మామిడితో మనిషి బంధం.. తెలంగాణా పల్లె ముచ్చట!

తోపుమామిడి.. తోపు మామిడి
~~~~~

మామిడితోటలు రెండురకాలు
ఒకటి- పెద్దతోటలు, రెండు- పెట్టినతోటలు.

పెద్దతోటలు దేశీయమైన రకాలు.
ఇవి ఎన్నటివో, తాతలతాతల నాటివి.
గున్నమామిడి, గూడుమామిడి, కుచ్చెమామిడి,
పంగలమామిడి, పైడిమామిడి, లండుమామిడి..
ఇవన్నీ వాటి వన్నెనూ నడుకనూ బట్టి ఆనాటిపేర్లు.

తొక్కుమామిడి, వక్కమామిడి, తోలుమామిడి,
పుల్సుమామిడి,పీచుమామిడి,పిక్కమామిడి,
జీడిమామిడి, ముంతమామిడి, మేకచన్నుమామిడి,
గంజిమామిడి,కోతిపిర్రమామిడి, చిలుకముక్కుమామిడి,
చెంబుకాయలు, గొట్టెకాయలు, సన్నాలు, రసాలు..
ఇవన్నీ మన వెనుకటి పెద్దతోటల్ల మామిడిచెట్ల రకాలు.

ముద్దంకుంట మామిండ్లు, మామిడికుంట మామిండ్లు,
యాపలకుంట మామిండ్లు, అడ్డగుట్టకింది మామిండ్లు
గుట్టెనుక మామిండ్లు, గుండిదార్ల మామిండ్లు,
దొరగారి మామిండ్లు, దూదేకులోళ్ల మామిండ్లు… ఇట్ల
ఊరికి ఎనిమిద్దిక్కుల్ల ఏపట్టి తోటలు ఆపట్టికే ఉంటుండే.
ముందుతరాల కోసం మామిడితోటలు పెట్టి పెంపుజేసుడు
ఈడచ్చినంక చెట్లకు పెండ్లిజేసుడు, ప్రభోజనాలు పెట్టుడు,
కన్యాదాతలకు అత్తగారోళ్లు చీరెసారె ఒడిబియ్యం తెచ్చుడు,
ఆయిటికి పసుకతీర్థాలకు మామిడితోటల్లకు తీర్థాలువోవుడు,
ఇవన్నీ మామిడితోటతోటి ముడివడ్డ తెలంగాణ పల్లెముచ్చట్లు.
అచ్చగానికి బుచ్చెగానికి నాలుగురోజుల సంచారసంసారానికి
ఊరుబయటి మామిడితోటలే నిలువనీడనిచ్చే చలువపందిర్లు.

పాలోళ్ల నడుమ కొంచపుతనపు పంచాయితీలు,
భూములు అమ్మి సొమ్ముచేసుకుందామనే అత్యాశ,
పాతవాటిమీద అశ్రద్ధ, అంటుగట్టిన కొత్తతోటలమీద మోజు
కర్ణునిచావుకు కారణాలు ఎన్నయితేంది. ఊర్లల్ల తోటలు ఖతం.
పదిరువయేండ్లల్లనే వందలేండ్లనాటి తోటలను పొతం పెట్టిండ్రు.
పెద్దతోటలు ఆ విత్తనం మొత్తం పత్తకు లేకుంట ఊడ్చుకపొయినై.

ఇప్పుడు సంకర దిలుపసందులూ దిలుఖుషులే ఊరూరికి మోపనై.

సుతిదప్పిన మనుషులు,గతిదప్పిన మామిడిచెట్లు,ఏడాదెల్ల పంట.

చెట్టుపేరుజెప్పి కాయలమ్ముకపొయ్యే మందులమారి గజ్గరి కాలం,

రంగు రుచి వాసన గురించి మాట్లాడుకునుడైతె పసతక్కువ పని!

డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి.. ✍🏻

(మా పెట్టుడుచెట్ల మామిడికాయలివి. ఊరుదెల్వది-పేరుదెల్వది)
(మొదటితోపులో తోపు అంటే తోట. రెండోతోపు ఈ కాలపు తోపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles