాత్రను జంతువుగా మర్చేస్తానన్నదే ఆ హెచ్చరిక. అయితే, అది బెదిరింపు మాత్రమే కాదు.. అలాంటి సందర్భాలూ ఉన్నాయి.

విఠలాచార్య తెలివితేటలెలా ఉండేవో చెప్పుకునే ఒక ఉదాహరణ ఇది. ఓ ప్రముఖ హీరో ఓరోజు ఏవో అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఎగ్గొట్టాడనుకోండి.. సాధారణంగా దర్శకుడేం చేస్తాడు.. ఆ రోజు హీరో అవసరం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తాడు. లేకపోతే, షూటింగే వాయిదా వేస్తాడు. కానీ, విఠలాచార్య మాత్రం స్క్రిప్ట్ మార్చేస్తాడు. హీరోను ఒక ముని శాపంతో జంతువును చేస్తాడు. హీరో బదులు ఆ జంతువును తీసుకొచ్చి షూటింగ్ పూర్తి చేస్తాడు. ఇలాంటి సంఘటనలు విఠలాచార్యతో పనిచేసిన వారి జ్ఞాపకాల ఆధారంగా ఇప్పటికే కథనాలుగా నమోదయ్యాయి.

పైకి చూస్తే ఇదేదో సరదాగా ఉందే అనిపించినా… ఇందులోనూ ఓ ఫిల్మ్ మేకింగ్ పాఠముంది. స్క్రిప్ట్ తనను బందీ చేయకూడదు.. అవసరమైతే స్క్రిప్టును మార్చుకోగల్గాలి.

హీరో ఎంపికలోనూ తనకంటూ ఓ లెక్కుండేది!

విఠలాచార్య సినిమా అంటే తెలుగువారికి ఎక్కువ గుర్తొచ్చే పేరు కాంతారావే. కానీ, ఒకే రకమైన స్టార్స్ తో కాకుండా.. భిన్నమైనవారితోనూ విఠలాచార్య హిట్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ తోనూ విఠలాచార్యది బలమైన కాంబినేషన్. ఈ ఇద్దరి కలయిక తెలుగు జానపద సినిమాకు ఓ స్పెషల్ మార్కెట్ నే సృష్టించింది. అలాగే విలన్ క్యారెక్టర్ లో రాజనాలకు ఓ ప్రత్యేకత వచ్చిందంటే అందులో విఠలాచార్య సినిమాల పాత్ర ప్రధానమైంది.

ఇక కాంతారావునైతే జానపది హీరోగా నిలబెట్టిందే విఠలాచార్య సినిమాలు. కత్తి పట్టిన రాకుమారుడైనా, సాహసవీరుడైనా, అడవుల్లో తిరిగే యోధుడైనా కాంతారావు శరీరభాష, ఆ కంఠం, ఫైటింగ్ స్టైల్… సరిగ్గా అతికినట్టుగా విఠలాచార్య సినిమాకు సరిపోయేవి. ఇక కృష్ణతో ఇద్దరు మొనగాళ్లు పేరిట చేసిన మల్టీస్టారర్ కూడా కృష్ణ కెరీర్ లో ఓ హైలెట్. విఠలాచార్య సెట్టింగ్స్ ను కూడా ఎలా పొదుపుగా, తెలివిగా ఉపయోగించుకునేవారో ఓసారి కృష్ణ స్వయంగా గుర్తు చేసుకున్నారు. ఓ దర్బార్ సెట్ వేస్తే అందులోనే ఓవైపు బెడ్రూమ్, ఇంకోవైపు కారిడార్ అలా ఒక చిన్న స్పేస్ లోనే సెట్టింగ్స్ పక్కపక్కనే వేసి వెండితెరపై మెరుపులు మెరిపించిన మాయావి విఠలాచార్య.

స్టార్స్ కంటే పాత్రలే ముఖ్యం!

ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి ఓ పెద్ద హీరోతో సినిమా చేసినా సరే… కథలో మిగిలిన పాత్రలకూ అంతే ప్రత్యేకత ఇచ్చేలా డిజైన్ చేసేవాడు. ఓ మాంత్రికుడు, ఓ రాజగురువు, ఓ నాగకన్య, ఓ దుష్టరాజు, ఓ దెయ్యం, ఓ వింత జంతువు, ఓ హస్యనటుడు, మరో గ్రామీణ పాత్ర.. ఇలా ప్రతీ పాత్రకూ ఓ ప్రాధాన్యత తప్పనిసరి ఉండేది.

చాలా సినిమాల్లోలా హీరో, విలన్ గ్యాంగ్ మధ్యలో ఫైట్స్ మాత్రమే కాదు… కథను ముందుకు నడిపించే దెయ్యం ప్రత్యక్షమవ్వొచ్చు. అది భయపెట్టడానికనే అనుకోనక్కర్లేదు… సమస్య పరిష్కారం కోసం రావచ్చు.. లేదా, ప్రతీకారం తీసుకునే ఎంట్రీ కావొచ్చు. అందుకే ఆయన కథలు పిల్లల్లో క్యూరిసిటీని, పెద్దల్లో ఆసక్తినీ రేకెత్తించేవి.

జానపద సినిమాలకు ఆదరణ తగ్గుతోందని భావించి తన జాన్రా మార్చేసి అక్కినేనితో ఆయన రూపొందించిన బీదలపాట్లు ఉత్తమ చిత్రంగా మన్ననలందుకున్నా… డబ్బులు మాత్రం రాబట్టలేకపోయింది.

మరి విఠలాచార్య డబ్బింగ్, ఇతర ప్రొడక్షన్ వ్యవహారాల్లో ఎలా ఉండేవారు…? జయమాలినిని పరిచయం చేసిన ఆయన జగన్మోహినిగా ఎలా మార్చి ఆకట్టుకున్నాడు..?

తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం పదండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles