మనసుంటే మార్గముంటుంది! వయసుతో పనేముందంటోంది థంకమ్మ!!

బీస్ విద్య.. తీస్ లక్ష్మి.. ఇది ఎక్కువ మంది విషయంలో నిజం కావచ్చుగానీ.. ఇది మాత్రమే నిజం ఏమాత్రం కాదని నిరూపించింది థంకమ్మ. 74 ఏళ్ల వయస్సులో యువతీ, యువకులతో కలిసి ఫైనాన్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పాఠాలపై చర్చిస్తోంది. రిటైర్డ్ మెంట్ వయస్సు కూడా దాటాక గెస్ట్ ప్రొఫెసర్ గా మళ్లీ జాయినైందేమో అని మీరనుకోవచ్చు.. కానీ, ఆమే ఓ స్టూడెంటే.

కేరళ ఎర్నాకులం వీసాట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అందుకు ఓ వేదిక. అక్కడి విశాలమైన క్యాంపస్ కు వెళ్లినవారెవ్వరైనా 74 ఏళ్ల వయస్సులో బిజీబిజీగా కాలేజ్ అసైన్మెంట్స్ పై చర్చల్లో గడిపే థంకమ్మను చూస్తే ఆశ్చర్యపోతారు. ఆమే ఓ విద్యార్థే అని తెలిశాక లవ్ లో పడిపోతారు.

ప్రస్తుతం బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ మొదటి ఏడాది చదువుతున్న థంకమ్మ కుంజప్పన్.. 73 ఏళ్ల వయస్సులో తన ప్లస్ టూ పూర్తి చేసింది. తమ ఊరు ఎలంజి గ్రామపంచాయితీ పరిధిలోనే థంకమ్మ కుంజప్పన్ ఇప్పుడు అక్కడి యువతీ, యువకులందరికీ ఓ రోల్ మాడల్!

థంకమ్మకు 13 ఏళ్లకే మైనర్ బాలికగా ఉన్నప్పుడు పెళ్లైపోయింది. చదువుకోవాలనే మమకారమున్నా.. తన వివాహం కారణంగా చదువును వదిలేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కొద్దిరోజులకు భర్త తనను వదిలేశాడు. ఓ కొడుకు, మరో కుమార్తె. ఇద్దరినీ పెంచడం థంకమ్మకు ఓ సవాల్ గా మారింది. తన పిల్లలను పెంచి పెద్దచేసి బాగా చదివించేందుకు ఆమె రకరకాల కూలీ పనులు చేసింది. ఇక ఆమెపై బరువైన బాధ్యతలు పడటంతో చదువుకోవాలనే మనసున్నా అది కాస్తా పక్కకుపోయింది. ఇప్పుడు పిల్లలు పెద్దవారై ఎవరి జీవితం వారు చూసుకుంటున్న సమయంలో థంకమ్మ మళ్లీ చదువుకోవాలన్న తన పాత కోరికను బయటకు తీసింది. అలా 71 ఏళ్లకు ఎస్సెఎస్సెల్సీ పూర్తి చేసింది. ఆమె మంచి ఉత్తీర్ణత సాధించడంతో పట్టుదల మరింత పెరిగింది. దాంతో చదువును కొనసాగించింది. 73 ఏళ్లకు ప్లస్ టూ పూర్తి చేసిన థంకమ్మ ఇప్పుడు 74 ఏళ్ల వయస్సులో బీకామ్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది.

బాగా చదువుకోవాలనకోవాలన్నది చిన్ననాట్నుంచీ తన కల అంటుంది థంకమ్మ. అందుకే, నాకు వయస్సు అడ్డుకాలేదని ఒకింత గర్వంగా చెబుతుంది. నేర్చుకోవడానికి జీవితంలో వయస్సెప్పుడూ అడ్డంకి కాదని నిరూపించాలనుకున్నానంటోంది.

తన భర్త కుంజప్పన్ తనను విడిచి వెళ్లిపోయిన రోజున… తన ప్రపంచమే కుప్పకూలిపోయిందని తన చేదు జ్ఞాపకాలను యాజ్జేసుకుంది థంకమ్మ. చాలాకాలం తన వ్యథ ఎవ్వరికి చెప్పాలో తెలియక.. ఏం చేయాలో తోచక.. ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్లన్నీ ఆవిరైపోయాయి. కానీ, ఏడిస్తే లాభం లేదు. మిగిలేది బాధే తప్ప ఇంకేమీ రాదు. చూస్తే పిల్లల కొండంత బాధ్యత భుజస్కంధాలపై ఉంది. అలాంటి సమయంలో మొక్కవదలని ఆత్మస్థైర్యంతో తనకు వచ్చిన పనల్లా చేసుకుంటూ పిల్లల్ని పెంచానంటోంది. వారు సెటిలైపోయాక.. ఇప్పుడు మళ్లీ తన పుస్తకాల దుమ్ముదులిపి చదువుల్లో రాణించడం.. కాలేజీలో యువతీ, యువకులతో కలిసి పాఠాలు వినడం ఒకింత థ్రిల్లింగ్ గా ఉందంటోంది థంకమ్మ.

తనకు అవకాశం కల్పించిన వీసాట్ కళాశాల యాజమాన్యానికీ, తన ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకున్నా మనవలు, మనవరాళ్ల వయస్సులో ఉండి కూడా తనకు ప్రోత్సాహమందిస్తున్న తన కాలేజ్ మేట్స్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతోంది ఈ 74 ఏళ్ల బాలిక.

అవునూ, నిజంగానే థంకమ్మ ఇంకా బాలికే. ఎందుకంటే తన చదువును గ్రాడ్యుయేషన్ వరకే పరిమితం చేయకుండా.. ఇంకా పీజీ వంటివి చేయాలని తీర్మానించుకుంది. తనకు ఆసక్తి ఉన్న రంగాల్లో ముందుకెళ్లాలన్న సంకల్పాన్ని తనకు తాను విధించుకుంది. మొత్తంగా నేర్చుకోవడం అనే ఒక ప్రక్రియ జీవితంలో ఎప్పుడూ ఆగిపోకూడదనే ఓ సందేశానికి నిలువెత్తు ఉదాహరణై నిలుస్తోంది ఈ ఎర్నాకులం 74 ఏళ్ల నవ యువతి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles