బాలీవుడ్ వెండి తెరపై అమితాబ్ ఎంత కింగో… వెండి తెర వెనుక ఆయనకు స్వరమందించిన కిషోర్ కుమార్ అంతకన్నా చక్రవర్తి. అదే సమయంలో కిషోర్ కూడా చాలా సినిమాల్లో నటించారు. దాంతో అమితాబ్, కిషోర్ కుమార్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ చిత్రం చూడాలనే కోరిక వారి అభిమానులతో పాటు, బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఉండటంతో అలాంటి కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయట. కానీ, ఆ ప్రయత్నాలెందుకు సఫలీకృతం కాలేదు మరి..?
అరే దివానో పెహచానో… అప్నీ తో జైసే తైసే వంటి పాటల నుంచి మొదలకుంటే సారా జమానా… యే దోస్తీ హమ్ నహీ తోడెంగే వంటి పాటల వరకూ తెరపై అమితాబ్ కు… తెరవెనుక కిషోర్ దా గాత్రం పర్యాయనామమైపోయింది. అలాంటి ఆ ఇద్దరు దిగ్గజాలు తెరను పంచుకోవాలన్న ఆశనూ కొందరు వారి ముందుంచగా.. అభిమానుల్లోనూ ఆ ఆశ కనిపించడం సహజమే. అయితే, ఆ ఆశ కేవలం బాలీవుడ్ వర్గాలు, వారిరువురి అభిమానుల వరకే కాకుండా.. కిషోర్ దాలోనూ ఉండేదంటారు పాటల రచయిత సమీర్.

ఓ పాట రికార్డింగ్ తర్వాత కిషోర్ కుమార్ తనతో చెప్పన మాటలను సమీర్ ఓసారి గుర్తు చేసుకున్నారు. అమిత్ నేను నిజంగా ఎప్పుడూ మిమ్మల్ని ఏదీ అడగలేదు. కానీ, నా మనసులో మాత్రం ఓ కోరిక మిగిలి ఉంది. ఎందరి నటనో చూసిన నాకు.. మీ నటను చూసినప్పుడు మీతో కలిసి నటించాలనిపించింది.. మీరు నాతో కలిసి ఓ సినిమా చేస్తారా అని అడిగారట కిషోర్.
దానికి అమితాబ్ నుంచి ఓ అనూహ్యమైన స్పందన వచ్చిందట. కిషోర్ మాటలకు ఆశ్చర్యపోయిన అమితాబ్ గౌరవంగా చేతులు జోడించాడట. నన్ను బర్బాద్ చేయాలనుందా అని ఎదురు ప్రశ్నించాడట. దానికి నివ్వెరపోయిన కిషోర్ దా అరే తు క్యా బోల్ రహా హై అంటూ.. ఎందుకంత మాటన్నారని ఎదురు ప్రశ్నించాడు. మీ పాటకు సరైన భావవ్యక్తీకరణ చేసేందుకే నాకు పిచ్చెక్కిపోతోంది. మీ పాటలోనే నటన, జీవితమన్నీ మిళితమై ఉన్నాయి. అలాగే, మీలాంటి నటుడు ఇంకెప్పుడూ రాలేడు. కాబట్టి మీతో పోలిస్తే నాలాంటి 500 మంది అమితాబ్ బచ్చన్ లు కూడా ఎందుకూ పనికిరారు. మీ స్థాయికి నేనెప్పుడూ సరిపోను. అందుకే, ఇంకో వందేళ్ల వరకూ కూడా నేను మీతో కలిసి నటించడానికి ఒప్పుకోను. కాబట్టి ఆ ఒక్కటీ అడక్కండని తిరస్కరించారట అమితాబ్.
అమితాబ్ ఎన్నోసార్లు కిషోర్ కుమార్ ను ఓ మేధావిగా అభివర్ణించిన సందర్భాలూ ఉన్నాయి. నేటికీ ఆయన ప్రేక్షకుల హృదయాల్లో ఉండటానికి కాలాలు మారినా అనుభూతినిచ్చే ఆయన పాటలే కారణమంటాడు అమితాబ్.
ఇవాళ లెజెండ్రీ కిషోర్ కుమార్ వర్ధంతి సందర్భంగా!



