ఆ గంగ పోటీ పడ్డదంతా.. ఆ షహనాయ్ నాదంతోనే!

ఏ. రాజాహుస్సాన్… ✍️

ఆయన షెహనాయ్ వినందే కాశీవిశ్వేశ్వరుడు నిద్ర లేవడు!
గంగమ్మకు ఆయన షెహనాయి చైతన్యగీతి!!

ఆయన లేరు.ఆయన షెహనాయి స్వరం
మాత్రం ఇప్పటికీ వినిపిస్తూనే వుంది..‌ ఎప్పటికీ వినిపిస్తూనే వుంటుంది.


ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్…షెహనాయితోనే అక్కడ
కాశీవిశ్వనాథుడు నిద్ర లేస్తాడు. ఆ షహనాయి చెవిలో పడందే గంగమ్మ మేల్కొని ఉరకలెత్తదు.

కాశీ అంటే..కాశీ విశ్వనాథుడే కాదు .బిస్మిల్లాఖాన్ కూడా! ఆయన షెహనాయి నాదం కూడా!!

భారతీయ సంస్కృతిలోని గొప్పదనం గురించి చెప్పినప్పుడు.. వారణాసిలోని హిందూ, ముస్లిం
సహన సంస్కృతి గురించి చెప్పుకోవాలి. కులాలు, మతాలనికాట్లాడుకుంటూ.. మారణహోమాలకు తెగబడుతున్న కాలంలో కాశీలోని… సహన సంస్కృతి గురించి చెప్పుకోవడమేకాదు.. ఆచరించి చూపాలి.

అక్కడ కాశీవిశ్వేశ్వరుడు, బిస్మిల్లా ఖాన్ కు మధ్య ఉంది.. విడదీయలేని అనుబంధం. గంగమ్మ తల్లి ముద్దుబిడ్డ బిస్మిల్లా ఖాన్. ఆయన షెహనాయి వినందే ఆ ప్రవాహం వినసొంపైన సంగీతాన్నందుకోలేదు. అంతగా బిస్మిల్లాఖాన్, గంగమ్మ బంధం బలపడి, భావితరాలకు ఆదర్శంగా నిలిచింది.


జుగల్బందీ!

మీరెప్పుడైనా.‌. కాశీకి వెళితే గంగామాయి గలగలు.. బిస్మిల్లా ఖాన్ సరిగమల జుగల్బందీని వినడం మిస్ కావొద్దు. బిస్మిల్లాఖాన్ పేరులో అల్లాః ఉన్నా.. ఆయన కొలిచేది సంగీత సరస్వతిని. గంగ, కాశీవిశ్వేశ్వరుడు ఆయనకు రెండుకళ్ళు.

బిస్మిలాంతరంగ తరంగమౌను గంగ.. అంటాడు సాంధ్యశ్రీ!
బిస్మిల్లాఖాన్ కు సంగీతం ప్రాణం. షెహనాయ్ ఊపిరి. సంగీతానికి భాష, కుల, మత బేధాలు లేవని చాటి చెప్పిన మహానుభావుడు బిస్మిల్లాఖాన్!


ఆయన పేరు వింటే చాలు…షెహనాయ్ గానం లీలగా మదిలోకొస్తుంది. ముస్లిమైనా.. తొలుత భారతీయుడు. ఈ మట్టిలో పుట్టి, ఈ మట్టిలో పెరిగిన సంగీత సుగంధమతడు.
భారతీయ సంస్కృతిని ఒంట బట్టించుకున్న భారతరత్నం! భారతీయ సంగీత ఆత్మజుడు!!


ఆయన ఎక్కని సంగీత శిఖరాల్లేవు! ఆయన మునగని షెహనాయ్ లోతుల్లేవు!!

భారతీయ సంస్కృతికి ఆయన జీవితం ఓ సందేశం!
సంగీత సరస్వతి బిస్మిల్లా ఖాన్ గారి అంతరంగంలో గంగమ్మ ఉంది. కాశీ గంగానది ఒడ్డున కూర్చొని కాశీనాథుడి సన్నిధిలో షెహనాయ్ ఊదుతుంటే.. గంగమ్మ తల్లి అలలు అలలుగా ఎగిసొచ్చి ఆ గానాన్ని వింటుంది. ఆ షెహనాయ్ నాదం.. క్రమక్రమవర్ధితమై, దిగంతరములు రోదసీ కుహరాన్ని ఆక్రమించింది. ఆ దివ్యనాదం మధుర సంకేత వనాంతరమ్య కోకిలారావ జనిత సంగీతమవుతుంది.
అంతెందుకు? బిస్మిలాంతరంగ తరంగ మౌతుందట.. ఆ గంగమ్మ తల్లి!

సంగీత సరస్వతీ ఆరాధకుడు!


“నేను పుట్టుకతో మహమ్మదీయుడ్ని కావొచ్చు.. నేను సరస్వతీ దేవి ఆరాధకుడను. ఆమెను తలవనిదే నారోజు ఆరంభం కాదు.. సంగీతానికి భాష, మత భేధాలు లేవు. నాది పుట్టుకతో సంగీత వారసత్వం. భారతీయత అంతా నా సంగీతంలో, నా రక్తంలో నిండి ఉంది. నన్ను నా దేశప్రజలు అందరూ తమ ఇంట్లో సభ్యుడిలా ఆదరించారు. మనం భారతీయులం. భరతమాత బిడ్డలం.” అంటారు బిస్మిల్లా ఖాన్.

అమెరికాలో అన్నీ ఉన్నా… గంగ, కాశీవిశ్వేరుడేరీ..?


ఓ సారి ఆయన అమెరికాకు వెళితే అక్కడి వాళ్ళు ఖాన్ సాబ్ షెహనాయికి ఫిదా అయ్యారు. అంతేకాదు.. మీరు తిరిగి ఇండియాకు వెళ్ళొద్దు.. మాతోనే ఇక్కడ వుండండి. మీకు కావాల్సినవన్నీ సమకూరుస్తాం. ఇక్కడ ఓ వీధికి మీ పేరు కూడా పెట్టి గౌరవంగా చూసుకుంటాం” అన్నారట!

దానికి బిస్మిల్లా ఖాన్ గారు చెప్పిన సమాధానం వింటే… ఖాన్ సాబ్ గారి దేశభక్తి, కాశీ పట్ల ఆయన ప్రేమ అర్థమైతుంది!

“అయ్యా! నేను ఇక్కడ వుంటే ఓ వీధికి నా పేరు పెడతామంటున్నారు. మంచిది. అయితే
నేను రోజూ దర్శించే కాశీ విశ్వనాథుడు ఇక్కడ ఉన్నాడా? నేను ప్రతీ రోజూ మునిగే గంగను ఇక్కడకు తేగలరా? పైగా “గంగా మాత లేకుండా, విశాలాక్షి విశ్వనాధుల దర్శన లేకుండా నా షెహనాయ్ పలకదు. నాకు నా దేశంలో ఉండటమే గౌరవం” అన్నారట బిస్మిల్లాఖాన్!


“మానవాళి లేకున్నా, సంగీతం బతుకుతుంది.
సంగీతానికి కులం లేదు, మతం లేదు” అంటారు బిస్మిల్లా ఖాన్. తన భార్య చనిపోయిన తర్వాత షెయనాయ్ నే తన బేగంగా భావిస్తున్నానన్నాడు.‌ ఖాన్ సాబ్ కన్నుమూసినప్పుడు ఆయన ప్రాణంలో ప్రాణమైన ‘షెహనాయీ’ ని కూడా ఆయనతో కలిపి పూడ్చిపెట్టారు. అంతగా విడదీయలేని ఆత్మీయాను బంధం ఆయనది షెహనాయీతో!

ఎర్రకోటపై షెహనాయ్ రాగాలు!

జనవరి 26 న భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా, ఎర్రకోటలో కాఫీ రాగాన్ని తన షెహనాయిపై ఆలపించేవారు. ఆయన జీవించి ఉన్న కాలంలో దాదాపు ప్రతి ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట వద్ద బిస్మిల్లా ఖాన్ చేసే షెయనాయ్ వాద్య కచేరీని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసేది. జెండా
వందనం తరువాత ప్రధానమంత్రి ప్రసంగం తరువాత ఖాన్ సాబ్ కచేరీ విధిగా వుండేది.

తీరని కోరిక!
అమర వీరులకు నివాళిగా ఇండియా గేట్ వద్ద కచేరీ చేయాలన్నది బిస్మిల్లాఖాన్ చివరి కోరిక. కానీ ఆఖరికి ఆ కోరిక తీరకుండానే బిస్మిల్లాఖాన్ ఆగస్ట్ 21, 2016న తుదిశ్వాస
విడిచారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles