ఎంత ప్రధానైనా, రాష్ట్రపతైనా… సామాన్యులనుభవించే రోజువారీ సమస్యలు వారికీ తప్పవు. కొస్సెటి ముక్కు, చురుకైన కళ్లు, పెద్ద నుదురు, చిన్న పెదాలు, నవ్వితే అందంగా కనిపించే చిర్నవ్వు.. ఇన్నీ ఉండి… తలపై వెంట్రుకల్లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అప్పుడదే ఇబ్బందిగా మారుతుంది. మన దేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూను కూడా ఆ బాధే పట్టి పీడించింది. ప్రధాని కాకమునుపు ముచ్చట ఇది. ఒకానొక సమయంలో నెహ్రూ తన తండ్రికి ఏం లేఖ రాశారో తెలుసా…? తెలుసుకోవాలంటే ఈ కథ చదివేయండి.

సరిగ్గా 1911లో, తన 21 ఏళ్ల వయస్సులో జవహర్ లాల్ నెహ్రూ తన తండ్రికి ఓ లేఖ రాశారు. భారతదేశ తొలి ప్రధానిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, రాజనీతిజ్ఞుడిగా, న్యాయవాదిగా, రచయితగా, ఒక దార్శనికుడిగా చరిత్రలో నెహ్రూదీ ఓ ప్రధాన స్థానం. కానీ, ఆయనా వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యేవాడు. అవునూ, ఆయన్నూ ఆయన హెయిర్ ఫాలింగే బాగా ఇబ్బంది పెట్టేదట. ఏకంగా ఒక పోరాటమే చేయాల్సి వచ్చింది నెహ్రూ. అందుకు, ఆయన తన తండ్రికి రాసిన లేఖే ఓ ఉదాహరణ.
1911లో నెహ్రూ లండన్ లో చదువుకుంటున్న సమయమది. లండన్ లో 38 గ్లౌసెస్టర్ టెర్రస్ లో నివాసముండే నెహ్రూ ఇన్స్ ఆఫ్ కోర్ట్ స్కూల్ ఆఫ్ లా కళాశాలలో లా చదువుతున్నాడప్పుడు. అదిగో, సరిగ్గా ఆ సమయంలోనే తండ్రికి ఓ లేఖ రాశాడు. సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్ లాల్ నెహ్రూ అనే పుస్తకంలో కనిపించిన ఈ విషయం మధ్యలో సోషల్ మీడియాలోనూ మళ్లీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇంతకీ నెహ్రూ లేఖలో ఏం రాశాడు..?
తలపైన నా జుట్టు పరిస్థితేం బాగా లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. నేను రెండుసార్లు స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లాను. మళ్లీ కూడా వెళ్లాలనుకుంటున్నాను. నేను ఇప్పటికే కోల్పోయిన జుట్టును తిరిగి పొందే అవకాశం కచ్చితంగా లేదు. కాకపోతే, మిగిలిన ఆ మాత్రం జుట్టును కాపాడుకోవాలన్నదే నా తాపత్రయం. నాన్న మీరు నాకేం తల నూనెలు అక్కడినుంచి పంపించే ప్రయత్నం చేయకండి. నూనె పెట్టుకోవడం నాకు సుతారమూ ఇష్టం లేదు. పైగా ఆ నూనెలతో నా వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయన్న నమ్మకం అంతకన్నా లేదు. అసలు వేర్లే లేకపోతే జుట్టు పెరుగుతుందన్న ఆశే అవసరం లేదు. ఏ లోషనైనా చేయగల్గేది కేవలం జుట్టును శుభ్రంగా ఉంచగల్గే ప్రయత్నం చేయడానికి.. అలాగే, కొంచెం జుట్టు పెరగుతుందన్న ఆశలు కల్పించడానికి మాత్రమే. కిషన్ భాయ్ నాకు ప్రత్యేక చికిత్స అందించాడు. కానీ, నాకది పెద్దగా ప్రయోజనమేమీ కల్గించలేదు. నా జుట్టుపై దృష్టి పెట్టి పెట్టీ నేను విసుగు చెందాను. ఆ సమయాన్ని, డబ్బును ఇంకా ఏదైనా మెరుగైన పద్ధతిలో సద్వినియోగం చేసుకుని ఉంటే బాగుండేదనిపించింది.
ప్రేమతో మీ కుమారుడు, జవహర్ లాల్ నెహ్రూ!
ఇదీ లెటర్ సారాంశం.
ఈ విషయం గతంలో Xలో వైరల్ టాపిక్ గా ట్రెండైంది. యవ్వనంలో ఉండగా నెహ్రూ లాంటి వ్యక్తి కూడా తమలాగే హెయిర్ ఫాలింగ్ గురించి ఆందోళన చెందడం… ఇప్పుడు ఆందోళన చెందినవారికి కాసింత సాంత్వన చేకూర్చే విషయం.
జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ ద్వారా సంకలనం చేయబడిన సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్ లాల్ నెహ్రూ పుస్తకాలు సంపుటాలుగా విడుదల కాగా.. 1903 నుంచి 1924 వరకు నెహ్రూ ఉత్తర, ప్రత్యుత్తరాలు, ప్రసంగాలు, రచనల సమాహారంగా ఈ పుస్తకం ప్రచురణైంది.
ముఖ్యంగా ఇంగ్లాండ్ లో నెహ్రూ గడిపిన పాఠశాల, కళాశాల రోజులు.. అలహాబాద్ బార్ అసోసియేషన్, అక్కడి హైకోర్ట్ లో ఆయన ప్రాక్టీస్ వంటి పలు అంశాలను సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్ లాల్ నెహ్రూ బుక్ ప్రస్తావిస్తుంది. అలాగే, భారతదేశంలో ఆ రోజుల్లో జరిగిన పలు ఘటనలు, ఆనాటి అన్నదాతల ఆందోళనలు, నెహ్రూపై మహాత్మాగాంధీ ప్రభావము, తద్వారా తను జాతీయవాదిగా మారి స్వాత్రంత్ర్య సమరంలోకి దూకడం, జైలు శిక్షలు, కోర్టుల చుట్టూ తిరగడం, రాజనీతిజ్ఞుడిగా ఎదగడం వంటి అనేక అంశాలను ఈ బుక్ వెల్లడిస్తుంది.
నెహ్రూ రాజకీయ నాయకుడిగా, దార్శనికుడిగానే కాకుండా స్వతహాగా ఒక రచయిత కూడా కావడంతో తన జీవితంలో జరిగిన ఘటనలు, ప్రజాక్షేత్రంలో ఆయన రాసిన ఉత్తర, ప్రత్యుత్తరాలు వంటి పలు అంశాలు ఆసక్తికరంగా ఇప్పటికీ జనంలో చర్చకొస్తూనే ఉంటాయి.



