సీన్ రీ కన్స్ట్రక్షన్.. నేరపరిశోధకులకెంత అవసరమో.. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ ఛానల్స్ కు అంతవసరం. లేకపోతే నాటకీయత పండదు. శ్రీదేవీ బాత్రూమ్ టబ్బు నుంచి మొదలు ప్రజా సమస్యలెన్నింటినో అనుభవరూపంలో చూపించాలనే రిపోర్టర్స్, ఆయా ఛానల్స్ తాపత్రయం అంతా ఇంతా కాదు. అలాంటి తాపత్రయంతోనే నదిలోకి దిగిన ఓ బ్రెజిల్ రిపోర్టర్ కు ఊహించని ఓ సంఘటన ఎదురైంది. అసలేం జరిగింది..?

బ్రెజిల్ మారన్హావో రాష్ట్రంలోని మెరిమ్ నదిలో ఈతకు వెళ్లిన రైస్సా అనే 13 ఏళ్ల బాలిక గల్లంతైంది. ఆ విషయాన్ని ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ రిపోర్ట్ చేస్తూ ఎలా జరిగింది, ఏం జరిగిందనేది వివరిస్తూ, తన శైలిలో కాస్తా విశ్లేషిస్తున్నాడు. అలా ఛాతీ వరకు లోతులో ఉన్న ఆ రిపోర్టర్ అలా రిపోర్టింగ్ చేస్తున్న సమయంలోనే నీళ్లల్లోకి చూపిస్తున్న తన చేయికి ఏదో తగిలినట్టనిపించింది. అంత లోతులో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ఆ రిపోర్టర్.
ఇంతకీ ఆ కరస్పాండెంట్ కు ఎదురైన ఆ అనూహ్య సంఘటనేంటి..?
సదరు కరస్పాండెంట్ పేరు లెనిల్డోఫ్రాజావో. గత జూన్ 30వ తేదీన బకాబల్ నగరానికి సమీపంలో ఉన్న మెరిమ్ నదిలో స్నేహితులతో కలిసి వెళ్లి రైస్సా గల్లంతు వార్త అక్కడ కలకలం రేపింది. ఛాతీ వరకు లోతులోకి వెళ్లి ఒక్కసారిగి వచ్చిన ఉధృతితో ఆ 13 ఏళ్ల బాలిక ఎలా గల్లంతైందో వివరిస్తుంటే.. అతను నీటి అడుగులో తన చేయి పెట్టి ఏదో చెబుతుండగా ఈ నీటి ఉపరితలంపైన ఏదో అతడి చేతికి తాకుతోంది. దాంతో ఒకింత ఆందోళనకు గురైన ఫ్రాజావో.. ఇక్కడ ఏదో నీళ్లల్లో తడుతోందంటూ రిపోర్ట్ చేశాడేగానీ.. అంతకుమించి లోతులోకెళ్లి అదేంటో చూసే ధైర్యం మాత్రం చేయలేకపోయాడు.
దాంతో లెనిల్డో వెనక్కి తిరిగి వచ్చేశాడు. తనకెదురైన అనుభవాన్ని రెస్క్యూ బృందానికి చేరవేశాడు. ఎవరిదో చేయి తాకినట్టుగా అనిపించందని చెబుతూనే.. మరోవైపు, అదో పెద్ద చేప అయ్యుండొచ్చన్న ఒకింత భయంతో కూడిన ఆందోళనా సదరు టీవీ కరస్పాండెంట్ లో కనిపించింది.
ఫ్రాజావోకు ఎక్కడైతే నీటి ఉపరితలంపై ఏదో తగిలినట్టుగా అనిపించిందో అక్కడికి ఆయన్ను తీసుకుని రెస్క్యూ బృందాలు వెళ్లింది. అప్పటివరకూ రెస్క్యూ బృందాలు ఎంత వెతికినా దొరకని ఆ బాలిక మృతదేహం.. సరిగ్గా ఫ్రాజావో రిపోర్ట్ చేసిన చోట లభించింది. లెనిల్డోకు రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు తగిలిన చేయి ఆ విగతజీవిదే. సదరు కరస్పాండెంట్ అనుమానం నిజమే అయింది. అయితే, అది ఆ గల్లంతైన బాలికదే అయి ఉండొచ్చన్న ఆలోచన ఆ ఆందోళనకర సమయంలో మాత్రం ఫ్రాజావోకు తట్టలేదు.
అయితే, సదరు రిపోర్టర్ కు చేయి తగలడం.. అతడు భయపడటం.. రెస్క్యూ టీమ్స్ కు చెప్పడం.. ఆ తర్వాత వారి సెర్చింగ్ లో ఆమె దొరకడం ఇవన్నీ ఒకటికొకటి కాస్తా అనుమానాన్నీ రేకెత్తించాయి. దాంతో థరో పోస్ట్ మార్టం చేయించారు. ఆ అమ్మాయిని ఎవరైనా చంపి ఉంటారా.. చంపి నదిలో వేసి ఉంటారా అనే కోణంలోనూ దర్యాప్తు చేశారు. కానీ, ఆ అమ్మాయి నీళ్లల్లో ఈతకు వెళ్లే గల్లంతైందనేది దర్యాప్తు బృందాలు తేల్చేశాయి.
విపరీతమైన వేసవి వేడి నుంచి సేద తీరడానికి రైస్సా తన స్నేహితుల బృందంతో ఆరోజు నదికి వెళ్లింది. అయితే, మెరిమ్ నదిలో ధారగా వచ్చే ప్రవాహానికి తోడు.. నదిలోపలి ఇసుకలో దిగబడేలా పెద్ద పెద్ద గోతులుండటంతో ఆ నది లోతులోకి సాధారణంగా ఎవ్వరూ వెళ్లరు. గజ ఈతగాళ్లకు కూడా అందనంత లోతులో పెద్ద పెద్ద గుంతలతో ఓ డేంజర్ జోన్ ను తలపిస్తుంది. అలా ఆ ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతైన రైస్సా ఆ గోతుల్లో ఎక్కడ చిక్కుకుని ఎలా మృత్యువాత పడిందోగానీ.. విగతజీవిగా నదిలో తేలింది.
ఆ అమ్మాయి మృతి కుటుంబంలో విషాదం రేపితే.. సదరు ప్రైవేట్ టీవీ ఛానల్ రిపోర్టర్ కు ఓ సీన్ రీకన్స్ట్రక్షన్ లో ఎదురైన అనుభవం.. ఆ తర్వాత తను ఎవరి గురించైతే రిపోర్టింగ్ కు వెళ్లాడో ఆ బాలిక మృతదేహం తన వల్లే లభ్యమవ్వడంతో… లెనిల్డో లో ఒకింత ఆందోళన నెలకొంటే.. ఈ రిపోర్టింగ్ బ్రెజిల్ మొత్తం విశేషంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో ఫ్రజావోను ప్రశంసించారు. తను ఆ రిపోర్టింగ్ చేసే సమయంలో విగతజీవిగా ఉన్న ఆ బాలిక చేయి సదరు కరస్పాండెంట్ కు తగిలి ఉండకపోతే.. ఆమె మృతదేహం ఇంకెంతో కాలం బయటకొచ్చే అవకాశమే ఉండకపోయేదేమోనంటూ కొందరు ప్రస్తావిస్తున్నారు.
ఒక రిపోర్టర్ గా ఈ అనుభవం తనకెప్పటికీ మర్చిపోలేనిదంటున్నాడు లెనిల్డో ఫ్రజావో. మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇలాంటి ఘటనలను ఊహించం సాధ్యం కానే కాదు. అందుకే, ఇలాంటివి అనూహ్యమైన ఘటనలు తమ జీవితకాలం గుర్తుండేవంటాడు ఫ్రజావో.



