మిషన్ గన్ నింపిన అంతులేని సంతోషం! నలభై ఏళ్ల కింద.. బెజవాడ లీలామహల్ ఐల్యాండ్ ముచ్చట!!

ఆకాశం నిర్మలంగా ఉంది..అది ప్రశాంత అట్లాంటిక్ సముద్రం.. ఫ్లోరిడా తీరం నుండి చాలా లోపలికి ఉంటుంది మధ్యాహ్నపు సూర్యకాంతి పడి, కెరటాలు తళుక్కున మెరుస్తూ ఉన్నాయి.. ఒక బోటులో చేపలు వేటాడుతూ, బ్లైర్, అతని కొడుకు జస్టిన్.. ప్రకృతిని ఏకాంతంగా ఆస్వాదిస్తూ సాగుతున్నారు.. ఇంతలో దూరంగా నీటి అలలపై ఏదో కదలిక.. అస్పష్టంగా!

ఇద్దరి చూపులూ అటే కేంద్రీకృతమైనాయి. అటుకేసి బోటును పోనిచ్చారు. ఆ కదిలేది, మునిగిపోతున్న ఒక చిన్నపిల్ల చేయి.. ఒక్క అవకాశం.. రక్షించమని ఆమె వేడుకుంటున్నట్లు ఉంది.. బోటును వేగంగా దగ్గరికి జరిపి, వంగి, ఆపన్నహస్తం అందించాడు జస్టిన్. ఆ చేతిని అందిపుచ్చుకొని, పైగి లాగే ప్రయత్నం చేశాడు. అయితే.. ఆ క్షణమే అనుకోని సంఘటన జరిగింది. ఆ చెయ్యి, బలంగా జస్టిన్ ని ఒక్క ఉదుటన నీటిలోకి లాగిపడేసింది.

చూస్తూండగానే ఆ నీటిలోని పిల్ల, వేగంగా జస్టిన్ని లాక్కొని, దగ్గరలో ఉన్న ఒక ద్వీపం వైపు సాగిపోతుంది. ఆ పిల్ల, ఒక నరాంతక సముద్ర దొంగల ముఠా సభ్యురాలు. ఊహించని ఆ సంఘటనకు నిశ్చేష్టుడయ్యాడు బ్లైర్.

వెంటనే నీటిలో దూకి, తన బిడ్డను రక్షించుకునే ప్రయత్నంలో ఈదుతూ వారిద్దరినీ అనుసరించాడు.. ఈ సన్నివేశం, ఆ వెనుక వినిపించే బీభత్స సంగీతం.. 1980లో బెజవాడ లీలామహల్ హాల్ లో సినిమా చూసినప్పటి నా అనుభవం.. ఎప్పటికీ మరచిపోలేను. ఆ చిత్రం పేరు.. THE ISLAND.

పీటర్ బెంచ్లీ నవల ఆధారంగా తీసిన మైకేల్ రిచీ దర్శకత్వంలోని ఆ సినిమాలో బ్లైర్ పాత్రలో నటించిన మైకేల్ కేన్ నా అభిమాన హీరోలలో ఒకరు.

ఇంతకీ ఏంటీ THE ISLAND కథ…?

ఇక చిత్ర కథాసంగ్రహంలోకి వస్తే.. బ్లైర్,న్యూయార్క్ నగరంలోని ఒక జర్నలిస్ట్. నేవీలో పనిచేసిన అనుభవం చేత, అట్లాంటిక్ సముద్రంలోని బెర్ముడా ట్రయాంగిల్ లో ఓడల అదృశ్యం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించాలనుకుంటాడు. అయితే, విమాన ప్రమాదం వల్ల మధ్యలో వేరే ప్రాంతంలో చిక్కుపడిపోయి, విధివశాత్తూ కొడుకుతో పాటు పైన చెప్పిన విధంగా పరమ దుర్మార్గులైన సముద్రదొంగల ముఠా పన్నిన ఉచ్చులో పడిపోతాడు. ఆ దొంగలు వీరిద్దరినీ ప్రపంచానికి తెలియని తమ రహస్య ద్వీపంలోకి తీసుకువెళతారు. నౌ అనే ఆ ముఠా నాయకుడు పరమ కిరాతకుడు. దొరికినవారినెల్లా చిత్రహింసలు పెట్టి చంపడం, వాళ్లను బ్రెయిన్ వాష్ చేసి, జీవచ్ఛవాలను చేయటం, తమ తెగలో కలిపివేసుకోవటం వంటి దుష్కృత్యాలు చేస్తూ ఉంటాడు. వారంతా నరరూప రాక్షసులు. ఆ ద్వీపం ఒక నరక కూపం.

వాళ్ళ బాధలు తాళలేక, పారిపోవాలని బ్లైర్ చేసిన ప్రయత్నాలన్నీ వమ్ముచేసి, మరింత కిరాతకంగా వారిద్దరినీ హింసిస్తూ ఉంటారు ఆ ముఠా సభ్యులు. ఆఖరికి బ్లైర్ కొడుకుకు కూడా బ్రెయిన్ వాష్ చేసి, తమకు అనుకూలంగా మార్చుకుని, కొడుకుననే స్పృహ లేకుండా చేసి, అతనిచేతనే తండ్రిని చంపించాలని యత్నిస్తారు. బ్లైర్ ను వారు శారీరకం గానూ, మానసికంగానూ అమానుషంగా హింసిస్తారు.

ఈ సినిమాలో ఉన్న విశేష మేమంటే.. ఆ సముద్ర దొంగల ముఠా చేసే వికృత క్రీడలు, పాశవిక కృత్యాలు ప్రేక్షకులకు వారిపట్ల జుగుప్సను, తీవ్ర ద్వేషాన్ని క్షణక్షణం పెంచుతూపోతాయి. ఆ మూక చేసే మారణహోమాలకు అంతం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేట్లు చేస్తాయి.

అక్కడ నీతి ధర్మం, మానవత్వం, క్షమ ఇటువంటి పదాలకు తావే ఉండదు. కళ్ళ ముందు వందలాది మందిని పొట్టనపెట్టుకుంటూ, ఓడలను కొల్లగొడుతూ, వారి ఆయుధాలతో వారినే వికలాంగులను చేసి, చంపి, కరాళనృత్యం చేసే ఆ ముఠా నుండి బయటపడటం అసాధ్యమని గ్రహించిన బ్లైర్ స్థితిని, ఆ దొంగల పైశాచికత్వాన్ని చూసే ప్రేక్షకులకు పిడికిళ్లు బిగుస్తాయి. ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. నరరూప రాక్షసుల వంటి ఆ ముఠా సభ్యులపై ఆగ్రహం పెల్లుబుకుతుంది. ఎప్పుడు? ఎప్పుడు? వారంతా శిక్షింపబడేది? అని ప్రేక్షకులు ఎదురుచూస్తారు. దర్శకుడు ఆ స్థాయిలో వారిపై అసహ్యం తారాస్థాయికి చేర్చిన తరుణంలో… అమెరికన్ తీరప్రాంత గస్తీ నౌక ఒకటి సైనికులతో ఆ ద్వీపాన్ని సమీపిస్తుంది. అయితే మన దుష్టసమూహం.. ఆ నౌకను చాకచక్యంతో స్వాధీనపరచుకుని, సైనికులను బందీలను చేసి, నిర్దాక్షిణ్యంగా వారందరినీ పాశవికంగా చంపుతూ ఉంటారు.

ఇదే అదనుగా బ్లైర్.. వారి కన్నుగప్పి, నౌక శిఖరాగ్రం చేరుకుంటాడు. అక్కడ రహస్యంగా కప్పిఉంచబడిన అత్యంత శక్తివంతమైన 50 కాలిబర్ హెవీ మెషీన్ గన్ అతని కంటపడుతుంది.
(ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న మా లీలామహల్ ప్రేక్షకులు.. ఆ మెషీన్ గన్ ని చూడగానే ఒక్కసారి హార్షాతిరేకాలతో హాలులో తమ కుర్చీల నుండి లేచి మరీ చప్పట్లు చరుస్తూ ఆ దుష్టులను కాల్చేయమని అరిచారు. వారిలో నేనూ ఉన్నాను. అంతలా ఆ కథాసంవిధానంలో లీనమై పోయేలా చేయటం.. ఆ చిత్ర దర్శకుడి గొప్పతనమనిపించింది నాకు.)

అంతే.. ఇక క్షణం ఆలస్యం చేయక, ఆ గన్ చేతిలోకి తీసుకొని, క్రింద నౌకపై ఉన్న సముద్ర దొంగల ముఠాపై కాల్పుల వర్షం ఆరంభిస్తాడు బ్లైర్. కసితీరా పిట్టలను కాల్చినట్లుగా ఆ అందరినీ.. ఒక్కరూ మిగలకుండా కాల్చిపారేస్తాడు. బుల్లెట్ల వర్షం కురుస్తుంది.. దొంగలంతా విగతజీవులైనా అతని ఆక్రోశం చల్లారదు.. కాల్పులు కొనసాగిస్తూనే ఉంటాడు. ఎట్టకేలకు ముఠా నాయకుడు నౌ కూడా హతం అయ్యాక.. బ్లైర్, అతని కుమారుడు జస్టిన్ క్షేమంగా అమెరికన్ రక్షక విమానంలో తిరిగి వెళ్ళటంతో కథ సుఖాంతం అవుతుంది.

ఎప్పుడో 43సంవత్సరాల క్రితం చూసిన ఈ సినిమా ఇప్పుడు నాకు ఎందుకో గుర్తుకు వచ్చింది. వీలైతే మీరూ చూడండి..

MODUMUDI SUDHAKAR…✍🏻

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles