ఒక ఇంజనీర్ ఐడియా.. 26 గ్రామాల కరువు తీర్చింది!
ఓ ఇంజనీర్ ఒక్క ఆలోచన 26 గ్రామాల కరువు తీర్చింది. ఒక్క చాలీస్ గావ్ కరువు.. మిగిలిన చుట్టుపక్కల గ్రామాల్లో కరువు తీర్చేందుకూ కారణమైంది. అయితే ఆ కరువు పారద్రోలిన ఆ ఇంజనీరెవరూ… ఎందుకతనొక్కడే అంతలా ప్రభుత్వాలను మించి మానవీయ కోణంలో స్పందించాడు…? తెలుసుకోవాలంటే.. మహారాష్ట్ర కల్మడు గ్రామానికి చెందిన గుణ్వంత్ సోనావానే కథ చదవాలి మరి!

గుణ్వంత్ సోనావానే.. పూణేకు చెందిన IT ప్రొఫెషనల్. ఆటోమేటిక్ డేటా ప్రాసెసింగ్ (ADP) ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఓ కంప్యూటర్ ఇంజనీర్. 2012 నుంచీ.. ఆరోగ్యం, విద్య, నీటి సంరక్షణ రంగంలో పనిచేసే పూణేకు చెందిన సేవా సహయోగ్ అనే NGO తో కలిసి పనిచేస్తున్నాడు. మురికివాడల్లోని పిల్లల కోసం లైబ్రరీలను నిర్మించడం, స్టడీ మెటీరియల్, కంప్యూటర్లనందించడం కోసం సేవా సహయోగ్ తో కలిసి స్వచ్ఛందంగా సేవ చేసేవాడు. సేవా సహయోగ్ అనే NGO నీటి సంరక్షణకు సంబంధించిన అవగాహనా కార్యక్రమాలు కూడా చేస్తుంటుంది. అందులో కూడా భాగస్వామవుతూ.. తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు గుణ్వంత్. అందుకుగాను గుణ్వంత్ ను తన కంపెనీ ADP ప్రెసిడెంట్.. 2017లో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద న్యూయార్క్‌లో గ్లోబల్ అవార్డుతో సత్కరించారు. దాంతో అతనికి పదివేల అమెరికన్ డాలర్ల రూపంలో.. సుమారు ఏడు లక్షల 46 వేల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. అప్పుడు గుణ్వంత్ కు తన సొంతూరు కల్మాడుతో పాటు.. పొరుగునే ఉన్న ఇందాపూర్ గ్రామంలోని దుర్భరమైన తాగునీటి పరిస్థితులు కళ్లముందు కదలాడాయి. వెంటనే ఆ డబ్బును వాటర్ ఫిల్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓవైపు తన గ్రామంతో పాటు..చుట్టుపక్కల నివసించే పిల్లలకు విద్యనందించే తన ప్రక్రియను కొనసాగిస్తూనే… మరోవైపు ఆ 37 ఏళ్ల గుణ్వంత్ తాగునీటి సమస్యతో పాటు… తన ఊరు, దాని చుట్టున్న ఇతర ప్రాంతాలను పట్టిపీడిస్తున్న లోతైన సమస్యల గురించి తెలుసుకున్నాడు.
అదిగో అప్పుడు తమ బతుకు చిత్రం కోసం… పిల్లలను బళ్లల్లో వదిలిపెట్టి వలస వెళ్తున్న దయనీయ స్థితిలోని గ్రామీణ పేద ప్రజల ఆకలిబాధ గుణ్వంత్ ను కదిలించింది. ఇంట్లో పేరెంట్స్ లేకపోవడంతో… పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యా తగ్గిపోయింది. ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా తయారైన పరిస్థితి… దాంతో పెరుగుతున్న డ్రాపవుట్స్ సంఖ్య గుణ్వంత్ ను వారికోసం మరింత ఆలోచించేలా చేసింది. తమ గ్రామాల్లో నీటివనరుల్లేక పంటలన్నీ ఎండిపోయి… బోర్లు వేసినా పడని దైన్యస్థితిలో వ్యవసాయం ఓ జూదంలా మారింది. కరవు మిగిల్చిన నష్టాలతో… తమ పొట్టకూటి కోసం అక్కడివారంతా పల్లె నుంచి పట్టణాల బాట పడతున్నారని తెలుసుకున్నాడు గుణ్వంత్. ముఖ్యంగా నీటి సంక్షోభంతో 2017 లో తీవ్ర ప్రభావితమైన రాజ్మానే గ్రామం పరిస్థితి చూసి చలించిన ఆయనకు… అక్కడ ఎవ్వరూ పట్టించుకోక పూర్తిగా సిల్ట్ తో నిండుకున్న బ్రిటీష్ కాలం నాటి చెరువు నిర్మాణం కనిపించింది. అదిగో అదే ఊతంగా గుణ్వంత్ కు తట్టిన ఐడియా… ఆ తర్వాత 50 వేల మంది రైతుల జీవితాల్ని మార్చేసింది.

జలసంరక్షణపై అవగాహన పెంచాడు. వారిని నీటివినియోగంలో అక్షరాస్యులను చేశాడు. ఓవైపుసేవా సహయోగ్ NGOతో పాటు.. సకల్ ఫౌండేషన్ అనే మరో ఆర్గనైజేషన్ సహకారంతో కందకాలు, కాలువలు తీయించాడు. కరకట్టలను నిర్మాణం నుంచి మొదలు.. సరస్సును సిల్ట్ చేయడం, కాంక్రీట్ బ్యారేజీలను ఏర్పాటు చేయడం వంటి పనులన్నింటికీ సకల్ ఫౌండేషన్ నిధుల సాయం చేసింది. దాంతో శిథిలావస్థలో ఉన్న నీటి బ్యారేజీలు, చెక్‌డ్యామ్‌ల మరమ్మతు పనులను భుజాన వేసుకున్నాడు. అందులో గ్రామస్థులనూ భాగస్వామ్యులను చేశాడు. పరీవాహక ప్రాంతాల్లోని వర్షపు నీటిని నిలిపి.. చెరువుల వైపు మళ్లించడం, భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించాడు. అలా 2017లో ప్రారంభమైన ప్రయత్నంతో… 2018 తిరిగేసరికల్లా… గ్రామస్థుల సహకారంతో 15 కోట్ల లీటర్ల నీటిని ఒడిసిపట్టుకుని… ఓ భగీరథ విజయం సాధించాడు గుణ్వంత్.
ఆ విజయం ఇచ్చిన ఊపు… గుణ్వంత్ ను చుట్టుపక్కల మరిన్ని గ్రామాలు, తాండాల వైపు చూసేలా చేసింది. దాంతో చాలీన్ గావ్ తాలూకాలోనే.. ఆబోనే అనే మరో తాండాలోనూ నీటి సంరక్షణ పనులపై దృష్టి సారించి… సరిగ్గా రెండేళ్లు తిరిగేసరికి… మూడు సరస్సులను పునరుద్ధరించి.. నాలుగు చెరువులను సృష్టి చేశాడు. కావల్సినంత నీటివనరులు అందుబాటులోకొచ్చేసరికి.. రైతుల బతుకుచిత్రం మారిపోయింది. ఆదాయం మూడు రెట్లు పెరిగింది. ఇక అప్పటి నుంచీ గుణ్వంత్.. వెనుదిరిగి చూసుకోలేదు. సుమారు ఇప్పటి వరకు 26 గ్రామాలకు.. 165 కోట్ల లీటర్ల నీటి వనరుల్ని సృష్టించి పల్లెల్లో జలకళ తెచ్చాడు.
2012-2018 మధ్య నీటిఎద్దడితో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులనెదుర్కొన్న తమ గ్రామాలన్నీ ఇప్పుడు సుభిక్షమయ్యాయన్న ఆనందం ఇప్పుడక్కడి రైతుల కళ్లల్లో కనిపిస్తోంది. నీటిట్యాంకర్లు తెప్పించుకుంటేనే నీరందే పరిస్థితి నుంచి… తీవ్రమైన ఎండాకాలంలోనూ బావుల్లో నీరు పుష్కలంగా లభించే విధంగా భూగర్భజలాలు పెరిగాయి. ఆ కరువు ప్రాంతంలో ఇప్పుడు ఏడాదికి ఏకంగా మూడుపంటలు పండిస్తూ… 80 వేల నుంచి లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అక్కడి రైతులు. అంతకు ముందు పత్తి, వేరుశనగ, అపరాలు మాత్రమే పండించేవారు. కానీ ప్రస్తుతం నీటి లభ్యత ఉండటంతో… సీజన్ కు తగ్గ కూరగాయలు, వాణిజ్య పంటలూ పండిస్తున్నారు. గతంలో ఎప్పుడూ చూడని మిర్చి, బెండ వంటవి కూడా నేడు ఆయా గ్రామాల్లో పండుతుండటంపై రైతుల్లో ఒకింత ఆశ్చర్యంతో కూడిన ఆనందం వ్యక్తమవుతోంది. అంతేకాదు… ఒకప్పుడు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు, కరువుతో ఆత్మహత్యలకు నెలవైన ఆయా గ్రామాలన్నీ గుణ్వంతే అనే ఓ మానవీయ కోణపు చొరవతో… ఆసాంతం మారిపోయాయి. కచ్ఛా ఇళ్ల స్థానే పక్కా కాంక్రీట్ ఇళ్లు నిర్మించుకుని దర్జాగా బతుకుతున్నారు 26 గ్రామాల ప్రజానీకం.
అయితే గుణ్వంత్ సోనావానే కృషికి తోడు.. పలు స్వచ్ఛంద సంస్థల మద్దతు, ఆయా గ్రామాల ప్రజానీకం చేదోడువాదోడు… తన సాఫ్ట్ వేర్ ఫ్రెండ్స్ సాయం కూడా తోడై… ఓ సమష్ఠి విజయం సాకారమైంది. ప్రతీ గ్రామంలో భూగర్భ జల వనరుల మ్యాపింగ్ ఉండాలని.. జలసంరక్షణపై మరింత అవగాహన పెరగాలని… అలాగే విద్యార్థుల దశలోనే అవగాహన తీసుకొచ్చేలా పాఠ్యాంశాల రూపకల్పన ఉండాలన్నది గుణ్వంత్ ప్రగాఢ కోరిక.
ఇదీ మొత్తంగా ఓ ఇంజనీర్ ఐడియా! ఓ యాభై వేల మంది రైతుల జీవితాన్నే మార్చేసిన ఇన్స్పైరింగ్ కథ! అందుకే ఇప్పుడు అక్కడివారి దృష్టిలో గుణ్వంత్ కూడా… ఓ వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ అంత ఆరాధ్యుడు!



