కూల్చేయాలనుకున్నారు.. చివరకు, పద్మశ్రీతో సత్కరించారు: చాంద్ సైనీ ఏం చేశాడు..?

శిల్పాలతో ఉద్యనవనాన్ని నిర్మించిన రాక్‌గార్డెన్ నిర్మాత… పద్మశ్రీ చాంద్ సైనీ!

బాహ్యప్రపంచం కంటపడకుండా నిజాన్ని దాస్తూ తాననుకున్న రాక్ గార్డెన్ ను నిర్మించాలనుకున్నాడు నెక్ చాంద్ సైనీ. కానీ దాస్తే దాగేదా నిజం..? అంతేగా… ? ప్రభుత్వం ఒక దశలో ఏకంగా ఆ గార్డెన్ నే ధ్వంసం చేయాలని నిర్ణయించింది. కానీ చూపరులను కట్టిపడేసేలా అద్భుతంగా తీర్చిదిద్దిన ఉద్యానవన ఇంజనీరింగ్ నిర్మాణశైలి… మెజార్టీ ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వమే వెనుకడగేసింది. ఇవాళ దేశంలోనే అద్భుతమైన రాక్ గార్డెన్ గా అవతరించింది. ఏకంగా ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్నందించేంత ప్రభావితం చేసింది.

వృత్తి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో రోడ్ ఇన్స్ పెక్టర్… కానీ ప్రవృత్తి మాత్రం రోజూ ఉద్యోగం కాగానే ఇదిగో ఇవాళ భారతదేశంలోనే ఓ అద్భుతమైన రాక్ గార్డెన్ గా చెప్పుకునే చండీగఢ్ లోని ఈ ఉద్యానవన నిర్మాణం. పుట్టింది నాటి పంజాబ్ రాష్ట్రంలో… ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న బెరియన్ కలాన్ అనే గ్రామంలో. 1947 భారత విభజన సమయంలో భారత్ కు వచ్చేసింది నెక్ చాంద్ సైనీ కుటుంబం.

1955లో సైనీ కుటుంబం చండీగఢ్‌కు వలస వచ్చింది. ఆ సమయంలో స్విస్, ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లే కొర్బుజియర్ రూపొందించిన ఆధునిక నగరంగా చండీగఢ్ నిర్మాణం జరుగుతోంది. భారతదేశంలోనే చండీగఢ్ తొలి ప్రణాళికాబద్ధమైన నగరం. నెక్ చాంద్ 1951లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో రోడ్స్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం పొందారు.

రోజూ ఉద్యోగం ఐపోగానే కూల్చివేతలు జరిగే భవనాల వద్దకు వెళ్లడం.. అక్కడి దొరికిన మెటీరియల్ లో తనకు అక్కరకొస్తుందనుకున్నదంతా పట్టుకురావడం.. ఇదీ నిత్యం సైనీ పని. తన రాక్ గార్డెన్ కు 1902లో అటవీ సంరక్షణ భూమిగా గుర్తించిన సుఖ్నా సరస్సు సమీపంలో అటవీ ప్రాంతాన్నెంచుకున్నాడు సైనీ. అక్కడ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టేందుకు వీల్లేదు. కానీ, ఎవ్వరి దృష్టి పడకుండా మెల్లిమెల్లిగా తన రాక్ గార్డెన్ నిర్మాణంలో భాగంగా.. 18 ఏళ్లు అధికారుల దృష్టి అటువైపు పడకుండా పని కానిచ్చేశాడు. 1973లో అధికారుల ఫోకస్ అటువైపు పడే సమయానికే అది 13 ఎకరాల్లో ఓ శిల్పకళా తోరణంలా మారిపోయింది.

అయితే చాంద్ రూపుదిద్దిన రాక్ గార్డెన్ ను ఎస్.కే.శర్మ అనే అధికారి గుర్తించారు. అటవీస్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా చాంద్ నిర్మించిన రాక్ గార్డెన్ అక్రమ నిర్మాణమని కూల్చేయాలని అప్పటి ప్రభుత్వం కూడా దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసింది. కానీ రాక్ గార్డెన్ నిర్మాణానికి ఎంత కృషి చేశాడో… ప్రజాభిప్రాయ సేకరణకూ అంతే కష్టపడ్డాడు సైనీ. అదే ప్రభుత్వం చేత అదో గొప్ప పర్యాటక స్థలం కాగలదని గుర్తించేలా చేసి, ఒప్పించాడు. 1975లో అధికారికంగా 18 ఎకరాల్లో నిర్మించిన చండీగఢ్ లోని రాక్ గార్డెన్ ను గుర్తించిన అక్కడి ప్రభుత్వం… 1976 నుంచి దాన్ని పర్యాటకుల సందర్శనార్థం ప్రారంభించింది. ఇప్పుడు లక్షలాది మంది పర్యాటకులతో చండీగఢ్ రాక్ గార్డెన్ ఓ ఫేమస్ వ్యూ పాయింట్.

చాంద్ నిర్మించిన ఈ ఉద్యానవనం రూపు దిద్దుకోవడం వెనుక ఆయన 18 ఏళ్ల శ్రమ, కృషి ఉన్నాయి. 1957లో 12 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ రాక్ గార్డెన్… ఇప్పుడు సుమారు నలభై ఎకరాలకు విస్తరించింది. నెక్ చాంద్ సైనీ కృషికి ఆ తర్వాత మరో యాభై మంది శ్రామికులూ ఆయనకు బాసటగా నిలవడంతో ఈ అద్భుత నిర్మాణం ఆవిష్కృతమైంది. తానుండేందుకు ఓ రాతి పలకల గూటిని ఇంటిలా నిర్మించుకుని… అక్కడే ఉంటూ, తింటూ, పడుకుంటూ… సైనీ కన్న కలే చండీగఢ్ లో సుఖ్నా సరస్సుకు సమీపాన ఉన్న నేటి నెక్ చాంద్ ఉద్యానవనం. చాంద్ తన రాక్ గార్డెన్ నిర్మాణంలో పెద్ద పెద్ద రాళ్లతో పాటే.. గాజువస్తువులు, గాజులు, టైల్సు, సిరామిక్ కుండలు, సింకులు, విద్యుత్ వ్యర్థపదార్థాలు, క్షౌరశాలల్లో కత్తిరించిన జుట్టు, ఖాళీ సీసాలు, పెంకులు ఇలా కాదేదీ గార్డెన్ కు అనర్హమన్న రీతిలో ముడిపదార్థాలను వాడి ఒక అందమైన రాక్ గార్డెన్ నిర్మాణం చేశాడు. తనకున్న ఇంజనీరింగ్ నైపుణ్యంతో దేశానికే తలమానికం చేసిన ప్రత్యే’కథ’య్యాడు నెక్ చాంద్ సైనీ.

ఇవాళ కన్నులపండువలా కనిపించే చండీగఢ్ రాక్ గార్డెన్ నిర్మాణం కోసం చాంద్ సైనీ తపస్సే చేశాడు. ఏడేళ్ల పాటు ఆయన ఉద్యోగ విధులు ముగిసిన అనంతరం.. కొండల దిగువన తిరుగుతూ.. పక్షులు, వివిధ రకాల జంతువులు, మనుషుల ఆకారాలను పోలి ఉన్న రాళ్ళను గుర్తించేవాడు. తన సైకిల్ పై తీసుకువచ్చి రాక్ గార్డెన్ ప్రాంతంలో చేర్చేవాడు. అవన్నింటినీ 20 వేల కళాకృతులుగా చూపు తిప్పుకోలేనంత అందంగా రూపుదిద్ది… 12 ఎకరాల్లో నాట్యకారులు, సంగీత వాద్యకారులు, వివిధ జంతువులు, రాతి మేడలు, తోరణాలు, జలపాతాలు, సింహాసనాలు, కళారూపాలతో విస్తుగొలి మానవ ప్రతిసృష్టే చేశాడు సైనీ.

ఒక సన్నటి దారి గుండా వెళ్తుంటే.. ముందు ఏమి వస్తుందో తెలియని ఉద్విగ్నతతో.. మరొక్క క్షణం ఆగితే.. కళ్ళముందు మరో అద్భుత ప్రపంచం ఆవిష్కరించే రీతిలో అడుగడుగునా అబ్బురపర్చేలా ఈ రాక్ గార్డెన్ ను నిర్మించాడు. ఒకే ఒక్క మనిషి ఇంత గొప్ప అద్భుతాన్ని సృష్టించగలడా… ఏమా ఊహ అనేట్టుగా ఓ దృశ్యకావ్యంలా నిలుస్తోంది నేటికీ చండీగఢ్ రాక్ గార్డెన్. ప్రభుత్వానికి తెలవకుండా ఓ అటవీప్రాంతంలో ఓ ఉద్యానవనాన్ని నిర్మించాలన్న నెక్ చాంద్ సైనీ గట్టి సంకల్పమేంటోగానీ… ఆ రాక్ గార్డెన్ కూల్చాలనుకుని నిర్ణయించుకున్నవారినే అబ్బురపర్చాడు. వారే దాన్ని ఓ పర్యాటక కేంద్రంగా ప్రకటించే కళానైపుణ్యంతో విభ్రమకు గురిచేశాడు. సైనీ అద్భుత ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని గుర్తించి.. ప్రభుత్వం 1984లో పద్మశ్రీతో సత్కరించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles