సౌత్ ఏసియా పర్యటన. సింగపూర్ లో మేము!
……………………………………………………………………………………………………………

సన్నీ… ✍🏻
సింగపూర్… ఓ వెలుగు రేఖలా విశ్వాన్ని ఆలింగనం చేసుకున్న నగరం. నీలాకాశాన్ని కమ్ముకుంటున్న మేఘాల్లో తేలుతూ మెరీనా బే స్యాండ్స్ తళుకులు, ప్రకృతి కౌగిలిలో పరచుకున్న గార్డెన్స్ బై ద బే.. ఇలా, ఇక్కడి ప్రతి పులకరింత ప్రకృతిలో ఒక కొత్త సొబగు! ప్రతి వీధి ఒక కవిత్వం!! సముద్ర సవ్వడుల్లో స్వప్నాలు సవారీ చేస్తూ.. సెంటోసా దీవి నవ్వులు చిందిస్తూ కనిపిస్తుంది. క్రమశిక్షణతో, వినయంతో నగరం ఒక మహామహుడిలా నిలిస్తే.. సాంకేతికతతో కూడిన రహదారులు కాలం కంటే వేగంగా పరుగులు తీస్తాయి. ప్రపంచానికి చూపించడానికి ప్రతి మూలా ఓ కొత్త ఆవిష్కరణ! అందుకే.. సింగపూర్ ప్రతీ క్షణం కొత్త ఆశయాలతో నిండిన ఒక కావ్యం!!
ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న ట్రిప్… ప్రవళిక యూఎస్ నుండి రాగానే వెళ్లాలనే కాంక్షతో… వచ్చిన వారం రోజుల్లోనే ప్లాన్ చేశాం. ముందుగానే హైదరాబాద్ నుండి సింగపూర్, సింగపూర్ టూ హైదరాబాద్ ఫ్లైట్స్ బుక్ చేశాం. అయినా, అప్పటికీ మా పూర్తి ప్రణాళిక ఇంకా పైనల్ కాలేదు. మొదటగా రెండు దేశాలు అనుకున్నది.. మారుతూ మారుతూ చివరికి నాలుగు దేశాల ట్రిప్ గా మారింది.
ఇక్కడ ప్రస్తవించాల్సిన ముఖ్య విషయం.. ఈ నాలుగు దేశాల పర్యటనను మాకు మేముగా మాత్రమే ఎక్స్ ప్లోర్ చేయాలనుకున్నాం. అందుకోసమే ఏ ట్రావెల్ ఏజెన్సీ ప్యాకేజి తీసుకోలేదు. ముందుగా ఆసియాలోని ప్రధాన దేశాలైన నాలుగు దేశాలను చుట్టేయాలని సంకల్పించాం. అందుకోసం ఒక వారం పాటు రీసెర్చ్ చేశాం. అంతకుముందు వెళ్లిన ట్రావెలర్స్ తో మాట్లాడటంతో పాటు.. మాకు తెలిసిన సోర్సెస్ ఉపయోగించి మాకు మేమే 4 దేశాలు 15 రోజుల ఐటినరీ రెడీ చేసుకున్నాం. ఈ ఐటినరీ రెడీ చేసుకున్నప్పుడే మేము డిసైడ్ అయిందేంటంటే.. వీలైనంత వరకూ.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తూ ట్రిప్ కొనసాగించాలని! దీని వల్ల రకరకాల మనుషలతో ప్రయాణం, అక్కడి సంస్కృతిపై అవగాహన వస్తుందనే ఆలోచన. అలా మా ప్లాన్ లో భాగమైన నాలుగు దేశాల్లో మొదటిదైన సింగపూర్ లో అడుగుపెట్టాం!
సింగపూర్ చాంగీ ఎయిర్‌పోర్ట్!
సింగపూర్ లో అడుగుపెట్టక ముందే ఓ వింత పర్యాటక అనుభూతిని మనం ఆస్వాదిస్తూ ఉంటాం. అంత అధునాతనంగా తీర్చి దిద్దారు ఇక్కడి ఎయిర్పోర్ట్ ను! ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ, ఉత్తమ ఎయిర్‌పోర్ట్‌లలో సింగపూర్ ఒకటి! అద్భుతమైన డిజైన్ కళ్లు తిప్పుకోనివ్వదు. అత్యంత
వైవిధ్యభరితమైన, ఆకర్షణీయమైన నిర్మాణం దీని ప్రత్యేకత!
ప్రత్యేకంగా జువెల్ చాంగీ! (Jewel Changi)పేరుతో ప్రపంచంలోనే ఎత్తైన ఇండోర్ వాటర్‌ఫాల్స్ మనల్ని అబ్బురపరుస్తాయి. 130 అడుగుల ఎత్తు నుంచి కిందకు పారే జలపాత అందాలు ఈ ఎయిర్ పోర్ట్ కు ప్రత్యేక ఆకర్షణ! చుట్టూ లావుగా విస్తరించిన గార్డెన్స్, గ్లాస్ డోమ్ తో పాటు…
జలనిర్మాణాలు ఈ ప్రదేశాన్ని అందమైన పర్యాటక కేంద్రంగా నిలబెట్టాయి!
అక్కడి నుంచి MRTలో సింగపూర్ సిటీకి బయలుదేరాం. MRT అంటే మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్. ఇది సింగపూర్ ప్రజారవాణ వ్యవస్థకు గుండెకాయ! చాంగీ ఎయిర్ పోర్ట్ లోనే దీనికి సంబంధించిన కార్డులను 30 డాలర్లు చెల్లిస్తే.. మూడు రోజులపాటు అన్ లిమిటెడ్ గా ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. MRT గురించి ఇక్కడ ప్రధానంగా ప్రస్తవించాలి. ఇది సింగపూర్ నగరాన్ని అనుసంధానించే ఆధునిక, వేగవంతమైన రవాణా వ్యవస్థ. 1987లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇది ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన మరియు భద్రతా ప్రమాణాలు కలిగిన రవాణా వ్యవస్థగా అభివృద్ధి చెందింది. MRT సిస్టమ్ మొత్తం దాదాపు 200 కిలోమీటర్ల ఫ్రీక్వెన్సీ కల్గిఉంటుంది. ఇది సింగపూర్‌లోని ప్రధాన ప్రాంతాలనన్నింటినీ అనుసంధానిస్తుంది. MRT రైళ్ల వేగం, సమయపాలన చాలా కచ్చితమైనవి. రద్దీ ఎక్కువ ఉన్న సమయంలోనైతే తక్కువ కాలవ్యవధిలోనే ఎక్కువ రైళ్లు అందుబాటులో ఉండటం కూడా ఇక్కడి రైల్వే రవాణా వ్యవస్థలో కొనియాడదగింది. ఇది ప్రయాణీకులకు అనుకూలంగా ఉంటుంది. అందుకే అక్కడి ప్రజల్లో 80 శాతం మంది MRTపైనే ఆధారపడతారు. కార్లల్లో ప్రయాణించే వారు చాలా తక్కువే! ఇక మెజారిటి MRT స్టేషన్లన్నీ భూగర్బంలోనే కట్టడం ఇక్కడి మరో విశేషం. అది ఏ రేంజ్ లో ఉంటుందంటే.. మన దగ్గర సెంట్రల్ షాపింగ్ మాల్ కంటే పెద్దవిగా ఉంటుంది ఇక్కడి ఒక్కో స్టేషన్!
ఇక సింగపూర్ ప్రజల క్రమశిక్షణ ఇక్కడ చాల స్పష్టంగా కనిపిస్తుంది ఎస్కలేటర్లపై వెళ్లేప్పుడు కానీ.. టికెట్ క్యూ కౌంటర్ వద్ద కానీ.. ఇక్కడి ప్రజల క్రమశిక్షణను ప్రతిబింబిస్తుంది. సింగపూర్ లో చైనీస్ తో పాటు… తమిళులెక్కువ! అది ఏ స్థాయిలో అంటే.. మనకు కనిపించే బోర్డులు కూడా తమిళంలో ఉంటాయి. MRTఅనౌన్స్ మెంట్ కూడా తమిళంలో చేస్తారంటే తమిళుల కమాండింగ్ ఇక్కడేస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు!

MRT నుంచి సింగపూర్ కు!
ఇక MRTనుంచి సింగపూర్ నగరంలోని క్లార్కికి చేరుకున్నాం. ఆకాశం వైపు చూస్తూ అడుగుపెడుతూ… ఆకాశాన్ని తాకే ఆర్కిటెక్చర్ ఓవైపు.. మరోవైపు సముద్ర లోయల్లో మెరిసే నగరం. క్రమశిక్షణా వైభవానికి ప్రతీక! నాలుగు రోజుల పర్యటనలో MRT సౌకర్యాలను ఉపయోగించుకుని సింగపూర్ లోని ముఖ్యమైన ప్రదేశాలను అన్వేషించాం. దేశాన్ని భౌతికంగా చూసి మురిసిపోవడమే కాదు.. వీలైనంతగా అక్కడి చరిత్ర, సమ్మిళిత అభివృద్ధి, సంస్కృతిని కూడా మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశం కల్గింది మాకు!
సింగపూర్ చరిత్ర!
మొదట సింగపూర్ చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇదో చిన్న దీవి. జస్ట్ ఓ దీవి.. ఇవాళ ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా మారే వరకు ఎన్నో సవాళ్లకోర్చి.. ఇవాళ ప్రపంచాన్నే సవాల్ చేసే స్థాయిలో వృద్ధి చెందింది. సుమారు 14వ శతాబ్దంలో మొదటిసారి సింగపూర్ గురించి రికార్డులున్నాయని చెప్తారు. 1819లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సింగపూర్‌ను తమ వాణిజ్య స్థావరంగా ఏర్పాటు చేసింది. తర్వాత ఇది బ్రిటిష్ వలస పాలనలో చేరింది. 1965లో, సింగపూర్ మలేషియా నుంచి విడిపోయి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇది ఒక ఆర్థిక కేంద్రంగా ఎదిగింది.
ప్రస్తుతం సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటి! అంతర్జాతీయ వాణిజ్యం, ఫైనాన్స్, టెక్నాలజీ, పర్యాటక రంగాల్లో అగ్రగామి!. దేశం చిన్నదైనా.. సాధించిన అభివృద్ధి విధానాలు, సాంకేతికత, చారిత్రక వారసత్వం అన్నీ కలిపి ఇప్పుడో అద్భుతమైన ప్రోగ్రెసివ్ డెెవలప్ మెంట్ కు చిహ్నంగా నిలబడింది.
మొదటి రోజు.. మెరీనా బే స్యాండ్స్!
MRT(మాస్ రాపిడ్ ట్రాన్సిట్) లో మా సింగపూర్ పర్యటన ప్రారంభమైంది. మెరీనా బే శాండ్స్ మా మొదటి రోజు ట్రిప్ . ఇది సింగపూర్ ఐకానిక్ నిర్మాణాల్లో ఒకటి. మూడు గోపురాలతో ఉన్న ఈ హోటల్ నిర్మాణం.. ఆకాశంలో ఒక నావలా కనిపిస్తుంది. 57వ అంతస్తులో ఉన్న స్కైపార్క్ నుండి నగర దృశ్యాలను చూడటం ఒక అద్భుతమైన అనుభవం. ఇక, మెరీనా బే ప్రాంతం పూర్తిగా ఆధునిక నగర శిల్పంతో మిరుమిట్లుగొల్పుతుంది. ఇక్కడ నదిలో పడవ ప్రయాణం, లైటింగ్ షోస్, ఆకాశ సీమ నుండి ఆవిర్భవిస్తున్న సిటీ స్కైలైన్ అన్నీ అనుభవిస్తేనేగానీ అనుభూతి చెందలేని అద్భుతాలు. అనుభవాన్ని అందిస్తాయి… ఇక పక్కనే ఉన్న గార్డెన్స్ బై ద బే అనేది కూడ ఒక అందమైన అద్బుతం అనే చేప్పాలి.. ఇక్కడ ఫ్లవర్ డోమ్‌లు ఇక, క్లౌడ్ ఫారెస్ట్ ఓ మ్యాన్ మేడ్ వండర్! రాత్రి సమయమంతా.. సూపర్‌ట్రీస్ వెలుతుర్లు జిగేలుమనిపిస్తాయి.

రెండో రోజు.. యూనివర్సల్ స్టూడియోస్!
సింగపూర్‌లోని యూనివర్సల్ స్టూడియోస్… ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన థీమ్ పార్క్. ఇది కేవలం చిన్నపిల్లలకే కాదు.. పెద్దలు కూడా కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేసే అమ్యూజ్ మెంట్ పార్క్! ఇందులో హాలీవుడ్, న్యూయార్క్, మడగాస్కర్ వంటి వివిధ సినిమాల నేపథ్యాలను తెలుసుకోవచ్చు!
ఇక్కడ ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది.. ట్రాన్స్‌ఫార్మర్స్ రైడ్! ఇది మనల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది. ఓ అడ్వెంచరస్ రైడ్. ఈ రైడ్లు మన్నల్ని నిజమైన సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. దాంతో పాటు.. జురాసిక్ పార్క్ కూడా చూసి తీరాల్సింది. మొత్తంగా ఈ రైడ్ ఎంజాయ్ మెంట్ మాటల్లో వర్ణించలేని ఓ అనుభూతి! యూనివర్సల్ స్టూడియోస్ లోని ఒక్కో ప్రాంతం.. ప్రతీక్షణం.. ఏదో ఓ కొత్త ఆకర్షణ మనల్ని అటువైపుగా అయస్కాంతత్వానికి గురిచేస్తుంది. అయితే, కేవలం థ్రిల్లింగనేది రైడ్స్ తోనే కాకుండా.. అందమైన ఆర్కిటెక్చర్, ఆహ్లాదకరమైన వాతావరణంతో మనసును ఉల్లాసపరుస్తుంది. అన్ని దేశాల సందర్శకులను ఇక్కడ చూడొచ్చు! అది ముగియగానే.. ఓపెన్ టాప్ బిగ్ బస్ ఎక్కాం. సింగపూర్ అందాలు ఆ నైట్ టైంలో ఓ విజువల్ వండర్! అలా విద్యుద్దీపకాంతుల్లోని రంగుల రంగుల భవనాలను.. సింగపూర్ అందాలను పూర్తిగా ఆస్వాదిస్తాం.
మూడో రోజు.. సెంటోసా ఐలాండ్!
ఇక మూడో రోజు మోనో రైలులో ప్రయాణం! సెంటోసా ఎక్స్ ప్రెస్ లో సెంటోసా ఐలాండ్ చేరుకున్నాం. అక్కడి నుండి కేబుల్ కార్ జర్నీ మరో థ్రిలింగ్! సింగపూర్ నగరం మధ్యలో నుండి కేబుల్ కార్ వెళ్తుంటే.. సింగపూర్ పోర్ట్ వ్యూ, సీటి వ్యూ ఓ విజువల్ ఫీస్ట్! ఇక సెంటోసాలో సెంటోసా రిసార్ట్ వరల్డ్, సిలోసో బీచ్ మరింత ప్రత్యేకం!. ఉదయం నుండి సాయంత్రం వరకు అలరించే ఎన్నో కార్యకలాపాలను ఇక్కడ చూడొచ్చు! సిలోసో బీచ్ లో సాయంత్రం వరకు ఉండి.. అద్భుతమైన సూర్యాస్తమయాన్ని చూసి తీరాల్సిందే! మేము వెళ్లిన సమయంలో ఉక్కపోత ఎక్కువ ఉండటంతో.. చాల ఇబ్బంది పడినా.. బీచ్ అందాలు, సెంటోసా మాయాలో అదో పెద్ద శ్రమగా అనిపించలేదు.

నాల్గో రోజు.. చైనా టౌన్, లిటిల్ ఇండియా!
నాలుగో రోజు మా పర్యటనలో చరిత్ర, సంస్కృతి, మరియు షాపింగ్ ఒకటే చోట అనుభవించడానికి అవకాశం కలిగింది. చైనా టౌన్, లిటిల్ ఇండియా వంటి ప్రాంతాలు సింగపూర్‌లో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. చైనా టౌన్ లో రకరకాల షాపింగ్ కు కాదు.. అక్కడి సంస్కృతిని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కూడా ఇస్తుంది. లిటిల్ ఇండియాలో పూర్తిగా భారతీయ వాతావరణాన్ని చూస్తాం. రహదారుల వెంట ఉండే భారతీయ స్టోర్స్, ఆహార పాకాల రుచులు అన్నీ భారతదేశాన్ని గుర్తుచేశాయి. ఇక్కడి మార్కెట్లో వెరైటీ వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సాంప్రదాయ వస్తువులున్నాయి. లిటిల్ ఇండియా అనేది భారతీయ సంస్కృతికి ప్రతీకలా కనిపిస్తుంది. ఇక్కడి వీధులకు కూడా తమిళుల పేర్లుండటం ఆశ్చర్యానికి గురి చేసింది.
మలేషియాకు ప్రయాణం!
ఇక ఆ నాలుగు రోజుల సింగపూర్ జ్ఞాపకాలతో.. మా పర్యటనలో మరో దేశమైనా మలేషియాకు బయల్దేరాం! అది నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం!!



