మెత్తటి కత్తిలా చీరే గొంతుక.. ముఖేష్ !

Shanthi Ishaan…✍🏼

mukeshsinger

ముకేశ్ చంద్ మాథుర్! రాజ్ కపూర్ కి మారు గొంతుగా చెప్పుకునే ముకేశ్ పూర్తి పేరిది. రాజ్ కపూర్ తో పాటు మనోజ్ కుమార్, దిలీప్ కుమార్, సునీల్ దత్ లాంటి హీరోలకు ఆరోజుల్లో ముకేశ్ స్వరం చక్కగా సెట్ అయిపోయేది. కానీ ముకేశ్ మొట్టమొదట పాడింది ఎవరికో తెలుసా? తనకే! అవును 1941లో వచ్చిన Nirdosh అనే సినిమాలో నటించి పాడారాయన. ఆ పాటే Dil Hi Bujha Hua Ho To. ఇక నేపథ్య గాయకుడిగా ఆయన మొదటి పాట Dil Jalta Hai To Jalne De. 1945లో వచ్చిన Pehli Nazar సినిమా కోసం ముకేశ్ పాడిన ఈ పాట విని ఇది నేనెప్పుడు పాడాను అని కె.ఎల్. సెహ్ గల్ ఆశ్యర్యపోయారట. ప్రారంభ దశలో ముకేశ్ పై సెహ్ గల్ ప్రభావం అంతగా ఉండేది. ఆ తర్వాత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ నౌషాద్ అలీ సాయంతో ముకేశ్ తనకంటూ ఒక శైలిని సృష్టించుకున్నారు.

1945లో Andaz సినిమాలో దిలీప్ కుమార్ కి ముకేశ్ పాడగా, రాజ్ కపూర్ కి రఫీ పాడారు. కానీ ఆ తర్వాత శంకర్ – జై కిషన్ సారథ్యంలో ముకేశ్ గొంతుక క్రమక్రమంగా రాజ్ కపూర్ కి మారు స్వరంగా మారిపోయింది. ముకేశ్ గెలుచుకున్న నాలుగు ఫిలింఫేర్ అవార్డుల్లో మూడు శంకర్-జై కిషన్ కంపోజ్ చేసినవే. ఆయనకు ఒక్కగానొక్క జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది మాత్రం Rajanigandhaలోని Kai Baar Yunhi Dekha Hai అనే పాట. దీన్ని కంపోజ్ చేసింది సలీల్ చౌదరీ. ఇదే ట్యూన్ ని సలీల్ చౌదరీ మన తెలుగులో “ఛైర్మన్ చలమయ్య” అనే సినిమాలో “నయనాలు కలిసె తొలిసారి” అనే పాట రూపంలో వాడారు. (ఈ పాటలో పల్లవి కంటే చరణాలు నాకు చాలా ఇష్టం).

Nasal voiceతో మంద్రస్థాయి, మధ్యస్థాయిలో ఎక్కువగా పాడే ముకేశ్ తారస్థాయిలో పాడిన పాటలు తక్కువే. కానీ హై పిచ్ లో పాడిన ఆ కొన్ని పాటలూ చాలా గొప్పగా అనిపిస్తాయి. Mera Naam Jokerలో Jane Kahan Gaye Woh Din దీనికి మంచి ఉదాహరణ.

ముకేశ్ గొంతుకలో సంగీతంతో పాటు ఆత్మ కూడా పలుకుతుంది. పైపైన వినేవారికి అంతగా నచ్చకపోవచ్చు కానీ ఆయన గొంతుక మనసుతో వినేవారి గుండె పొరలను మెత్తటి కత్తిలాగా చీరేస్తుంది.

కిశోర్ కుమార్ లాగే ముకేశ్ గొంతు ఉంటే చాలు ఏ పాటయినా వినేయొచ్చు అనేది నా ఫీలింగ్. కానీ ఆయన పాడిన పాటల్లో నాకంటూ కొన్ని favourite songs ఉన్నాయి. వాటిలో ఓ ఆరేడు పాటలు మాత్రం the best అనిపిస్తాయి. Count down వెనక నుంచి మొదలుపెడితే Kisi Ki Muskurahaton Pe పాటకు ఐదో స్థానమిస్తాను. Anadi సినిమా కోసం శంకర్-జైకిషన్ కంపోజ్ చేసిన ఈ పాటలో శైలేంద్ర రాసిన లిరిక్స్ గొప్ప జీవన సత్యాన్ని చాటి చెబుతాయి.

Anandలో Maine Tere Liye అనే పాటకు నాలుగో స్థానమిస్తాను. గుల్జార్ రాసి, సలీల్ చౌదరీ స్వరపరిచిన ఈ పాట రాజేశ్ ఖన్నా కోసం ముకేశ్ పాడిన అతి తక్కువ పాటల్లో ఒకటి.

మూడో స్థానాన్ని Saraswatichandraలో Chandan Sa Badan, Milan లోని Sawan Ka Mahina పాటలకిస్తాను. శంకర్ జై కిషన్ తర్వాత ముకేశ్ కల్యాణ్ జీ-ఆనంద్ జీ బాణీలనే ఎక్కువగా పాడారు. Chandan Sa badan అందులో ఒకటి. ఈ పాటలో శాస్త్రీయ సంగీతపు ఛాయలు కనిపిస్తే Sawan Ka Mahinaలో జానపద రీతి పలుకుతుంది. లక్మీకాంత్-ప్యారేలాల్ బాణీలు కట్టిన Milan మన “మూగ మనసులు” సినిమాకి రీమేక్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది.

ఇక Kabhi Kabhiలో టైటిల్ సాంగ్ కి నా లెక్క ప్రకారం రెండో ర్యాంక్. ఖయ్యాం సంగీతం, సాహిర్ లుధియాన్వీ సాహిత్యం, ముకేశ్ స్వరం వల్ల ఈ పాట evergreen hitగా నిలిచిపోయింది.

Anandలోనే యోగేశ్ రాసిన Kahin Door Jab అనే పాట, Kabhi Kabhiలో Main Pal Do Pal Ka Shayar Hoon – ఈ రెండూ వేటికవే ప్రత్యేకం. రెండూ నా best favourites. ఏం పాడినా గుండెను మెలిపెట్టేయడం ముకేశ్ స్వరానికున్న గొప్ప లక్షణం. Kahin Door Jab పాట సందర్భంలోను, పదాల్లోనూ melancholy ఉట్టిపడుతుంది. ముకేశ్ స్వరం ఆ విషాదాన్ని రెట్టింపు చేసి మనల్ని మరో జగత్తులోకి తీసుకుపోతుంది. ఇక Main Pal Do Pal Ka Shayar సాహితీపరంగా ఉత్కృష్టమైన పాట. తత్వం కలగలిపి సాహిర్ రాసిన ఈ పాట ఖయ్యాం స్వర కల్పనలో, ముకేశ్ గొంతులో చాలా హాయిగా పలుకుతుంది. అమితాబ్ బచ్చన్ కి ముకేశ్ పాడిన అతి తక్కువ పాటల్లో ఇదీ ఒకటి. అయితేనేం బాలీవుడ్ సంగీతపు దశను మార్చేసిన గీతాల్లో ఇది ఎప్పటికీ ఒకటిగా ఉండిపోతుంది.

ఆగస్టు 27 ముకేశ్ వర్థంతి. అమెరికాలోని మిచిగాన్ లో ఓ కాన్సర్ట్ కోసం వెళ్ళి గుండె పోటుతో మరణించారు. జీవితమంతా పాడుతూనే గడిపేసిన ముకేశ్ పాడుతూనే వెళ్ళిపోయారు.

ఈరోజు జూలై 22 ముఖేష్ పుట్టినరోజు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles