ఒక గ్రామం – ఒక దేవత
………………………………………………………
డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి ✍️
అనగనగ షాపూర్ అనే మారుమూలపల్లె.
అడవుల్ల నెలవైనది, అత్యంత స్వచ్ఛమైనది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉత్తరపు కొసన ఉన్నవూరు.
ఒక రెండువందలయేండ్లకు ముందుముచ్చట…
అడవులలోని మారుమూల పల్లెలకూ విస్తరించిన
ఆంగ్లేయుల పాలనలోన, ఆ ఊరూ ఒక అంతర్భాగం.

కొండలు గుట్టబోర్లపైన పశువులు మేపుకునేవారిమీద
ఆంగ్లేయులు ఆంక్షలు విధించి, పుల్లరి వసూలుచేసేవారు.
పశుపోషణమీద ఆధారపడ్డ అడవిపల్లెకు అదొక సంకటం.
ఊరుదాపునున్న బోరుమీద పశువులను మేపుకుంటున్న
ఓ పెండ్లీడు బాలిక, ఆంగ్లేయుల కంటబడ్డది. వెంబడించారు.
వాళ్లు ఆమెను ప్రశ్నించారు, ఆమె తిరిగి ఎదురు ప్రశ్నించింది.
కోపించిన అధికారులు ఆమెను బలాత్కరించపూనుకున్నారు.
ఆ బాలిక వారికి చిక్కకుండా,పక్కనున్న గుట్టకు పరుగుపెట్టింది.
అహం దిబ్బతిన్న ఆంగ్లేయ అధికారులు ఆమెను వెంబడించారు. గుట్ట పైభాగానికి చేరిన బాలిక ఒక చెట్లపొదలలో చేరి దాగున్నది.
పిల్లకోసం ఆంగ్లేయులు చెట్టుచెట్టును గుట్టమొత్తం గాలించారు.
అమ్మాయి దాగిన పొద కొట్టివేసిచూసినా ఆనవాళ్లు దొరుకలేదు.
తెల్లవాళ్లు వెతికి వెనుదిరిగి వెళ్లిపోయిన పిదప తల్లిదండ్రి, గ్రామస్తులు వెళ్లి వెతికితే, పొదకింద భూమిలో అమ్మవారి విగ్రహం దొరికింది. విగ్రహం దొరికిన పొదమీద ఊరివాళ్లు విజయస్తంభం నిలిపారు.
ఆత్మార్పణం చేసుకున్న బాలికయే ఆ విగ్రహశిలగ మారివుందని
భావించిన గ్రామస్తులు విగ్రహాన్ని తెచ్చి గుట్టకింద ఊరికి దాపున
సహజసిద్ధంగా ఏర్పడివున్న సరస్సు పక్కన చిన్నగుడి నిర్మించారు.
అస్తిత్వపోరాటంలో వెలిసిన ఆ అమ్మవారి పేరే మాతా మాడాదేవి. ఈమెను పెండ్లీడు మగపిల్లలు భక్తిశ్రద్ధలతో పూజించుట విశేషాంశం.
శరన్నవరాత్రులు, వసంతపంచమి వంటి పుణ్యదినాల్లో ఇక్కడ
ప్రత్యేకంగా పూజలూ, హోమాలూ జరుగుతాయి. శాకాహారదేవత. కానీ ఏడాదికి ఓసారి ఈ అమ్మవారికి రక్తతర్పణం కూడా ఆచారం.
ఈ శ్రీపంచమినాటి పూజ ఐదుగురు బ్రహ్మచారులు చేయించారు. హోమ జపతపాదుల తర్వాత వారు అన్నదానం నిర్వహించారు. దారిన పోతున్న మేము అన్నదాన సమయానికే ఆ గుడికి చేరుడు, వారు తమ ఆతిథ్యం స్వీకరించుమని పిలుచుడు మా అదృష్టం.
రెక్కాడితే కానీ డొక్కాడని బక్కపలుచని కాయకష్టపు యువత
నిష్టగ ఒక్కపొద్దులుండి, చెట్టుకింద కొత్తపొయ్యి వేసి, వంటలు చేసి దారినపోతున్నవారికి సైతం అమ్మవారి ప్రసాదం పంచుడు గొప్ప. మాడాదేవి ఐతిహ్యాన్ని మురిపెంగా చెప్పుకునుడు మరింత గొప్ప.
చిన్న గ్రామదేవత గుడి, పల్లీయులు చక్కగ తీర్చిదిద్దుకున్న గుడి. తమ వారసత్వ సంస్కృతిని మన దేశచరిత్రకు కలిపినిలిపిన గుడి. ఒక ఆత్మగౌరవ పోరాటాన్ని తరతరాలపాటు నిలబెడుతున్న గుడి. కజురహో తొవ్వలో ఈ గుడియిచ్చిన అచంచలానందం.. శాశ్వతం!
ఇది మన దేశచరిత్ర – మన దేశంలో ఒక ఊరిచరిత్ర.



