కింగ్ కోబ్రాస్ క్యాపిటల్.. ఆ విలేజ్!

ప్రతీ దేశానికీ, రాష్ట్రానికీ, జిల్లాకు ఓ రాజధాని ఉన్నట్టే… కింగ్ కోబ్రాలకూ ఓ రాజధాని ఉంది తెలుసా..? రాజధాని అంటే కాస్తోకూస్తో నగరమో, పట్టణమో అయ్యుండాలి. కానీ, అదో మారుమూల గ్రామం. కాదు కాదు మారుమూల దట్టమైన అడవి. ఆ అడవేంటి.. కోబ్రాల రాజధాని ఎందుకంటారు.. ఓసారి తెలుసుకుందాం రండి.

కర్నాటకలోని పశ్చిమ కనుమలవి. నైరుతీ భారతాన నిటారు కొండలు.. భారీ వర్షాలతో కీకారణ్యమనే మాటకు పర్యాయపదంలా కన్పించే ప్రాంతమది. దూకుతున్న జలపాతాలతో కట్టిపడేసే ప్రకృతి సౌందర్యానికి చిరునామా. ఆ ప్రాంతాన్ని దక్షిణాది చిరపుంజి అని కూడా పిలుస్తుంటారు. ఇన్ని విశేషాలున్న ప్రాంతం కాబట్టే యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కూడా పొందిన అటవీప్రాంతమిది. చీకటిని చీలుస్తూ నిటారుగా ఉన్న కొండల మధ్య నుంచి మబ్బున్నే పొడుచుకొచ్చే నారింజ రంగు సూరీడు మెల్లిమెల్లిగా ఎర్రబడుతున్న దృశ్యమైనా… సాయంసంధ్యవేళకు అదే నారింజరంగుతో కొండల్లోకి దిగిపోతూ టాటా బైబై చెప్పే భాస్కరుడినైనా రెండు కళ్లూ రెప్పవాల్చకుండా చూడాల్సిందేనన్నంత ప్రకృతి అద్దిన రంగుల క్యాన్వాస్ ఆ అరణ్యం.

ఆ ప్రాంతమే అగుంబే. ఈ ప్రాంతం జీవవైవిధ్యానికి కేరాఫ్ లా కనిపిస్తుంది. వివిధ జాతుల మొక్కలు, వివిధ రకాల కప్పలు, సరీసృపాలు, పక్షులు, సీతాకోకచిలుకలతో పాటు.. ముఖ్యంగా కింగ్ కోబ్రాస్ అడ్డా. అందుకే అగుంబే భారతదేశ కింగ్ కోబ్రాస్ క్యాపిటల్ గా పేరుగాంచింది.

మనదేశంలో మెజార్టీ నమ్మకాలమీదే ఆధారపడింది. భయానకమైన విషజీవిగా పామును చూస్తే ఎంత ఆందోళన చెందుతారో జనం.. అదే పామును పూజించే ప్రత్యేక సంస్కృతి కూడా ఇదే దేశంలో కనిపిస్తుంది. అంతేనా, నాగులచవితి, పంచమి అంటూ పండుగలూ చేసుకుంటుంటాం. అక్కడితో ఆ పాములతో మన బంధాలేమీ ఆగిపోలేదు. నాగుపాముల శిల్పాలు, పురాణాలు, ఇతిహాసాల్లోనూ వాటికుండే విశిష్ఠత, కథల్లో విరివిగా వినిపించే వాటి ప్రస్తావనలు.. ఇలా మొత్తానికి యావత్ దేశం మొత్తంలో మెజార్టీకి నాగుపామంటే ఓ సెంటిమెంట్. అదిగో ఆ సెంటిమెంట్ కర్నాటకలోని అగుంబేలో కూడా కనిపిస్తుంది. అందుకే అక్కడ పాములను పూజిస్తుంటారు.

అగుంబే ఓ దట్టమైన అటవీ ప్రాంతం.. మరోవైపు కింగ్ కోబ్రాస్ రాజధాని అని చెప్పుకుంటున్నట్టే.. ఇక్కడ మనుషులూ జీవిస్తుంటారు. అంతటి భయపెట్టే కింగ్ కోబ్రాస్.. జీవావరణంలో అంత ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించుకున్న ఆ పాములు.. ఆ సమాజపు దైనందిన జీవితంలో మాత్రం ఓ భాగం కావడమే అక్కడికెళ్లే పరిశోధకులను ఆశ్చర్యపరుస్తుంటుంది. ఈ మధ్య శాస్త్రీయ పరిశోధకుల పర్యటనలకు అగుంబే ఓ స్పెషల్ టూరిస్ట్ ప్లేస్ గా మారిపోయింది.

కొన్ని చదరపు కిలోమీటర్ల పరిధిలోనే ఈ అరణ్యం విస్తరించి ఉన్నా.. ఇక్కడి పర్యావరణ సంపద మాత్రం అబ్బురపరుస్తుంది.

కర్నాటక శివమొగ్గ జిల్లాలోని అగుంబే గ్రామానికి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వెళ్లితే.. అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ కనిపిస్తుంది. 2005లో ప్రారంభించిన ఈ ఏఆర్ఆర్ఎస్ అగుంబే అటవీ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ, పరిశోధనతో పాటు.. మరీ ముఖ్యంగా ఇక్కడి కింగ్ కోబ్రాల సంతతిని కాపాడటమే లక్ష్యంగా వెలిసింది. ప్రముఖ హెర్పెటాలజిస్ట్, పద్మశ్రీ రోములస్ విటేకర్ ఈ అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ ను ఇక్కడ ప్రారంభించడానికి బీజం వేశారు. భారతదేశంలోనే కింగ్ కోబ్రాలపై పరిశోధన చేసేందుకు మొట్టమొదటి రేడియో టెలిమెట్రీ ప్రాజెక్ట్ ను ఇక్కడే ప్రారంభించారు. ఇక్కడ దాదాపు ప్రతీ పాము కదలికలనూ రికార్డ్ చేసే విధంగా ఈ రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ ను సీసీ కెమెరాల సాయంతో రూపొందించారు.

అగుంబేలో పాము ఓ దైవం!

ఇక్కడ కింగ్ కోబ్రాలను పవిత్రమైన జీవిగా కొలుస్తారు. శాస్త్రీయ పద్ధతిలో చూడటం కంటే కూడా.. ఇక్కడి ప్రజల జీవనవిధానంలో త్రాచుపాములకు పూజలు, మొక్కులే ఎక్కువ కనిపిస్తాయి. నెలవారీ పండుగలు, పాముల కోసమే తోటల పెంపకంతో.. ఇలా పాములపైన ఉన్న అపారమైన భక్తే.. ఇక్కడ ఆ విష జీవులకు మనుషుల నుంచి హాని లేకుండా చేస్తోంది. అందువల్లే ఇక్కడ కింగ్ కోబ్రాలు స్వేచ్ఛగా సంచరిస్తూ.. ఏకంగా దేశంలోనే కింగ్ కోబ్రా క్యాపిటల్ గా అగుంబేకు పేరు తీసుకొచ్చాయి.

2005లో అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ ను ఏర్పాటు చేశాక.. ఇక్కడ అవగాహన మరింత పెంచారు. భక్తితో పూజించడం కూడా ఈ గ్రామంలో అప్పటికే కొనసాగుతుండటంతో… పాముల పరిరక్షణకు కేరాఫ్ గా అగుంబే మారిపోయింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles