ఖర్గ్ పై దాడి.. మరో గల్లీపోలీ అనుభవాన్ని మిగల్చనుందా..?

ఇరాన్ రిఫైనరీ వ్యవస్థను అతలాకుతలం చేస్తే ఆ దేశం పూర్తిగా బలహీనపడిపోతుందనేది ట్రంప్ యోచన. ఆ దేశం ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర ఖర్గ్ ఐలాండ్ లోని రిఫైనరీలది. ఈ నేపథ్యంలో గతంలో బ్రిటన్ తరహాలోనే.. అమెరికా కూడా ఇరాన్ ఉచ్చులో పడుతోందా..?

ఖర్గ్ దీవి ఎక్కుడుంది..?

ఇరాన్ తీరానికి సమీపంలోని ఓ చిన్న దీవి ఖర్గ్. ఇదే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక లక్ష్యం. అమెరికా దళాలతో దాడులు చేయించి దీవిని స్వాధీనపర్చుకోవడం, ఇరాన్ చమురు సరఫరా మార్గాల్ని నిలిపివేయడం, తద్వారా టెహ్రాన్ ను యుద్ధంలో బలహీనపర్చడం ట్రంప్ ఆలోచనలోని వ్యూహం.

వందేళ్ల క్రితం బ్రిటన్ ఏం చేసింది..?

సరిగ్గా వందేళ్ల క్రితం బ్రిటన్ కూడా ఇలాంటి ఓ ప్రయత్నమే చేసి చిత్తుగా వైఫల్యం చెందింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో టర్కిష్ డార్డనెల్స్ జలసంధిని స్వాధీనం చేసుకుని.. అప్పటి ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని బలహీనపర్చాలని యత్నించింది. కానీ, అదే నాడు బ్రిటన్ చేసిన అతి పెద్ద తప్పిదం. గల్లీపోలీ యుద్ధంగా ప్రసిద్ధి చెందిన ఆ ఆపరేషన్ లో లక్షలాది మంది గాయపడ్డారు. వేలాది మంది మరణించారే కానీ.. బ్రిటన్ తననుకున్న లక్ష్యాన్ని సొంతం చేసుకోలేకపోయింది. చివరకు వెనుతిరిగి వెళ్లిపోయింది.

చమురు ఎగుమతల్లో 90 శాతం వాటా ఖర్గ్ దీవి నుంచే!

ఇప్పటికే మనమంతా మీడియా కథనాల ద్వారా విన్న హార్మూజ్ జలసంధి లేదా ఖర్గ్ దీవిపై జరిగే భూసేనల దాడులు కూడా గల్లీపోలీ వంటి ప్రమాదాలనే కళ్ల ముందు ఉంచుతుండొచ్చు. ఎందుకంటే, భూతల దాడుల్లో ఇరాన్ కు ఉన్న సైనిక బలం తక్కువ అంచనా వేయలేనిది. కాబట్టి ట్రంప్ ఆశలు కూడా నాటి గల్లీపోలీ యుద్ధంలో బ్రిటన్ తరహాలోనే అడియాసలయ్యే అవకాశాలే ఎక్కువ అనేది వినిపిస్తున్న వాదన.

1916లో నాటి బ్రిటన్ పెద్దలు కూడా ఒట్టోమన్ సైన్యాన్ని నేటి ట్రంప్ తరహాలోనే బలహీనంగా భావించారు. అదే నాడు వారి పెద్ద పొరపాటైంది.

ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా ఇలాంటి అంచనాలే నెలకొన్నాయి. ఖర్గ్ పై భూసేనల దాడిని ఓ చిన్న యాత్ర అన్నట్టు తనను తాను పెద్దగా అభివర్ణించుకున్నాడు ట్రంప్. నెతాన్యాహూ సైతం ఇరాన్ ను పేపర్ టైగర్ గా అభివర్ణించాడు. కానీ, వీరిద్దరూ గల్లీపోలీ యుద్ధం నుంచి పాఠాన్ని నేర్చుకోలేకపోతున్నారు అనేవారూ లేకపోలేదు.

అసలు గల్లీపోలీ యుద్ధంలో ఏం జరిగింది..?

1915లో బ్రిటన్ ఆధ్వర్యంలో దాని మిత్రదేశాలు టర్కీపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాయి. టర్కీ అప్పట్లో సెంట్రల్ పవర్స్ వైపుంది. నీటిలోగానీ, భూమ్మీదగానీ సైనిక సేనలు విరుచుకుపడే యుద్ధాన్ని ఆంబీఫీబియస్ ఆపరేషన్ గా చెబుతుంటారు. టర్కీ కాకేసన్ ప్రాంతంలో రష్యాపై దాడి చేసే ప్రమాదముందన్న సమాచారంతో.. నాడు రష్యాకు సాయంగా బ్రిటన్, దాని మిత్రదేశాలు గల్లీపోలీ యుద్ధం చేశాయి.

మరి నాడు బ్రిటన్ ప్రణాళికేంటి..?

నౌకాదళాలతో దాడులు చేస్తూ.. సైన్యాన్ని దింపి.. ప్రస్తుతం ఇస్తాంబుల్ గా పేరు మారిన కాన్స్టాంటినోపుల్ ను స్వాధీనం చేసుకోవడం. డార్డనెల్స్ జలసంధిని ఆక్రమించడం, 61 కిలోమీటర్ల పొడవులో ఏజియన్ సముద్రాన్ని బ్లాక్ సీతో కలిపే జలసంధిపై పట్టు సాధించడం బ్రిటన్ సేనల లక్ష్యం.

1915 ఫిబ్రవరి 19న బ్రిటన్, ఫ్రాన్స్ యుద్ధనౌకలు డార్డనెల్స్ పై బాంబుల దాడులకు తెగబడ్డాయి. కొన్ని కోటలు కూడా ఆ దాడుల్లో ధ్వంసమయ్యాయి. దాంతో టర్కీ కూడా తీవ్రంగా ప్రతిఘటించింది. టర్కీ అమలుపర్చిన వ్యూహాలతో సముద్రంలోపల అమర్చిన మైన్స్ మూడు నౌకలను పూర్తిగా ముంచేశాయి. మరికొన్ని నౌకలను తీవ్రంగా దెబ్బతీశాయి.

దీంతో భూసేనల దాడి ఆరంభమైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అలాగే ఫ్రెంచ్ కాలనీల సైనికులు బ్రిటన్ తో కలిసి గ్రీకు దీవి లెమ్నోస్ వద్దకు మూకుమ్మడిగా చేరుకున్నారు.

తీరప్రాంతాల్లో దీటుగా రక్షణ ఏర్పాట్లు చేసిన టర్కీ!

1915, ఏప్రిల్ 25న గల్లీపోలీ ద్వీపకల్పంపై భూసేనలు దాడులు మొదలుపెట్టాయి. కానీ, మొదటి దళంలో 200 మంది సైనికులు వెళ్లితే.. 21 మందే తిరిగి తీరానికి వచ్చారు. ఎత్తైన కొండలపైన టర్కీ సేనలు వ్యూహాత్మకంగా మోహరించి ఉండటంతో మిత్రదేశాలన్నీ ఇరుక్కుపోయి ముందుకు వెళ్లడమే ప్రమాదంగా మారింది. వెనక్కి రావడమూ కుదరని పరిస్థితులు నెలకొన్నాయి. అదే క్రమంలో టర్కీ మరింతమంది సైనికులను మోహరించడంతో.. బ్రిటన్ మిత్రదేశాలన్నింటికీ భారీ నష్టం వాటిల్లింది. బ్రిటన్ సేనాధిపతి ఐన్ హామిల్టన్ 95 వేల మంది అదనపు బలగాలను కావాలని కోరినా.. అంతమంది లేకపోవడమూ నాడు యుద్ధంలో బ్రిటన్ వెనక్కి తిరిగేందుకు కారణమైంది. అప్పటివరకూ మిత్రదేశాలతో కలిసి యుద్ధం చేసిన బ్రిటన్ 1916, జనవరి 9వ తేదీన వెనక్కి మళ్లింది.

అపారనష్టాన్ని మిగిల్చిన గల్లీపోలీ యుద్ధం!

నాడు బ్రిటన్ తో కలిసి మిత్రదేశాల సైనికులంతా 4 లక్షల 80 వేల మంది యుద్ధంలో పాల్గొంటే.. 2 లక్షల 50 వేల మంది గాయపడ్డారు. 46 వేల మంది మరణించారు. టర్కీ వైపు కూడా 65 వేల మంది మృతి చెందారు. అయినప్పటికీ మిత్రదేశాలన్నీ కలిసినా టర్కీని కొట్టలేకపోయాయి. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించ బలమైన సర్పం చలిచీమల చేతిలో చిక్కి చావదే అన్నట్టుగా.. చరిత్రలో నాడు బ్రిటన్ ఓటమి అహంకారంతో విర్రవీగే వారికి ఓ గుణపాఠంలాంటింది.

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ భూసేనల దాడికి దిగితే ఏమవుతుంది..?

ఖర్గ్ లేదా హార్మూజ్ ప్రాంతంలో భూసేనల దాడులు జరిగితే గల్లీపోలీ తరహా పరిస్థితులే ఉత్పన్నమవుతాయి. యూఎస్ఎస్ ట్రైపోలీ అనే ఆంబీఫీబియస్ యుద్ధనౌకలో ఉన్న 2 వేల 200 మెరైన్స్ మార్చ్ 28 నాటికి అంటే ఈరోజు వరకుగానీ మధ్యప్రాచ్యానికి చేరే అవకాశం లేదు. పైగా ఇరాన్ తీర ప్రాంతం ఎత్తైన కొండలతో ఉండటం వల్ల తీరానికి చేరిన సైనికులను.. ఇరాన్ సులభంగా గుర్తించడం ఖాయం. కోటగోడల్లాంటి ఎత్తైన పర్వతాలు.. మరోవైపు, అధః పాతాళాన్ని తలపించే లోయలు, పడిపోయే ఆక్సిజన్ లెవెల్స్ మధ్య.. భారీ ఆయుధాలతో యుద్ధానికి సైన్యం ఎదురొడ్డడమంటే మృత్యువు నోట్లో తల పెట్టినట్టే. 1980లో తమ బందీలను విడిపించే క్రమంలో ఆపరేషన్ ఈగల్ క్లా విషయంలో అమెరికా సైన్యం కుప్పకూలిన అనుభవమూ ఉంది. అందుకే ఖర్గ్ దీవి ఇరాన్ కు ఓ పెట్టని కోటలాంటింది. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ అలాంటి ఏర్పాట్లు చేసుకుంది.

ముఖ్యంగా తీరప్రాంతంలో తన మైన్స్ మోహరించడం
యాంటీ ఆర్మర్, యాంటీ పర్సనల్ మైన్స్ ఏర్పాటు
కావల్సినంత అదనపు బలగాల మోహరింపు
మ్యాన్ ప్యాడ్స్ క్షిపణులు
డ్రోన్స్, మిస్సైల్స్, వేగవంతమైన పడవలు

ఇవన్నింటితో సాచ్యురేషన్ వార్ ఫేర్ కు సిద్ధంగా ఉంది ఇరాన్.

హార్మూజ్ జలసంధి 22 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇదే ప్రత్యర్థులకు ప్రమాదకరం కావచ్చు. చిన్న నౌకలు, మైన్స్, డ్రోన్సే పెద్ద పెద్ద యుద్ధనౌకలను కూడా దెబ్బ తీయవచ్చు.

గల్లీపోలీ యుద్ధం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు!

గల్లీపోలీ యుద్ధం ఒక విషయాన్నైతే స్పష్టంగా చెబుతోంది. తమ దేశాన్ని రక్షించడానికి పోరాడే సైన్యం ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఊహించినంత సులభంగా వెనుకడుగు వేయదు. అలాగే, ప్రత్యర్థులు అతి విశ్వాసంతో ఆ భూభాగం గురించి తెలియకుండా, తక్కువ అంచనా వేయడమూ పెద్ద తప్పిదమే.

కాబట్టి ఖర్గ్ దీవిపై అమెరికా భూసేనలతో దాడికి పాల్పడితే మాత్రం అది అమెరికాకు పర్షియన్ గల్లీపోలీ అనుభవంగా చరిత్రలో మిగలవచ్చన్నదే ఇప్పుడు చర్చ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles