ఈవారం జోర్డాన్ లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటనతో.. భారత్ – హషెమైట్ కింగ్డమ్ మధ్య ఉన్న దీర్ఘకాలిక సంబంధాలపై మరోసారి అందరి దృష్టి పడింది. అమాన్ లోని అల్ హుసైనియా ప్యాలెస్ లో జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 బిన్ అల్ హుసేన్ తో ప్రధాని మోడీ ప్రతినిధి స్థాయి చర్చల నేపథ్యంలో.. ఈ భారత్ – జోర్డాన్ బంధంపై కూడా చర్చ మొదలైంది. మోడీ పర్యటనలో ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయంగా స్థిరత్వం, ఉగ్రవాద నిరోధక చర్యలు ప్రధానాంశాలుగా నిల్చినా… ఆ దౌత్య సంబంధాలకు మించి జోర్జాన్ రాజ కుటుంబానికి, భారత ఉపఖండంతో ఉన్న ఒక ఆసక్తికరమైన, పెద్దగా జనానికి తెలియని ఓ బంధముంది.

ఆ బంధానికి కారణం.. ప్రిన్సెస్ సర్వత్ ఎల్. హాసన్! 1947లో విభజనకు కొన్ని వారాల ముందు కోల్ కత్తాలో జన్మించిది ఆ రాకుమారి. అప్పుడు ఆమెకు సర్వత్ ఇక్రముల్లా అని పేరు పెట్టారు.
ప్రఖ్యాత సుహ్రావర్ది కుటుంబానికి చెందిన రాకుమారి సర్వత్ ఇక్రముల్లా. రాజకీయాలు, దౌత్యాల మధ్యే పెరిగారు. ఆమె తండ్రి మొహమ్మద్ ఇక్రముల్లా ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి. ఆయన పాకిస్థాన్ తొలి విదేశాంగ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆమె తల్లి షైస్తా సుహ్రావర్ది ఇక్రముల్లా పాకిస్థాన్ తొలి మహిళా పార్లమెంటేరియన్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆమె మొరాకోలో రాయబారిగా కూడా సేవలందించారు.
తండ్రి దౌత్య పర్యటనల్లో భాగంగా యూరప్, దక్షిణాసియా ప్రాంతాల్లో పెరిగిన సర్వత్.. బ్రిటన్ లో విద్యాభ్యాసం చేశారు. కమ్యూనికేటివ్ స్కిల్స్ అధికంగా ఉన్న సర్వత్ కు అంతర్జాతీయంగా ఎవరితోనైనా ఇట్టే కలిసిపోగల్గే గుణముండేది. అదే ఆమెకు గుర్తింపును కూడా తెచ్చింది. లండన్ లోని డిప్లమాటిక్ నెట్వర్క్స్ లో భాగంగా ఆమె మొదటిసారి జోర్డాన్ హాషమైట్ వంశానికి చెందిన ప్రిన్స్ హాసన్ బిన్ తలాల్ ను కలిశారు.
చూపులు కలిసి శుభవేళ ఏమైంది..?
భారత్ లో జన్మించిన సర్వత్ వివాహం మాత్రం పాకిస్థాన్ లో జరిగింది. 1968 ఆగస్ట్ 28వ తేదీన జోర్డాన్ ప్రిన్స్ హాసన్ బిన్ తలాల్ ను వివాహమాడింది. ఆ వివాహ వేడుక పాకిస్థానీ, జోర్డానియన్, ప్రాశ్చాత్య సంప్రదాయల సమ్మేళనంగా జరిగింది. ఆ తర్వాత ఆ సర్వత్, హాసన్ బిన్ తలాల్ దంపతులిద్దరూ అమాన్ లో స్థిరపడ్డారు. ఆ తర్వాత నల్గురు పిల్లలయ్యారు. వారంతా యువరాణులు రహ్మా, సుమయ్య, బదీయా, ప్రిన్స్ రషీద్.
1969 నుంచి 1999 వరకూ కూడా సర్వత్ ఇక్రముల్లా జోర్డాన్ క్రౌన్ ప్రిన్సెస్ గా సేవలందించారు. ఆ కాలంలో విద్య, సామాజికాభివృద్ధి, మహిళా సాధికారిత వంటి పలు రంగాల్లో ఆమె పెను మార్పులు తీసుకొచ్చారు.
విద్య – సేవతో ముడిపడ్డ జీవితం సర్వత్!
జోర్డాన్ లో విద్యావకాశాల విస్తరణలో ప్రిన్సెస్ సర్వత్ కీలకపాత్ర పోషించారు. 1981లో అమాన్ బాకలారియేట్ స్కూల్ ను స్థాపించేందుకు కారకురాలయ్యారు. జోర్డాన్ లో అదే మొట్టమొదటి మల్టీ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ బాకలారియేట్ స్కూల్. అంతకుముందే, సెంటర్ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్, 1980లో సర్వత్ కమ్యూనిటీ కాలేజ్ వంటివి స్థాపించి.. మహిళలు, దివ్యాంగుల సాధికారిత కోసం వృత్తి విద్యనందించేందుకు దోహదపడ్డారు.
క్రీడల్లోనూ టాప్ సర్వత్!
ఆమె ప్రజా జీవితానికే పరిమితం కాలేదు. క్రీడలు, మానవతా సేవల్లోనూ గుర్తింపు సాధించారు. జోర్డాన్ లో తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించిన తొలి మహిళగా సర్వత్ ఘనత సాధించారు. జోర్డానియన్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ గౌరవాధ్యక్షురాలిగా పనిచేశారు. 1991లో గల్ఫ్ యుద్ధ సమయంలో జోర్డాన్ నుంచి ఇరాక్ కు వైద్య సదుపాయాలందించేందుకు, ఆ మెడిసిన్ ను సరఫరా చేసేందుకు మిలియన్ డాలర్లకుపైగా విలువైన సాయమందించారు సర్వత్. అలా ఆమె పేరు అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.
1999లో జోర్డాన్ రాజు హుస్సేన్ తన కుమారుడైన ప్రిన్స్ అబ్దుల్లాను వారసుడిగా ప్రకటించడంతో.. ప్రిన్స్ హాసన్, క్రౌన్ ప్రిన్సెస్ పదవీ కాలం ముగిసింది. అయినప్పటికీ సర్వత్ తన సామాజిక, విద్యా సేవలను కొనసాగించారు.
995లో ఉమన్ ఆఫ్ పీస్ అవార్డ్ తో పాటు.. 1994లో గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది రినైసన్, 2002లో పాకిస్థాన్ హిలాల్- ఈ- ఇంతియాజ్, అలాగే, యూనివర్సిటీ ఆఫ్ బాత్, యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రన్స్విక్ నుంచి గౌరవ డిగ్రీలు ఆమె గౌరవార్ధం వరించాయి.



