డాక్టర్, యాక్టర్, కలెక్టర్ ఏది కావాలన్నా.. వారిని తయారుచేసే గురువుదే ప్రధాన పాత్ర. అందుకే టీచర్ ఉద్యోగానికి అంత గౌరవం. అలాంటి ముగ్గురు ఉపాధ్యాయులు మన భారతదేశం నుంచి వన్ మిలియన్ డాలర్ గ్లోబల్ టీచర్ ప్రైజుకు షార్ట్ లిస్ట్ అయ్యారు. ఇంతకీ ఎవరు వారు.. ఏం చేశారు..?
విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు.
విద్వత్త్వంచ నృపత్వంచ నైవ తుల్యం కదాచన స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే
పండితుడు, రాజు వీరిద్దరికీ పోలికే లేదు. రాజు కేవలం తన దేశంలోనో , తన రాజ్యంలోనే మాత్రమే గౌరవించబడతాడు. కానీ, పండితుడు లోకమంతటా గౌరవ, మర్యాదలు పొందుతాడు. అలాంటి టీచర్ల గురించే మనమిప్పుడు మాట్లాడుకుంటున్నాం.

విద్యలో దూరదృష్టి, వినూత్న పద్ధతుల అవలంబనతో భారత్ కు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు 2026 మిలియన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ టాప్ 50 షార్ట్ లిస్ట్ లో స్థానం దక్కించుకున్నారు.
సుధాంశు శేఖర్ పాండా… మీరట్ కు చెందిన ఈ పాఠశాల ఉపాధ్యాయుడితో పాటు.. జమ్ముకశ్మీర్ టీచర్ మోహ్రాజ్ ఖుర్షీద్ మాలిక్.. అలాగే, గ్రామీణ భారతంలోని మురికివాడల్లో విద్యార్థులకు విద్యనందిస్తున్న రౌబుల్ నాగి అనే మహిళా మాస్టార్ ఈ అవార్డ్ పోటీలో నిల్చారు.
యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన వర్కీ ఫౌండేషన్, ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థైన యునెస్కోతో కలిసి నిర్వహిస్తున్న GEMS ఎడ్యుకేషన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ పదో ఎడిషన్ పోటీకి ప్రపంచవ్యాప్తంగా 139 దేశాల నుంచి 5 వేలకు పైగా నామినేషన్స్ అందాయి.
ఈ క్రమంలో భారతీయ మూలాలున్న గ్లోబల్ టీచర్ ప్రైజ్ వ్యవస్థాపకుడైన సన్నీ వర్కీ భారతీయుల నామినేషన్లపై హర్షం వ్యక్తం చేశాడు. మీ సృజనాత్మకత, కరుణ, అంకితభావం ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందాల్సినవంటూ అభినందించాడు. మీలాంటి ఉపాధ్యాయులను ప్రపంచం మొత్తానికి పరిచయం చేయడమే తమ లక్ష్యమన్నారాయన.
రాళ్లను రత్నాలుగా మారుస్తారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు. యువతకు మంచి భవిష్యత్ వైపు దారులు తెరుస్తారు. కనుక మీ పని తరగతి గదులకు మాత్రమే పరిమితమైంది కాదు.. అది జీవితాలను… తద్వారా ప్రపంచ గతినే మార్చే ప్రభావశక్తి అంటూ ఉపాధ్యాయ వృత్తి గొప్పదనాన్ని పొగిడారు సన్నీ వర్కీ.
సుధాంశు శేఖర్ పాండా ప్రత్యేకతేంటి మరి..?
మీరట్ లోని కే. ఎల్. ఇంటర్నేషనల్ స్కూల్ లో ఆర్థికశాస్త్రం, భౌగోళిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు పాండా. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులను మెరికల్లా మల్చడంలో ఆయన చేసిన కృషికి ఇప్పటికే ఆయన గుర్తింపు పొందారు. ప్రాజెక్ట్ వర్క్ తరహాలో పిల్లలతో అభ్యాసం చేయించడం, కళల గురించి సమగ్ర బోధన, ఆరంభదశలోనే సాంకేతిక వినియోగం ప్రాముఖ్యతను తెలియజెప్పడం, యోగాను బోధనలో భాగం చేయడం వంటి వినూత్న పద్ధతులతో ఆయన నేతృత్వంలోని విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. తాను ఓ టీచర్ గా పనిచేస్తూనే.. మరోవైపు, తనలోని మానవీయ కోణానికి నిలువెత్తు సాక్ష్యంగా పుహార్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పేద కుటుంబాలకు అవసరమైన విద్య, వనరులు, మార్గదర్శకత్వం అందిస్తున్నారు. అందుకే ఎడ్యుకేషన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ లో భాగంగా పాండా పేరు షార్ట్ లిస్టుకెక్కింది.
మరి మెహ్రాజ్ ఖుర్షీద్ మాలిక్ ఎవరు..?
నిత్యం ఘర్షణలతో సంఘర్షణ పడే కశ్మీర్ వంటి ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా, సమాజానికి మార్గదర్శిగా మాలిక్ అందించిన సేవలకు ఈయన గ్లోబల్ టీచర్ ప్రైజ్ కు షార్ట్ లిస్ట్ అయ్యారు. శాంతి, భావోద్వేగ నియంత్రణ, యువతను హింసా మార్గాల నుంచి దూరం చేయడం వంటివి ప్రధాన లక్ష్యాలుగా ఈయన బోధన నడుస్తోంది. మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత.. గత దశాబ్దం నుంచి ఆయన పాఠశాలలు, మత సంస్థలు, పునరావాస కేంద్రాలు, జైళ్లల్లో బోధన చేస్తున్నారు.
మాలిక్ రూపొందించిన రెండు ముఖ్య కార్యక్రమాలు బాగా పేరు తెచ్చుకున్నాయి.
ఇన్సానియల్ క్యారికులం పేరిట అనుభూతి ఆధారితంగా ఏడాదిపాటు సాగే స్కూల్ ప్రోగ్రాం ఇది. అలాగే, సహీ రాస్తా.. 23 రోజుల పాటు పునరావాస నమూనా పేరిట కశ్మీర్ ప్రాంతానికే ప్రత్యేకంగా ఉండేలా తన ప్రోగ్రామ్స్ ను డిజైన్ చేసి బోధిస్తున్నారు మాలిక్.
ఇక రౌబుల్ నాగి ఎందుకు స్పెషల్..?
ఎడ్యుకేషన్ గ్లోబల్ ప్రైజ్ లో మూడో భారతీయురాలు రౌబుల్ నాగి. తక్కువ ఖర్చుతో అందుబాటులో నాణ్యమైన విద్యా నమూనాల కోసం రౌబుల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ ను స్థాపించారీమె. విద్యను నేరుగా పేదలు, మురికివాడల పిల్లల వద్దకే తీసుకెళ్లడమే లక్ష్యంగా రౌబుల్ నాగి పనిచేస్తున్నారు. మిసాల్ ముంబై, మిసాల్ ఇండియా వంటి ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలతో కళలు, విద్య, పరిశుభ్రత, సమాజాభివృద్ధి ధ్యేయంగా వందకు పైగా గ్రామాల్లో, మురికివాడల్లో ఈమె చేపట్టిన విద్యా కార్యక్రమాలను అమలు చేస్తోంది.
బోధనా పద్ధతులు, స్థానిక సమస్యలకు వినూత్న పరిష్కారాలు, స్పష్టమైన అభ్యాస పద్ధతులు, వాటి నుంచి వచ్చే ఫలితాలు, తరగతి గది దాటి విద్యార్థుల సామాజిక ప్రయాణం, విద్యార్థులను గ్లోబల్ స్టూడెంట్స్ గా తీర్చిదిద్దడం వంటి సేవల ఆధారంగా.. గ్లోబల్ టీచర్ ప్రైజ్ కు దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులను షార్ట్ లిస్ట్ కు మదింపు చేశారు.
అయితే, ఇందులో టాప్ 10 ఫైనలిస్టులకు ఈ షార్ట్ లిస్ట్ కుదించబడుతుంది. తుది విజేతను గ్లోబల్ టీచర్ ప్రైజ్ అకాడమి ఎంపిక చేస్తుంది. విజేత పేరును 2026 ఫిబ్రవరిలో దుబాయ్ లో జరిగే వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ లో ప్రకటిస్తారు. 50 మంది షార్ట్ లిస్టులో ఉన్న మన ముగ్గురు భారతీయ ఉపాధ్యాయులు కూడా ఆ టాప్ టెన్ లో ఉండాలని కోరుకుందాం.



