కళా దర్శకుడి ప్రాధాన్యతను పెంచినవాడు: తోట తరణి.. ఓ ఇంట్రెస్టింగ్ జర్నీ!

పొన్నియన్ సెల్వన్ సినిమాకు వెళ్లామనుకోండి.. చోళుల రాజరిక కళావైభవం మనల్ని కట్టిపడేస్తుంది. మధుర మధురతర మీనాక్షీ కంచిపట్టున కామాక్షీ అంటూ వేటూరీ గీతంపై కీర్తీరెడ్డి నృత్యం ఆడుతుంటే.. భక్తులతో కిటకిటలాడే అంతటి గుళ్లో అర్జున్ సినిమా షూటింగ్ కు అవకాశమెలా దొరికిందానని అనుమానం కల్గుతుంది. కానీ, అది సెట్టింగని తెలిశాక అంతకంటే ఆశ్చర్యమేస్తుంది. శివాజీ సినిమాలో సహానా అంటూ ఒక కొత్త ఊహా జగత్తులోకి మనల్ని లాక్కెళ్లినా.. అర్జున్ సినిమాకొచ్చిన వీక్షకుడిని మధురై తీసుకెళ్లినా… చోళుల కాలంలోకి మనల్ని టైం మిషన్ ఎక్కించి వెనక్కి మళ్లించినా.. దానివెనుక ఓ కళా దర్శకుడున్నాడు. ఆయనే దక్షిణభారతం గర్వించే ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ పద్మశ్రీ తోట తరణి.

ఇప్పుడెందుకాయన గురించంటారా..?

ఫ్రాన్స్ ప్రభుత్వం తోట తరణి కళాదర్శకత్వానికి మెచ్చి ప్రతిష్ఠాత్మక షెవలియర్ అవార్డుతో సత్కరించింది.

నాయకుడు వంటి గ్యాంగ్ స్టర్ సినిమాల్లోని వాస్తవిక నేపథ్యం నుంచి… దశావతారంలోని రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడంటూ మూడ్ ని బట్టి విజువల్ ఎఫెక్ట్స్ అన్నింటిలోనూ ఆ తరణీ కళారూపం మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంది. సినిమా 24 క్రాఫ్ట్స్ లో ఒకటైన ఆర్ట్ డైరెక్షన్ కు.. ఓ హీరో, హీరోయిన్, విలన్, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడికి దక్కాల్సినంత గుర్తింపు మన దగ్గర ఏనాడూ కానరాదు. కానీ, ఓ ఆర్ట్ డైరెక్టర్ అవసరమెంతో.. ఎంత గొప్ప కళా దర్శకుడుంటే ఓ గొప్ప సినిమాను మరింత గొప్పగా మార్చవచ్చో తరణి సినిమాలను తరచి చూసినవాళ్లకు అర్థమైంది. ఆ తర్వాత కళా దర్శకుడికీ పెద్దపీట వేసే సంస్కృతికి బీజం పడింది.

సరిగ్గా 61 ఏళ్ల ఇండస్ట్రీ అనుభవం తోట తరణిది. తెల్లగడ్డంతో రుషిలా కనిపించే తాను… తన పనినీ ఓ రుషి తపస్సులా చేయడమే ఆయన గురించి ఇవాళ మనం చెప్పుకునేందుకు కారణం.

తన తండ్రి తోట వెంకటేశ్వర్ రావుతో కలిసి 25 ఏళ్లు పనిచేసిన తోట తరణి… కేవలం ఆయన ప్రభావమే తనపై ఉండొదన్న భావనతో మరికొందరు కళాదర్శకుల వద్దా పనిచేశాడు. పలువురు దిగ్గజాల వద్ద పనిని ఆకళింపు చేసుకుని… ఆ తర్వాత తానే స్వతంత్ర కళా దర్శకుడిగా ఎదిగాడు. ఇండియాలో రెండు చేతుల వేళ్లలా కనిపించే కేవలం పది మంది కళాదర్శకులైన సాబు సిరిల్, నితిన్ దేశాయ్, బన్సీ చంద్రగుప్త, రెమియాన్, బెన్నీ మ్యాథ్యూస్, సమీర్ చందా, ముత్తురాజ్, అపర్ణా రైనా, వాసిక్ ఖాన్, రాజీవ్ అంచల్ పేర్ల సరసన తన పేరు నిలుపుకోవడమే కాదు.. ఈ పది మంది ఆర్ట్ డైరెక్టర్లనూ తన కళాత్మక దర్శకత్వంతో అబ్బురపర్చినావుడు తోట తరణి. అదే సమయంలో అలాంటి వారందరి నుంచీ ఇంకా నేర్చుకోవాలనుకునేవాడు ఈ కళా పిపాసి.

మోనాటనీ గిట్టని తరణి!

రోజూ ఒకే రుచి ఇష్టపడగలదా జిహ్వచాపల్యం కల్గిన నాలుక..? అలాగే, తరణి అభిరుచులు కూడా ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి తగ్గట్టుగా పరిభ్రమిస్తుంటాయి. అంతే వేగంగా మారిపోతాయి. రోజూ ఒకే మెనూ ఉంటే ఏం బాగుంటుంది.. ప్రతీరోజూ కొత్త మోనూ సిద్ధం చేసుకోవాల్సిందేనన్న ఫిలాసఫీ తోట తరణిది.

తాను ఇష్టపడే పనిచేస్తాడు. అంతే కష్టపడతాడు. అలా కళాదర్శకుడిగా తాను సాధించినవి తనకు ఆత్మసంతృప్తినిచ్చినా… వాటిని తానెంతో ప్రేమించినా… నేర్చుకోవాల్సిందీ, చేయాల్సిందీ ఇంకా ఎంతో ఉందనే ఒక స్పృహ తరణిని నిత్య విద్యార్థిగా నేటికీ కళా దర్శకత్వంలో ముందుకు తీసుకెళ్తోంది.

సినిమాటోగ్రఫీ ఎడమ కన్నైతే.. ఆర్ట్ డైరెక్షన్ కుడి కన్ను!

ఇదే మాటంటాడు తోట తరణి. ప్రతీ సినిమాకు వైవిధ్యంగా కొత్త ఆలోచనలతో పనిచేయడమే ఆనందం. కానీ పని మధ్యలో ఏర్పడే ఆటంకాలు, అంతరాయాలను మెల్లిగా దాటుకుంటూనే.. వేగంగా కాన్సెప్ట్ డిజైన్ చేయడం, వాటిని విజువల్ ఇంపాక్ట్ ఉండేలా తీర్చిదిద్దడం కత్తిమీద సాము అన్నది తరణి చెప్పే మాట.

తానెప్పుడూ పూర్తి స్క్రిప్ట్ చదవనని.. కథ ఆరంభం, మధ్యలో వచ్చే సన్నివేశాలు, ముగింపు గురించి మాత్రమే దర్శకుడితో సంపూర్ణంగా చర్చించి ఆ ఫోకస్డ్ అంశాలపై మరింత ఫోకస్డ్ గా పనిచేస్తానంటాడు.

మైండ్ లో ఉన్న విజువల్ స్కెచ్ ప్రకారమే ముందుకెళ్తాడు. ఆ తర్వాతే బడ్జెట్ గురించి ఆలోచన. బడ్జెట్ మించకుండా చూడాలనుకున్నా.. కొన్నిసార్లు సెట్టింగ్స్ లో రియలిస్టిక్ ఫీల్ రావడానికి మించక తప్పదు. మణిరత్నం అంజలి సినిమాలో కేవలం ఐదురోజుల్లో సెట్స్ పూర్తి చేశాడు . అలా సెట్టింగ్స్ ను అతి వేగంగా నిర్మించి ఇవ్వగల్గే ఆర్ట్ డైరెక్టర్ గా కూడా తోట తరణి మిగిలిన కళా దర్శకుల కంటే మిన్న.

సెడ్రిక్ గిబ్సన్ పని తీరంటే తరణికి మక్కువ!

తరణి తన తండ్రి దగ్గర ఒకే చోట పని చేయడం వల్ల మొనాటనీ ఆవహిస్తుందని ఇతరుల వద్దా పనికి కుదిరాడే తప్ప.. తనకు ఎక్కువ ప్రేరణనిచ్చింది తన తండ్రి వెంకటేశ్వర్ రావే. అందుకే తండ్రితో కలిసే ఎక్కువ కాలం పనిచేశాడు. మాధవపెద్ది గోఖలే, సూరపనేని కళాధర్, గంగ వంటి వారినీ ఇష్టపడుతుండేవాడు తోటతరణి. జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రొడక్షన్ డిజైన్ చేసిన కేన్ ఆడమ్స్ అంటే అభిమానించే తరణిని.. The Wizard of Oz అనే అమెరికన్ మ్యూజికల్ ఫాంటసీ సినిమాలో సెడ్రిక్ గిబ్సన్ డిజైన్స్ ఎంతో ఆకట్టుకున్నాయట.

ప్రశాంత చిత్తంతో హేపీగా పనిచేస్తే.. మంచి పనీ వస్తుంది.. ఆత్మసంతృప్తీ లభిస్తుంది.. ఇదీ స్థూలంగా తోట తరణి ఫిలాసఫీ.

షెవలియర్ అవార్డ్ కథేంటి..?

తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం కళలు, సాహిత్యం, సైన్స్ వంటివాటికిచ్చే ప్రిస్టేజియన్ షెవలియర్ అవార్డుతో తోట తరణిని నవంబర్ 13న సత్కరించింది. గతంలో ఈ పురస్కారాన్ని అందుకున్న వాళ్లల్లో శివాజీ గణేశన్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ. కమల్ హాసన్, ఐశ్వర్యారాయ్, కల్కి కొచ్లిన్ వంటి కొందరు ప్రముఖులు మాత్రమే ఉండగా.. ఇప్పుడీ పురస్కారం తోట తరణిని వరించింది.

ఆక్స్ ఫర్డ్ లో తోట తరణి గీసిన పెరియార్ చిత్రమెంత మెరుస్తుందో.. ఇప్పుడు తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వం షెవలియర్ అవార్డునందజేయడంతో అంతకన్నా రెట్టింపైన ఆనందం తనలో కల్గుతోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన X ఖాతాలో అభినందించాడు. ఒక సత్యజిత్ రే, ఓ షారుక్ ఖాన్, ఓ కమల్ హాసన్, ఓ అమితాబచ్చన్ వంటివారి సరసన తోట తరణి చేరడంపై ఆనందం వ్యక్తం చేశాడు.

తోట తరణి సాధించిన విజయాలు!

తోట తరణి కళా దర్శకత్వం వహించిన సినిమాల్లో శుభలేఖ, సాగర సంగమం, గీతాంజలి, దళపతి, ప్రేమికుడు, భారతీయుడు, రోజా, బొంబాయి, అర్జున్, చూడాలని ఉంది, అతడు, శివాజీ, చంద్రముఖి, రుద్రమదేవి, దశావతారం, కాలాపానీ వంటి ఎన్నో క్లాసిక్స్ కనువిందు చేశాయి. రెండు జాతీయ అవార్డులు, మూడు తమిళనాడు రాష్ట్ర అవార్డులు, మూడు నంది అవార్డులు, ఒకటి కేరళ రాష్ట్ర అవార్డ్ వంటివెన్నో అందుకున్నారు. 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

సొమ్మొక్కడిది సోకొక్కడిది సినిమాతో 1978లో తోట తరణి కళా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తమిళంలో 1981లో సింగీతం శ్రీనివాసరావు, కమల్ హాసన్ కాంబోలో రాజా పార్వైతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన బిగ్ మూవీస్ లో పొన్నియన్ సెల్వన్ వన్, టూ సీక్వెల్స్ తో పాటు.. శేఖర్ కమ్ముల కుబేరా, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వంటి చిత్రాలున్నాయి. అలాంటి తరణిని గౌరవిస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వమే ప్రతిష్ఠాత్మక పురస్కారం అందించిన నేపథ్యంలో.. మనమూ ఓసారి అప్లాజ్ తో అభినందించి గౌరవించుకోవాల్సిన సమయమిది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles