కన్నడ నేల నుంచి.. తెలుగు జానపద బ్రహ్మగా!

ప్రేక్షకుడి పల్స్ పట్టిన జానపద మాంత్రికుడు!

విఠలాచార్యది కర్నాటకలోని ఉడిపి. ఏడుగురు సంతానంలో చిన్నవాడు. చిన్ననాటి నుంచే నాటకాలు, యక్షగానం, బయలాట వంటి జానపద ప్రదర్శనలపై ఆసక్తి ఉండేది. తండ్రేమో వైద్యుడు. తండ్రికి విఠలాచార్య ఆసక్తులు నచ్చేవి కావు. అందుకే, ఆయన జీవితమూ సినిమాను తలపించేలా సాగింది. 9 ఏళ్ల వయస్సులోనే ఇంటి నుంచి పారిపోయాడు. అక్కడా ఇక్కడా చిన్నా చితక పనులు చేసి డబ్బు కూడబెట్టుకుని.. ఆరసికెరిలో ఓ హోటల్ ఆరింభించాడు. అక్కడే రకరకాల వ్యక్తులతో ఏర్పడిన పరిచయం సినిమావైపు ఆసక్తిని పెంచింది. అదే సమయంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకూ వెళ్లివచ్చాడు.

టూరింగ్ టాకీస్ నిర్వాహకుడి నుంచి ఫిల్మ్ మేకర్ గా!

డి. శంకర్ సింగ్ అనే మరో స్నేహితుడితో కలిసి విఠలాచార్య టూరింగ్ టాకీస్ నడిపారు. ఇక్కడే సినిమాపై మక్కువ పెరిగింది. ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడో ముందు తన టూరింగ్ టాకీస్ లోనే గమనించడం మొదలెట్టాడు. ఏ సినిమా జనానికి నచ్చుతుంది.. ఎక్కడ చప్పట్లు పడుతున్నాయి.. ఎక్కడ ఉత్కంఠగా చూస్తున్నారు.. ఎక్కడ భయపడుతున్నారు.. ఎలాంటి పాటలు జనరంజకమవుతున్నాయి.. ఏ సన్నివేశాలు చిరాకుపెట్టి ప్రేక్షకులు బయటకు వెళ్లడానికి కారణమవుతున్నాయి.. ఏ హీరోకు ఎక్కువ స్పందన వస్తోంది.. ఎలాంటి కథలను ఎక్కువ ఇష్టపడుతున్నారు.. ఇదిగో అలాంటి విశేషాలన్నీ టూరింగ్ టాకీస్ నిర్వహణలోనే పసిగట్టాడు. టూరింగ్ టాకీస్ లో ప్రేక్షకుల ఆలోచనలే.. విఠలాచార్యకు ఫిల్మ్ స్కూల్ పాఠాలను బోధించాయి.

విఠలాచార్య, డి. శంకర్ సింగ్ కు సంబంధించి మైసూర్ స్టార్ లో ఓ ఆసక్తికర కథనం ప్రచురిచమైంది. ఈ ఇద్దరికీ టూరింగ్ టాకీస్ నిర్వహించాలనే కోరిక ఎలాగైతే మొదలైందో.. ఆ తర్వాత సినిమాలు తీయాలనే ఆకాంక్ష కూడా అలాగే బలపడింది. 1950ల ఆరంభంలో వి. శాంతారామ్ ను కలిశాక విఠలాచార్యకు సినిమాలు నిర్మించాలన్న కోరిక మరింత బలపడింది. అలా 1951లో కన్నడ సినిమా నిర్మాణ రంగంలోకి డి. శంకర్ సింగ్ తో కలిసి అడుగుపెట్టిన ప్రయాణం.. ఆ తర్వాత మహాత్మ పిక్చర్స్ పేరిట ఓ ప్రొడక్షన్ హౌజ్ గా మారింది. కన్నడలో చేసిన అనుభవమే విఠలాచార్యకు ఆ తర్వాత తెలుగులో బలమైన పునాదిగా మారింది. అయితే, విఠలాచార్య చాలా పొదుపరి. పని చక్కగా చేసినవారికి సమయానికి పారితోషికమిచ్చేవారు. ఎక్కడా వృథా ఖర్చులు చేసేవారు కాదు. ఎవరికీ జవాబుదారీగా ఉండటం ఇష్టం లేక.. తను దర్శకుడైతే, తనే ఆ సినిమా నిర్మాణ బాధ్యతల్నీ మోయాలనుకునే ఆలోచనలున్నవాడు.

సగటు ప్రేక్షకుడి రివార్డులే విఠలాచార్యకు అవార్డులు!

విఠలాచార్యకు పెద్దగా అవార్డులేమీ వరించలేదు. కానీ, ప్రేక్షకుల రివార్డులు మాత్రం మిగిలిన ఏ డైరెక్టర్ కూ తీసిపోని స్థాయిలో దక్కాయి. క్రిటికల్ సర్కిల్స్ ఆయన గురించి పెద్దగా పట్టించుకోకపోయి ఉండొచ్చు.. కానీ, సినీ ప్రేక్షకులు మాత్రం విఠలాచార్య సినిమా అంటే ఉవ్విళ్లూరేవారు. విమర్శకులను మెప్పించేందుకు ఏనాడూ సినిమాలు తీయలేదు. ప్రేక్షకులను రంజింపజేసేందుకే విఠలాచార్య సినిమాలొచ్చాయి. అలాగే, ఆయన సినిమాల్లో అసాధ్యమేదీ ఉండదు.

భిన్నమైన పాత్రలు.. ఆ తర్వాత ఏం జరుగుతుందోనన్న ఎగ్జైట్మెంటే ఆయన సినిమాల బలం.

తన వ్యక్తిగత జీవిత విశేషాలను బయటపెట్టని డైరెట్రు!

వారసత్వ ఆగమనానికి కేరాఫ్ అయిన సినిమా ఫీల్డ్ లో విఠలాచార్య మాత్రం తన పిల్లల్ని సినిమాల్లోకి రానివ్వలేదు. వారితో సినిమాల్లోకి రామని ఒట్టు వేయించుకున్నారట. సినీ ప్రపంచాన్ని అంతగా ప్రేమించిన వ్యక్తి.. ఆ ప్రపంచానికి పిల్లల్ని దూరముంచడం వైరుధ్యమే. బహుశా, సినీ ఫీల్డులో ఆయన అనుభవించిన కష్టాలే అందుకు కారణం కావచ్చు. అంతేకాదు, తన వ్యక్తిగత జీవిత విషయాలనూ ఎవ్వరితోనూ పంచుకునేవారు కాదట విఠలాచార్య.

తెలుగు సినిమాలతో ఖ్యాతి.. కానీ తమిళనాడుతో బంధం!

పుట్టింది కన్నడీగుడిగానే అయినా.. తెలుగు సినిమాలతోనే గొప్ప పేరు సంపాదించారు విఠలాచార్య. కానీ, ఆయన జీవితమంతా మద్రాస్ లోనే గడిచింది. 1955లో చెన్నై బాట పట్టిన ఆయన.. పురసైవాక్కంలోని గంగాదీశ్వరర్ ఆలయ సమీపంలో నివాసముండేవారు. షూటింగ్ రోజుల్లో కారులో విజయవాహినీ స్టూడియోకు వెళ్లడం.. షూటింగ్ లేని రోజుల్లో మాత్రం ఆ వీధుల వెంట కాలినడకన తిరగడం ఆయనకిష్టంగా ఉండేది. విఠలాచార్య 1999లో కన్నుమూశారు. కానీ, ఇప్పటికీ గ్రాఫిక్స్ సినిమాలు తెరపై చూస్తున్నప్పుడు.. ఇవీ ఆనాడే మన విఠలాచార్య చేశాడని మాట్లాడుకునే స్థాయిలో తనదైన ముద్ర వేశాడు. ఆయన సృష్టించిన ఫాంటసీ, హార్రర్ ప్రపంచం ఆ తర్వాత దర్శకులపై కూడా అమితమైన ప్రభావం చూపింది.

నేడు వెండితెరపై గ్రాఫిక్స్ తో వండర్స్ చేస్తున్న రాజమౌళి నుంచి.. మన్నోహన్ దేశాయ్, స్పీల్ బర్గ్, కామారూన్, నోలన్ వంటివారికేమాత్రం తక్కువ కాని దర్శకుడు విఠలాచార్య. ఎందుకంటే, సాంకేతికత అంతగా అందుబాటులో లేని ఆ కాలంలోనే విజువల్ స్పెక్టికల్ పై ఆయనకున్న ముందుచూపు అందుకు నిదర్శనం.

మొత్తంగా విఠలాచార్య అంటే ఏంటి..?

కేవలం జానపద చిత్రాల దర్శకుడే కాదు ప్రేక్షకుడి మనస్తత్వాన్ని చదివిన ఓ నిర్మాత . తక్కువ బడ్జెట్ లో సృజనాత్మకతను ఆయుధంగా వాడినవాడు. స్టార్స్ కంటే పాత్రలకు ప్రాధాన్యతనిచ్చి కథను నడిపినవాడు. అతీంద్రయశక్తులు, ఫాంటసీ కథలతో తెరపై అసాధ్యాలను సుసాధ్యం చేసి ఆకట్టుకున్న గండరగండడు… ఎలాంటి హద్దుల్లేని సృజనాత్మక ప్రపంచానికి ఓ పర్యాయపదం విఠలాచార్య.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles